దీపావళి వెళ్లింది...కార్తీక మాసం వచ్చింది. అంతకంటే ముందు ఉసిరికాయ వచ్చేసింది. ఊరగాయలు మెల్లగా పెట్టుకోవచ్చు. ఉసిరితో వనభోజనానికి సిద్ధమవుదాం. ఉసిరితో ఇన్‌స్టంట్‌గా ఇలా వండుదాం. రోటి పచ్చడి... వేడి వేడి చారు... ఈ వారానికి ఇవి చాలు.
ఉసిరి చారు
కావలసినవి: ఉసిరికాయ గుజ్జు – 5 లేదా 6 (100 గ్రాముల గుజ్జు రావాలి); కందిపప్పు – 2 టేబుల్ స్పూన్‌లు; మిరియాలు – 4–5 గింజలు; జీలకర్ర – అర టీ స్పూన్; పసుపు – పావు టీ స్పూన్; నీరు – 2 కప్పులు; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి.
పోపు కోసం: నెయ్యి లేదా నూనె – టీ స్పూన్; ఆవాలు – అర టీ స్పూన్; జీలకర్ర – అర టీ స్పూన్; ఎండుమిర్చి – 2; పచ్చిమిర్చి–2; కరివేపాకు రెమ్మలు –2.
తయారీ: ఉసిరి కాయలను కడిగి తరిగి గింజలు తొలగించాలి. ఆ ముక్కలను, మిరియాలు, జీలకర్ర మిక్సీలో వేసి పలుకుగా గ్రైండ్ చేయాలి. ప్రెషర్ కుకర్‌లో కందిపప్పును ఉడికించి, వేడి తగ్గిన తర్వాత మెదిపి పక్కన పెట్టాలి మందపాటి పాత్రను స్టవ్ మీద పెట్టి నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి నిమిషంపాటు వేయించాలి. వేగిన తర్వాత ఉసిరికాయ గుజ్జు వేసి రెండు నిమిషాలపాటు కలుపుతూ వేయించాలి. ఇప్పుడు కందిపప్పు, పసుపు, ఉప్పు వేసి, ఆ తర్వాత నీటిని పోసి కలిపి మూత పెట్టాలి. నీళ్లు మరగడం మొదలైన తర్వాత స్టవ్ ఆపేసి మూత పెట్టి, ఐదు నిమిషాల సేపు కదిలించకుండా ఉంచాలి. ఈ రసం అన్నంలోకి రుచిగా ఉంటుంది.
ఉసిరి రోటి పచ్చడి
కావలసినవి: ఉసిరి కాయలు – 6; ఎండు మిర్చి– 10; జీలకర్ర – టీ స్పూన్; పచ్చి శనగపప్పు – 2 టేబుల్ స్పూన్‌లు; మినప్పప్పు– టేబుల్ స్పూన్; మెంతులు – అర టీ స్పూన్; వెల్లుల్లి రేకలు – 7; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి; ధనియాలు – 2 టీ స్పూన్‌లు; నూనె టీ స్పూన్.
పోపు కోసం: నూనె – టేబుల్ స్పూన్; ఆవాలు – అర టీ స్పూన్; జీలకర్ర – అర టీ స్పూన్; ఎండుమిర్చి– 2; కరివేపాకు– 2 రెమ్మలు; పసుపు – అర టీ స్పూన్.
తయారీ: ఉసిరి కాయలను కడిగి తరిగి గింజలను తొలగించాలి ∙పెనంలో నూనె వేడి చేసి అందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి. అవి దోరగా వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి అవి వేగుతుండగా స్టవ్ ఆపేయాలి. స్టవ్, పెనం వేడికి మెల్లగా వేగి అమరుతాయి. వేడి తగ్గిన తరవాత మిక్సీ జార్‌లో వేసి గ్రైండ్ చేయాలి. ఆవపొడిలో వెల్లుల్లి రేకలు వేసి మళ్లీ గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఉసిరికాయ ముక్కలను వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పోపు కోసం బాణలిలో నూనె వేడి చేసి పోపు దినుసులన్నీ వేసి వేయించాలి. అందులో గ్రైండ్ చేసిన ఉసిరి పచ్చడి వేసి కలిపి, స్టవ్ ఆపేయాలి.
Comments
Please login to add a commentAdd a comment