మా అమ్మాయి వయసు 18 సంవత్సరాలు. బీటెక్ చదువుతోంది. ఈ మధ్య తల వెంట్రుకలను గట్టిగా పట్టి ఒక్కొక్కటీ లాగేసుకుంటోంది. మాట్లాడుతూనో.. చదువుకుంటూనో... ఇలా వెంట్రుకలు లాగేస్తోంది. దీనివల్ల తలలో చాలా భాగం బట్టతలలా మారి చూడటానికి అసహ్యంగా కనిపిస్తోంది. గట్టిగా మందలిస్తే, అప్పుడు మానేస్తుంది కానీ మళ్లీ మామూలే! మాకు విసుగొచ్చి ఒక దెబ్బ వేస్తే ఏడుస్తోంది. తాను కావాలని అలా చేయడం లేదనీ, తనకు తెలియకుండానే అలా లాగేస్తున్నానని చెబుతోంది. కాలేజీకి వెళ్లే అమ్మాయి ఇలా చేస్తుంటే నలుగురూ ఏమనుకుంటారో అని భయంగా ఉంది. ఇది ఇలాగే కొనసాగితే తనకసలు పెళ్లవుతుందో లేదోనని ఆందోళనగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
– రాజేశ్వరి, ఆదిలాబాద్
మీరు చెప్పిన వివరాలను బట్టి మీ అమ్మాయి ట్రైకోటిల్లో మేనియా అనే మానసిక రుగ్మతతో బాఢపడుతున్నట్లు అర్థమవుతోంది. అయితే మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. ఇది యువతలో వచ్చే ఒక అరుదైన మానసిక రుగ్మత. తలవెంట్రుకలే కాకుండా, కొందరు కనుబొమలు, కంటిరెప్పల వెంట్రుకలను కూడా ఇలాగే లాగేసుకుంటూ ఉంటారు.
కొన్ని సందర్భాలలో అయితే ఇలా లాగేసిన వెంట్రుకలను మింగడం కూడా జరుగుతుంది. కొందరు పిల్లల్లో సడన్‌గా వచ్చే కడుపునొప్పికి కారణం ఈ వెంట్రుకలన్నీ కడుపులో అడ్డుపడడమే! ఆందోళన, టెన్షన్‌కు లోనయిన వారిలోనూ, బుద్ధిమాంద్యమున్న వారిలోనూ ఇలాంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. కంపల్సివ్ పుల్లింగ్ అంటే వెంట్రుకలు లాగేయడం అన్నది మళ్లీ మళ్లీ చేయాలనే ఒక మానసిక వైపరీత్యం వల్ల కూడా ఇలా జరుగుతుంది.
దీనిని ఎంత అదుపు చేసుకుందామనుకున్నా వారికి సాధ్యం కాదు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఆధునిక మానసిక వైద్యశాస్త్రంలో అద్భుతమైన ఔషధాలతోపాటు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనే ప్రత్యేక మానసిక చికిత్స కూడా ఉంది. చాలామందికి ఇది మానసిక సమస్య అని తెలియక చర్యవ్యాధి డాక్టర్లను సంప్రదిస్తుంటారు. మీరు ఆలస్యం చేయకుండా మీకు దగ్గరలోని మానసిక వైద్యుని సంప్రదిస్తే మీ అమ్మాయిని ఈ సమస్య నుంచి బయటకు తీసుకురావచ్చు.
డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.
(మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com)
(చదవండి: శీతాకాలం చర్మం పొడిబారకుండా ఉండాలంటే..?)
Comments
Please login to add a commentAdd a comment