ఇడ్లీని చట్నీతో నంచుకుని తినడం దక్షిణ భారతేదశంలో సంప్రదాయంగా వస్తోంది. వీటిని తయారుచేసి అలంకరించడంలో వైవిధ్యాలు ఉన్నాయి. మా అత్తగారు తయారుచేసే మదరాసీ గన్‌పౌడర్ గురించి వివరించాలనుకుంటున్నాను. ఇందుకోసం రవ్వ ఇడ్లీ మిశ్రమం (20 ఇడ్లీలకు సరిపడా) సిద్ధం చేసుకోవడానికి కావలసినవి...
బొంబాయి రవ్వ 100 గ్రా., పెరుగు 5 టేబుల్ స్పూన్లు, అర టీ స్పూను బేకింగ్ పౌడర్, రుచికి తగినంత ఉప్పు, 30 మి.లీ. నీళ్లు, ఒక టేబుల్ స్పూన్ వేయించిన జీడిపప్పు పలుకులు, ఇడ్లీ పిండిలో పోపు వేయడానికి ఒక టేబుల్ స్పూన్ బటర్ కావాలి. ఒక టీ స్పూన్ నూనెలో మినప్పప్పు, పచ్చి సెనగపప్పు, ఒక టీ స్పూను ఆవాలు, అర టీ æస్పూన్ కరివేపాకు వేసి వేయించాలి. గన్ పౌడర్ కోసం... ఒక టీ స్పూన్ నూనె, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ సెనగ పప్పు, అర టేబుల్ స్పూన్ మినప్పప్పు, కడిగిన బియ్యం ఒక టేబుల్ స్పూన్, అర టీ స్పూన్ ఎండు మిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, ఒక వెల్లుల్లి రెబ్బ, ఒక టేబుల్ స్పూను వేయించిన నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ పంచదార పొడి, తగినంత ఉప్పు ఉంచుకోవాలి.
కొబ్బరి జీడిపప్పు చట్నీ కోసం...
ఒక టీ స్పూన్ నూనె, పావు టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మినప్పప్పు, ఒక రెమ్మ కరివేపాకు, 50 మి.లీ. కొబ్బరి పాలు, ఒక టీ స్పూన్ వేయించిన జీడిపప్పులు సిద్ధం చేసుకోవాలి.
సర్వ్ చేయడానికి...
ఒక టీ స్పూన్ సాల్టె్టడ్ బటర్, అర టీ స్పూన్ అల్లం తురుము, అర టీ స్పూన్ వెల్లుల్లి తరుగు, అర టీ స్పూన్ పచ్చి మిర్చి తరుగు, ఒక టీ స్పూన్ వేయించిన జీడి పప్పు, ఒక టీ స్పూన్ వేయించి కొబ్బరి ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు, అర టీ స్పూన్ ఉల్లి కాడల తరుగు తీసుకోవాలి.
పోపు తయారు చేసుకోవడం...
స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడేవరకు వేయించాలి. పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు వేసి వేయించి దింపేయాలి.
ఇడ్లీ పిండి తయారు చేసుకోవడం...
ఒక పాత్రలో బొంబాయి రవ్వ, పెరుగు, బేకింగ్ పౌడర్, ఉప్పు, జీడిపప్పు పలుకులు, నీళ్లు వేసి బాగా కలిపాక, వేయించి ఉంచుకున్న పోపును ఈ పిండిలో వేసి కలిపి సుమారు అరగంట సేపు పక్కన ఉంచాలి.
ఇడ్లీలు తయారు చేయడం....
ఇడ్లీ స్టాండును శుభ్రంగా కడిగి, ఇడ్లీ రేకులకు బటర్ పూయాలి. సిద్ధంగా ఉంచుకున్న ఇడ్లీ పిండి మిశ్రమాన్ని ఈ రేకులలో వేసి ఇడ్లీ స్టాండును స్టౌమీద ఉంచి ఉడికించి దింపేయాలి.
గన్ పౌడర్ ఇలా తయారుచేసుకోవాలి...
స్టౌమీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, పచ్చి సెనగపప్పు, బియ్యం, మినప్పప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించాలి. నువ్వులు జత చేసి, పదార్థాలన్నీ బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి, దింపేసి చల్లారాక మిక్సీలో వేసి పొడి చేయాలి (మరీ మెత్తగా ఉండకూడదు). పంచదార, ఉప్పు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి.
జీడిపప్పు, కొబ్బరి పచ్చడి తయారుచేద్దాం...
స్టౌమీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేసి వేయించాలి. కొబ్బరి పాలు, వేయించిన జీడిపప్పు పలుకులు జత చేసి, కొద్దిసేపు సన్నని మంట మీద ఉంచి, దింపేసి చల్లారనివ్వాలి. బాగా చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. పాన్‌లో బటర్ వేసి స్టౌమీద ఉంచి కరిగించాక, అల్లం తురుము, వెల్లుల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు వేసి వేయించాలి. తయారుచేసి ఉంచుకున్న ఇడ్లీలను జత చేయాలి. వీటి మీద గన్ పౌడర్ వేయాలి. ఇడ్లీలకు గన్ పౌడర్ బాగా పట్టేలా జాగ్రత్తగా కలపాలి. వేయించి ఉంచుకున్న జీడిపప్పులు, వేయించిన కొబ్బరి ముక్కలు, కొత్తిమీర తరుగు, ఉల్లికాడల తరుగు జత చేసి, స్టౌమీద నుంచి దింపేయాలి. సర్వింగ్ ప్లేట్లలో ఇడ్లీలను అందంగా అలంకరించి, జీడిపప్పు, కొబ్బరి చట్నీతో అందించాలి.
క్యాలీఫ్లవర్ గ్రీన్ పీస్ అండ్ కినోవా పులావ్
కావలసినవి:
ఉడికించిన కినోవా బియ్యం – 300 గ్రా. (సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. వీటి ఖరీదు కొద్దిగా ఎక్కువే ఉంటుంది. ఈ బియ్యం బదులు బాస్మతి బియ్యం కూడా వాడుకోవచ్చు); అల్లం తురుము – 2 టీ స్పూన్లు; ఉల్లి తరుగు – ఒక టేబుల్ స్పూన్; క్యాలీ ఫ్లవర్ తరుగు – 3 టేబుల్ స్పూన్లు; తాజా పచ్చి బఠాణీ – 3 టేబుల్ స్పూన్లు; పసుపు – అర టీ స్పూన్; మిరప కారం – అర టీ స్పూన్; ఉప్పు – కొద్దిగా; గరం మసాలా పొడి – అర టీ స్పూన్; జీలకర్ర – ఒక టీ స్పూన్; పుదీనా తరుగు – 2 టీ స్పూన్లు; ఆలివ్ ఆయిల్ – ఒక టేబుల్ స్పూన్
తయారీ
స్టౌమీద బాణలి ఉంచి వేడయ్యాక ఆలివ్ ఆయిల్ వేయాలి. నూనె కాగాక జీలకర్ర వేసి చిటపటలాడేవరకు వేయించాలి. అల్లం తురుము, ఉల్లి తరుగు వేసి వేయించాలి. క్యాలీఫ్లవర్ తరుగు, పచ్చి బఠాణీ జత చేసి మరోమారు వేయించాలి. పసుపు, మిరప కారం, గరం మసాలా పొడి వేసి బాగా కలిపి, మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు జత చేసి ఉడికించాలి. కొద్దిగా మెత్తబడ్డాక, ఉడికించిన కినోవా వేసి బాగా కలిపి, ఉప్పు జత చేయాలి. పుదీనా ఆకులతో అలంకరించి వేడివేడిగా అందించాలి.
Comments
Please login to add a commentAdd a comment