ఉత్తరాఖండ్‌లో మాదిరిగానే హిమాచల్ ప్రదేశ్‌లోని అడవుల్లోనూ కార్చిర్చు కనిపిస్తోంది. సోలన్, మండి, కాంగ్రాలో కోట్లాది రూపాయల విలువైన అటవీ సంపద బూడిదగా మారింది. తాజాగా హిమాచల్‌లోని మండీ జిల్లా ధరంపూర్ మండప్ గ్రామ అడవుల్లోకి మంటలు వ్యాపించాయి. సోలన్ సమీపంలోని అడవిని కూడా మంటలు చుట్టుముట్టాయి. ఈ మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం ఉండటం లేదు.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం సోలన్ సమీపంలోని కాలాఘాట్‌లో తాజాగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అటవీ శాఖ ఉద్యోగులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయినా మంటలు అదుపులోకి రాలేదు. అడవుల్లో దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర మంటలు వ్యాపించాయి. దీంతో అటవీ శాఖ ఉద్యోగులు స్థానికులను సహాయం కోసం అభ్యర్థించారు. ఎనిమిది గంటలపాటు ఎదురు చూసినా అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకోలేదు.
అటవీ శాఖ డిప్యూటీ రేంజర్ నీలం ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ చాలాసేపటి నుంచి తాము మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నామని, స్థానికుల సహాయం కూడా అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఉద్యోగులు ప్రాణాలను పణంగా పెట్టి మంటలను ఆర్పుతున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment