మంటను చల్లార్చుదాం... | today special pickle masti | Sakshi
Sakshi News home page

మంటను చల్లార్చుదాం...

Published Fri, May 9 2014 10:07 PM | Last Updated on Sat, Sep 2 2017 7:08 AM

today special pickle masti

ఓ పక్కన మండే ఎండలు...
 మరో పక్కన తీరని దాహం...
 ఒంటి మీద చెమట వాన...
 కుతకుత ఉడుకుతూండే కడుపు...
 ఆ ఉడుకు మీద కొద్దిగా నీళ్లు చల్లాలి...
 ఉత్తిగా నీళ్లయితే ఏం బాగుంటుంది...
 పెరుగును జత చేయాలి...
 అక్కడితో ఆగ కుండా...
 క్యారట్, కొత్తిమీర, టొమాటో, అరటి దూట, పొట్లకాయ, కొబ్బరి కూడా వేసేద్దాం...
 కవ్వంతో చల్లగా చిలికేద్దాం...
 పచ్చడి పచ్చడి చేసేద్దాం...
 ఉడుకుతూన్న కడుపులో పోసేద్దాం...
 ఎండలు మండించే సూర్యుడికి వీడ్కోలు పలికేద్దాం...

 
 క్యారట్ పెరుగు పచ్చడి
 
 కావలసినవి
 క్యారట్ తురుము - అర కప్పు
 పెరుగు - 2 కప్పులు
 పచ్చి మిర్చి - 4 (మిక్సీలో వేసి మెత్తగా చేయాలి)
 శనగపప్పు - టీ స్పూను
 మినప్పప్పు - టీ స్పూను
 ఆవాలు - టీ స్పూను
 జీలకర్ర - అర టీ స్పూను
 ఎండు మిర్చి - 6
 కరివేపాకు - రెండు రెమ్మలు
 పసుపు - చిటికెడు
 ఉప్పు - తగినంత
 ధనియాల పొడి - అర టీ స్పూను
 జీలకర్ర పొడి - అర టీ స్పూను
 నూనె - 2 టేబుల్ స్పూన్లు
 
 తయారీ
 బాణలిలో నూనె వేసి కాగాక క్యారట్ తురుము వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి పక్కన ఉంచాలి.
 
 గిన్నెలో పెరుగు, ఉప్పు, పసుపు, కొద్దిగా నీళ్లు వేసి గిలక్కొట్టాలి.
 
 బాణలిలో నూనె కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర , ఎండు మిర్చి, కరివేపాకు వరుసగా వేసి వేయించాలి.
 
  చిలకరించిన పెరుగులో... వేయించి ఉంచుకున్న క్యారట్ తురుము వేసి కలపాలి.
 
 వేయించి ఉంచుకున్న పోపు జత చేయాలి.
 
 ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి సర్వ్ చేయాలి.
 
 ఇది అన్నంలోకి, రోటీలలోకి బాగుంటుంది.
 
 కొత్తిమీర పెరుగు పచ్చడి

 కావలసినవి:
 కొత్తిమీర - ఒక కట్ట (పెద్దది); పెరుగు - 4 కప్పులు; పచ్చి మిర్చి - 8; ఆవాలు - టీ స్పూను ; జీలకర్ర - టీ స్పూను; శనగపప్పు - టీ స్పూను; ఎండు మిర్చి - 8 (ముక్కలు చేసుకోవాలి); మినప్పప్పు - టీ స్పూను; పసుపు - కొద్దిగా; ఉప్పు - తగినంత; నూనె - 2 టీ స్పూన్లు; ఉల్లి తరుగు - పావు కప్పు
 
 తయారీ:
 మిక్సీలో కొత్తిమీర, పచ్చి మిర్చి, ఉప్పు వేసి మెత్తగా చేయాలి  
 
 గిన్నెలో పెరుగు, పసుపు, కొద్దిగా నీళ్లు పోసి చిక్కగా గిలక్కొట్టాలి  
 
 బాణలిలో నూనె వేసి కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వరుసగా వేసి వేయించాలి
 
 కొత్తిమీర మిశ్రమం, వేయించి ఉంచుకున్న పోపు... పెరుగులో వేసి కలపాలి  
 
 ఉల్లి తరుగు జత చేసి బాగా కలిపి వడ్డించాలి.
 
 కొబ్బరి పెరుగు పచ్చడి
 
 కావలసినవి:
కొబ్బరి తురుము - కప్పు; పెరుగు - 3 కప్పులు; శనగపప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - అర టీ స్పూను; ఎండుమిర్చి - 6; పచ్చి మిర్చి - 2; కరివేపాకు - రెండు రెమ్మలు; పసుపు - చిటికెడు; ఉప్పు - తగినంత; నూనె - టీ స్పూను; అల్లం తురుము - పావు టీ స్పూను; కొత్తిమీర - చిన్నకట్ట; కీరా చక్రాలు - 4; అల్లం తురుము - టీ స్పూను
 
 తయారీ:
 మిక్సీలో కొబ్బరి తురుము, అల్లం తురుము, పచ్చి మిర్చి, ఉప్పు వేసి మెత్తగా చేసుకోవాలి  
 
 గిన్నెలో పెరుగు, పసుపు, కొద్దిగా నీళ్లు వేసి గిలక్కొట్టాలి
 
 స్టౌ మీద బాణలిలో నూనె కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వరసగా వేసి వేయించాలి  
 
 మెత్తగా చేసుకున్న కొబ్బరి తురుము మిశ్రమాన్ని పెరుగులో వేసి కలపాలి  
 
 వేయించి ఉంచుకున్న పోపును జత చేసి బాగా కలపాలి  
 
 కొత్తిమీర, కీర చక్రాలతో గార్నిష్ చేసి వడ్డించాలి  
 
 ఇది దోసెలు, ఇడ్లీలలోకే కాకుండా అన్నంలోకి కూడా రుచిగా ఉంటుంది.
 
 పొట్లకాయ పెరుగు పచ్చడి
 
 కావలసినవి:
 పొట్లకాయ ముక్కలు - కప్పు; పెరుగు - 4 కప్పులు; పచ్చి మిర్చి - 8; జీలకర్ర - టీ స్పూను; ఆవాలు - టీ స్పూను; శనగపప్పు - టీ స్పూను; ఎండు మిర్చి - 8 (ముక్కలు చేసుకోవాలి); మినప్పప్పు - టీ స్పూను; పసుపు - కొద్దిగా; ఉప్పు - తగినంత; నూనె - 2 టీ స్పూన్లు; ధనియాల పొడి - టీ స్పూను; ఇంగువ - కొద్దిగా; కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర - చిన్న కట్ట
 
 తయారీ:
 ఒక గిన్నెలో పొట్లకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి ఉడికించి చల్లార్చాలి  
 
 మరో గిన్నెలో పెరుగు, తగినన్ని నీళ్లు వేసి గిలక్కొట్టాలి  
 
 బాణలిలో నూనె కాగాక ఇంగువ, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వరుసగా వేసి వేయించాలి
 
 ఉడికించుకున్న పొట్లకాయ ముక్కలను వేయించి ఉంచుకున్న పోపుతో సహా పెరుగులో వేసి బాగా కలపాలి  
 
 దనియాల పొడి జత చేసి, కొత్తిమీరతో గార్నిష్ చేసి వడ్డించాలి.
 
 అరటి దూట పెరుగు పచ్చడి
 
 కావలసినవి:
 అరటి దూట - చిన్న ముక్క; పెరుగు - మూడు కప్పులు; పచ్చి మిర్చి - 6; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; శనగపప్పు - టీ స్పూను; ఎండు మిర్చి - 8 (చిన్న ముక్కలుగా చేసుకోవాలి); మినప్పప్పు - టీ స్పూను; పసుపు - కొద్దిగా; ఉప్పు - తగినంత; నూనె - 2 టీ స్పూన్లు; కరివేపాకు - 4 రెమ్మలు
 
 తయారీ:
 ముందుగా అరటి దూటను శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి  
 
 ఒక గిన్నెలో అరటి దూట ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, తగినంత ఉప్పు వేసి ఉడికించాలి
 
 బాణలిలో నూనె కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వరుసగా వేసి వేయించాలి  
 
 ఒక గిన్నెలో పెరుగు, తగినన్ని నీళ్లు వేసి గిలక్కొట్టాలి ఉడికించిన అరటిదూట ముక్కలు పెరుగులో వేసి కలపాలి
 
 వేయించి ఉంచుకున్న జత చేసి, బాగా కలిపి వడ్డించాలి.
 
 టొమాటో పెరుగు పచ్చడి
 
 కావలసినవి:
 టొమాటోలు - పావు కిలో; పెరుగు - 5 కప్పులు; పచ్చి మిర్చి - 8; జీలకర్ర - టీ స్పూను; ఆవాలు - టీ స్పూను ; శనగపప్పు - టీ స్పూను; ఎండు మిర్చి - 8 (ముక్కలు చేసుకోవాలి); మినప్పప్పు - టీ స్పూను; పసుపు - కొద్దిగా; ఉప్పు - తగినంత; నూనె - 2 టీ స్పూన్లు; కరివేపాకు - 2 రెమ్మలు
 
 తయారీ:
 టొమాటోలను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి  
 
 బాణలిలో నూనె వేసి కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వరుసగా వేసి వేగాక, టొమాటో ముక్కలు జత చేయాలి
 
 పసుపు, ఉప్పు వేసి టొమాటో ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించి చల్లార్చాలి  గిన్నెలో పెరుగు, తగినన్ని నీళ్లు పోసి చిక్కగా గిలక్కొట్టాలి
 
ఉడికించి ఉంచుకున్న టొమాటో మిశ్రమం వేసి బాగా కలిపి వడ్డించాలి.
 
 ఇమ్లీ పన్నా
 చలివేంద్రం
 
 వేసవి ఎండలకు చల్లచల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తూ ఉంటుంది. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండక, ఈ తియ్యటి, చల్లటి పానీయాన్ని తయారుచేసి సేవించండి. ఇంటిని చలివేంద్రం చేయండి.
 
 కావలసినవి:
 చింతపండు- 100 గ్రా.; బెల్లం - 300 గ్రా.; ఉప్పు - టీస్పూను; రాక్ సాల్ట్ - టీ స్పూను; జీలకర్ర పొడి - టీ స్పూను; ఆవ పొడి - టీ స్పూను; పచ్చిమిర్చి - 4; వెల్లుల్లి రేకలు - 4; అల్లం తురుము - కొద్దిగా; పుదీనా, కొత్తిమీర ఆకులు - కొన్ని.
 
 తయారీ:
 ఒక పాత్రలో చింతపండు, బెల్లం, చిటికెడు ఉప్పు, తగినన్ని నీళ్లు వేసి ఉడికించాలి  చల్లారాక రసం తీసి వడ కట్టి పక్కన ఉంచాలి  
 
 ఈ రసానికి ఉప్పు, రాక్ సాల్ట్, జీలకర్ర పొడి జత చేసి పక్కన ఉంచాలి  
 
 ఈ మిశ్రమానికి... పచ్చి మిర్చి ముక్కలు, పుదీనా ఆకులు, కొత్తిమీర తరుగు, వెల్లుల్లి రేకలు, అల్లం తురుము జత చేసి మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి  
 
 చల్లటి నీళ్లు జత చేసి, ఆవ పొడి వేసి కలిపి గ్లాసులలో అందించాలి.
 
 సేకరణ: డా. వైజయంతి
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement