మన ఇంటి షెఫ్‌లు...
‘‘రండి రండి రండి.. దయచేయండి... ’’ అంటూ స్వాగతించే మీ గడుగ్గాయిల ఆహ్వానాన్ని ఆప్యాయంగా అందుకోండి. వారి చేత తిరిగిన గరిట అంచున కమ్మని రుచులను ఆస్వాదించడానికి సిద్ధమవ్వండి. ఇన్నాళ్లూ బడిలో తరగతి గదిలో నేర్చిన పాఠాలు బుర్రకు మేత పెడితే... ఇప్పుడు వంటిల్లు .. అందులోని వంటపాత్రలు.. బొజ్జకు మేత ఎలా సిద్ధం చేసుకోవాలో నేర్పించాయి. ఇన్నిరోజులూ మీరే వారి ఆలనాపాలనా చూసి ఉంటారు. ఈ వేసవి సెలవుల్లో అప్పుడప్పుడైనా మీ ఆలనాపాలనా చూసుకునే వారిని సిద్ధం చేయండి. అందుకు కమ్మని రుచుల శాస్త్రాన్ని పరిచయం చేయండి. వారి పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని అద్భుతమని ప్రశంసించండి. ఒక్కరోజే కాదు నెలకు ఒకసారి, అటు నుంచి వారానికి ఒకసారి మీ వంటింటిని గారాల మమకారాలతో నింపండి. ఆప్యాయతానందాలను కడుపారా ఆరగించండి.
సింపుల్ కుకింగ్...
ముందుగా అన్నం..
కావల్సినవి: బియ్యం: 4 కప్పులు; నీళ్లు: 8-9 కప్పులు
తయారి: బియ్యం రెండుసార్లు కడిగి, 8 కప్పుల నీళ్లు పోసి, స్టౌ వెలిగించి, దానిమీద పెట్టాలి. అన్నం పొంగకుండా, అడుగంటకుండా జాగ్రత్తపడాలి. (ఇప్పుడు ఎలక్ట్రిక్ రైస్ కుకర్లు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి పెద్దవారి సాయంతో వీటిని ఉపయోగించవచ్చు) నీళ్లన్నీ పోయి, అన్నం పూర్తిగా ఉడికాక, మంట తీసేసి, దించేయాలి.
టొమాటో పప్పు
కావల్సినవి: పెసరపప్పు - అర కప్పు; పచ్చిమిర్చి- 4; కారం - అర టీ స్పూన్; వెల్లుల్లి - 4 రెబ్బలు; టొమాటోలు - 2 (ముక్కలుగా కట్ చేయాలి); కరివేపాకు - రెమ్మ; కొత్తిమీర తరుగు - టీ స్పూన్; నూనె - 2 టేబుల్ స్పూన్లు; జీలకర్ర - అర టీ స్పూన్; ఆవాలు - పావు టీ స్పూన్; ఎండుమిర్చి - 2; పసుపు - పావు టీ స్పూన్; ఉల్లిపాయ - అర ముక్క (నిలువు ముక్కలుగా కట్ చేయాలి); ఉప్పు - తగినంత
తయారి: పెసరపప్పును కడిగి పక్కనుంచాలి గిన్నెలో నూనె వేసి వేడి చేసి, జీలకర్ర-ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయాలి పోపులో పదార్థాలువేగాక కరివేపాకు, టొమాటోలు, పెసరపప్పు, కప్పు నీళ్లు పోసి ఉడకనివ్వాలి పెసరపప్పు సగం ఉడికాక ఉప్పు-కారం వేసి కలిపి మెత్తగా అయ్యాక చివరగా కొత్తిమీర చల్లి దించాలి.
చపాతీ
కావల్సినవి: గోధుమపిండి - కప్పు; నీళ్లు - తగినన్ని
తయారి: గోధుమపిండిలో కావాలనుకుంటే చిటికెడు ఉప్పు వేసుకోవచ్చు. దీంట్లో తగినన్నినీళ్లు పోసి పిండి కలిపి, పైన మూత పెట్టి 10 నిమిషాలు పక్కనుంచాలి తర్వాత పండి ముద్దను బాగా కలిపి, నిమ్మకాయ పరిమాణంలో ఉండలు చేసి, రొట్టెల పీట మీద అప్పడాల కర్రతో గుండ్రంగా పిండిని వత్తాలి ఇలా చేసిన దానిని పెనం మీద అర టీ స్పూన్ నెయ్యి వేసి, రెండు వైపులా కాల్చుకోవాలి తయారుచేసుకున్న రోటీలను పప్పు కాంబినేషన్‌తో వడ్డించవచ్చు.
పాయసం
కావల్సినవి: పాలు - 2 కప్పులు; నీళ్లు -
అర కప్పు; సేమియా - కప్పు; పంచదార - కప్పు; యాలకులు - 4; జీడిపప్పు పలుకులు - తగినన్ని; నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు.
తయారి: సేమియాను నెయ్యిలో వేయించి, పక్కనుంచాలి నీళ్లు, పాలు కలిపి సేమియాను ఉడికించాలి దీంట్లో పంచదార కలిపి కరిగేంతవరకు ఉడికించాలి చివరగా యాలకుల పొడి, మిగిలిన నెయ్యి, జీడిపప్పు పలుకులు వేసి 2-3 నిమిషాలు మరిగించి దించాలి స్వీట్ కప్పులలో పోసి అందించాలి.
గుడ్డు కూర
కావల్సినవి: కోడిగుడ్లు - 2; ఉల్లిపాయలు - 2 (సన్నగా తరగాలి); పచ్చిమిర్చి - 2; ఉప్పు - తగినంత; పసుపు - చిటికెడు; అల్లం-వెల్లుల్లి పేస్ట్ - పావు టీ స్పూన్; కరివేపాకు - కొన్ని ఆకులు; కొత్తిమీర తరుగు - అర టీ స్పూన్; నూనె - టీ స్పూన్
తయారి: ఉల్లిపాయలను టీ స్పూన్ నూనె వేసి వేయించుకోవాలి. దీంట్లో అల్లం వెల్లుల్లిపేస్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసి కలపాలి ఉల్లిపాయలు వేగాక కోడిగుడ్లు పగలకొట్టి, లోపలి సొనను వేయాలి. 2-3 నిమిషాలు కదపకుండా ఉంచి, తర్వాత కూర అంతా కలపాలి దించే ముందు కొత్తిమీర తరుగు వేయాలి.
ఎక్కిళ్ల నుంచి లెక్కల దాకా...!
అన్నం తినమంటే ‘వద్దని’ ఎక్కిళ్లు పెట్టి ఏడ్చే మీరు వంట తయారీ వెనుక ఉన్న శ్రమ, శ్రద్ధ, నైపుణ్యం... తెలుసుకుంటే పాఠ్యాంశాలనూ ఎంచక్కా వంటింట్లోనే తెలుసుకోవచ్చు. అప్పుడు పాఠశాల తరగతి గది థియరీ క్లాస్ అయితే, వంటగది ప్రాక్టికల్స్‌ను నేర్పుతుంది.
వంటలకు సంబంధించిన వివరాలను చదవడం, వాటికి సంబంధించిన పేపర్లను కట్ చేయడం, వంటగది గోడపై స్టిక్ చేయడం, సరుకుల లిస్ట్‌ను తయారుచేయడం, డబ్బులు చెల్లించేముందు ఎంత మొత్తం అయ్యిందో చెక్‌చేయడం ... ఇలాంటివన్నీ లెక్కల్లో నైపుణ్యాలను పెంచుతాయి. మార్కెట్‌కి వెళ్లేముందు ఏమేం కొనుక్కురావాలో ఓ లిస్ట్ తయారుచేసుకోండి. ఇంటికి వచ్చిన తర్వాత లిస్ట్‌లో ఉన్న సరుకులన్నీ కరెక్ట్‌గా వచ్చాయో లేదా చూడమని గ్రూప్‌లో మరొకరికి చెప్పండి.
ఏయే పదార్థాలు కలిపి వండితే ఎలాంటి రుచి వస్తుందో, రంగులు ఎలా మారుతాయో మొదలైన విషయాలు తెలుసుకోవచ్చు. నలుగురిలో కలిసి పనిచేసుకుంటే కలిగే ఆనందాన్ని అనుభవించవచ్చు. అవి సమాజంలో చొచ్చుకుపోయే నైపుణ్యాలను పెంచుతాయి. ఇవన్నీ ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. ప్రాక్టికల్స్‌లోనే థియరీని కూడా మిక్స్ చేయాలంటే... సంపద, ఊబకాయం, బేకరీ పదార్థాలు, చెడు ఆహారపు అలవాట్లు.. వంటి ముఖ్యమైన విషయాలను చర్చించడానికి అనువైన ప్రదేశం కిచెన్ ఒక్కటే.
వంట చేయడానికి ముందు చేతులు కడుక్కోవాలని, కూరగాయలను శుభ్రపరిచిన తర్వాతే వండాలని తెలుస్తుంది. పాడైపోయిన పదార్థాలను ఎలా వేరు చేయాలి? మంచి వాటిని ఎలా ఎంచుకోవాలో అవగాహన కలుగుతుంది. వంటిల్లు శుభ్రంగా లేకపోతే వచ్చే వ్యాధులు, మానసిక ఒత్తిడి, రకరకాల చికుకాలు.. కలిగిస్తాయనే అంశాలలో అవగాహన పెరుగుతుంది. వంటకు పదార్థాలను సిద్ధం చేసుకోవడం, వంట తయారు చేయడానికి పట్టే సమయం వంటివి సహనాన్ని అలవడేలా చేస్తాయి. కూరగాయలను కట్ చేయడం, వండటంలో ఉండే ఇన్‌వాల్‌మెంట్ ఏకాగ్రతను పెంచుతుంది.
భోజనంలోకి ఏమేం ఐటమ్స్ ఉంటే బాగుంటుందో ప్లానింగ్ చేసే అవగాహన కలుగుతుంది. తాము తయారుచేసిన ఆహారం ప్లేట్‌లో వడ్డించాక తినడానికి గతంలో కన్నా ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. పప్పులు, దినుసులు, రకరకాల పదార్థాలు.. వాటి రంగు, రూపు, రుచి ప్రత్యక్షంగా తెలుసుకుంటారు. ఏ వంటకం ఎలా ఉంటుంది? ఏదయితే బెస్ట్ అనే రివ్యూ మీటింగ్స్ పిల్లల మధ్య నిర్వహించడం వల్ల వారిలో ఆలోచన, వికాసం పెరుగుతాయి. వంటింటి పరిచయం వల్ల అతిథులను ఆహ్వానించడం, వారికి మర్యాదలు చేయడంలో ముందుంటారు.
మొదటి షెఫ్ అమ్మే!
చదువుకునే వయసులో వంటతో ఏం పని అని పెద్దవాళ్లు కసురుకుంటారు. కానీ, వంటిల్లే జీవిత పాఠాలను నేర్పగలదు అని మీరే ముందు వారికి షెఫ్‌గా పరిచయం అవ్వండి. పిల్లల కోసం వారికి అనువైన చిన్న స్టూళ్లు టేబుల్ దగ్గర లేదా కౌంటర్ టాప్, స్టౌ దగ్గర పెద్దల పర్యవేక్షణలో ఉంచాలి. కూరగాయలు కట్ చేయడానికి అనువైన కటింగ్ బోర్డ్స్ ఉండాలి. కత్తుల వాడకం - జాగ్రత్తల గురించి ముందే తెలియజేయాలి. కిందపడినా పగలని వస్తువులు, చేతులు తుడుచుకోవడానికి టవల్ వంటివి ఏర్పాటు చేయాలి. ఉడెన్ స్పూన్స్, మృదువుగా, రౌండ్‌గా హ్యాండిల్ గ్రిప్ ఉండే వస్తువులను ఎంచుకోవడం మేలు.ఐదు, పది నిమిషాల్లో పూర్తయ్యే వంటలను పరిచయం చేయాలి. వంటల పుస్తకాలను ఫాలో అవ్వచ్చు. ఒక టైమ్‌లో ఒకే ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వండి. అదీ ఒకటే ఐటమ్‌కి.
రక్షణకవచాలు తప్పనిసరి....
పిల్లలు వంట చేసేటప్పుడు పేరెంట్స్ దగ్గరగా ఉండాలి. ఎట్టి పరిస్థితిలోనూ వారిని ఒంటరిగా వదిలి వెళ్లకూడదు. రక్షణకు సంబంధించిన వివరాలు తెలియజేసి, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నప్పుడు అలెర్ట్‌గా ఉండటమెలాగో సూచించాలి. వంట చేసేటప్పుడు పిల్లలు కాటన్ దుస్తులు ధరించాలి. వేడి పాన్‌లు, గిన్నెలు తగలకుండా హెచ్చరించాలి. ఎలక్ట్రికల్ అప్లయెన్సులను, షార్ప్ వస్తువులను, వేడి పాత్రల వల్ల కలిగే ప్రమాదాలు, నివారణ చర్యల గురించి తెలియజేయాలి.