అష్టభోగాలలో ఉత్కృష్ట భోగం... భోజనం!
ధనం, ధాన్యం, వాహనం, వస్త్రం, స్నానం, సదుపాయం, సయోగం...
అన్నీ... భోజనం తర్వాతే.
మరి భోజనాలలో... ఉత్కృష్ట భోజనం?
ఆకేసి, పప్పేసి, నెయ్యి వేసిందే కదా!
అబ్బే... చప్పగా ఉంటుంది. అది కాదు.
సాంబారు, రసం, అప్పడం, వడియం?
అబ్బే... అదంతా సెకండ్ సెషన్.
వేపుడు, పులిహోర, పూర్ణాలు?
అబ్బే... ఇవన్నీ నంజుళ్లు, పైపై చప్పరింతలు.
పాయసం, వడ, గడ్డపెరుగు..?
అబ్బే... పడాల్సింది ఇంకా ఎక్కడ పడిందీ?!
పడాలా? ఏం పడాలి? ఎక్కడి నుంచి పడాలి?
రోట్లోంచి, రోలు లేకపోతే మిక్సీలోంచి...
పచ్చి పచ్చడి వచ్చి పడాలి.
అలా పడితేనే అది... ఉత్కృష్ట భోజనం
మృష్టాన్న భోజనం... సంపూర్ణ భోజనం.
కొబ్బరి -మామిడికాయ పచ్చడి
కావలసినవి:
కొబ్బరి - ఒక చిప్ప, మామిడికాయ - 1 (చిన్నది)
పచ్చిమిర్చి - 5, ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు, ఇంగువ - కొద్దిగా
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
ఎండుమిర్చి - 5, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, శనగపప్పు - టీ స్పూను, మినప్పప్పు - టీ స్పూను
తయారి
కొబ్బరిని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేయాలి.
మామిడికాయ తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
మిక్సీలో మామిడికాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి.
బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి.
పచ్చడిని ఒక గిన్నెలోకి తీసి, పోపు, ఇంగువ జతచేసి అన్నంలోకి వడ్డించాలి.
కీరా రైతా
కావలసినవి
కీరా - పావు కిలో
పచ్చిమిర్చి - 6, పెరుగు - అరకిలో
ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు
కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు
ధనియాలపొడి - అర టీ స్పూను
తయారి
కీరాలను శుభ్రంగా కడిగి, చిన్నచిన్న ముక్కలుగా తరగాలి
పచ్చిమిర్చిని సన్నగా కట్ చేయాలి
ఒక గిన్నెలో పెరుగు వేసి చిక్కగా చిలకాలి
కీరా ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, పసుపు, కొత్తిమీర తరుగు, ధనియాలపొడి వేసి బాగా కలపాలి
సుమారు రెండుగంటలు ఊరనివ్వాలి
రోటీలలోకి, అన్నంలోకి రుచిగా ఉంటుంది. శరీరానికి చలవ చేస్తుంది.
పచ్చిపులుసు
కావలసినవి:
ఉల్లిపాయ - 1, పచ్చిమిర్చి - 2, నూనె - తగినంత, ఎండుమిర్చి - 2, చింతపండు - కొద్దిగా, ఉప్పు - తగినంత, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, బెల్లం తురుము - టీ స్పూను, కరివేపాకు - ఒక రెమ్మ
తయారి
ఉల్లిపాయను చిన్నముక్కలుగా తరగాలి.
పచ్చిమిర్చిని పొడవుగా మధ్యకు కట్ చేయాలి.
బాణలిలో కొద్దిగా నూనె వేసి, కాగాక ఎండుమిర్చి వేసి వేయించి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి.
చింతపండును పది నిముషాలు నీటిలో నానబెట్టి, మూడు కప్పుల గుజ్జు వచ్చేలా తీయాలి.
ఉప్పు, ఉల్లితరుగు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి పొడి వేసి కలపాలి.
చిన్న బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించి పచ్చిపులుసులో కలపాలి.
బెల్లం తురుము, కరివేపాకు జతచేసి, బాగా కలిపి సర్వ్ చేయాలి.
దోసకాయ పచ్చడి
కావలసినవి
దోసకాయ - మీడియం సైజుది ఒకటి
పచ్చిమిర్చి - 6
చింతపండు - కొద్దిగా
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు
ఇంగువ - చిటికెడు
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
కొత్తిమీర - చిన్న కట్ట
తయారి
దోసకాయ చెక్కు తీసి, గింజలు వేరు చేసి, చిన్నచిన్న ముక్కలుగా తరగాలి.
మిక్సీలో పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, కొన్ని దోసకాయముక్కలు వేసి కచ్చాపచ్చాగా చేయాలి.
ఒక గిన్నెలో దోసకాయ ముక్కలు, మెత్తగా చేసిన దోసకాయల మిశ్రమం, పసుపు, ఇంగువ, నూనె వేసి బాగా కలిపి, అరగంట సేపు ఊరనివ్వాలి.
కొత్తిమీరతో గార్నిష్ చేసి, వేడివేడి అన్నంలోకి సర్వ్ చేయాలి.
పెసర పచ్చడి
కావలసినవి:
పెసరపప్పు - కప్పు, పచ్చిమిర్చి - 4
చింతపండు - కొద్దిగా
జీలకర్ర - అర టీ స్పూను
ఉప్పు - తగినంత
నూనె - టీ స్పూను
ఇంగువ - చిటికెడు
కొత్తిమీర - కొద్దిగా
తయారి:
పెసరపప్పును రెండు గంటలు నానబెట్టి నీరు వడగొట్టాలి
మిక్సీలో పెసరపప్పు, పచ్చిమిర్చి, చింతపండు, జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా చేయాలి
చివరగా ఇంగువ, నూనె వేసి కలిపి, వేడివేడి అన్నంలో వడ్డించాలి.
కొత్తిమీర పచ్చడి
కావలసినవి
కొత్తిమీర - రెండుకప్పులు
పచ్చిమిర్చి - 6
చింతపండు - నిమ్మకాయంత
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు
ఇంగువ - చిటికెడు
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
తయారి:
కొత్తిమీరను శుభ్రంగా కడగాలి
మిక్సీలో కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంగువ, చింతపండు, పసుపు, ఉప్పు వేసి మెత్తగా చేయాలి. (అవసరమనుకుంటే నీరు జత చేయాలి)
పచ్చడిని గిన్నెలోకి తీసుకుని కొద్దిగా నూనె వేసి కలపాలి.
సేకరణ:
డా. వైజయంతి