భోపాల్: దుకాణంలో విక్రయించే సమోస, కచొరికి భార్య చేసిన చట్నీని రుచి చూసిన భర్త రుచిగా రాలేదని చెప్పాడు. మళ్లీ చేసుకురా అని చెప్పడంతో భార్యాభర్తల మధ్య గొడవ ప్రారంభమైంది. ఈ క్రమంలో మాటామాట పెరిగి ఆమెపై తీవ్రంగా దాడి చేసి భర్త పరారయ్యాడు. కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడిన ఆమె చివరకు ప్రాణం కోల్పోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ధాటియా జిల్లా ఉపరాయంగావ్‌లో చోటుచేసుకుంది.
స్థానికంగా సమోస కచోరి దుకాణాన్ని ఆనంద్ గుప్తా నిర్వహిస్తున్నాడు. ఆయన భార్య ప్రీతి. అయితే సమోస.. కచోరి కోసం చట్నీ తయారు చేయమని ఆనంద్ ఆదివారం ఇంట్లో ఉన్న భార్యకు చెప్పాడు. కొద్దిసేపటి అనంతరం భార్య చట్నీ తయారుచేసి భర్తకు రుచి చూపించింది. అయితే రుచి లేకపోవడంతో భర్త ఆమెకు మళ్లీ చేయమని చెప్పాడు. ఈ సమయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది. క్షణికావేశానికి లోనైన భర్త భార్యపై దాడి చేశాడు. కోడలిని కొడుతుండడంతో భర్త తల్లి వచ్చి వారించింది. ఆమెను పక్కకు నెట్టి కర్రతో తలపై గట్టిగా బాదాడు.
తీవ్ర గాయాలపాలైన భార్య ప్రీతిని వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందింది. దాడి చేసిన అనంతరం భర్త ఆనంద్ గుప్తా పరారయ్యాడు. సమాచారం అందుకున్న గోరాఘాట్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు అనంతరం నిందితుడు ఆనంద్ కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment