chutney
-
ఉసిరితో వనభోజనం : ఇన్స్టంట్ పచ్చడి ఒక్కసారి తిన్నారంటే!
దీపావళి వెళ్లింది...కార్తీక మాసం వచ్చింది. అంతకంటే ముందు ఉసిరికాయ వచ్చేసింది. ఊరగాయలు మెల్లగా పెట్టుకోవచ్చు. ఉసిరితో వనభోజనానికి సిద్ధమవుదాం. ఉసిరితో ఇన్‌స్టంట్‌గా ఇలా వండుదాం. రోటి పచ్చడి... వేడి వేడి చారు... ఈ వారానికి ఇవి చాలు. ఉసిరి చారుకావలసినవి: ఉసిరికాయ గుజ్జు – 5 లేదా 6 (100 గ్రాముల గుజ్జు రావాలి); కందిపప్పు – 2 టేబుల్ స్పూన్లు; మిరియాలు – 4–5 గింజలు; జీలకర్ర – అర టీ స్పూన్; పసుపు – పావు టీ స్పూన్; నీరు – 2 కప్పులు; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి.పోపు కోసం: నెయ్యి లేదా నూనె – టీ స్పూన్; ఆవాలు – అర టీ స్పూన్; జీలకర్ర – అర టీ స్పూన్; ఎండుమిర్చి – 2; పచ్చిమిర్చి–2; కరివేపాకు రెమ్మలు –2.తయారీ: ఉసిరి కాయలను కడిగి తరిగి గింజలు తొలగించాలి. ఆ ముక్కలను, మిరియాలు, జీలకర్ర మిక్సీలో వేసి పలుకుగా గ్రైండ్ చేయాలి. ప్రెషర్ కుకర్‌లో కందిపప్పును ఉడికించి, వేడి తగ్గిన తర్వాత మెదిపి పక్కన పెట్టాలి మందపాటి పాత్రను స్టవ్ మీద పెట్టి నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి నిమిషంపాటు వేయించాలి. వేగిన తర్వాత ఉసిరికాయ గుజ్జు వేసి రెండు నిమిషాలపాటు కలుపుతూ వేయించాలి. ఇప్పుడు కందిపప్పు, పసుపు, ఉప్పు వేసి, ఆ తర్వాత నీటిని పోసి కలిపి మూత పెట్టాలి. నీళ్లు మరగడం మొదలైన తర్వాత స్టవ్ ఆపేసి మూత పెట్టి, ఐదు నిమిషాల సేపు కదిలించకుండా ఉంచాలి. ఈ రసం అన్నంలోకి రుచిగా ఉంటుంది. ఉసిరి రోటి పచ్చడి కావలసినవి: ఉసిరి కాయలు – 6; ఎండు మిర్చి– 10; జీలకర్ర – టీ స్పూన్; పచ్చి శనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు; మినప్పప్పు– టేబుల్ స్పూన్; మెంతులు – అర టీ స్పూన్; వెల్లుల్లి రేకలు – 7; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి; ధనియాలు – 2 టీ స్పూన్లు; నూనె టీ స్పూన్.పోపు కోసం: నూనె – టేబుల్ స్పూన్; ఆవాలు – అర టీ స్పూన్; జీలకర్ర – అర టీ స్పూన్; ఎండుమిర్చి– 2; కరివేపాకు– 2 రెమ్మలు; పసుపు – అర టీ స్పూన్.తయారీ: ఉసిరి కాయలను కడిగి తరిగి గింజలను తొలగించాలి ∙పెనంలో నూనె వేడి చేసి అందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి. అవి దోరగా వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి అవి వేగుతుండగా స్టవ్ ఆపేయాలి. స్టవ్, పెనం వేడికి మెల్లగా వేగి అమరుతాయి. వేడి తగ్గిన తరవాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయాలి. ఆవపొడిలో వెల్లుల్లి రేకలు వేసి మళ్లీ గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఉసిరికాయ ముక్కలను వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పోపు కోసం బాణలిలో నూనె వేడి చేసి పోపు దినుసులన్నీ వేసి వేయించాలి. అందులో గ్రైండ్ చేసిన ఉసిరి పచ్చడి వేసి కలిపి, స్టవ్ ఆపేయాలి. -
చట్నీలో చిట్టెలుక
సంగారెడ్డి: సుల్తాన్పూర్ జేఎన్టీయూ హాస్టల్ వంట గదిలోని చట్నీ పాత్రలో చిట్టెలుక ప్రత్యక్షమవ్వడం కలకలం రేపింది. ఈ సంఘటనపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలివి. సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండలం సుల్తా¯Œన్పూర్ జేఎన్టీయూ హాస్టల్ మెస్ పనితీరు వారం రోజులుగా బాగా లేదని విద్యార్థులు పలుమార్లు ప్రి¯Œన్సిపాల్కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి విద్యార్థులు తినే చట్నీలో చిట్టెలుక ప్రత్యక్షమైంది. దాన్ని విద్యార్థులు వీడియో తీసి మంగళవారం సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో వైరంగా మారింది. విషయం తెలియగానే కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహ మంగళవారం ఉదయం హాస్టల్‌కు వెళ్లి పరిశీలించారు. చట్నీలో ఎలుక పడటం వాస్తవమేనని, కానీ విద్యార్థులు తిన్న తర్వాత కడిగేందుకు నీళ్లు పోసి ఉంచిన పాత్రలోనే ఎలుక ఉందని ఆయన స్పష్టం చేశారు. చట్నీలో ఎలుక పడిన ఘటనపై మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తక్షణం విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని అదనపు కలెక్టర్, ఆర్డీవో, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లోని హాస్టళ్లు, క్యాంటీన్లలో తనిఖీలు నిర్వహించాలన్నారు. నిబంధనలు పాటించని సంస్థల లైసెన్స్‌లను వెంటనే రద్దు చేయాలని ఆదేశించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, హాస్టళ్లు, క్యాంటీన్లలో ఆహార పదార్థాలు తయారు చేసే నిర్వాహకులపై నిఘా ఉంచాలని సూచించారు. అపరిశుభ్రతపై అడిషనల్ కలెక్టర్ ఆగ్రహం అడిషనల్ కలెక్టర్ మాధురి హాస్టల్‌ను సందర్శించి అక్కడి అపరిశుభ్ర వాతావరణంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులుగా శుభ్రం చేయకుండా పాత్రలను అలాగే ఉంచడమేమిటని కాంట్రాక్టర్‌ను నిలదీశారు. బాధ్యులను వెంటనే తొలగించాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆమె వెంట అందోల్ ఆర్డీవో పాండు, ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేందర్ తదితరులు ఉన్నారు. -
స్పైసీ స్పైసీ ఎర్ర చీమల చట్నీ: ఇక వరల్డ్ వైడ్‌గా మారు మోగనుంది
చీమల పచ్చడి గురించి ఎపుడైనా విన్నారా? ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్, ఒడిశాలోని మయూర్‌భంజ్‌లోనూ ఇది ఫ్యామస్. రుచికరమైన చట్నీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజ నాలున్నాయని తాజాగా పరిశోధకులు తేల్చారు. సిమిలిపాల్ టైగర్ రిజర్వ్‌తో సహా జిల్లాలోని ప్రతి బ్లాక్ ఏరియాలోని అడవులలో ఏడాది పొడవునా సమృద్ధిగా కనిపిస్తాయి. ఒడిశాలోని మయూర్భంజ్ ప్రజలు దీన్ని విరివిగా వాడతారు. వీరు తయారు చేసే స్పైసీ స్పైసీ రెడ్ యాంట్ చట్నీకి ఇప్పటికే భిన్నమైన గుర్తింపు లభించడంతో పాటు ఇపుడిక జీఐ ట్యాగ్ కూడా అందుకోవడం విశేషంగా నిలిచింది. దీంతో రెడ్ యాంట్ చట్నీ ఇక వరల్డ్ వైడ్‌గా గుర్తింపును తెచ్చుకోనుంది. మయూర్భంజ్ రెడ్ యాంట్ చట్నీకి GI ట్యాగ్ మయూర్భంజ్లోని రెడ్ చట్నీపై చేసిన పరిశోధనలో, శాస్త్రవేత్తలు రెడ్ వీవర్ చీమలను విశ్లేషించారు. ఇందులో ప్రోటీన్, కాల్షియం, జింక్, విటమిన్ బి-12, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, కాపర్, అమినో యాసిడ్లు ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పోషకాలను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచి, వ్యాధులను నివారించవచ్చని గుర్తించారు. రెండ్ యాంట్ చట్నీ కేవలం రుచికి మాత్రమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దాని వైద్యపరమైన లక్షణాల కారణంగా ఇది స్థానిక ప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందింది. ప్రకృతితో ముడిపడి ఉన్న ప్రజల పోషకాహార భద్రతకు ఇది చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. స్థానికుల విశ్వాసంతో పాటు, ఈ చట్నీలోని ఔషధ గుణాలను నిపుణులు ఇప్పటికే గుర్తించారు. జ్వరం, జలుబు, దగ్గు, ఆకలిని తగ్గించడానికి, కంటి చూపు, కీళ్ల నొప్పులు, ఆరోగ్యకరమైన మెదడును మెరుగుపరచడంలో సహాయపడుతుందని తేల్చిన సంగతి తెలిసిందే. ఈ చీమల నుండి తయారుచేసిన సూప్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందట. స్థానికంగా చాప్ డా అని పిలిచే ఈ చీమల పచ్చడికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఎర్ర చీమల చట్నీ ఎలా తయారు చేస్తారంటే ఈ రెడ్ వీవర్ చీమలను వాటి గుడ్లతో పాటు గూళ్ళ నుండి సేకరించి శుభ్రం చేస్తారు. దీని తరువాత, ఉప్పు, అల్లం, వెల్లుల్లి, కారం కలిపి, గ్రైండ్ చేయడం ద్వారా చట్నీ తయారు చేస్తారు. ఈ చట్నీ కారం..కారంగా , పుల్లగా ఉంటుంది కానీ చాలా రుచిగా ఉంటుంది. స్థానిక గిరిజనులు తమ ఆహారంలో చేర్చుకుంటారు. ఇందులోని ప్రొటీన్, కాల్షియం, ఫామిక్ యాసిడ్, ఇతర పోషక గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి మారుమూల గిరిజనవాసులకు ఎంతో మేలు చేస్తాయి. ఈ చట్నీ మలేరియా, కామెర్లు తదితర కొన్ని రకాల వ్యాధులను కూడా నయం చేస్తుందని స్థానిక గిరిజనుల విశ్వాసం. అలాగే కొలంబియా, మెక్సికో, బ్రెజిల్‌లోనూ చీమలను ఆహారంగా తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే OUAT బృందం 2020లో శాస్త్రీయ ఆధారాలతో జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ గుర్తింపుకోసం చేసిన ప్రయత్నం ఫలించింది. -
వీకెండ్ స్పెషల్: క్యారట్ చట్నీ.. సింపుల్‌గా ఇలా చేసుకోండి
క్యారట్ చట్నీ తయారీకి కావల్సినవి: నూనె – టీస్పూను; పచ్చిమిర్చి – ఆరు; వెల్లుల్లి రెబ్బలు – రెండు; అల్లం తరుగు – టీస్పూను; చింతపండు – గోలీకాయంత; క్యారట్ – మీడియంసైజు మూడు; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; వేయించిన వేరుశనగ గింజలు – రెండు టేబుల్ స్పూన్లు; పచ్చికొబ్బరి తురుము – టేబుల్ స్పూను;జీలకర్ర – టీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా తాలింపు కోసం: నూనె – టీస్పూను; ఆవాలు – టీస్పూను; జీలకర్ర – టీస్పూను; మినపప్పు – అరటీస్పూను; పచ్చిశనగపప్పు – అరటీస్పూను; ఎండుమిర్చి – రెండు; ఇంగువ – చిటికెడు; కరివేపాకు – రెమ్మ. తయారీ విధానమిలా: ∙బాణలిలో నూనెవేసి పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపేస్టు వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి ∙ఇవన్నీ వేగిన తరువాత చింతపండు వేసి నిమిషం తర్వాత దించేయాలి ∙ఇదే బాణలిలో క్యారట్, కొత్తిమీర తరుగు, కరివేపాకు వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి ∙ఇప్పుడు వేయించిన పచ్చిమిర్చి మిశ్రమం, క్యారట్ తురుము, వేరుశనగ గింజలు, కొబ్బరి తురుము, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పువేసి గ్రైండ్ చేయాలి ∙చట్నీ మెత్తగా గ్రైండ్ చేసాక... తాలింపు దినుసులతో తాలింపు పెట్టి చట్నీలో వేయాలి ∙ఈ క్యారట్ చట్నీ ఇడ్లీ, దోశ, రోటి, అన్నంలోకి మంచి కాంబినేషన్. -
వడ్డించేందుకు గరిట లేదని... చిప్పతో చట్నీ పోసెయ్
తుమకూరు: తుమకూరు నగరంలో ఉన్న తుమకూరు విశ్వ విద్యాలయానికి నిధులకు లోటులేదు. ప్రతి ఏటా కేంద్ర, రాష్ట్రాల నుంచి వందల కోట్ల రూపాయలు వస్తుంటాయి. ప్రొఫెసర్లు, అధికారులు అధునాతన వసతులతో తులతూగుతూ ఉంటారు. కానీ వర్సిటీ మెస్‌లలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు లబోదిబోమంటారు. వర్సిటీ పరిధిలో ఉన్న ఎస్సి, ఎస్టీ హాస్టల్లో విద్యార్థులకు ఆహారం వడ్డించేందుకు కనీసం గరిటెలు కూడా లేని దుస్థితి నెలకొంది. గరిటెతో కాకుండా కొబ్బరి చిప్పతో చట్నీని వడ్డించడమే దీనికి నిదర్శనం. శుక్రవారం రాత్రి విద్యార్థులకు భోజనం వడ్డించేటప్పుడు చిత్రాన్నంలోకి చట్నీ వేయడానికి గరిటె లేకపోయింది. దీంతో ఒక చిప్పతో చట్నీని పోశారు. ఈ వీడియో, ఫోటోలు వైరల్ అయ్యాయి. సౌకర్యాల లేమిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి: నిరుద్యోగులకు మొండిచెయ్యి) -
సమోస.. కచొరికి చట్నీ రుచిగా వండలేదని భార్యపై..
భోపాల్: దుకాణంలో విక్రయించే సమోస, కచొరికి భార్య చేసిన చట్నీని రుచి చూసిన భర్త రుచిగా రాలేదని చెప్పాడు. మళ్లీ చేసుకురా అని చెప్పడంతో భార్యాభర్తల మధ్య గొడవ ప్రారంభమైంది. ఈ క్రమంలో మాటామాట పెరిగి ఆమెపై తీవ్రంగా దాడి చేసి భర్త పరారయ్యాడు. కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడిన ఆమె చివరకు ప్రాణం కోల్పోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ధాటియా జిల్లా ఉపరాయంగావ్‌లో చోటుచేసుకుంది. స్థానికంగా సమోస కచోరి దుకాణాన్ని ఆనంద్ గుప్తా నిర్వహిస్తున్నాడు. ఆయన భార్య ప్రీతి. అయితే సమోస.. కచోరి కోసం చట్నీ తయారు చేయమని ఆనంద్ ఆదివారం ఇంట్లో ఉన్న భార్యకు చెప్పాడు. కొద్దిసేపటి అనంతరం భార్య చట్నీ తయారుచేసి భర్తకు రుచి చూపించింది. అయితే రుచి లేకపోవడంతో భర్త ఆమెకు మళ్లీ చేయమని చెప్పాడు. ఈ సమయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది. క్షణికావేశానికి లోనైన భర్త భార్యపై దాడి చేశాడు. కోడలిని కొడుతుండడంతో భర్త తల్లి వచ్చి వారించింది. ఆమెను పక్కకు నెట్టి కర్రతో తలపై గట్టిగా బాదాడు. తీవ్ర గాయాలపాలైన భార్య ప్రీతిని వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందింది. దాడి చేసిన అనంతరం భర్త ఆనంద్ గుప్తా పరారయ్యాడు. సమాచారం అందుకున్న గోరాఘాట్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు అనంతరం నిందితుడు ఆనంద్ కోసం గాలిస్తున్నారు. -
ఇడ్లీ విత్ కాజూ చట్నీ అండ్ గన్ పౌడర్
ఇడ్లీని చట్నీతో నంచుకుని తినడం దక్షిణ భారతేదశంలో సంప్రదాయంగా వస్తోంది. వీటిని తయారుచేసి అలంకరించడంలో వైవిధ్యాలు ఉన్నాయి. మా అత్తగారు తయారుచేసే మదరాసీ గన్‌పౌడర్ గురించి వివరించాలనుకుంటున్నాను. ఇందుకోసం రవ్వ ఇడ్లీ మిశ్రమం (20 ఇడ్లీలకు సరిపడా) సిద్ధం చేసుకోవడానికి కావలసినవి... బొంబాయి రవ్వ 100 గ్రా., పెరుగు 5 టేబుల్ స్పూన్లు, అర టీ స్పూను బేకింగ్ పౌడర్, రుచికి తగినంత ఉప్పు, 30 మి.లీ. నీళ్లు, ఒక టేబుల్ స్పూన్ వేయించిన జీడిపప్పు పలుకులు, ఇడ్లీ పిండిలో పోపు వేయడానికి ఒక టేబుల్ స్పూన్ బటర్ కావాలి. ఒక టీ స్పూన్ నూనెలో మినప్పప్పు, పచ్చి సెనగపప్పు, ఒక టీ స్పూను ఆవాలు, అర టీ æస్పూన్ కరివేపాకు వేసి వేయించాలి. గన్ పౌడర్ కోసం... ఒక టీ స్పూన్ నూనె, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ సెనగ పప్పు, అర టేబుల్ స్పూన్ మినప్పప్పు, కడిగిన బియ్యం ఒక టేబుల్ స్పూన్, అర టీ స్పూన్ ఎండు మిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, ఒక వెల్లుల్లి రెబ్బ, ఒక టేబుల్ స్పూను వేయించిన నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ పంచదార పొడి, తగినంత ఉప్పు ఉంచుకోవాలి. కొబ్బరి జీడిపప్పు చట్నీ కోసం... ఒక టీ స్పూన్ నూనె, పావు టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మినప్పప్పు, ఒక రెమ్మ కరివేపాకు, 50 మి.లీ. కొబ్బరి పాలు, ఒక టీ స్పూన్ వేయించిన జీడిపప్పులు సిద్ధం చేసుకోవాలి. సర్వ్ చేయడానికి... ఒక టీ స్పూన్ సాల్టె్టడ్ బటర్, అర టీ స్పూన్ అల్లం తురుము, అర టీ స్పూన్ వెల్లుల్లి తరుగు, అర టీ స్పూన్ పచ్చి మిర్చి తరుగు, ఒక టీ స్పూన్ వేయించిన జీడి పప్పు, ఒక టీ స్పూన్ వేయించి కొబ్బరి ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు, అర టీ స్పూన్ ఉల్లి కాడల తరుగు తీసుకోవాలి. పోపు తయారు చేసుకోవడం... స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడేవరకు వేయించాలి. పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు వేసి వేయించి దింపేయాలి. ఇడ్లీ పిండి తయారు చేసుకోవడం... ఒక పాత్రలో బొంబాయి రవ్వ, పెరుగు, బేకింగ్ పౌడర్, ఉప్పు, జీడిపప్పు పలుకులు, నీళ్లు వేసి బాగా కలిపాక, వేయించి ఉంచుకున్న పోపును ఈ పిండిలో వేసి కలిపి సుమారు అరగంట సేపు పక్కన ఉంచాలి. ఇడ్లీలు తయారు చేయడం.... ఇడ్లీ స్టాండును శుభ్రంగా కడిగి, ఇడ్లీ రేకులకు బటర్ పూయాలి. సిద్ధంగా ఉంచుకున్న ఇడ్లీ పిండి మిశ్రమాన్ని ఈ రేకులలో వేసి ఇడ్లీ స్టాండును స్టౌమీద ఉంచి ఉడికించి దింపేయాలి. గన్ పౌడర్ ఇలా తయారుచేసుకోవాలి... స్టౌమీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, పచ్చి సెనగపప్పు, బియ్యం, మినప్పప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించాలి. నువ్వులు జత చేసి, పదార్థాలన్నీ బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి, దింపేసి చల్లారాక మిక్సీలో వేసి పొడి చేయాలి (మరీ మెత్తగా ఉండకూడదు). పంచదార, ఉప్పు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి. జీడిపప్పు, కొబ్బరి పచ్చడి తయారుచేద్దాం... స్టౌమీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేసి వేయించాలి. కొబ్బరి పాలు, వేయించిన జీడిపప్పు పలుకులు జత చేసి, కొద్దిసేపు సన్నని మంట మీద ఉంచి, దింపేసి చల్లారనివ్వాలి. బాగా చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. పాన్‌లో బటర్ వేసి స్టౌమీద ఉంచి కరిగించాక, అల్లం తురుము, వెల్లుల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు వేసి వేయించాలి. తయారుచేసి ఉంచుకున్న ఇడ్లీలను జత చేయాలి. వీటి మీద గన్ పౌడర్ వేయాలి. ఇడ్లీలకు గన్ పౌడర్ బాగా పట్టేలా జాగ్రత్తగా కలపాలి. వేయించి ఉంచుకున్న జీడిపప్పులు, వేయించిన కొబ్బరి ముక్కలు, కొత్తిమీర తరుగు, ఉల్లికాడల తరుగు జత చేసి, స్టౌమీద నుంచి దింపేయాలి. సర్వింగ్ ప్లేట్లలో ఇడ్లీలను అందంగా అలంకరించి, జీడిపప్పు, కొబ్బరి చట్నీతో అందించాలి. క్యాలీఫ్లవర్ గ్రీన్ పీస్ అండ్ కినోవా పులావ్ కావలసినవి: ఉడికించిన కినోవా బియ్యం – 300 గ్రా. (సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. వీటి ఖరీదు కొద్దిగా ఎక్కువే ఉంటుంది. ఈ బియ్యం బదులు బాస్మతి బియ్యం కూడా వాడుకోవచ్చు); అల్లం తురుము – 2 టీ స్పూన్లు; ఉల్లి తరుగు – ఒక టేబుల్ స్పూన్; క్యాలీ ఫ్లవర్ తరుగు – 3 టేబుల్ స్పూన్లు; తాజా పచ్చి బఠాణీ – 3 టేబుల్ స్పూన్లు; పసుపు – అర టీ స్పూన్; మిరప కారం – అర టీ స్పూన్; ఉప్పు – కొద్దిగా; గరం మసాలా పొడి – అర టీ స్పూన్; జీలకర్ర – ఒక టీ స్పూన్; పుదీనా తరుగు – 2 టీ స్పూన్లు; ఆలివ్ ఆయిల్ – ఒక టేబుల్ స్పూన్ తయారీ స్టౌమీద బాణలి ఉంచి వేడయ్యాక ఆలివ్ ఆయిల్ వేయాలి. నూనె కాగాక జీలకర్ర వేసి చిటపటలాడేవరకు వేయించాలి. అల్లం తురుము, ఉల్లి తరుగు వేసి వేయించాలి. క్యాలీఫ్లవర్ తరుగు, పచ్చి బఠాణీ జత చేసి మరోమారు వేయించాలి. పసుపు, మిరప కారం, గరం మసాలా పొడి వేసి బాగా కలిపి, మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు జత చేసి ఉడికించాలి. కొద్దిగా మెత్తబడ్డాక, ఉడికించిన కినోవా వేసి బాగా కలిపి, ఉప్పు జత చేయాలి. పుదీనా ఆకులతో అలంకరించి వేడివేడిగా అందించాలి. -
స్వీట్ చట్నీ
కావలసినవి: చింతపండు – అర కప్పు; గింజలు లేని ఖర్జూరాలు – అర కప్పు; బెల్లం తురుము – అర కప్పు; నీళ్లు – 2 కప్పులు; వేయించిన జీలకర్ర పొడి – అర టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; శొంఠి పొడి – అర టీ స్పూను; మిరప కారం – అర టీ స్పూను; ఉప్పు – తగినంత. తయారీ: బాణలిలో చింతపండు, ఖర్జూరాలు, నీళ్లు వేసి స్టౌ మీద పెట్టి సుమారు పది నిమిషాల పాటు పదార్థాలు మెత్తబడేవరకు ఉడికించాలి ♦ బెల్లం తురుము జత చేసి బాగా కలియబెట్టాలి ♦ జీలకర్ర పొడి, ధనియాల పొడి, శొంఠి పొడి, మిరపకారం జత చేసి మరోమారు కలపాలి ♦ ఉప్పు జత చసి బాగా కలిపి దింపేయాలి ♦ బాగా చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ♦ మిశ్రమాన్ని వడగట్టి, డబ్బాలోకి తీసుకోవాలి ♦ ఎక్కువరోజులు నిల్వ ఉండాలంటే, ఫ్రిజ్‌లో భద్రపరచుకోవాలి. గ్రీన్ చట్నీ కావలసినవి: కొత్తిమీర – 2 కప్పులు; పచ్చిమిర్చి – 2; అల్లం – చిన్న ముక్క; నిమ్మరసం – అర టీ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; చాట్ మసాలా – అర టీ స్పూను; ఉప్పు – తగినంత. తయారీ: కొత్తిమీర ఆకులను శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి ♦ మిక్సీ జార్లో కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి, నిమ్మ రసం, చాట్ మసాలా, జీలకర్ర పొడి, అల్లం ముక్క, ఉప్పు వేసి మెత్తగా చేసి, చిన్న గిన్నెలోకి తీసుకోవాలి ♦ అవసరమనుకుంటే కొద్దిగా నీరు జత చేయ వచ్చు. -
రోట్లో పాము.. నోట్లో చట్నీ..
-
రోట్లో పాము.. నోట్లో చట్నీ..
ఓ కుటుంబం ఆస్పత్రిలో.. ఖిల్లాఘనపురం: వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం మానాజీపేట.. గురువారం ఉదయం.. గొల్ల రాజ మ్మ అనే మహిళ చట్నీ కోసం టమాటాలు, మిరపకా యలు ఉడికించింది. చట్నీ నూరేందుకు ఇంట్లోని పెద్ద రోట్లో వాటిని పోసి రోకలితో గట్టిగా నూరింది. అయి తే, అప్పటికే అందులో ఓ పాము పడుకుని ఉంది. దాన్ని గమనించని రాజమ్మ రోకలి దెబ్బలేసింది. అంతే పాము ముక్కలుముక్కలైంది.. చట్నీలో మిక్సయిపోయింది. రాజమ్మతో పాటు ఆమె కుమార్తె కృష్ణవేణి, కుమారుడు అదే చట్నీతో భోజనం చేశారు. గొర్రెల మంద దగ్గర ఉన్న పెద్ద కుమారుడు సాయికి కూడా తీసుకెళ్లారు. కొంత అన్నం తిన్న తర్వాత సాయికి చట్నీలో పాము తోక ముక్క కనిపించింది. అతడు చట్నీని పరిశీలించగా టమాటాలతో పాటు పాము ముక్కలు కనిపించాయి. ఆందోళనకు గురైన కుటుంబం మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో చేరి చికిత్సలు పొందుతున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
చిక్కుడు కాయ పచ్చడి
హెల్దీ కుకింగ్ కావలసినవి: చిక్కుడుకాయలు – పావు కిలో; చింతపండు– కొద్దిగా; ఎండు మిర్చి – 4; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – టీ స్పూను; మెంతులు – అర టీ స్పూను; పసుపు – కొద్దిగా; ఇంగువ – చిటికెడు; ఉప్పు – తగినంత; కొత్తిమీర – కొద్దిగా; నూనె – 2 టీ స్పూన్లు తయారీ: ⇔ బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండు మిర్చి వరసగా వేసి, దోరగా వేగాక తీసి పక్కన ఉంచాలి ⇔ అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక చిక్కుడుకాయ ముక్కలు (చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి ఈనెలు తీసి, ముక్కలుగా చేయాలి) వేసి, కొద్దిగా వేగిన తర్వాత... ఉప్పు, చింతపండు, పసుపు, ఇంగువ వేసి బాగా కలిపి మూత పెట్టాలి ⇔ ముక్కలు బాగా మెత్తబడ్డాక బాణలి దించేయాలి ⇔ మిక్సీలో ముందుగా పోపు వేసి, మెత్తగా చేయాలి ⇔ చిక్కుడుకాయ ముక్కలు, కొత్తిమీర జతచేసి మరోమారు మిక్సీ పట్టి తీసేయాలి. -
పచ్చడి పచ్చడే!
తిండి గోల విస్తట్లో పప్పు, కూర, ధప్పళం, గారెలు, బూరెలు, లడ్లు, అరిసెలు, వడియాలు, అప్పడాలు, ఊరగాయలు, పులిహోర, పాయసాలు... ఇలా ఎన్ని ఉన్నా, పచ్చడి ఇంకా పడలేదే అని ఎదురు చూసేవారెవరయినా ఉన్నారా అంటే అది తెలుగువారే! పచ్చళ్ల కోసం ఇంతగా నాలుక పీక్కుంటారు కాబట్టే గోంగూరకు శాకంబరీ మాత అని పేరు పెట్టుకుని మురిసిపోయారు మన తెలుగువాళ్లు. ఇప్పుడంటే మిక్సీలొచ్చి పని సులువు చేశాయిగానీ, అవి రాక మునుపు నానా తంటాలూ పడేవాళ్లు లేడీసు. ఊర్బిండి అంటే మినప లేదా పెసరపప్పును నానబెట్టి రుబ్బిన పచ్చడో, ఊర్పచ్చడి అంటే ఏ కందిపచ్చడో, శనగపచ్చడో, బజ్జీపచ్చడి అంటే దోసకాయనో, వంకాయనో నిప్పులమీద కాల్చి, నూరి తాలింపు పెట్టిన పచ్చడో, తొక్కు అంటే గోంగూర లేదా చింతకాయను రోట్లో నూరిన పచ్చడో లేనిదే ముద్ద దిగేది కాదు. పచ్చడి మెతుకులంటే పేదవారి కూడు అనేది దురభిప్రాయం మాత్రమే.. అప్పుడూ ఇప్పుడూ కూడా! ఎందుకంటే ఇప్పుడు మిర్చి రేటు ఘాటు భరించడమే కష్టం. దొండ, బెండ, బీర, దోస... వాడ్చి, అందులో ఇంత చింతపండు, ఎండుమిరపకాయలు, ఉప్పు పడేసి, కచ్చాపచ్చాగా నూరి, ఇష్టం ఉంటే ఇంగువ, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్టు పడేసి, తిరగమోత పెట్టేస్తే ఘుమ ఘుమలాడే రోటిపచ్చడి రెడీ! ఏమీ లేదంటారా, నాలుగు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కాస్తంత ఉప్పు, చింతపండు కలిపి నూరి, ఓపికుంటే తిరగమోత పెట్టుకోవడం లేదంటే అట్లాగే తినేసినా సరే. ఒకప్పుడు మిరపకాయలకు బదులు మిరియాలపొడి, చింతపండుకు బదులు నిమ్మరసం, ఉప్పు స్థానంలో సైంధవ లవణం వేసి, ఆరోగ్యంగా తినేవారు. ఇప్పుడు కూడా పచ్చడి మీద జిహ్వచాపల్యం చంపుకోలేని వారు ఇలా కూడా ఓసారి ట్రై చేసి చూస్తే సరి! -
చెట్నీ అడిగితే 'పచ్చడి' కింద కొట్టాడు
న్యూఢిల్లీ: హోటల్లో అయినా.... రోడ్డు పక్కన బండి దగ్గర టిఫిన్ చేస్తూ... కొంచెం పచ్చడి వేయమంటే మళ్లీ ఎవరైనా వేస్తారు. అది సహజం. కానీ చేస్తున్న టిఫిన్‌లో మరోసారి పచ్చడి వేయమని అడిగి... కాకా హోటల్ యజమాని ఆగ్రహానికి గురైన ఓ వ్యక్తి ఆసుపత్రి ఐసీయూలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ సంఘటన తూర్పు న్యూఢిల్లీలోని త్రిలోక్ పూరి బ్లాక్ 31లో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. సన్నీ అనే యువకుడు అతని స్నేహితులు రోడ్డు పక్కనే ఉన్న కాకా హోటల్లో టిఫిన్ తింటున్నారు. ఆ క్రమంలో సన్నీ ప్లేట్లో పచ్చడి అయిపోయింది. మళ్లీ పచ్చడి కావాలని హోటల్ యజమాని కమల్ని కోరాడు. దాంతో కమల్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సన్నీపై ఐరన్ రాడ్‌తో దాడి చేసి... విచక్షణరహితంగా కొట్టి 'పచ్చడి' చేశాడు. దాంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతడి స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కమల్‌పై కేసు నమోదు చేశారు. సన్నీని చికిత్స నిమిత్తం లాల్ బహదూర్ శాస్త్రీ ఆసుపత్రికి తరలించారు. అయితే మరింత మెరుగైన వైద్య చికిత్స కోసం అతడిని మరో ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. దాంతో అతడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా పచ్చడిని సన్నీ వృద్ధా చేశాడని... అలా చేయవద్దని చెప్పినందుకు అతడితోపాటు అతడి స్నేహితులు తనతో ఘర్షణకు దిగారని కమల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతే కాకుండా అతడి స్నేహితులకు ఫోన్ చేస్తే.. వారు కూడా వచ్చి తనతో వాదనకు దిగారని ఆ ఫిర్యాదులో కమల్ పేర్కొన్నాడు. దాంతో సన్నీపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పచ్చడి తిని 14 మంది మృతి
మేఘాలయాలోని మారుమూల గ్రామం సైఫుంగ్లో జరిగిన ఘోర విషాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అడవి పళ్లతో చేసిన పచ్చడి తిని 14 మంది కూలీలు మృత్యువాత పడ్డారు. వీరంతా ఓ రోడ్డు నిర్మాణంలో పనిచేసేందుకు ఒడిషా నుంచి మేఘాలయాకు వలస వచ్చారు. సోమవారం ఈ ఘటన గురించి తమకు సమాచారం అందిందని, ఆదివారం రాత్రి భోజనంలో విషపు పండ్లతో చేసిన పచ్చడి తినడం వల్లే మరణాలు సంభవిచినట్లు భావిస్తున్నామని, అవగాహన లేకే ఇలా జరిగి ఉంటుందని, పోస్ట్‌మార్టం రిపోర్టుకూడా దీనిని బలపరిచే అవకాశం ఉందని ఐజీ జీపీ రాజు మీడియాకు తెలిపారు. -
రుచుల రుతువు
కోకిల... వగరు పాట. వేప... చేదు పూత. చెరకు... తీపి గడ. చింతపండు... పుల్లటి రసం. మిర్చి... ఘాటైన ప్రేమ. ఉప్పు... తెల్లటి రుచి. వసంతం... రుచుల రుతువు. అన్నిటి మేళవింపులే ఉగాది తాలింపులు. అయ్యంగారి పులిహోర చింతపండు - 200 గ్రా.; ఎండు మిర్చి - 25; శనగపప్పు - 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు - టీ స్పూను; నువ్వుల నూనె - కప్పు; ఉప్పు తగినంత పొడి కోసం: ధనియాలు - 3 టేబుల్ స్పూన్లు; మెంతులు - టీ స్పూను; ఎండు మిర్చి - 15; ఇంగువ - కొద్దిగా అన్నం కోసం: బియ్యం - 4 కప్పులు; మినప్పప్పు - 3 టీ స్పూన్లు; పల్లీలు - అర కప్పు; జీడిపప్పు - అర కప్పు; కరివేపాకు - ఒక కట్ట; నువ్వుల నూనె - 2 టీ స్పూన్లు; ఎండు మిర్చి - 3; ఉప్పు - తగినంత తయారీ: చింతపండు రెండు కప్పుల వేడి నీళ్లలో సుమారు అరగంటసేపు నానిన తర్వాత, మిక్సీ జార్లో వేసి మెత్తగా గుజ్జులా అయ్యేవరకు మిక్సీ పట్టి, జల్లెడ వంటి దానిలో వడకట్టాలి. (చెత్త వంటివన్నీ పైన ఉండిపోతాయి. అవసరమనుకుంటే కొద్దిగా వేడి నీళ్లు జత చేసి జల్లెడ పట్టవచ్చు. మిశ్రమం చిక్కగా ఉండాలే కాని పల్చబడిపోకూడదు) ధనియాలు, మెంతులను విడివిడిగా బాణలిలో నూనె లేకుండా వేయించి, చల్లారాక విడివిడిగానే మెత్తగా పొడి చేయాలి బాణలిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి, ఆవాలు, మినప్పప్పు వరుసగా వేసి వేయించాలి చింతపండు గుజ్జు జత చే సి బాగా కలిపి నూనె పైకి తేలేవరకు బాగా ఉడికించాలి మెంతి పొడి జత చేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి వేరొక బాణలిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి, మినప్పప్పు, కరివేపాకు వరుసగా ఒక దాని తరువాత ఒకటి వేసి వేయించాక, పల్లీలు, జీడి పప్పులు వేసి బాగా కలిపి దించేయాలి ఒక పళ్లెంలో అన్నం వేసి పొడిపొడిగా విడదీసి, టీ స్పూను నువ్వుల నూనె వేసి కలిపాక, ఉడికించి ఉంచుకున్న చింతపండు గుజ్జు, పోపు సామాను వేసి కలపాలి ఉప్పు, చిటికెడు ధనియాల పొడి, చిటికెడు మెంతి పొడి వేసి కలపాలి. మామిడికాయ నువ్వు పప్పు పచ్చడి కావలసినవి: పచ్చి మామిడి కాయలు - 2; నువ్వులు - కప్పు; పచ్చి మిర్చి తరుగు - అర కప్పు; వెల్లుల్లి రేకలు - అర కప్పు; అల్లం తురుము - 2 టీ స్పూన్లు; ఇంగువ - చిటికెడు; ఆవాలు - టీ స్పూను; కరివేపాకు - 4 రెమ్మలు; ఎండు మిర్చి - 4; రిఫైన్డ్ ఆయిల్ - 350 మి.లీ.; పసుపు - టీ స్పూను; ఉప్పు - తగినంత తయారీ: మామిడికాయ తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం తురుము, పసుపు వేసి బాగా కలిపి ముక్కలు మెత్తబడేవరకు ఉంచాలి వేరొక బాణలిలో నూనె లేకుండా, నువ్వులు వేసి వేయించి చల్లారాక మెత్తగా పొడి చేయాలి వేయించి ఉంచుకున్న మామిడికాయ ముక్కల మిశ్రమం, ఉప్పు జత చేసి మరోమారు మిక్సీ తిప్పి ఒక పాత్రలోకి తీసుకోవాలి బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు వేసి వేగాక, వెల్లుల్లి రేకలు, ఎండు మిర్చి, చివరగా కరివేపాకు వేసి వేయించి తీసి, తయారుచేసి ఉంచుకున్న పచ్చడిలో వేసి కలపాలి వేడి వేడి అన్నంలోకి కమ్మటి నెయ్యితో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. వేప పువ్వు చారు కావలసినవి: వేప పువ్వు - 3 టేబుల్ స్పూన్లు; చింతపండు - కొద్దిగా; ధనియాల పొడి - పావు టీ స్పూను; ఇంగువ - చిటికెడు; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - అర టీ స్పూను; మిరియాల పొడి - పావు టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; ఎండు మిర్చి - 4; పచ్చి మిర్చి - 2; కొత్తిమీర - కొద్దిగా; కరివేపాకు - 2 రెమ్మలు; ఉప్పు - తగినంత; పసుపు - తగినంత; నూనె - టీ స్పూను తయారీ: వేపపువ్వును శుభ్రంగా కడిగి పక్కన ఉంచాలి చింతపండును నానబెట్టి రసం తీసి పక్కన ఉంచాలి బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వరసగా వేసి వేయించాలి వేప పువ్వు, పచ్చి మిర్చి తరుగు వేసి కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు వేయించాక, చింతపండు రసం వేసి బాగా కలపాలి రసం పొంగుతుండగా మిరియాల పొడి, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, కరివేపాకు, కొత్తి మీర వేసి ఒక పొంగు రానిచ్చి దించేయాలి. -
ఉగాది పచ్చడి ప్రాశస్త్యం
తెలుగు నెలలలో మొదటిదైన చైత్రమాసం ఆరంభమే ‘ఉగాది’. దీనితోనే ‘వసంతరుతువు’ మొదలవుతుంది. ఆయుర్వేద సూత్రాలరీత్యా ఇది ‘శ్లేష్మ’ ప్రకోపకాలం. కాబట్టి కఫాన్ని నియంత్రణలో పెట్టడానికి చేదు, కారం, వగరు ఉండే ఆహారం మంచిది. పాయసాల వంటి స్నిగ్ధ పదార్థాలు నిషేధం. వేడి కలిగించే పదార్థాలు మంచివి. దీనికి మద్దతుగా మనకు ప్రకృతి ప్రసాదించిన ద్రవ్యాలు ‘వేపపువ్వు (తిక్తరసం - చేదు), మామిడి పిందెలు (కషాయరసం - వగరు)’ తెలుగు కొత్త ఏడాది ప్రారంభానికి చిహ్నంగా ‘కొత్తబెల్లం, కొత్త చింతపండు, మిరియాలు’ కలిపి రుచి చూస్తారు. ఉగాది పచ్చడి :- చిక్కటి చింతపండురసంలో బెల్లం, వేపపువ్వు, మామిడి పిందెల్ని దంచి కలిపి పచ్చడిలా చేస్తారు. కొన్ని ప్రాంతాలలో కొంచెం మిరియాలపొడి, సైంధవలవణం కలిపే ఆచారమూ ఉంది. స్థూలంగా చూస్తే ఇది షడ్రసాల సమ్మేళనం. పండగలో భాగంగా ఈ పచ్చడిని అందరూ పరగడుపున సేవిస్తారు. ఈ ద్రవ్యాల విశిష్ట గుణాల వల్ల జీర్ణప్రక్రియ చురుగ్గా మారుతుంది. వివిధ రసాల గుణాలు మధురరసం: జన్మతః ఎల్లరకూ హితకరం. ధాతుపుష్టిని కల్గిస్తుంది. శరీరకాంతి పెరుగుతుంది. కేశాలు బాగా పెరుగుతాయి. ఓజస్సును పెంచుతుంది. బాలురకు, వృద్ధులకు, గాయపడిన వారికి కూడా హితకరం. ‘‘ఆ జన్మసాత్మ్యాత్ కురుతే ధాతూనాం ప్రబలం బలం బాలవృద్ధ క్షతక్షీణ, వర్ణకేశ ఇంద్రియ ఓజసాం॥ అమ్లరసం: అగ్నిదీప్తిని, జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది. స్నిగ్ధమై (జావలా/ జిగురులాగా చేసిన పదార్థంలా) హృద్యంగా ఉంటుంది. నాలుకకు రుచిని పెంచుతుంది. ‘‘అమ్లో అగ్నిదీప్తికృత్ స్నిగ్ధో హృద్యయః పాచన రోచనః’’ లవణరసం: అగ్నిని ప్రేరేపించి, అజీర్ణాన్ని పొగొడుతుంది. ‘‘లవణః స్తంభసంఘాత బంధ విధ్మాపనో అగ్నికృత్.......’’ కటురసం: గొంతుకను శుద్ధి చేస్తుంది. దద్దుర్లు మొదలైన చర్మవ్యాధుల్ని తగ్గిస్తుంది. ఉదరశుద్ధి చేసి, వాపులను పోగొడుతుంది. ‘‘కటుః గలామయ, ఉదర్ద, కుష్ఠ, అలసక శోఫజిత్’’ తిక్తరసం: చేదు నాలుకకు ఇబ్బందికరమైనా... దీనిలో కొన్ని మంచి గుణాలున్నాయి. ఈ రసం ఆకలిని జనింపజేస్తుంది. క్రిమినాశకం, విషహరం, చర్మరోగాలు, జ్వరం, మూర్ఛ, ఛాతీ పట్టినట్లుండటం వంటి వికారాలను తగ్గిస్తుంది. మంటను, దప్పికనూ తగ్గిస్తుంది. ‘‘తిక్తః స్వయం అరోచిష్టురరుచిం, కృమి తృట్ విషం కుష్ట మూర్ఛా జ్వర ఉత్క్లేశదాహ పిత్త కఫాన్ జయేత్॥ కషాయరసం: ఇది కష్టంగా జీర్ణమౌతుంది. పిత్త, కఫ వ్యాధులను శాంతింపజేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ‘‘కషాయః పిత్తకఫహా, గురుః అస్రవిశోధనః’’ గమనిక: ఈ రుచులన్నింటిని అవసరాన్ని బట్టి తగు మోతాదుల్లో సేవించాలి. మితిమీరితే మేలు చేసే ఈ రసాలే వ్యాధుల్ని కలగజేస్తాయి. ముఖ్యంగా లవణరసాన్ని చాలా తక్కువగా వాడాలి. అంటే ప్రకృతిలో దొరికే కాయగూరలలోని లవణ రసం సరిపోతుంది. కాబట్టి, రుచికోసమని, మళ్లీ ఉప్పును అధికంగా వేసుకోవడం మంచిదికాదు. -
మంటను చల్లార్చుదాం...
ఓ పక్కన మండే ఎండలు... మరో పక్కన తీరని దాహం... ఒంటి మీద చెమట వాన... కుతకుత ఉడుకుతూండే కడుపు... ఆ ఉడుకు మీద కొద్దిగా నీళ్లు చల్లాలి... ఉత్తిగా నీళ్లయితే ఏం బాగుంటుంది... పెరుగును జత చేయాలి... అక్కడితో ఆగ కుండా... క్యారట్, కొత్తిమీర, టొమాటో, అరటి దూట, పొట్లకాయ, కొబ్బరి కూడా వేసేద్దాం... కవ్వంతో చల్లగా చిలికేద్దాం... పచ్చడి పచ్చడి చేసేద్దాం... ఉడుకుతూన్న కడుపులో పోసేద్దాం... ఎండలు మండించే సూర్యుడికి వీడ్కోలు పలికేద్దాం... క్యారట్ పెరుగు పచ్చడి కావలసినవి క్యారట్ తురుము - అర కప్పు పెరుగు - 2 కప్పులు పచ్చి మిర్చి - 4 (మిక్సీలో వేసి మెత్తగా చేయాలి) శనగపప్పు - టీ స్పూను మినప్పప్పు - టీ స్పూను ఆవాలు - టీ స్పూను జీలకర్ర - అర టీ స్పూను ఎండు మిర్చి - 6 కరివేపాకు - రెండు రెమ్మలు పసుపు - చిటికెడు ఉప్పు - తగినంత ధనియాల పొడి - అర టీ స్పూను జీలకర్ర పొడి - అర టీ స్పూను నూనె - 2 టేబుల్ స్పూన్లు తయారీ బాణలిలో నూనె వేసి కాగాక క్యారట్ తురుము వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి పక్కన ఉంచాలి. గిన్నెలో పెరుగు, ఉప్పు, పసుపు, కొద్దిగా నీళ్లు వేసి గిలక్కొట్టాలి. బాణలిలో నూనె కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర , ఎండు మిర్చి, కరివేపాకు వరుసగా వేసి వేయించాలి. చిలకరించిన పెరుగులో... వేయించి ఉంచుకున్న క్యారట్ తురుము వేసి కలపాలి. వేయించి ఉంచుకున్న పోపు జత చేయాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి సర్వ్ చేయాలి. ఇది అన్నంలోకి, రోటీలలోకి బాగుంటుంది. కొత్తిమీర పెరుగు పచ్చడి కావలసినవి: కొత్తిమీర - ఒక కట్ట (పెద్దది); పెరుగు - 4 కప్పులు; పచ్చి మిర్చి - 8; ఆవాలు - టీ స్పూను ; జీలకర్ర - టీ స్పూను; శనగపప్పు - టీ స్పూను; ఎండు మిర్చి - 8 (ముక్కలు చేసుకోవాలి); మినప్పప్పు - టీ స్పూను; పసుపు - కొద్దిగా; ఉప్పు - తగినంత; నూనె - 2 టీ స్పూన్లు; ఉల్లి తరుగు - పావు కప్పు తయారీ: మిక్సీలో కొత్తిమీర, పచ్చి మిర్చి, ఉప్పు వేసి మెత్తగా చేయాలి గిన్నెలో పెరుగు, పసుపు, కొద్దిగా నీళ్లు పోసి చిక్కగా గిలక్కొట్టాలి బాణలిలో నూనె వేసి కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వరుసగా వేసి వేయించాలి కొత్తిమీర మిశ్రమం, వేయించి ఉంచుకున్న పోపు... పెరుగులో వేసి కలపాలి ఉల్లి తరుగు జత చేసి బాగా కలిపి వడ్డించాలి. కొబ్బరి పెరుగు పచ్చడి కావలసినవి: కొబ్బరి తురుము - కప్పు; పెరుగు - 3 కప్పులు; శనగపప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - అర టీ స్పూను; ఎండుమిర్చి - 6; పచ్చి మిర్చి - 2; కరివేపాకు - రెండు రెమ్మలు; పసుపు - చిటికెడు; ఉప్పు - తగినంత; నూనె - టీ స్పూను; అల్లం తురుము - పావు టీ స్పూను; కొత్తిమీర - చిన్నకట్ట; కీరా చక్రాలు - 4; అల్లం తురుము - టీ స్పూను తయారీ: మిక్సీలో కొబ్బరి తురుము, అల్లం తురుము, పచ్చి మిర్చి, ఉప్పు వేసి మెత్తగా చేసుకోవాలి గిన్నెలో పెరుగు, పసుపు, కొద్దిగా నీళ్లు వేసి గిలక్కొట్టాలి స్టౌ మీద బాణలిలో నూనె కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వరసగా వేసి వేయించాలి మెత్తగా చేసుకున్న కొబ్బరి తురుము మిశ్రమాన్ని పెరుగులో వేసి కలపాలి వేయించి ఉంచుకున్న పోపును జత చేసి బాగా కలపాలి కొత్తిమీర, కీర చక్రాలతో గార్నిష్ చేసి వడ్డించాలి ఇది దోసెలు, ఇడ్లీలలోకే కాకుండా అన్నంలోకి కూడా రుచిగా ఉంటుంది. పొట్లకాయ పెరుగు పచ్చడి కావలసినవి: పొట్లకాయ ముక్కలు - కప్పు; పెరుగు - 4 కప్పులు; పచ్చి మిర్చి - 8; జీలకర్ర - టీ స్పూను; ఆవాలు - టీ స్పూను; శనగపప్పు - టీ స్పూను; ఎండు మిర్చి - 8 (ముక్కలు చేసుకోవాలి); మినప్పప్పు - టీ స్పూను; పసుపు - కొద్దిగా; ఉప్పు - తగినంత; నూనె - 2 టీ స్పూన్లు; ధనియాల పొడి - టీ స్పూను; ఇంగువ - కొద్దిగా; కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర - చిన్న కట్ట తయారీ: ఒక గిన్నెలో పొట్లకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి ఉడికించి చల్లార్చాలి మరో గిన్నెలో పెరుగు, తగినన్ని నీళ్లు వేసి గిలక్కొట్టాలి బాణలిలో నూనె కాగాక ఇంగువ, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వరుసగా వేసి వేయించాలి ఉడికించుకున్న పొట్లకాయ ముక్కలను వేయించి ఉంచుకున్న పోపుతో సహా పెరుగులో వేసి బాగా కలపాలి దనియాల పొడి జత చేసి, కొత్తిమీరతో గార్నిష్ చేసి వడ్డించాలి. అరటి దూట పెరుగు పచ్చడి కావలసినవి: అరటి దూట - చిన్న ముక్క; పెరుగు - మూడు కప్పులు; పచ్చి మిర్చి - 6; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; శనగపప్పు - టీ స్పూను; ఎండు మిర్చి - 8 (చిన్న ముక్కలుగా చేసుకోవాలి); మినప్పప్పు - టీ స్పూను; పసుపు - కొద్దిగా; ఉప్పు - తగినంత; నూనె - 2 టీ స్పూన్లు; కరివేపాకు - 4 రెమ్మలు తయారీ: ముందుగా అరటి దూటను శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ఒక గిన్నెలో అరటి దూట ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, తగినంత ఉప్పు వేసి ఉడికించాలి బాణలిలో నూనె కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వరుసగా వేసి వేయించాలి ఒక గిన్నెలో పెరుగు, తగినన్ని నీళ్లు వేసి గిలక్కొట్టాలి ఉడికించిన అరటిదూట ముక్కలు పెరుగులో వేసి కలపాలి వేయించి ఉంచుకున్న జత చేసి, బాగా కలిపి వడ్డించాలి. టొమాటో పెరుగు పచ్చడి కావలసినవి: టొమాటోలు - పావు కిలో; పెరుగు - 5 కప్పులు; పచ్చి మిర్చి - 8; జీలకర్ర - టీ స్పూను; ఆవాలు - టీ స్పూను ; శనగపప్పు - టీ స్పూను; ఎండు మిర్చి - 8 (ముక్కలు చేసుకోవాలి); మినప్పప్పు - టీ స్పూను; పసుపు - కొద్దిగా; ఉప్పు - తగినంత; నూనె - 2 టీ స్పూన్లు; కరివేపాకు - 2 రెమ్మలు తయారీ: టొమాటోలను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి బాణలిలో నూనె వేసి కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వరుసగా వేసి వేగాక, టొమాటో ముక్కలు జత చేయాలి పసుపు, ఉప్పు వేసి టొమాటో ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించి చల్లార్చాలి గిన్నెలో పెరుగు, తగినన్ని నీళ్లు పోసి చిక్కగా గిలక్కొట్టాలి ఉడికించి ఉంచుకున్న టొమాటో మిశ్రమం వేసి బాగా కలిపి వడ్డించాలి. ఇమ్లీ పన్నా చలివేంద్రం వేసవి ఎండలకు చల్లచల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తూ ఉంటుంది. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండక, ఈ తియ్యటి, చల్లటి పానీయాన్ని తయారుచేసి సేవించండి. ఇంటిని చలివేంద్రం చేయండి. కావలసినవి: చింతపండు- 100 గ్రా.; బెల్లం - 300 గ్రా.; ఉప్పు - టీస్పూను; రాక్ సాల్ట్ - టీ స్పూను; జీలకర్ర పొడి - టీ స్పూను; ఆవ పొడి - టీ స్పూను; పచ్చిమిర్చి - 4; వెల్లుల్లి రేకలు - 4; అల్లం తురుము - కొద్దిగా; పుదీనా, కొత్తిమీర ఆకులు - కొన్ని. తయారీ: ఒక పాత్రలో చింతపండు, బెల్లం, చిటికెడు ఉప్పు, తగినన్ని నీళ్లు వేసి ఉడికించాలి చల్లారాక రసం తీసి వడ కట్టి పక్కన ఉంచాలి ఈ రసానికి ఉప్పు, రాక్ సాల్ట్, జీలకర్ర పొడి జత చేసి పక్కన ఉంచాలి ఈ మిశ్రమానికి... పచ్చి మిర్చి ముక్కలు, పుదీనా ఆకులు, కొత్తిమీర తరుగు, వెల్లుల్లి రేకలు, అల్లం తురుము జత చేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి చల్లటి నీళ్లు జత చేసి, ఆవ పొడి వేసి కలిపి గ్లాసులలో అందించాలి. సేకరణ: డా. వైజయంతి -
పచ్చడి పడితేనేఫుల్ మీల్స్
అష్టభోగాలలో ఉత్కృష్ట భోగం... భోజనం! ధనం, ధాన్యం, వాహనం, వస్త్రం, స్నానం, సదుపాయం, సయోగం... అన్నీ... భోజనం తర్వాతే. మరి భోజనాలలో... ఉత్కృష్ట భోజనం? ఆకేసి, పప్పేసి, నెయ్యి వేసిందే కదా! అబ్బే... చప్పగా ఉంటుంది. అది కాదు. సాంబారు, రసం, అప్పడం, వడియం? అబ్బే... అదంతా సెకండ్ సెషన్. వేపుడు, పులిహోర, పూర్ణాలు? అబ్బే... ఇవన్నీ నంజుళ్లు, పైపై చప్పరింతలు. పాయసం, వడ, గడ్డపెరుగు..? అబ్బే... పడాల్సింది ఇంకా ఎక్కడ పడిందీ?! పడాలా? ఏం పడాలి? ఎక్కడి నుంచి పడాలి? రోట్లోంచి, రోలు లేకపోతే మిక్సీలోంచి... పచ్చి పచ్చడి వచ్చి పడాలి. అలా పడితేనే అది... ఉత్కృష్ట భోజనం మృష్టాన్న భోజనం... సంపూర్ణ భోజనం. కొబ్బరి -మామిడికాయ పచ్చడి కావలసినవి: కొబ్బరి - ఒక చిప్ప, మామిడికాయ - 1 (చిన్నది) పచ్చిమిర్చి - 5, ఉప్పు - తగినంత పసుపు - చిటికెడు, ఇంగువ - కొద్దిగా నూనె - రెండు టేబుల్ స్పూన్లు ఎండుమిర్చి - 5, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, శనగపప్పు - టీ స్పూను, మినప్పప్పు - టీ స్పూను తయారి కొబ్బరిని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేయాలి. మామిడికాయ తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. మిక్సీలో మామిడికాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. పచ్చడిని ఒక గిన్నెలోకి తీసి, పోపు, ఇంగువ జతచేసి అన్నంలోకి వడ్డించాలి. కీరా రైతా కావలసినవి కీరా - పావు కిలో పచ్చిమిర్చి - 6, పెరుగు - అరకిలో ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు ధనియాలపొడి - అర టీ స్పూను తయారి కీరాలను శుభ్రంగా కడిగి, చిన్నచిన్న ముక్కలుగా తరగాలి పచ్చిమిర్చిని సన్నగా కట్ చేయాలి ఒక గిన్నెలో పెరుగు వేసి చిక్కగా చిలకాలి కీరా ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, పసుపు, కొత్తిమీర తరుగు, ధనియాలపొడి వేసి బాగా కలపాలి సుమారు రెండుగంటలు ఊరనివ్వాలి రోటీలలోకి, అన్నంలోకి రుచిగా ఉంటుంది. శరీరానికి చలవ చేస్తుంది. పచ్చిపులుసు కావలసినవి: ఉల్లిపాయ - 1, పచ్చిమిర్చి - 2, నూనె - తగినంత, ఎండుమిర్చి - 2, చింతపండు - కొద్దిగా, ఉప్పు - తగినంత, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, బెల్లం తురుము - టీ స్పూను, కరివేపాకు - ఒక రెమ్మ తయారి ఉల్లిపాయను చిన్నముక్కలుగా తరగాలి. పచ్చిమిర్చిని పొడవుగా మధ్యకు కట్ చేయాలి. బాణలిలో కొద్దిగా నూనె వేసి, కాగాక ఎండుమిర్చి వేసి వేయించి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. చింతపండును పది నిముషాలు నీటిలో నానబెట్టి, మూడు కప్పుల గుజ్జు వచ్చేలా తీయాలి. ఉప్పు, ఉల్లితరుగు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి పొడి వేసి కలపాలి. చిన్న బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించి పచ్చిపులుసులో కలపాలి. బెల్లం తురుము, కరివేపాకు జతచేసి, బాగా కలిపి సర్వ్ చేయాలి. దోసకాయ పచ్చడి కావలసినవి దోసకాయ - మీడియం సైజుది ఒకటి పచ్చిమిర్చి - 6 చింతపండు - కొద్దిగా ఉప్పు - తగినంత పసుపు - చిటికెడు ఇంగువ - చిటికెడు నూనె - రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర - చిన్న కట్ట తయారి దోసకాయ చెక్కు తీసి, గింజలు వేరు చేసి, చిన్నచిన్న ముక్కలుగా తరగాలి. మిక్సీలో పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, కొన్ని దోసకాయముక్కలు వేసి కచ్చాపచ్చాగా చేయాలి. ఒక గిన్నెలో దోసకాయ ముక్కలు, మెత్తగా చేసిన దోసకాయల మిశ్రమం, పసుపు, ఇంగువ, నూనె వేసి బాగా కలిపి, అరగంట సేపు ఊరనివ్వాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసి, వేడివేడి అన్నంలోకి సర్వ్ చేయాలి. పెసర పచ్చడి కావలసినవి: పెసరపప్పు - కప్పు, పచ్చిమిర్చి - 4 చింతపండు - కొద్దిగా జీలకర్ర - అర టీ స్పూను ఉప్పు - తగినంత నూనె - టీ స్పూను ఇంగువ - చిటికెడు కొత్తిమీర - కొద్దిగా తయారి: పెసరపప్పును రెండు గంటలు నానబెట్టి నీరు వడగొట్టాలి మిక్సీలో పెసరపప్పు, పచ్చిమిర్చి, చింతపండు, జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా చేయాలి చివరగా ఇంగువ, నూనె వేసి కలిపి, వేడివేడి అన్నంలో వడ్డించాలి. కొత్తిమీర పచ్చడి కావలసినవి కొత్తిమీర - రెండుకప్పులు పచ్చిమిర్చి - 6 చింతపండు - నిమ్మకాయంత ఉప్పు - తగినంత పసుపు - చిటికెడు ఇంగువ - చిటికెడు నూనె - రెండు టేబుల్ స్పూన్లు తయారి: కొత్తిమీరను శుభ్రంగా కడగాలి మిక్సీలో కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంగువ, చింతపండు, పసుపు, ఉప్పు వేసి మెత్తగా చేయాలి. (అవసరమనుకుంటే నీరు జత చేయాలి) పచ్చడిని గిన్నెలోకి తీసుకుని కొద్దిగా నూనె వేసి కలపాలి. సేకరణ: డా. వైజయంతి