Colombo Airport
-
శ్రీలంకకు తిరిగొచ్చిన ‘గొటబయ’.. ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం!
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయేందుకు కారణమై, ప్రజాగ్రహంతో దేశం విడిచి పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స స్వదేశం తిరిగివచ్చారు. ఈ ఏడాది జూలై 13న దేశం విడిచి మాల్దీవులకు వెళ్లారు. అక్కడి నుంచి సింగపూర్ పారిపోయిన గొటబయ సుమారు ఏడు వారాల తర్వాత శనివారం తెల్లవారుజామున దేశంలో అడుగుపెట్టారు. బ్యాంకాక్ నుంచి వయా సింగపూర్ మీదుగా కొలంబోలోని బందారనాయక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి శనివారం వచ్చినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ సందర్భంగా ఆయన పార్టీకి చెందిన పలువురు చట్టసభ్యులు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని స్వాగతం పలికారు. భారీ భద్రత నడుమ ఎయిర్పోర్ట్ నుంచి మాజీ అధ్యక్షుడిగా ఆయనకు కేటాయించిన ప్రభుత్వ అధీనంలోని భవనానికి చేరుకున్నారు గొటబయ. 2019లో శ్రీలంక అధ్యక్ష పదవిని చేపట్టారు గొటబయ రాజపక్స. అయితే, దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తటంతో ప్రజలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలు తీవ్రమవటం వల్ల జులై 9న అధ్యక్ష భవనం నుంచి పరారయ్యారు. నాలుగు రోజుల తర్వాత మిలిటరీ జెట్‌లో మాల్దీవులకు వెళ్లారు. అక్కడి నుంచి సింగపూర్ చేరుకున్నారు. తర్వాత అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత రెండు వారాలకు దౌత్య వీసా ద్వారా థాయిలాండ్‌కు వెళ్లారు. ఇదీ చదవండి: అమెరికాలో సెటిల్ కావడానికి ప్లాన్ చేసిన గొటబయా రాజపక్స! -
అర్ధరాత్రి దుబాయ్ చెక్కేసేందుకు ప్రయత్నించిన గొటబాయ సోదరుడు, కానీ..
కొలంబో: తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో ప్రజల ఆగ్రహావేశాలు చూసి నాయకులు వణికిపోతున్నారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సహా ఇప్పటికే చాలా మంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తాజాగా శ్రీలంక మాజీ మంత్రి, గొటబాయ సోదరుడు బసిల్ రాజపక్స దుబాయ్ పారిపోయేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దుబాయ్ వెళ్లేందుకు మంగళవారం ఉదయం 12:15గంటలకే కొలంబో విమానాశ్రయం చేరుకున్నారు బసిల్ రాజపక్స. చెక్ ఇన్ కౌంటర్లో ఉన్న ఆయనను అక్కడున్న వారు సహా ఇమ్మిగ్రేషన్ సిబ్బంది గుర్తుపట్టారు. దీంతో అతడ్ని దేశం దాటి వెళ్లేందుకు అధికారులు నిరాకరించారు. ఇక చేసేదేం లేక 3:15గం. వరకు వేచి చూసి విమానాశ్రయం నుంచి బసిల్ తిరిగివెళ్లిపోయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. శ్రీలంక పరిస్థితులు చూసి ఉన్నతాధికారులు, నాయకులను దేశం వీడి వెళ్లేందుకు ఎయిర్‌పోర్టు సిబ్బంది అనుమతించట్లేదని సంబంధింత వర్గాలు తెలిపాయి. తమకు సరైన భద్రత కల్పించేవరకు వీఐపీ సేవలు కొనసాగించమని పేర్కొన్నట్లు చెప్పాయి. మరోవైపు శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ బుధవారం అధికారికంగా రాజీనామా చేయనున్నారు. ప్రధాని రణిల్ విక్రమసింఘే కూడా ఇప్పటికే రాజీనామా చేస్తానని ప్రకటించారు. దీంతో శ్రీలంక అఖిల పక్షాలన్నీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. చదవండి: లంకకు 20న కొత్త అధ్యక్షుడు -
శ్రీలంకకు తప్పిన మరో ముప్పు
కొలంబో: శ్రీలంకలో సంభవించిన బాంబు పేలుళ్లు మారణహోమాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే భద్రతా సిబ్బంది అప్రమత్తతో మరో పెను ముప్పు తప్పింది. వరుస పేలుళ్లతో చివురుటాకులా వణుకుతున్న కొలంబోలో తాజాగా మరో శక్తివంతమైన బాంబును గుర్తించడం కలకలం రేపింది. కొలంబో అంతర్జాతీయ విమానాశ్రయం మెయిన్ టెర్మినల్ రోడ్డులో అతిప్రమాదకరమైన ఐఈడీ పేలుడు పదార్థాలను సిబ్బంది తొలగించారు. దీంతో మరో పెద్ద ప్రమాదం తప్పింది. ఆదివారం పేలుళ్ల నేపథ్యంలో కొలంబియా కతునాయకే విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంట్లో భాగంగా అనుమానాస్పద వస్తువులను, వ్యక్తులపై తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో శ్రీలంక వైమానిక దళం (ఎస్ఎల్ఏ ఎఫ్) సిబ్బంది ఐఈడీ బాంబు (స్థానికంగా తయారు చేసిన పైప్ బాంబు) నిర్వీర్యం చేశారని స్థానిక మీడియా నివేదించింది. హై సెక్యూరిటీ జోన్లో వీటిలో ఎవరు పెట్టారన్న అంశంపై అదనపు భద్రతా బృందం విచారిస్తోంది. సీసీటీవీ ఫుజేట్‌ను పరిశీలిస్తున్నారు. అటు అదనపు భద్రతా చర్యలను దృష్టిలో ఉంచుకుని కనీసం నాలుగు గంటల ముందు విమానాశ్రయానికి చేరుకోవాల్సిందిగా విమాన ప్రయాణికులకు ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా శ్రీలంక రాజధాని కొలంబో పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్య 290కి చేరింది. మరోవైపు ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలకు సెలవులు ప్రకటించారు. ఫేక్ న్యూస్‌ను నిరోధించే ఉద్దేశంతో సోషల్ మీడియా సేవలను నిలిపివేయగా, కర్ఫ్యూ కొనసాగుతోంది. -
రుచుల సంజీవని
అన్ని దినుసులనూ ఎన్నుకొని, ఏరుకొని వండేవాడు కాదు... మిగిలిపోయిన దినుసులతో కూడా మరపురాని రుచులని అందించేవాడే వంటవాడంటే! ఆ నిర్వచనాన్నే రెసిపీగా మార్చి బ్రహ్మ వండిన వంట... సంజీవ్ కపూర్! 1-‘ఖానా ఖజానా’ ఎపిసోడ్ నంబర్ 255. పాలక్ కోఫ్తా... ఆరోజు వీక్షకుల కళ్లకు తినిపించబోయే వంటకం. పదహారు దినుసుల సమాహారం ఆ వంటకం. బాణలి తీసుకుని పని ప్రాంభించారు సంజీవ్. కావల్సిన దినుసులను కలుపుతుండగా ఒక ‘క్రియేటివ్ షాక్’ తగిలినట్టయి శరీరం అంతా అడ్రినలిన్ రష్! ఏమైందో కానీ, తనకు తెలియకుండానే టొమాటో గుజ్జుకి, లవంగాలు, కాజు, వెన్న, కాస్త చక్కెర వేసి, మఖ్నీ గ్రేవీ తయారు చేశాడు. అంతేకాదు, కాస్త తేనె, మెంతి ఆకులు వేసి పాలక్ కోఫ్తాను కొత్తగా మార్చేశాడు. ఆ తరువాత అదే అతని సిగ్నేచర్ డిష్‌గా పేరొందిన ‘షామ్ సవేరా’. మన మీద మనకు నమ్మకం ఉంటే చాలు. ఏం చేసినా గొప్ప కావ్యం అవుతుందని తెలుసుకున్నారు సంజీవ్! 2- కొలంబో విమానాశ్రయంలో తన బ్యాగేజ్ కోసం ఎదురు చూస్తున్నారు సంజీవ్. ఒక యువతి వచ్చి, తన కాళ్ల మీద పడింది. వెంటనే కంగారుగా పక్కకి జరిగి ఆ అమ్మాయిని పైకి లేపారు సంజీవ్. ‘‘నా జీవితాన్ని కాపాడారు మీరు’’ అంది ఆ అమ్మాయి. ఏమీ అర్థం కానట్టు చూస్తున్నారు సంజీవ్. ఆ అమ్మాయి ఏడుస్తూ ‘‘సార్! నాకు పెళ్లయి చాలా ఏళ్లయింది. నాకు వంట చేతకాదని మా అత్తగారింట్లో ప్రతిరోజూ తిట్లు, చీవాట్లే. మీకు చిన్న విషయంలా అనిపించొచ్చు కానీ కుమిలి కుమిలి ఏడ్చేదాన్ని. తరువాత టీవీలో మీ కార్యక్రమాలు, మీ పుస్తకాలు చూసి వంట నేర్చుకున్నాను. మీరు చెప్పినట్టుగా నేను చేసిన వంటలు మా ఇంట్లో వాళ్లకు ఎంతో నచ్చాయి. ఇప్పుడు నన్ను వారు చాలా బాగా చూసుకుంటున్నారు. అంతేకాదు... పెళ్లైన తరువాత మా ఆయన నన్ను మొదటిసారి హనీమూన్‌కు తీసుకెళ్తున్నారు’’ అని చెప్పింది. అంతే... ఇన్నాళ్ళ తన శ్రమకు ప్రతిఫలం దొరికినట్లయింది సంజీవ్‌కు. 3- ‘‘ఆహారంలో రుచికరమైన పదార్థాలే కాదు.. ఎంతో ప్రేమ, అంకితభావం కలగలిపి వండుతారు. అలా వండిన వంట మిగిలిపోయినా, ఎక్కువై పారేసినా అది కేవలం ఆహారాన్ని వృథా చేయడం కాదు, ప్రేమను వ్యర్థం చేయడం. ప్రేమను డస్ట్‌బిన్‌లో పారేయడమే!’’ అని నమ్ముతారు సంజీవ్. తన హోటల్లో కస్టమర్ అయినా, ఇంట్లో తన కూతురు రచిత గబగబ తిని వదిలేసిన చపాతీ ముక్కలైనా సరే... మిగులు చూస్తే దిగులు ఆయనకి! ఊరుకోకుండా ఉండలేక, ఆ ముక్కలను తీసుకుని, కాస్త అల్లం, వెల్లుల్లి దట్టించి, సాస్, మిరియాలు, చీజ్ వేసి చపాతీలు ఎన్నడూ చరిత్రలో చూడని ‘చపాతీ లసాన్యా’ను తయారుచేశారు. 4- ‘‘సార్! మీ వంటకాలన్నింటినీ ఒక పుస్తకంగా వెయ్యచ్చు కదా?’’ పార్టీలో కలిసిన ఒక ఆవిడ సంజీవ్‌తో అన్న మాటలివి. ‘‘ఎందుకమ్మా! అన్ని వంటలనీ నేనే ఫ్రీగా టీవీలో చేసి చూపిస్తున్నాను కదా! మళ్లీ కొత్తగా పుస్తకం ఎందుకు? మీకు డబ్బులు దండగ’’ అని నవ్వారు సంజీవ్. కానీ ఇలా ఎన్నో రిక్వెస్టులు వచ్చాయి. ఎప్పుడూ వంట చేయనివాడు మొదటిసారి గరిటె పడితే, అతనికి వచ్చే సందేహాలన్నీ ముందుగానే ఊహించి, వాటిని నివృత్తి చేస్తూ తన మొదటి పుస్తకం ‘ఎనీ టైమ్ టెంప్టేషన్స్’ని సంజీవ్ రాశారు. అది మొదలు పుస్తకాలు రాస్తూనే ఉన్నారు. ‘హౌ టు కుక్ ఇండియన్’ అనే ఆయన రచన ఏకంగా కోటికి పైగా కాపీలు అమ్ముడైంది. 5- లైఫ్ అనేది ఒక డిష్ లాంటిది. అందులో ముఖ్యమైనది... అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవటమే. మానవత్వం, స్వ చైతన్యం, ఆశయాలను... ఒడుదొడుకుల్లో ఉడకపెట్టి, కష్టాలతో మగ్గబెట్టి, సుఖాలను టాపింగ్స్‌గా చేసిన మిశ్రమ ఆశ్రమమే జీవితమనే వంట. అనుకున్నవన్నీ జరగవు. అందుకే ఎవరూ జరగదనుకున్నదాన్ని జరిపించి చూపించు. చేసే పని పాతదే అయినా, చెయ్యడం కొత్తగా చెయ్యి! జీవితంలో ఏం కోల్పోయినా ‘నిన్ను నువ్వు కోల్పోకు, కోల్పోనివ్వకు, అదే నిన్ను నడిపిస్తుంది’. వంట గదిలోనే మగ్గిపోతున్న చెఫ్‌లను బయటకు తీసుకొచ్చి, చెఫ్గిరీని మార్కెట్‌కి పరిచయం చేసి, భారతీయ వంటకానికి ప్రపంచ స్థాయిలో ముఖచిత్రంగా మారిన సంజీవ్ జీవిత నిర్మాణంలో తెలుసుకున్నవి, తెలియజేసినవి ఇవే. కొన్ని కోట్ల మంది ప్రేమను కడుపారా నింపుకుంటుండగా, అలసిపోయిన గరిటె తడి మెరుపులో నవ్వుతుంది సంజీవ్‌కపూర్ ప్రతిబింబం. - జాయ్