
కేసీఆర్‌పై సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ధ్వజం
ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ తెస్తే చావును కోరుతున్నారు: హరీశ్‌రావు
కాంగ్రెస్ వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు తీరని అన్యాయమని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో జరిగిన చర్చలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగాన్ని బీఆర్‌ఎస్ బహిష్కరించింది. పదేళ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్ర పురోగతి కోసం శ్రమించిన కేసీఆర్ చావును రేవంత్ రెడ్డి కోరుకున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలు ఫణంగా పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ చావును కోరుకోవడం దారుణమన్నారు. కేసీఆర్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే ముఖ్యమంత్రి ప్రసంగాన్ని బహిష్కరించామని బీఆర్‌ఎస్ సభ్యుడు హరీశ్‌రావు అసెంబ్లీ లాబీల్లో వ్యాఖ్యానించారు.
ఉత్తమ్‌వి పచ్చి అబద్ధాలు
కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని హరీశ్‌రావు విమర్శించారు. సీఎం ప్రసంగాన్ని బహిష్కరించిన అనంతరం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ‘నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వహించి ప్రాజెక్టులు నిర్మించకపోవడం వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలను పంపిణీ చేశారు. నాడు కృష్ణా జలాల్లో తెలంగాణకు తాత్కాలిక కేటాయింపులు మాత్రమే జరిగాయి.
ఇటీవల తెలంగాణ అధికారులు రాహుల్ బొజ్జా, అనిల్ కుమార్ ఢిల్లీకి వెళ్లి 299 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకుని వచ్చారు’అని హరీశ్ అన్నారు. ‘పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుతో జరిగే అన్యాయంపై నాడు కాంగ్రెస్ నాయకులు పి.జనార్దన్‌రెడ్డి ఒక్కరే కొట్లాడారు. నాడు నాతోపాటు ఆరుగురు కాంగ్రెస్ మంత్రివర్గం నుంచి బయటకు వచ్చాం. కానీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో చోటుకోసం నోరు మూసుకున్నారు.
ఆయనది ద్రోహ చరిత్ర అయితే బీఆర్‌ఎస్‌ది త్యాగాల చరిత్ర. ఉత్తమ్ దంపతులు ఏపీ సీఎం చంద్రబాబు దగ్గరకు వెళ్లి భోజనం చేసి వచ్చి కృష్ణా నీటిలో తెలంగాణకు అన్యాయం చేశారు. సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం జిల్లాకు కేసీఆర్ నీళ్లు ఇస్తే.. హుజూర్‌నగర్‌ను ముంచి పులిచింతల ద్వారా ఆంధ్రాలో మూడో పంటకు నీళ్లు ఇచ్చిన ఘనులు కాంగ్రెస్ నాయకులు’అని హరీశ్‌రావు మండిపడ్డారు.
సీఎం వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం ఎన్నో త్యాగాలు చేసిన మాజీ సీఎం కేసీఆర్ మార్చురీకి పోతారని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. శనివారం సీఎం ప్రసంగాన్ని బహిష్కరించిన అనంతరం మీడియా పాయింట్ వద్ద వేముల ప్రశాంత్‌రెడ్డి, కేపీ వివేకానంద, పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడారు.
కేసీఆర్‌ను కించపరచడం తప్ప సీఎం 3 గంటల పాటు అసెంబ్లీలో మాట్లాడిందేమీ లేదన్నారు. రాజముద్ర నుండి చార్మినార్, కాకతీయుల కళాతోరణం తీసే ప్రయత్నం జరుగుతోందని, దీనిని అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు.
జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయండి
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని బీఆర్‌ఎస్ శాసనసభాపక్షం విజ్ఞప్తి చేసింది. హరీశ్‌రావు నేతృత్వంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు శనివారం స్పీకర్ చాంబర్‌లో శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌తో భేటీ అయ్యారు. సీనియర్ సభ్యుడైన జగదీశ్‌రెడ్డి స్పీకర్ పట్ల అమర్యాదగా ప్రవర్తించలేదనే విషయాన్ని హరీశ్‌రావు ప్రస్తావించారు.
జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేసే అంశంలో విపక్ష ఫ్లోర్ లీడర్ల అభిప్రాయం కోరలేదన్నారు. జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌పై పునఃసమీక్షించి ఎత్తివేయాలని బీఆర్‌ఎస్ శాసనసభా పక్షం స్పీకర్‌కు విజ్ఞప్తి చేసింది. సభ ప్రారంభమైన తర్వాత హరీశ్‌రావు ఇదే విషయాన్ని మరోమారు అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చి సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్‌ను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment