దావత్-ఏ-మొఘల్ | Dawat-e-Mughal | Sakshi
Sakshi News home page

దావత్-ఏ-మొఘల్

Published Fri, Feb 5 2016 11:04 PM | Last Updated on Sun, Sep 3 2017 5:01 PM

దావత్-ఏ-మొఘల్

దావత్-ఏ-మొఘల్

మొఘలులు వచ్చారు. ఏలారు. మనలో కలిసిపోయారు. వాళ్ల ఏలుబడి అంతరించింది. రుచులు ఇంకా ఏలుతూనే ఉన్నాయి. దర్బార్‌లు బంద్ అయ్యాయి. దావత్‌లు నడుస్తూనే ఉన్నాయి.  మీరూ.. ఓ దావత్ మీ ఇంట్లో చేస్కోండి.
 
 అంగూర్ కా షర్బత్
కావల్సినవి: నల్లద్రాక్ష - 2 కప్పులు
పంచదార పొడి - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర పొడి - టీ స్పూన్; నిమ్మరసం - 2 టీ స్పూన్లు
అల్లం రసం - టీ స్పూన్ (తగినంత)
పుదీనా తరుగు - 2 టేబుల్ స్పూన్లు

తయారీ:
ద్రాక్ష పండ్లను శుభ్రపరిచి, మిక్సర్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
మూడున్నర కప్పుల నీళ్లు పోసి కలపాలి.
దీంట్లో పంచదార, జీలకర్రపొడి, నిమ్మరసం, అల్లం రసం వేసి కలిపి ప్రిజ్‌లో ఉంచాలి.
గ్లాసులో పోసి చల్లగా అందించాలి.
నోట్: దాల్చిన చెక్క, జాజికాయ పొడులను కూడా కలుపుకోవచ్చు.
 
కార్న్, పొటాటో కబాబ్

కావల్సినవి: స్వీట్ కార్న్ గింజలు (ఉడికించినవి)- కప్పుడు
బంగాళదుంపలు (ఉడికించి, తరుమాలి) - కప్పుడు
పచ్చిమిర్చి - 2 (సన్నగా తరగాలి)
గరం మసాలా - పావు టీ స్పూన్
నిమ్మరసం - 2 టీ స్పూన్లు; బ్రెడ్ స్లైసులు - 2
ఉప్పు - రుచికి తగినంత; నూనె - 2 టీ స్పూన్లు
 
తయారీ:  
 ఒక గిన్నెలో కావల్సిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి.  నాలుగు సమ భాగాలు చేసుకోవాలి.  సన్నని ఇనుపచువ్వ తీసుకొని, కార్న్ ముద్దను దానికి బాగా అదమాలి.  ప్రతి కబాబ్ మిశ్రమంపై కొద్దిగా నూనె వేయాలి.  బొగ్గులను మండించి, దానిపైన ఈ కబాబ్స్‌ను అన్నివైపులా గోధుమరంగు వచ్చేవరకు కాల్చాలి.  తీసి, ముక్కలుగా కట్ చేసి, ఏదైనా పచ్చడితో సర్వ్ చేయాలి.
 నోట్: మార్కెట్‌లో ఉడెన్ కబాబ్ స్టిక్స్ దొరుకుతున్నాయి. ఇనుప చువ్వలకు బదులుగా వాటిని ఉపయోగించవచ్చు.  
 
అవధి గోష్
కావల్సినవి: బోన్‌లెస్ మటన్ - అర కేజీ; జీలకర్ర - అర టేబుల్ స్పూన్
ఉల్లిపాయల తరుగు - కప్పుడు; గసగసాల పేస్ట్ - అర కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు; ధనియాల పొడి - టేబుల్ స్పూన్
పసుపు - అర టీ స్పూన్; కారం - అర టీ స్పూన్; బిర్యానీ ఆకులు - 2
లవంగా - 8 ; ఆకుపచ్చ ఇలాచీలు - 8; దాల్చిన చెక్క - ముక్క
జాజికాయ పొడి - పావు టీ స్పూన్; నూనె - 4 టేబుల్ స్పూన్లు; ఉప్పు - రుచికి తగినంత
 
తయారీ:
కడాయిలో లవంగాలు, ఇలాచీలు, జాజికాయ పొడి, జీలకర్ర, దాల్చిన చెక్క వేసి వేయించి, పొడి చేయాలి.  గిన్నెలో నూనె వేసి, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు వేసి వేయించాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. దీంట్లో మటన్ ముక్కలు, చేసి పెట్టిన గరం మసాలా, పసుపు, కారం వేసి, కప్పు నీళ్లు ఉప్పు వేసి ఉడికించాలి. చిక్కదనం బట్టి మరికొన్ని నీళ్లు కూడా కలుపుకోవచ్చు.
 చివరగా గసగసాల పేస్ట్, కొబ్బరి పేస్ట్, ధనియాల పొడి వేసి మరో పది నిమిషాలు ఉడికించాలి. వేడి వేడిగా అన్నం లేదా రోటీలోకి వడ్డించాలి.
 
షాహీ పనీర్
కావల్సినవి: పనీర్ - 200 గ్రా.లు; ఉల్లిపాయల తరుగు అర కప్పు, డ్రై ఫ్రూట్స్ అరకప్పు, నీళ్లు కప్పు ఇవన్నీ కలిపి మరిగించిన నీళ్లు - ఒకటిన్నర కప్పు; పెరుగు - అర కప్పు (మృదువుగా అయ్యేలా గరిటెతో గిలకొట్టాలి); అమూల్ క్రీమ్ లేదా పాల మీగడ - 2 టేబుల్ స్పూన్లు; ధనియాల పొడి - అర టీ స్పూన్; పసుపు - పావు టీ స్పూన్; గరం మసాలా - పావు టీ స్పూన్; ఇలాచీ పొడి - పావు టీ స్పూన్
 కుంకుమపువ్వు రేకలు - 10 (చిదమాలి); ఎసెన్స్ - 2 చుక్కలు,ఉప్పు - రుచికి తగినంత
 
గ్రేవీ కోసం.
.
ఉల్లిపాయ - 1 (తరగాలి); జీడిపప్పు పలుకులు - 2 టేబుల్ స్పూన్లు (సన్నగా తరగాలి); బాదాంపప్పులు (తరిగినవి) - టేబుల్ స్పూన్; బూడిదగుమ్మడి గింజలు - టేబుల్ స్పూన్ (నానబెట్టి పై తొక్క తీసేయాలి); వెల్లులి - 4 రెబ్బలు (తరగాలి)
 చిన్న అల్లం ముక్క - 1 (సన్నగా తరగాలి)
 
తయారీ:
 ఉల్లిపాయలు, జీడిపప్పు, బాదాంపప్పులు, గుమ్మడి గింజలు, అల్లం-వెల్లుల్లి, ఒకటిన్నర కప్పు నీళ్లు కలిపి 10 నిమిషాలు మరిగించాలి. నీళ్లు వడకట్టి, పై పదార్థాలను పేస్ట్ చేయాలి.కడాయిలో టీ స్పూన్ నూనె వేసి గరం మసాలా దినుసులన్నీ వేయించి, పొడి చేసి పక్కనుంచాలి.అదే కడాయిలో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ- గ్రేవీ కోసం ఇచ్చిన పదార్థాల పేస్ట్, గరమ్ మసాలా వేసి వేయించాలి.మిగిలిన వడకట్టు నీళ్లు, పెరుగు, మీగడ, ఉప్పు, పంచదార కలిపి, దీనిని కూడా పై మిశ్రమంలో కలిపి 10 నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి. ఇలాచీ పొడి, కుంకుమపువ్వు రేకలు వేసి, కలిపిన తర్వాత పనీర్ ముక్కలు వేసి 2 నిమిషాలు ఉడికించాలి.  ఎసెన్స్ వేసి కలిపి, చివరగా కొత్తిమీర చల్లి దించాలి. ఈ కూర జీరా రైస్ లేదా రోటీస్, పుల్కాలకు చాలా బాగుంటుంది.
 
ముర్గ్ బిర్యానీ
కావల్సినవి: బాస్మతి బియ్యం - ఒకటిన్నర కప్పు
చికెన్ - 200 గ్రా.లు
దాల్చిన చెక్క - చిన్న ముక్క; బిర్యానీ ఆకు - 1
సాజీరా - టీ స్పూన్; లవంగాలు - 4
ఇలాచీలు - 3; నీళ్లు - 5 కప్పులు
ఉప్పు - రుచికి తగినంత
వైట్ పేస్ట్ మిశ్రమానికి: బాదాం పప్పులు - 10
(నీళ్లలో గంటసేపు నానబెట్టాలి)
బూడిద గుమ్మడి గింజలు - టేబుల్ స్పూన్
పచ్చికొబ్బరి తురుము - టేబుల్ స్పూన్
నీళ్లు - 2 టేబుల్ స్పూన్లు
 
తయారీ:
చికెన్‌ను శుభ్రపరచి పక్కన ఉంచాలి.
బాస్మతీ బియ్యం కడిగి, అరగంట నాననివ్వాలి.
తొక్కతీసిన బాదాం పప్పులు, బూడిదగుమ్మడి గింజలు, కొబ్బరి తురుము, రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు కలిపి మెత్తగా రుబ్బాలి.
ఉల్లిపాయను స్లైసులుగా కోసి పక్కనుంచాలి.
 
గిన్నెలో నీళ్లు పోసి మరుగుతుండగా అందులో దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచీలు, సాజీర వేయాలి. నీళ్లు బాగా మరుగుతుండగా అందులో ఉప్పు వేయాలి. పూర్తిగా వడకట్టిన బాస్మతి బియ్యం వేసి ఉడకనివ్వాలి. అన్నం (75 శాతం మాత్రమే ఉడకాలి) పూర్తిగా ఉడకకముందు దించి, జల్లిలో పోసి, వడకట్టాలి   విడిగా మరొక కడాయిలో నూనె వేసి, అందులో బాదాం పప్పులు, కిస్‌మిస్, జీడిపప్పు, ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి.  సాజీర, సగం బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీంట్లో చికెన్ వేసి ఉడికించాలి. వైట్ పేస్ట్ మిశ్రమం, తగినంత ఉప్పు కలిపి మరో రెండు నిమిషాలుంచి దించాలి.  విడిగా చిన్న గిన్నెలో మూడు స్పూన్ల పాలలో 7-8 కుంకుమ పువ్వు రేకలు వేసి కలపాలి.మరొక గిన్నె తీసుకొని అడుగున టేబుల్ స్పూన్ నెయ్యి లేదా నూనె రాసి,  ఒక పొర చికెన్ ముక్కల మిశ్రమం, ఒక పొర ఉడికిన బాస్మతి బియ్యం, ఆ పైన చికెన్ మిశ్రమం .. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ పూర్తి అయ్యాక పైన కుంకుమపువ్వు మిశ్రమం, జీడిపప్పులు, కిస్‌మిస్, పుదీనా చల్లి, మూతపెట్టి, సన్నని మంట మీద ఉడకనివ్వాలి. మాడకుండా చూసుకొని, దించాలి.
 
నోట్ 1: అవెన్ ఉన్నవారు బిర్యానీ గిన్నె మీద అల్యూమీనియమ్ ఫాయిల్‌తో కవర్ చేసి, 200 డిగ్రీల సెల్సియస్‌లో 20 నిమిషాలు ఉడికించాలి.
నోట్ 2: బిర్యానీకి కాంబినేషన్‌గా 2 కప్పుల పెరుగు, కూరగాయలు-పచ్చిమిర్చి తరుగు, ఉప్పు కలిపి చేసిన రైతాను వాడుకోవచ్చు.
 
ముర్గ్ బిర్యానీ బాదామి కెవ్రా సేవియాన్
కావల్సినవి: బాదాంపప్పుల పేస్ట్ - 4 టేబుల్‌స్పూన్లు
బాదాంపప్పు (సన్నగా తరిగినవి) - పావు కప్పు
ఎసెన్స్ - 4-5 చుక్కలు; నెయ్యి - టీ స్పూన్
సేమియా - అర కప్పు; వెన్నతీయని పాలు - 5 కప్పులు
పంచదార - 5 టేబుల్ స్పూన్లు
తయారీ:  గిన్నెలో నెయ్యి వేసి వేడి చేయాలి. దీంట్లో సేమియా వేసి 2-3 నిమిషాలు వేయించాలి.
పాలను విడిగా 15 నిమిషాలు మరిగించి, అందులో బాదాం పేస్ట్ వేసి మరో 2-3 నిమిషాలు ఉంచాలి.
దీంట్లో సేమియా వేసి, కలుపుతూ 4-5 నిమిషాలు ఉడికించాలి.
పంచదార వేసి, కలిపి, కెవ్రా ఎసెన్స్, బాదాం పప్పు పలుకులు వేసి కలిపి సర్వ్ చేయాలి.
 
నోట్: 15 బాదాం పప్పులను తీసుకొని వేడినీళ్లలో 20 నిమిషాలు నానబెట్టి, తర్వాత పొట్టు తీసి, పావు కప్పు నీళ్లు కలిపి మిక్సర్‌లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాలలో కలిపి ఉడికిస్తే సేవియా మరింత రుచిగా ఉంటుంది.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement