
వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టనున్న సీఎం రేవంత్
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కల్పన బిల్లును ప్రవేశపెట్టనున్న మంత్రి పొన్నం
బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం మరో బిల్లు కూడా..
సాక్షి, హైదరాబాద్: మూడు కీలక బిల్లులు సోమవారం శాసనసభ ముందుకు రానున్నాయి. అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు ఆదివారం రాత్రి విడుదల చేసిన ఎజెండా ప్రకారం ఎస్సీల వర్గీకరణ బిల్లును సీఎం రేవంత్‌రెడ్డి ప్రవేశపెడతారు. అనంతరం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుతో పాటు బీసీలకు ప్రత్యేకంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రతిపాదించనున్నారు.
బీసీలకు చట్టసభల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించిన అనంతరం..దేశవ్యాప్తంగా బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. దేవాదాయ మంత్రి కొండా సురేఖ మరో బిల్లును ప్రవేశపెడతారు. తెలంగాణ ధారి్మక, హిందూ మత సంస్థల బిల్లుకు ఆమె సవరణలు ప్రతిపాదించనున్నారు. కాగా బుధవారం 2025–26 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదించనుంది.
నేడు ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు
సోమవారం శాసనసభ, శాసనమండలి ప్రశ్నోత్తరాలను చేపట్టనున్నాయి. విదేశీ విద్యానిధి పథకంతో పాటు ప్రభుత్వ జీవోలను అందుబాటులో ఉంచడం, సంక్షేమ హాస్టళ్లలో డైట్ చార్జీల పెంపు, హెచ్‌ఎండీఏ భూముల తాకట్టు తదితర అంశాలపై సభ్యులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది. ఇక మండలిలో కూడా సోమవారం కీలక ప్రశ్నలు రానున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, కల్యాణమస్తు, ఇందిరమ్మ ఇళ్లు, సీతారామ ప్రాజెక్టు, ఫార్మాసిటీ తదితర అంశాలపై ప్రశ్నలకు ప్రభుత్వం జవాబివ్వనుంది.
నేడు బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బ్రేక్‌ఫాస్ట్: చరిత్రాత్మకమైన బీసీ రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ కానున్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు మంత్రి చాంబర్‌లో వారి కోసం బ్రేక్‌ఫాస్ట్ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment