వెయ్యింతల ఊరింతలు | Thousand times of Taste | Sakshi
Sakshi News home page

వెయ్యింతల ఊరింతలు

Published Fri, Nov 8 2013 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 12:25 AM

Thousand times of Taste

 చింతను చూస్తూ ఊరుకోవడం కష్టమే! కనీసం కాయ కొసల్నైనా కొరక బుద్దేస్తుంది.
 అందాకా ఎందుకు? చింతకాయను ఊహించుకోండి చాలు...
 జివ్వుమని మనసు ఊటబావి ఐపోతుంది!
 చింత వచ్చి చెంతన చేరితే... చప్పిడి పళ్లేలకు కూడా చురుకు పుట్టుకొస్తుంది.
 ఇక మనమెంత, మానవమాత్రులం?
 కళ్ల ముందు చింత పులుసో, పప్పో, పచ్చడో ప్రత్యక్షమవగానే...
 వేళ్లు కలబడి కలబడి ముద్దను కలిపేస్తాయి.
 చింతలో ఉన్న ‘సి’ట్రాక్షన్ వల్లనే... ఇంత ఎట్రాక్షన్.
 ఇవన్నీ కాదు...
 వెయ్యి రకాల కూర గాయలకైనా...
 వెయ్యి కాంబినేషన్‌ల రుచులను ఇవ్వగల కెపాసిటీ...
 చింతది, చింత పులుపుది, చింత తలపుది!
 
 చింతకాయ నువ్వుల పచ్చడి

 
 కావలసినవి:
 చింతకాయలు - 8, నువ్వుపప్పు - 100 గ్రా., పచ్చిమిర్చి - 10, ఎండుమిర్చి - 6, శనగపప్పు - రెండు టీ స్పూన్లు, మినప్పప్పు - రెండు టీ స్పూన్లు, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, మెంతులు - టీ స్పూను, ఇంగువ - చిటికెడు, పసుపు - పావు టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - 2 టేబుల్ స్పూన్లు
 
 తయారి:
 చింతకాయలను ఉడికించి రసం చిక్కగా తీసుకుని పక్కన ఉంచాలి  
 
 బాణలిలో నువ్వులను వేయించి, చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి  
 
 బాణలిలో నూనె వేసి కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు, ఇంగువ వేసి వేయించి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి
 
 మిక్సీలో చింతకాయరసం, నువ్వులపొడి, పోపుల పొడి, పసుపు, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి.
 
 దోసకాయ చింతకాయ పచ్చడి
 
 కావలసినవి:

 దోసకాయముక్కలు - రెండు కప్పులు, చింతకాయలు - కప్పు, పచ్చిమిర్చి - 7, కొత్తిమీర - చిన్నక ట్ట, ఉప్పు - తగినంత, మినప్పప్పు - 3 టీ స్పూన్లు, శనగపప్పు - 3 టీ స్పూన్లు, నూనె - 3 టీ స్పూన్లు, మెంతులు - 3 టీ స్పూన్లు, జీలకర్ర - టీ స్పూను, ఆవాలు - 2 టీ స్పూన్లు, ఎండుమిర్చి - 6 (ముక్కలు చేసుకోవాలి), కరివేపాకు  చిన్న కట్ట, ఇంగువ - చిటికెడు
 
 తయారి:  
 బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసి వేయించాలి  
 
 కరివేపాకు, ఇంగువ వేసి మరో మారు వేయించాలి  
 
 దోసకాయ ముక్కలను కొద్దిగా ఉడికించాలి. (హాఫ్ బాయిల్ చేయాలి)  
 
 చింతకాయలను ఉడికించి చిక్కగా రసం తీసుకోవాలి  
 
 వేయించి ఉంచుకున్న పోపు సామాగ్రి, పచ్చిమిర్చి మిక్సీలో వేసి మెత్తగాపేస్ట్  చేసుకోవాలి  
 
 ఒక గిన్నెలో ఉడికించి ఉంచుకున్న దోసకాయముక్కలు, చింతకాయరసం, మెత్తగా చేసుకున్న పేస్ట్, ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి.
 
 చింతకాయ పులుసు

 
 కావలసినవి:

 చింతకాయలు - 6, టొమాటో తరుగు - పావు కప్పు, ఉల్లితరుగు - పావు కప్పు, పచ్చిమిర్చి -2, బెల్లం తురుము - రెండు టీ స్పూన్లు, ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు, ఇంగువ - చిటికెడు, ఎండుమిర్చి - 4, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, ధనియాలపొడి - పావు టీ స్పూను, కరివేపాకు - రెండు రెమ్మలు, కొత్తిమీర - చిన్న కట్ట
 
 తయారి:  
 చింతకాయలను ఉడికించి రసం తీసి పక్కన ఉంచాలి  
 
 ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీరు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు వేసి ఉడికించాలి  
 
 ఉడికించిన చింతపండు రసం, బెల్లం తురుము, పసుపు వేసి పులుసును బాగా మరిగించాలి  
 
 ఒక బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి వేగాక పులుసులో వేయాలి  కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.
 
 చింతకాయ - శనగపిండి కూర
 
 కావలసినవి:

 చింతకాయలు - 10, శనగపిండి - మూడు టేబుల్ స్పూన్లు, ఉల్లితరుగు - పావు కప్పు, టొమాటో తరుగు - పావు కప్పు, పుదీనా ఆకులు - పావు కప్పు, ఎండుమిర్చి - 5, పచ్చిమిర్చి - 3, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, శనగపప్పు - రెండు టీ స్పూన్లు, మినప్పప్పు - రెండు టీ స్పూన్లు, ధనియాలపొడి - పావు టీ స్పూను, ఇంగువ - చిటికెడు, పసుపు - పావు టీ స్పూను, ఉప్పు - తగినంత, కరివేపాకు - రెండు రెమ్మలు, కొత్తిమీర - చిన్నకట్ట, నూనె - మూడు టేబుల్ స్పూన్లు.
 
 తయారి:

 చింతకాయలను ఉడికించి చిక్కగా రసం తీసి పక్కన ఉంచాలి  
 
 బాణలిలో నూనె వేసి కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి  
 
 టొమాటో ముక్కలు, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా ఆకులు వేసి వేయించాలి
 
 ఇంగువ, పసుపు జత చేసి బాగా కలపాలి
 
 చింతకాయ రసంలో శనగపిండి వేసి బాగా కలిపి ఉడుకుతున్న కూరలో వేసి ఆపకుండా కలపాలి  
 
 దనియాలపొడి, కరివేపాకు వేసి క లిపి దించేయాలి  
 
 కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.
 
 చింతకాయ ఉల్లిపాయ పచ్చడి
 
 కావలసినవి:
చింతకాయలు - 6, పచ్చిమిర్చి -  5, ఉప్పు - తగినంత, పసుపు - టీ స్పూను, ఇంగువ - చిటికెడు, ఎండుమిర్చి - 5, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, శనగపప్పు - రెండు టీ స్పూన్లు, మినప్పప్పు - రెండు టీ స్పూన్లు, ఉల్లిపాయలు - 2 (చిన్నముక్కలుగా కట్ చేయాలి), కొత్తిమీర - చిన్న కట్ట
 
 తయారి:  
 చింతకాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి  
 
 మిక్సీలో చింతకాయలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ చేయాలి
 
 పసుపు జత చేసి గాలి చొరని గాజు సీసాలో కాని జాడీలో కాని రెండు రోజులు ఉంచాలి  
 
 మూడవరోజు తిరగకలపాలి  
 
 బాణలిలో నూనె వేసి కాగాక ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి  
 
 కరివేపాకు జత చేసి మరోమారు వేయించి చింతకాయపచ్చడిలో వేసి కలపాలి  
 
 అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఉల్లిపాయముక్కలు వేసి దోరగా వేయించి తీసేసి పచ్చడిలో వేసి కలపాలి  
 
 కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.
 
 చింతకాయ పప్పు
 
 కావలసినవి:
చింతకాయలు - 4, కందిపప్పు - కప్పు, ఉల్లితరుగు - అర కప్పు, ఎండుమిర్చి - 6, పచ్చిమిర్చి - 4, ఆవాలు - టీ స్పూను, మెంతులు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, వెల్లుల్లి రేకలు - 4, కరివేపాకు - 2 రెమ్మలు, కొత్తిమీర - చిన్న కట్ట


 తయారి:  
 పప్పులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి ఉడికించాలి  
 
 చింతకాయలను ఉడికించి రసం తీసుకోవాలి  
 
 ఒక గిన్నెలో ఉడికించిన పప్పు, చింతపండు రసం వేసి స్టౌ మీద ఉంచాలి  
 
 కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసి కలపాలి  
 
 బాణలిలో కొద్దిగా నూనె వేసి అందులో వెల్లుల్లి, పోపు సామాను వేసి వేయించాలి  
 
 ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి కలపాలి  
 
 ఉడికిన పప్పులో ఈ పోపు వేసి కలపాలి.
 
 సేకరణ: డా.వైజయంతి
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement