
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో యావత్తు దేశం దిగ్బ్రాంతికి లోనైంది. ఆర్థిక వేత్తగా, ప్రధానిగా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, సేవలను గుర్తించేసుకుంటూ..ప్రముఖలు, రాజకీయనేతలు నివాళులర్పించారు. సుదీర్ఘకాలం ప్రధానిగా చేసిన తొలి సిక్కుగా ఘనత దక్కించుకున్నా మన్మోహన్ వ్యక్తిగత అలవాట్లు గురించి పెద్దగా ఎవ్వరికి తెలియవు. ఎందుకంటే మితభాషిగా ఉండే ఆయన వ్యవహారశైలినే కారణమని చెప్పొచ్చు. అయితే విదేశాలకు వెళ్లినప్పుడూ..అక్కడ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలలో తాను ఇష్టపడే వంటకాలకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. అవేంటో చూద్దామా.
ఆర్థిక సంస్కరణలతో ఆధునిక భారతావనిగా రూపు ఇచ్చి.. యావత్ ప్రపంచం మనవైపు చూసేలా చేసిన దార్శనికుడు. పాలన, దౌత్యపరంగా ఆయన చేసిన కృషి అసామాన్యమైనది. రాజీయ చతురత, వినయపూర్వకమైన ప్రవర్తనకు తగ్గటుగానే ఆయన అభిరుచులు ఉండేవని చెప్పొచ్చు. ప్రత్యేకించి ఆయన ఆహారపు అలవాట్లు ఓ సాధారణ వ్యక్తి ఇష్టపడేవే.
ఎందుకంటే ఆయన అమితంగా ఇష్టపడేది పెరుగు అన్నమే. దానిమ్మ, ఊరగాయలు అంటే మహా ఇష్టం. ఉత్తర భారతదేశంలో కధీ చావల్‌గా పిలిచే పెరుగన్నం(Curd Rice) మన్మోహన్ మెచ్చే వంటకమని చెబుతుంటారు సన్నిహితులు. ఇది శరీరానికి చలువ చేస్తుంది, పైగా మనసును ప్రశాంతంగా ఉంచే రెసిపీ అని అంటుంటారట మన్మోహన్. అయితే మధుమేహం(Diabetes) కారణంగా స్వీట్స్‌కి దూరంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారానికే ప్రాధాన్యత ఇచ్చేవారట.
చెప్పాలంటే ఇక్కడ మన్మోహన్ పూర్తి శాకాహారి(Vegetarian). అయితే బంగ్లాదేశ్ పర్యటనలో ఆ శాకాహార నియమాన్ని ఉల్లంఘించే గమ్మతైన ఘటన జరిగిందంటే. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పేరుగాంచిన డిష్ బెంగాలీ హిల్సా ఫిష్ కర్రీ. ఈ రెసిపీలో చేపకు ఆవపిండిని పట్టించి అరటి ఆకుల్లో ప్యాక్ చేసి ఆవిరిపై వండుతారట. ఈ వంటకం రుచి గురించి తెలుసుకుని మరీ తెప్పించుకుని ఆస్వాదించారట మన్మోహన్.
పైగా దీని రుచికి ఫిదా అయ్యి శాకాహార నియమాన్ని ఉల్లంఘించక తప్పలేదని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారట. ప్రస్తుతం ఆయన మన మధ్యలేకపోయినా..ఆయన విశిష్ట వ్యక్తిత్వం, ఆదర్శవంతమైన జీవితం తాలుకా జ్ఞాపకాలు సదా నిలిచే ఉంటాయి.
(చదవండి: మన్మోహన్ సింగ్ ఆ డ్రైస్సింగ్ స్టైల్‌నే ఎంచుకోవడానికి రీజన్ ఇదే..!)