
ఉత్తరాఖండ్ అడవుల్లో కార్చిచ్చు రగులుతూనే ఉంది. అల్మోరా, బాగేశ్వర్ సహా పలు జిల్లాల్లో అడవులు తగలబడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా రాటూరి రాష్ట్రంలోని అన్ని జిల్లాల మేజిస్ట్రేట్‌లకు లేఖ రాశారు. అడవుల్లోని మంటలను అదుపు చేసేందుకు నిరంతం చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఆ లేఖలో కోరారు.
మీడియాకు అందిన వివరాల ప్రకారం గత సంవత్సరం నవంబర్ ఒకటి నుండి ఇప్పటివరకూ ఉత్తరాఖండ్ అడవులలో మొత్తం 910 అగ్నిప్రమాదాలు సంభవించాయి. దాదాపు 1,145 హెక్టార్ల అటవీప్రాంతం ప్రభావితమైంది. రాష్ట్రంలో అడవుల్లోని కార్చిర్చు అదుపు చేయడం గురించి ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం జరిగింది. అడవుల్లో చెలరేగున్న మంటల కారణంగా ఇప్పటివరకు ఐదుగురు మరణించారు. అలాగే అడవుల నుంచి వెలువడుతున్న పొగ కారణంగా స్థానికులు ఊపిరి పీల్చుకోవడంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బరాహత్ శ్రేణి అడవుల్లో గురువారం సాయంత్రం వ్యాపించిన మంటలు ఇప్పటి వరకూ పూర్తిగా అదుపులోకి రాలేదు. తాజాగా ముఖెంరేంజ్‌లోని డాంగ్, పోఖ్రీ గ్రామానికి ఆనుకుని ఉన్న అడవితో పాటు దుండా రేంజ్‌లోని చామ్‌కోట్, దిల్సౌద్ ప్రాంతంలోని అడవులు కూడా మంటల్లో చిక్కుకున్నాయి. ధరాసు పరిధిలోని ఫేడీ, సిల్క్యారాకు ఆనుకుని ఉన్న అడవులు కూడా తగడలబడుతున్నాయి. అటవీ శాఖ అందించిన సమాచారం ప్రకారం ఉత్తరకాశీ అటవీ డివిజన్‌లో 19.5 హెక్టార్ల అడవి మంటల కారణంగా కాలి బూడిదైంది.