ముసురుతో పొత్తు... | combination of maize is enjoyable with health and enjoyment | Sakshi
Sakshi News home page

ముసురుతో పొత్తు...

Published Fri, Jul 14 2017 11:17 PM | Last Updated on Tue, Sep 5 2017 4:02 PM

ముసురుతో పొత్తు...

ముసురుతో పొత్తు...

మబ్బులు ముసిరిన వేళ బండి మీద అమ్మే మొక్కజొన్నపొత్తులు వెచ్చగా రారమ్మంటాయి. చింత నిప్పుల మీద అవి కాలుతుంటే చూసేవారి నోట్లో నీళ్లు ఊరుతుంటాయి... వాన వేళ వేడిని పుట్టించడానికి మాత్రమే కాదు వంట గదిలో రుచులను దట్టించడానికి కూడా తొలకరి చినుకులతో  మొక్కజొన్నల పొత్తు రుచితో పాటు ఆరోగ్యాన్నీ ఆస్వాదించే ఎత్తు!!

బేబీ కార్న్‌ బజ్జీ
కావలసినవి: బేబీకార్న్‌ – 100 గ్రాములు, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – చిటికెడు, మైదా, కార్న్‌ఫ్లోర్‌ – 20 గ్రాములు, బేకింగ్‌ సోడా – 2 గ్రాములు, నూనె – 100గ్రా.

తయారి: ∙ముందుగా బేబీకార్న్‌ను ఉడికించి పక్కన ఉంచాలి. ఒకగిన్నె తీసుకుని అందులో ఉప్పు, మిరియాలపొడి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మరొక చిన్న గిన్నెలో మైదా, కార్న్‌ఫ్లోర్, ఉప్పు, మిరియాలపొడి, నీళ్లు పోసి గరిటజారుగా కలపాలి. ఇందులో బేబీకార్న్‌ను ముంచి, కడాయిలో నూనె కాగాక అందులో పిండిలో ముంచిన బేబీకార్న్‌లను వేసి, గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. వీటిని టొమాటో సాస్‌తో సర్వ్‌ చేయాలి. రుచికిరుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.

మొక్క జొన్న గారెలు
కావలసినవి: మొక్కజొన్నగింజలు – 2 కప్పులు, ఉల్లిపాయ– 1 (ముక్కలుగా కట్‌ చేయాలి), కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు, కరివేపాకు – 2 రెమ్మలు, ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి – 2 (తగినన్ని), జీలకర్రæ – టీ స్పూన్, అల్లం తరుగు – టేబుల్‌ స్పూన్, ఉప్పు – తగినంత

తయారీ: ∙మొక్కజొన్న గింజలను అల్లం, పచ్చిమిర్చి వేసి కచ్చాపచ్చాగా నూరుకోవాలి. తర్వాత దీంట్లో పైవన్నీ కలిపి, మరికాస్త నూరి గారెలకు సిద్ధం చేసుకోవాలి. కాటన్‌ క్లాత్‌ మీద చిన్న చిన్న పిండి ముద్దలు వేసి, వెడల్పుగా అదిమి, మధ్యలో వేలితో చిల్లు పెట్టి, కాగుతున్న నూనెలో వేసి, రెండువైపులా దోరగా వేయించి, తీయాలి. వీటిని టొమాటో పచ్చడి లేదా సాస్‌తో వడ్డించాలి.

కార్న్‌ మినీ పిజ్జా
కావలసినవి: పిజ్జా బేస్‌ – 4 (చిన్నవి), ఉడికించిన స్వీట్‌ కార్న్‌ – పావు కప్పు, బీన్స్, క్యారట్, క్యాప్సికమ్, క్యాబేజీ తరుగు – పావు కప్పు, టొమాటో సాస్‌ – 3 టేబుల్‌ స్పూన్లు, చీజ్‌ తురుము – పావు కప్పు, పనీర్‌ ముక్కలు – టేబుల్‌ స్పూన్, ఉప్పు – తగినంత, చిల్లీ ఫ్లేక్స్‌ – 2 టీ స్పూన్లు, ఉల్లికాడల తరుగు – 3 టీ స్పూన్లు

తయారి:  ∙చిన్న సైజు పిజ్జా బేస్‌ తీసుకొని పలుచగా టొమాటోసాస్‌ పూయాలి. దాని పైన సన్నగా తరిగిన క్యాప్సికమ్, ఉల్లికాడలు, క్యారట్, బీన్స్‌ ముక్కలు వేయాలి. దానిపైన చీజ్‌ తురుము, పనీర్‌ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, స్వీట్‌కార్న్‌ వేసి పది నిమిషాలు లేదా చీజ్‌ కరిగేంతవరకు బేక్‌ చేయాలి. అవెన్‌ లేకుంటే నాన్‌ స్టిక్‌ లేదా మందపాటి పాన్‌ వేడి చేసి అందులో ఈ పిజ్జాలు పెట్టి, పైన మూతపెట్టి పదినిమిషాలు ఉంచాలి. చీజ్‌ కరిగిన తర్వాత తీయాలి.

క్రిస్పీ కార్న కెర్నల్స్‌
కావలసినవి: మొక్కజొన్న గింజలు – 80 గ్రాములు, ఉల్లిపాయ తరుగు – 20 గ్రాములు, పచ్చిమిర్చి తరుగు – 2 టీ స్పూన్లు, మైదా – 15 గ్రాములు, కార్న్‌ఫ్లోర్‌ – రెండు టీ స్పూన్‌లు, రిఫైన్డ్‌ ఆయిల్‌ – వేయించడానికి తగినంత, ఉప్పు –తగినంత, నల్లమిరియాలు, కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు

తయారి: ∙వెడల్పాటి పాత్రలో మొక్కజొన్న గింజలు, మొక్కజొన్న పిండి, ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి కలపాలి. కడాయిలో వేయించడానికి తగినంత నూనె పోసి వేడి చేయాలి. తర్వాత మొక్కజొన్న గింజలను కాగుతున్న నూనెలో వేసి, బంగారువర్ణం వచ్చేంతవరకు వేయించాలి. నూనె పీల్చుకునే పేపర్‌టవల్‌ పైన వేయించిన గింజలు వేయాలి. మరొక పాన్‌లో టేబుల్‌స్పూన్‌ నూనె వేసి, కాగిన తర్వాత ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి. తర్వాత పోపు గింజలు, వేయించిన మొక్కజొన్న గింజలు, ఉప్పు, నల్ల మిరియాల పొడి, కార్న్‌ఫ్లోర్‌ వేసి కలపాలి. ప్లేట్‌లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్‌ చేయాలి.

కార్న్‌ఫ్లేక్స్‌ టొమాటో బాస్కెట్స్‌
కావలసినవి:  కార్న్‌ఫ్లేక్స్‌ – అర కప్పు, పచ్చి బఠాణీ –  అర కప్పు, పచ్చికొబ్బరి కోరు – అర కప్పు, చాట్‌ మసాలా – ఒక టీ స్పూన్, గరం మసాలా – కొద్దిగా, కారం బూందీ – ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు – కొద్దిగా, టొమాటో కెచప్‌ – టేబుల్‌స్పూన్, పుదీన, కొత్తిమీర, ఉప్పు – తగినంత, క్యారట్‌ తురుము – అర కప్పు, బెంగళూరు టొమాటోలు – ఆరు (పెద్దవి)

తయారి: ∙ముందుగా టొమాటోలను ఫొటోలో చూపిన విధంగా కట్‌ చేసుకోవాలి. కట్‌చేసిన తర్వాత లోపల ఉన్న గుజ్జుని తీసేయాలి. లోపల ఉప్పు రాసి బోర్లించాలి. ఇలా చేయడం వల్ల టొమాటోలోని నీరంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు టొమాటో లోపల గరం మసాలా రాయాలి. ఒక పాత్ర తీసుకుని కారం బూందీ, ఉల్లిపాయ తరుగు, పచ్చి బఠాణి, పుదీనా, కొత్తిమీర వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని టొమాటో బాస్కెట్‌లో నింపి పైన కార్న్‌ఫ్లేక్స్‌వేసి దాని మీద కెచప్‌ పెట్టాలి. చివరగా కొబ్బరి తురుము చల్లి సర్వ్‌ చేయాలి.


క్రిస్పీ కార్న్‌ సూప్‌
కావలసినవి:  మొక్కజొన్న గింజలు – 1 కప్పు(పచ్చివి) (మూకుడులో టీ స్పూన్‌ నూనె వేసి వేయించాలి), క్యారెట్‌ – 1, బీన్స్‌ – గుప్పెడు, కార్న్‌ఫ్లోర్‌ – పావు కప్పు, ఉప్పు – తగినంత, మిరియాలు – 4, పంచదార – టీ స్పూను, కూరగాయ ముక్కలు లేదా పప్పు ఉడికబెట్టిన నీళ్లు – 3 కప్పులు

తయారి : ∙అడుగు మందంగా వున్న పాత్రలో కూరగాయలు లేదా పప్పు ఉడికించిన నీళ్ళుపోసి వేడిచేసి మొక్కజొన్న గింజలు, కూరగాయముక్కలు, పంచదార, ఉప్పు, మిరియాలువేసి ఉడికించాలి. కూరగాయ ముక్కలు ఉడికిన తరువాత స్టౌ పై నుంచి దించి నీటిని వడకట్టాలి. వడకట్టిన కూరగాయలను గ్రైండ్‌చేసి వడకట్టిన నీటిని కూడా కలిపి మిశ్రమం చిక్కగా అయ్యేంత వరకు ఉడికించాలి. సూప్‌ కప్పులో పోసి, పైన వేయించిన మొక్కజొన్న గింజలు, సన్నగా కట్‌ చేసిన కీరా ముక్క వేసి సర్వ్‌ చేయాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement