విధాన పరిషత్‌లో ఆసక్తికర చర్చ
బెంగళూరు : ‘నాటుకోడి కూర, గింజల కూర, బోటి, సెట్‌దోసె....వహ్వా ఏమా రుచులు’ ఈ తరహా ఆసక్తికర చర్చ విధానపరిషత్‌లో గురువారం చోటుచేసుకుంది. విధానపరిషత్ కార్యకలాపాల్లో భాగంగా పరిషత్ సభ్యుడు రామచంద్రగౌడ ప్రస్తావించిన అంశంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమాధానం ఇచ్చే సందర్భంలో ఈ చర్చ చోటుచేసుకుంది. సిద్ధరామయ్య మాట్లాడుతూ...‘మైసూరులో 12 పైసలకు రెండు సెట్ దోసెలు ఇచ్చేవారు. నాటుకోడి కూర, గింజల కూర, బోటిలతో ఈ సెట్‌దోసెలు అందించేవారు. మైసూరులోని చడ్డి హోటల్, మైలారి హోటల్, రాజుహోటల్‌ల దగ్గర పొద్దుపొద్దున్నే క్యూలో జనాలు కనిపించేవాళ్లు. అప్పటి రుచులే వేరు. ఇప్పుడు ఆ రుచి కనిపించడం లేదు’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంలో విధానపరిషత్‌లో ప్రతిపక్ష నేత ఈశ్వరప్ప కలగజేసుకుంటూ....‘ఇలా నాటుకోడి కూర, బోటి అంటూ మీరు చెబుతుంటే మాకు నోరూరుతోంది.
ఇలాంటి ఆహారపదార్థాలన్నీ మేం కూడా రుచి చూసేందుకు ఏదైనా ఏర్పాటు చేయకూడదా?’ అంటూ చమత్కరించారు. దీంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ...‘మైసూరుకు రండి, నాటుకోడి కూరతో పాటు బోటి, తలమాంసం ఇలా అన్ని రకాల పదార్థాలు వండి, వడ్డిస్తాం’ అంటూ ఆహ్వానించారు. ఇక ఈ సంభాషణల మధ్య జేడీఎస్ సభ్యుడు ముజీర్ ఆగా కలగజేసుకుంటూ...‘కేవలం ఈశ్వరప్పనేనా మమ్మల్ని కూడా ఆహ్వానించేదేమైనా ఉందా’? అంటూ సిద్ధరామయ్యను ప్రశ్నించారు. దీనిపై సిద్ధరామయ్య స్పందిస్తూ...‘మిమ్మల్ని వదిలి పెట్టి వేరే ఎవరినైనా ఆహ్వానించడం అసలు సాధ్యమేనా’ అనడంతో సభలో నవ్వులు విరబూశాయి.
‘నాటుకోడి’ కూరతో సెట్ దోసె!
Published Fri, Feb 13 2015 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 9:12 PM
Advertisement