
ష్యోపూర్(ఎంపీ): పెళ్లి సంబరాల్లో మునిగితేలుతున్న ఓ పెళ్లికొడుకు హఠాన్మరణం అక్కడి వారందరినీ హుతాశులను చేసింది. మధ్యప్రదేశ్‌లోని ష్యోపూర్ జిల్లాలో పెళ్లివేడుకలో ఈ విషాదం చోటుచేసుకుంది. పెళ్లి సందర్భంగా గుర్రంపై ఊరేగుతూ శుక్రవారం రాత్రి వరుడు విగతజీవిగా మారిన వైనం శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూన్స్‌వాడా గ్రామానికి చెందిన 26 ఏళ్ల ప్రదీప్ జాట్ పెళ్లివేడుక శుక్రవారం కన్నుల పండువగా జరిగింది.
ఈ సందర్భంగా అక్కడి వేదికవైపు ప్రదీప్ పెళ్లికొడుకు దుస్తుల్లో గుర్రంపై బయల్దేరారు. ఇదే సమయంలో హఠాత్తుగా ముందుకు ఒరిగి అలాగే గుర్రంపై కూలబడిపోయారు. ఇది గమనించిన బంధువులు వెంటనే ప్రదీప్‌ను జాగ్రత్తగా కిందకు దింపి హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతని ప్రాణం పోయిందని జిల్లా ఆస్పత్రి సివిల్ సర్జన్ డాక్టర్ ఆర్‌బీ గోయల్ ధృవీకరించారు. గుండెపోటు కారణంగా పెళ్లికొడుకు ప్రాణాలు కోల్పోయి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు. పెళ్లికొడుకు ప్రదీప్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్‌ఎస్‌యూఐ)కి ష్యోపూర్ జిల్లా అధ్యక్షునిగా గతంలో పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment