ఫ్యూజన్ ఫుడ్: కలిపి తిన్నా కలదు సుఖం | Baking Recipes: fussion food | Sakshi
Sakshi News home page

ఫ్యూజన్ ఫుడ్: కలిపి తిన్నా కలదు సుఖం

Published Fri, Oct 25 2013 11:37 PM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM

Baking Recipes: fussion food

కాంబినేషన్ లేకుండా తింటే...
 కడుపు కంభం చెరువైపోతుంది!
 కాస్త చూస్కొని వేస్కోవాలి.
 పడేవీ వుంటాయి, పడనివీ ఉంటాయి.
 పడనివాటితో కలిపి కొడితే..
 పడేవి కూడా పడకుండా పోతాయి.
 సలహా బాగానే ఉంది కానీ, వెరైటీలకు అలవాటు పడిన ప్రాణానికి
 ఈ మాట రుచిస్తుందా?
 కన్ను అరటిపండంటే...
 నోరు కోడిగుడ్డంటుంది.
 నాలుక... ఆపిల్ ని బేక్ చేయమంటుంది!
 ఏం చేయడం?
 ‘ఫ్యూజన్ ఫుడ్’ని  వండేయడమే!
 అదొకటుందా?
 ఉంది.
 ఈవారం ఫ్యూజనే మన విజన్!
 ప్రమాదం లేని కాంబినేషన్!!

 
 క్రేప్స్ విత్ బనానా ఫ్లేంబ్
 
 కావలసినవి:
 కోడిగుడ్లు - 7 (రెండు గుడ్లు కేవలం తెల్లసొన మాత్రమే తీసుకోవాలి); చిక్కటిపాలు - రెండున్నర కప్పులు; మైదా - ఒకటింపావు కప్పులు; ఉప్పు - చిటికెడు; బటర్ - 6 టేబుల్ స్పూన్లు; బనానా ఫ్లేంబ్ కోసం... అరటిపళ్లు - 4; బటర్ - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; టాపింగ్ కోసం - తగినంత వెనిలా ఐస్‌క్రీమ్
 
 తయారి:  
 పెద్ద పాత్రలో కోడిగుడ్లు వేసి గిలకొట్టాలి  పాలు, మైదా, ఉప్పు జత చేసి మళ్లీ గిలకొట్టాలి
 
  ఉండలు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి  
 
 పెనం వేడి చేసి టీ స్పూన్ బటర్ వేడి చేయాలి  
 
 కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని గరిటెతో తగినంత వేయాలి  
 
 బాగా కాలాక రెండవవైపు తిప్పితే క్రేప్స్ తయారవుతాయి  
 
 ఇలా మొత్తం పిండితో వేసుకుని పక్కన ఉంచాలి  
 
 అరటిపళ్లను ముక్కలుగా కట్ చేసుకోవాలి  
 
 ఒక పాత్రను స్టౌ మీద ఉంచి టేబుల్ స్పూను బటర్ వేసి కరిగాక అరటిపండు ముక్కలను వేసి కొద్దిగా వేయించి తీస్తే ఫ్లేక్స్ రెడీ అయినట్లే. (అరటిపండు ముక్కలను వేయించుకోవడం ఇష్టంలేని వారు కట్ చేసిన ముక్కలను వాడుకోవచ్చు) పైన తయారుచేసి ఉంచుకున్న క్రేప్స్ లోపల వీటిని ఉంచి సర్వ్ చేయాలి. వీటిని చాక్లెట్ సాస్‌తో సర్వ్ చేస్తే చాలా వెరైటీగా ఉంటుంది.
 
   బేక్ డ్ ఆపిల్ కప్స్
 
 కావలసినవి:
 గ్రీన్ ఆపిల్స్ - 4 (తొక్క తీసేయాలి); నిమ్మరసం - రెండు టీ స్పూన్లు; పంచదార -5 టేబుల్ స్పూన్లు; మసాలా - టీ స్పూను; జాజికాయ పొడి - పావు టీ స్పూను; లవంగాల పొడి - అర టీ స్పూను; ఉప్పు - పావు టీ స్పూను; వెనిలా ఎసెన్స్ - 2 టీ స్పూన్లు; మైదా - రెండు కప్పులు + రెండు టేబుల్ స్పూన్లు; కోడిగుడ్లు - మూడు; ఐస్ వాటర్ - 4 టేబుల్ స్పూన్లు; బటర్ - 8 టేబుల్ స్పూన్లు; వెనిలా ఐస్‌క్రీమ్ - 4 స్కూపులు
 
 తయారి:  
 చిన్న చాకు తీసుకుని దానితో ఆపిల్‌ను కప్‌లా వచ్చేలా, లోపలి గుజ్జును బాల్స్‌లా వచ్చేలా స్కూప్‌లాంటి దానితో నెమ్మదిగా తీయాలి. (ఆపిల్ అంగుళం మందంగా వచ్చేవరకు ఇలా చేయాలి)  
 
 నిమ్మరసం తీసుకుని ఆపిల్ కప్స్ మీద, ఆపిల్ బాల్స్ మీద నిమ్మరసం చల్లాలి  
 
 దాల్చినచెక్కపొడి, పంచదార, మసాలా, జాజికాయపొడి, లవంగాలపొడి, ఉప్పు, వెనిలా ఎసెన్స్‌లను ఆపిల్ కప్స్‌లో వరసగా వేయాలి  
 
 ఆపిల్‌బాల్స్ మీద కూడా చల్లి పక్కన ఉంచాలి  
 
 మిక్సింగ్ బౌల్‌లో మైదాపిండి, కోడిగుడ్ల సొన వేసి చేతితో బాగా కలపాలి
 
  6 టేబుల్ స్పూన్ల బటర్ జత చేసి కలపాలి. (అవసరమనుకుంటే కొద్దిగా చల్లటి నీరు జతచేసి మరోమారు కలపాలి. పిండి మెత్తగా ఉండేలా చూసుకోవాలి)  
 
 పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని అప్పడాల పీట మీద వేసి కొద్దిగా పొడి పిండి జత చేసి పూరీలా ఒత్తి, ఆపిల్ బాల్స్ మిశ్రమం మధ్యలో ఉంచి అంచులు మూసేయాలి  
 
 అవెన్‌ను 350 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేయాలి  
 
 అల్యూమినియం ప్లేట్‌కి చీజ్ రాసి ఆపిల్ కప్స్‌ను ఇందులో ఉంచాలి  
 
 ఒక కోడిగుడ్డును బాగా గిలక్కొట్టి ఎగ్ వాష్‌తో మృదువుగా ఈ సొనను వీటి మీద రాయాలి  
 
 ఆపిల్ కప్స్‌ని సుమారు 40 నిముషాలు బేక్ చేయాలి. (గోధుమరంగులోకి మారేవరకు ఉంచాలి)  
 
 ఇంక ఐదు నిముషాలలో బేకింగ్ పూర్తవుతుందనగా టేబుల్ స్పూన్ బటర్‌ను పెద్ద బాణలిలో కరిగించి, ఆపిల్ బాల్స్‌ను మూడు నిముషాల పాటు వేయించి వీటిని ఆపిల్ కప్స్‌లో ఉంచి వేడివేడిగా సర్వ్ చేయాలి.
 
  ఆల్మండ్ పుడింగ్ విత్ లిచీ
 
 కావలసినవి:
 అగర్ అగర్ పొడి - అర టీ స్పూను (సూపర్ మార్కెట్‌లో దొరుకుతుంది); నీరు - ఆరు కప్పులు; చిక్కటిపాలు - 5 కప్పులు (సుమారు ముప్పావు లీటరు); మరిగించిన పాలు - రెండు కప్పులు (చిక్కగా కోవాలా తయారయినవి); పంచదార - కప్పు; ఆల్మండ్ ఎసెన్స్ - ఒకటిన్నర స్పూనులు; లిచీలు - గార్నిషింగ్ కోసం
 
 తయారి:
  పెద్ద పాత్రలో నీరు పోసి మరిగించాలి
 
 చిన్న గిన్నెలో అగర్ అగర్ పొడి, ఐదారు చుక్కల వేడినీరు వేసి పేస్ట్‌లా కలిపి, మరుగుతున్న నీటిలో ఈ మిశ్రమాన్ని వేసి కలపాలి  
 
 పాలు, మరిగించిన కోవాలాంటిపాలు పోసి బాగా కలిపి మంట తగ్గించి పది నిముషాలు ఉంచాలి  
 
 పంచదార  వేసి కరిగేవరకు కలుపుతుండాలి
 
  స్టౌ మీద నుంచి కిందకు దించి ఆల్మండ్ ఎసెన్స్ జత చేయాలి  
 
 పుడ్డింగ్ మౌల్డ్‌లో పోసి డీప్‌ఫ్రీజ్‌లో రాత్రంతా ఉంచాలి  
 
 సర్వ్ చేసే ముందు ముక్కలుగా కట్ చేసి లిచీలతో గార్నిష్ చేయాలి.
 
 ఆల్మండ్ కేక్ విత్ మ్యాంగో బటర్‌క్రీమ్ ఫ్రాస్టింగ్
 
 కావలసినవి:
 పంచదార - కప్పు; బటర్ - అర కప్పు; కోడిగుడ్లు - 2; మైదా - ఒకటిన్నర కప్పులు; బేకింగ్ సోడా - అర స్పూను; ఉప్పు - అర టీ స్పూను; పాలు అర కప్పు; ఆల్మండ్ ఎసెన్స్ - ముప్పావు టీ స్పూను.
 
 మ్యాంగో బటర్ క్రీమ్... సాల్ట్ లేని బటర్ - కప్పు; కన్‌ఫెక్షనరీస్ పంచదార - అర కప్పు (సూపర్ మార్కెట్‌లో దొరుకుతుంది); పాలు - పావుకప్పు; మామిడిపండు గుజ్జు - ఒకటిన్నర కప్పులు లేదా మ్యాంగో ప్యూరీ - ఒకటిన్నరకప్పులు (సూపర్ మార్కెట్‌లో దొరుకుతుంది)
 
 తయారి:
 అవెన్‌ను 350 డిగ్రీల వద్ద ప్రీహీట్ చేయాలి  
 
 బేకింగ్ పాన్‌కి బటర్ పూయాలి  
 
 ఒక పెద్ద పాత్రలో బటర్, పంచదార వే సి మెత్తగా అయ్యేవరకు కలపాలి  
 
 కోడిగుడ్డు సొన జత చేసి కలపాలి  
 
 ఆల్మండ్ ఎసెన్స్ జత చేసి మళ్లీ బాగా కలపాలి  
 
 వేరే పాత్రలో మైదా, బేకింగ్ సోడా వేసి బాగా జల్లెడపట్టి పై మిశ్రమానికి జతచేసి నెమ్మదిగా గిలకొట్టాలి  
 
 చివరగా పాలు జతచేసి గరిటెతో కలపాలి బేకింగ్ పాన్‌లో ఈ మిశ్రమం పోసి, సుమారు 40 నిముషాలు అవెన్‌లో బేక్ చేసి తీసేయాలి  
 
 20 నిముషాల తర్వాత కావలసిన ఆకారంలో కట్ చేసుకోవాలి  
 
 మరొక పాత్రలో చల్లగా ఉన్న బటర్ క్రీమ్ వేసి బాగా చిక్కగా అయ్యేలా గిలకొట్టాలి  
 
 కన్‌ఫెక్షనరీ సుగర్ జతచేసి, రెండూ కలిసేలా బాగా కలపాలి  
 
 పాలు నెమ్మదిగా పోస్తూ కలిపి మరో మారు గిలకొట్టాలి  
 
 చివరగా మామిడిపండు గుజ్జు వేసి వేగంగా గిలకొట్టాలి
 
  బటర్ క్రీమ్, మామిడిపండు గుజ్జు కలిసేవరకు స్పీడ్‌గా బీట్ చేయాలి  
 
 మ్యాంగ్ బటర్‌క్రీమ్‌ను కేక్ స్లైసుల మీద పోసి సర్వ్ చేయాలి.
 
 అగర్... అగర్...
 అగర్ అగర్ అనే పదార్థం చూడటానికి చైనా సాల్ట్‌లాగ ఉంటుంది.
 
 ఇది ఆల్గై నుంచి తయారవుతుంది.  
 
 1658లో జపాన్‌లోని మినోరా టాంజెమన్ దీన్ని కనిపెట్టాడు  
 
 జపాన్‌లో అగర్ అగర్‌ను కాంటెన్ అని పిలిచేవారు.
 
 దీనిని కొన్నిరకాల పేస్ట్రీలలో వినియోగిస్తారు
 
 అగర్ స్వాభావికంగా అగరోస్, అగరోపెక్టిన్‌ల మిశ్రమంతో తయారవుతుంది  
 
 ఇది తెల్లగా, స్ఫటికంలా ఉంటుంది
 
 చిన్న చిన్న క్రిస్టల్స్ రూపంలోనూ, పొడి రూపంలోనూ దొరుకుతుంది
 
 జె ల్లీ, పుడ్డింగ్స్, కస్టర్డ్స్ తయారీలో దీనిని ఉపయోగిస్తారు  
 
 అగర్ అగర్‌లో 80 శాతం పీచుపదార్థం ఉండటం వలన, ఇది పేగులను సక్రమంగా ఉంచడంలో తోడ్పడుతుంది.
 
 బనానా బైట్ ఫిట్టర్స్
 
 కావలసినవి:  అరటిపళ్లు - 3 (బైట్ సైజ్‌లో తురమాలి); కోడిగుడ్లు -2; మైదా - కప్పు; కార్న్‌ఫ్లోర్ - అర కప్పు; బేకింగ్ సోడా - అర టీ స్పూను; ఉప్పు - పావు టీ స్పూను; క్లబ్ సోడా - అర కప్పు; నూనె - తగినంత; కండెన్స్‌డ్ మిల్క్ - చిలకరించడానికి తగినంత
 
 తయారి:
 పెద్ద పాత్రలో కోడిగుడ్డు సొన వేసి బాగా చిలకరించాలి
 
 మైదాపిండి, కార్న్‌ఫ్లోర్ , బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి మరోమారు బీట్ చేయాలి. (ఈ మిశ్రమం బాగా చిక్కగా ఉండాలి)
 
 చివరగా క్లబ్ సోడా వేసి బాగా కలపాలి
 
 బాణలిలో నూనె వేసి కాగనివ్వాలి
 
 అరటిపండు ముక్కలను పిండిలో ముంచి కాగుతున్న నూనెలో వేసి వేయించాలి  మంట మీడియంలో ఉంచి వేయించితే బాగా వేగుతాయి
 
 పేపర్ టవల్ మీదకు తీసి వేడివేడిగా సర్వ్ చేయాలి
 
 సేకరణ: డా.వైజయంతి
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement