ఇంట్లో ఇటాలియన్ | Italian food | Sakshi
Sakshi News home page

ఇంట్లో ఇటాలియన్

Published Fri, Jan 1 2016 11:21 PM | Last Updated on Sun, Sep 3 2017 2:55 PM

ఇంట్లో ఇటాలియన్

ఇంట్లో ఇటాలియన్

ఇటాలియన్ ఫుడ్ తినాలంటే ఇటలీ వెళ్లనవసరం లేదు. ఇంట్లోకే ఇటలీని తెప్పించుకోవచ్చు!
ఇక్కడ ఇచ్చినవన్నీ ఇండియాలో దొరికే పదార్థాలు. వాటిని మన ఇండియన్ కిచెన్‌లో వండినా
ఇటలీ ఐటమ్స్ తయారు అవుతాయి. చేసి చూడండి. ఫారిన్ రుచులను ఆస్వాదించండి.
 

నాచోస్
సగం కప్పు టొమాటో గుజ్జు, టీ స్పూన్ కొత్తిమీర, టీ స్పూన్ ఉల్లిపాయ తరుగు, తగినంత ఉప్పు, చిటికెడు మిరియాల పొడి, రెండున్నర టీ స్పూన్ల టొమాటో సాస్.. ఇవన్నీ కలిపిన మిశ్రమాన్ని టొమాటో సాల్సా అంటారు.  టీ స్పూన్ క్రీమ్, అర టీ స్పూన్ పెరుగు, తగినంత ఉప్పు, అర టీ స్పూన్ నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని సోర్ క్రీమ్ అంటారు.ఒక వెడల్పాటి గిన్నెలో 100 గ్రాముల మొక్కజొన్న చిప్స్ తీసుకోవాలి. దీని మీద రెండు టేబుల్ స్పూన్ల కరిగించిన ఛీజ్, అర కప్పు టొమాటో సాల్సా, టేబుల్‌స్పూన్ సోర్ క్రీమ్ వేయాలి. చివరగా సన్నగా తరిగిన కీరా, కొత్తిమీరతో అలంకరించాలి.
 
మినెస్ట్రాన్
క్యారెట్, బీన్స్, క్యాలీఫ్లవర్, క్యాప్సికమ్‌లను సన్నగా తరిగి 2 టీ స్పూన్ల చొప్పున తీసుకోవాలి. దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల పాస్తా కలిపి, ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మరో పాత్రలో టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేడి చేసి, అందులో అర టీ స్పూన్ వెల్లుల్లి వేసి వేయించాలి. దీంట్లో కప్పుడు టొమాటో గుజ్జు, కట్ చేసి పెట్టుకున్న కూరగాయల ముక్కలు, కప్పుడు నీళ్లు పోసి మిశ్రమం చిక్కగా అయ్యేలా ఉడికించాలి. ఇందులోనే ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని సూప్ బౌల్‌లో పోయాలి. 4 సన్నగా తరిగిన తులసి ఆకులను, అర టీ స్పూన్ ఛీజ్(మార్కెట్లో లభిస్తుంది) తరుగు వేసి అందించాలి.
 
స్పినాచ్ కార్న్ ఫెటుచిని

పాన్‌లో కొద్దిగా బటర్ వేసి వేడి చేసి దాంట్లో అర టీ స్పూన్ తరిగిన వెల్లుల్లి వేయించాలి. దాంట్లో 50 గ్రా.ల తరిగిన పాలకూర వేసి కొద్దిగా ఉడికాక, టీ స్పూన్ పెరుగు కలపాలి. దీంట్లో అర కప్పుడు ఉడికించిన పాస్తా, పావు కప్పుడు వైట్ సాస్ (పాన్‌లో 2 టీ స్పూన్ల వెన్న, 2 టేబుల్ స్పూన్ల మైదా వేయించి, పావు కప్పు పాలు పోసి చేసిన మిశ్రమం) కలిపి, ఉప్పు, మిరియాలపొడి వేసి చివరలో బాగా కలిపిన పాల మీగడ జత చేయాలి. వడ్డించే ముందు ఛీజ్ తరుగు, కొత్తిమీర వేసి, గార్లిక్ బ్రెడ్‌తో అలంకరించాలి.
 
ప్రాచుర్యం ఎక్కువ
శతాబ్దాల చరిత్ర ఉన్న ఇటాలియన్ రుచులకు ప్రపంచంలోనే బాగా ప్రాచుర్యం ఉంది. ఉంది. ఐస్‌క్రీమ్‌లతో మొదలైన ఇటాలియన్ వంటకాలు పిజ్జాలతో పుంజుకుని కాఫీలతో కొనసాగి, పాస్తాలతో పరిపుష్టమైంది. టొమాటోను అధికంగా వాడే వీరి వంటకాలలో పెద్దవంకాయ, బ్లాక్-గ్రీన్ ఆలివ్స్, క్యాప్సికం తదితర కూరగాయల శాతం ఎక్కువ. దీంతో మన వంటకాలకు కాస్త సన్నిహితంగా అనిపిస్తాయి. అలాగే మిరియాలపొడితో చేసే సాస్‌లు, వెల్లుల్లి, పుదీనా, చికెన్ వెరైటీలు... వంటివి ఇటాలియన్ రుచులకు కేరాఫ్‌గా మారుస్తున్నాయి. ఇటలీ దేశస్థులకు స్పైసీగా అనిపించే ఇటాలియన్ రుచులు మన దగ్గర ఆధునికుల జిహ్వలకు సరిపడా ఉంటున్నాయి. ఇక ఈ వంటకాల తయారీలో ఆలివ్ ఆయిల్‌ను మాత్రమే ఉపయోగిస్తారు. దాంతో ఆరోగ్యపరంగా కూడా ఇవి మేలనే ఆభిప్రాయం పెరిగింది.
 
హార్వెస్ట్ వెజ్ పిజ్జా
పిజా బేస్, పిజ్జా సాస్, పిజ్జా ఛీజ్‌లు రెడీమేడ్‌గా దొరుకుతాయి. టొమాటో, క్యాలీఫ్లవర్, పాలకూర, మొక్కజొన్న, 10 తులసి ఆకులు సన్నగా తరిగి 2 టీ స్పూన్ల చొప్పున తీసి, పక్కన ఉంచాలి. పిజ్జాబేస్ పైన సాస్ -దానిపైన తగినంత ఛీజ్ - ఆ పైన తరిగిన కూరగాయల ముక్కలు చల్లి అవెన్‌లో 200 డిగ్రీల ఉష్ణోగ్రతలో బేక్ చేయాలి. అవెన్ లేని వారు దీనిని పిజాపాన్‌లో తయారుచేసుకోవచ్చు.
 
చిపొట్లె చికెన్ స్క్యేర్స్
పావుకేజీ బోన్‌లెస్ చికెన్‌ని శుభ్రం చేసుకొని పైన టేబుల్‌స్పూన్ తేనె, అర టీ స్పూన్ చిపొట్లె టొబాస్కో (పండుమిర్చిని ముద్దగా నూరి వాడచ్చు), అర టీ స్పూన్ కారం వేసి, బాగా కలిపి పక్కన ఉంచాలి. మరొక గిన్నెలో పావు టీస్పూన్ పండుమిరప పేస్ట్, ఉప్పు, నల్ల మిరియాలపొడి, ఎండుకారం, కొద్దిగా నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల మెయోనేజ్ సాస్ (మార్కెట్లో దొరుకుతుంది) ఇది అందుబాటులో లేదంటే వెన్నలో కలిపి పక్కన ఉంచాలి. బాగా నానిన చికెన్ ముక్కలను వెదురుపుల్లలకు గుచ్చాలి. వీటిని పెనం మీద కొద్దిగా నూనె వేసి వేయించుకోవాలి. పండుమిర్చి పేస్ట్‌తో తయారుచేసుకున్న సాస్‌లో ముంచి, ప్లేట్లో పెట్టి, కొత్తిమీరతో అలంకరించాలి.
 
ఛీజ్ కేక్

ఒక పాత్రలో గుడ్డుసొన, అర టీ స్పూన్ పంచదార, చిన్న కప్పుడు వెన్నతీసిన పాలు, చిటికెడు జెలెటిన్ (ఇది వాడకపోతే కేక్ గట్టిగా అవదు. మార్కెట్లో దొరుకుతుంది), కప్పుడు విప్డ్ క్రీమ్ (దీని బదులు పాల మీగడను బాగా మిక్స్ చేసి వాడచ్చు) వేసి, కలిపి పక్కన ఉంచాలి. కేక్ అడుగు గట్టితనం కోసం 2 గుండ్రటి బిస్కట్లు తీసుకొని, వెన్న రాసి,10 ని.లు ఫ్రిడ్జ్‌లో ఉంచాలి. తర్వాత ఈ బిస్కెట్లను తీసి, కప్పు అడుగున ఉంచాలి. వీటి పైన ముందుగా చేసి ఉంచిన మిశ్రమాన్ని బిస్కెట్ల మీదుగా పోసి, 30 ని.లు డీప్ ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత దానిని బయటకు తీసి, మన ఇళ్లలో రోజూ వాడుకునే 3 టేబుల్ స్పూన్ల చిక్కటి బ్లాక్ కాఫీ డికాషన్‌లో వెనీలా ఎసెన్స్ కలిపి పోసి, చల్లగా అందించాలి.
 
రాజ శేఖర్
ఎగ్జిక్యూటివ్ చెఫ్
ఓరిస్ రుసి అండ్ ఐడోని
బంజారా హిల్స్
హైదరాబాద్
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement