కొలంబో: శ్రీలంకలో సంభవించిన బాంబు పేలుళ్లు మారణహోమాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే భద్రతా సిబ్బంది అప్రమత్తతో మరో పెను ముప్పు తప్పింది. వరుస పేలుళ్లతో చివురుటాకులా వణుకుతున్న కొలంబోలో తాజాగా మరో శక్తివంతమైన బాంబును గుర్తించడం కలకలం రేపింది. కొలంబో అంతర్జాతీయ విమానాశ్రయం మెయిన్ టెర్మినల్ రోడ్డులో అతిప్రమాదకరమైన ఐఈడీ పేలుడు పదార్థాలను సిబ్బంది తొలగించారు. దీంతో మరో పెద్ద ప్రమాదం తప్పింది.
ఆదివారం పేలుళ్ల నేపథ్యంలో కొలంబియా కతునాయకే విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంట్లో భాగంగా అనుమానాస్పద వస్తువులను, వ్యక్తులపై తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో శ్రీలంక వైమానిక దళం (ఎస్‌ఎల్‌ఏ ఎఫ్) సిబ్బంది ఐఈడీ బాంబు (స్థానికంగా తయారు చేసిన పైప్ బాంబు) నిర్వీర్యం చేశారని స్థానిక మీడియా నివేదించింది. హై సెక్యూరిటీ జోన్‌లో వీటిలో ఎవరు పెట్టారన్న అంశంపై అదనపు భద్రతా బృందం విచారిస్తోంది. సీసీటీవీ ఫుజేట్‌ను పరిశీలిస్తున్నారు. అటు అదనపు భద్రతా చర్యలను దృష్టిలో ఉంచుకుని కనీసం నాలుగు గంటల ముందు విమానాశ్రయానికి చేరుకోవాల్సిందిగా విమాన ప్రయాణికులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
కాగా శ్రీలంక రాజధాని కొలంబో పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్య 290కి చేరింది. మరోవైపు ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలకు సెలవులు ప్రకటించారు. ఫేక్ న్యూస్‌ను నిరోధించే ఉద్దేశంతో సోషల్ మీడియా సేవలను నిలిపివేయగా, కర్ఫ్యూ కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment