అన్ని దినుసులనూ ఎన్నుకొని, ఏరుకొని వండేవాడు కాదు... మిగిలిపోయిన దినుసులతో కూడా మరపురాని రుచులని అందించేవాడే వంటవాడంటే!
ఆ నిర్వచనాన్నే రెసిపీగా మార్చి బ్రహ్మ వండిన వంట...
సంజీవ్ కపూర్!
1-‘ఖానా ఖజానా’ ఎపిసోడ్ నంబర్ 255. పాలక్ కోఫ్తా... ఆరోజు వీక్షకుల కళ్లకు తినిపించబోయే వంటకం. పదహారు దినుసుల సమాహారం ఆ వంటకం. బాణలి తీసుకుని పని ప్రాంభించారు సంజీవ్. కావల్సిన దినుసులను కలుపుతుండగా ఒక ‘క్రియేటివ్ షాక్’ తగిలినట్టయి శరీరం అంతా అడ్రినలిన్ రష్! ఏమైందో కానీ, తనకు తెలియకుండానే టొమాటో గుజ్జుకి, లవంగాలు, కాజు, వెన్న, కాస్త చక్కెర వేసి, మఖ్‌నీ గ్రేవీ తయారు చేశాడు. అంతేకాదు, కాస్త తేనె, మెంతి ఆకులు వేసి పాలక్ కోఫ్తాను కొత్తగా మార్చేశాడు. ఆ తరువాత అదే అతని సిగ్నేచర్ డిష్‌గా పేరొందిన ‘షామ్ సవేరా’. మన మీద మనకు నమ్మకం ఉంటే చాలు. ఏం చేసినా గొప్ప కావ్యం అవుతుందని తెలుసుకున్నారు సంజీవ్!
2- కొలంబో విమానాశ్రయంలో తన బ్యాగేజ్ కోసం ఎదురు చూస్తున్నారు సంజీవ్. ఒక యువతి వచ్చి, తన కాళ్ల మీద పడింది. వెంటనే కంగారుగా పక్కకి జరిగి ఆ అమ్మాయిని పైకి లేపారు సంజీవ్. ‘‘నా జీవితాన్ని కాపాడారు మీరు’’ అంది ఆ అమ్మాయి. ఏమీ అర్థం కానట్టు చూస్తున్నారు సంజీవ్. ఆ అమ్మాయి ఏడుస్తూ ‘‘సార్! నాకు పెళ్లయి చాలా ఏళ్లయింది. నాకు వంట చేతకాదని మా అత్తగారింట్లో ప్రతిరోజూ తిట్లు, చీవాట్లే. మీకు చిన్న విషయంలా అనిపించొచ్చు కానీ కుమిలి కుమిలి ఏడ్చేదాన్ని. తరువాత టీవీలో మీ కార్యక్రమాలు, మీ పుస్తకాలు చూసి వంట నేర్చుకున్నాను. మీరు చెప్పినట్టుగా నేను చేసిన వంటలు మా ఇంట్లో వాళ్లకు ఎంతో నచ్చాయి. ఇప్పుడు నన్ను వారు చాలా బాగా చూసుకుంటున్నారు. అంతేకాదు... పెళ్లైన తరువాత మా ఆయన నన్ను మొదటిసారి హనీమూన్‌కు తీసుకెళ్తున్నారు’’ అని చెప్పింది. అంతే... ఇన్నాళ్ళ తన శ్రమకు ప్రతిఫలం దొరికినట్లయింది సంజీవ్‌కు.
3- ‘‘ఆహారంలో రుచికరమైన పదార్థాలే కాదు.. ఎంతో ప్రేమ, అంకితభావం కలగలిపి వండుతారు. అలా వండిన వంట మిగిలిపోయినా, ఎక్కువై పారేసినా అది కేవలం ఆహారాన్ని వృథా చేయడం కాదు, ప్రేమను వ్యర్థం చేయడం. ప్రేమను డస్ట్‌బిన్‌లో పారేయడమే!’’ అని నమ్ముతారు సంజీవ్. తన హోటల్‌లో కస్టమర్ అయినా, ఇంట్లో తన కూతురు రచిత గబగబ తిని వదిలేసిన చపాతీ ముక్కలైనా సరే... మిగులు చూస్తే దిగులు ఆయనకి! ఊరుకోకుండా ఉండలేక, ఆ ముక్కలను తీసుకుని, కాస్త అల్లం, వెల్లుల్లి దట్టించి, సాస్, మిరియాలు, చీజ్ వేసి చపాతీలు ఎన్నడూ చరిత్రలో చూడని ‘చపాతీ లసాన్యా’ను తయారుచేశారు.
4- ‘‘సార్! మీ వంటకాలన్నింటినీ ఒక పుస్తకంగా వెయ్యచ్చు కదా?’’ పార్టీలో కలిసిన ఒక ఆవిడ సంజీవ్‌తో అన్న మాటలివి. ‘‘ఎందుకమ్మా! అన్ని వంటలనీ నేనే ఫ్రీగా టీవీలో చేసి చూపిస్తున్నాను కదా! మళ్లీ కొత్తగా పుస్తకం ఎందుకు? మీకు డబ్బులు దండగ’’ అని నవ్వారు సంజీవ్. కానీ ఇలా ఎన్నో రిక్వెస్టులు వచ్చాయి. ఎప్పుడూ వంట చేయనివాడు మొదటిసారి గరిటె పడితే, అతనికి వచ్చే సందేహాలన్నీ ముందుగానే ఊహించి, వాటిని నివృత్తి చేస్తూ తన మొదటి పుస్తకం ‘ఎనీ టైమ్ టెంప్టేషన్స్’ని సంజీవ్ రాశారు. అది మొదలు పుస్తకాలు రాస్తూనే ఉన్నారు. ‘హౌ టు కుక్ ఇండియన్’ అనే ఆయన రచన ఏకంగా కోటికి పైగా కాపీలు అమ్ముడైంది.
5- లైఫ్ అనేది ఒక డిష్ లాంటిది. అందులో ముఖ్యమైనది... అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవటమే. మానవత్వం, స్వ చైతన్యం, ఆశయాలను... ఒడుదొడుకుల్లో ఉడకపెట్టి, కష్టాలతో మగ్గబెట్టి, సుఖాలను టాపింగ్స్‌గా చేసిన మిశ్రమ ఆశ్రమమే జీవితమనే వంట. అనుకున్నవన్నీ జరగవు. అందుకే ఎవరూ జరగదనుకున్నదాన్ని జరిపించి చూపించు. చేసే పని పాతదే అయినా, చెయ్యడం కొత్తగా చెయ్యి! జీవితంలో ఏం కోల్పోయినా ‘నిన్ను నువ్వు కోల్పోకు, కోల్పోనివ్వకు, అదే నిన్ను నడిపిస్తుంది’. వంట గదిలోనే మగ్గిపోతున్న చెఫ్‌లను బయటకు తీసుకొచ్చి, చెఫ్‌గిరీని మార్కెట్‌కి పరిచయం చేసి, భారతీయ వంటకానికి ప్రపంచ స్థాయిలో ముఖచిత్రంగా మారిన సంజీవ్ జీవిత నిర్మాణంలో తెలుసుకున్నవి, తెలియజేసినవి ఇవే. కొన్ని కోట్ల మంది ప్రేమను కడుపారా నింపుకుంటుండగా, అలసిపోయిన గరిటె తడి మెరుపులో నవ్వుతుంది సంజీవ్‌కపూర్ ప్రతిబింబం.
- జాయ్
రుచుల సంజీవని
Published Fri, Jul 11 2014 10:15 PM | Last Updated on Sat, Sep 2 2017 10:09 AM
Advertisement
Advertisement