ఉగాది పచ్చడి ప్రాశస్త్యం
తెలుగు నెలలలో మొదటిదైన చైత్రమాసం ఆరంభమే ‘ఉగాది’. దీనితోనే ‘వసంతరుతువు’ మొదలవుతుంది. ఆయుర్వేద సూత్రాలరీత్యా ఇది ‘శ్లేష్మ’ ప్రకోపకాలం. కాబట్టి కఫాన్ని నియంత్రణలో పెట్టడానికి చేదు, కారం, వగరు ఉండే ఆహారం మంచిది. పాయసాల వంటి స్నిగ్ధ పదార్థాలు నిషేధం. వేడి కలిగించే పదార్థాలు మంచివి. దీనికి మద్దతుగా మనకు ప్రకృతి ప్రసాదించిన ద్రవ్యాలు ‘వేపపువ్వు (తిక్తరసం - చేదు), మామిడి పిందెలు (కషాయరసం - వగరు)’ తెలుగు కొత్త ఏడాది ప్రారంభానికి చిహ్నంగా ‘కొత్తబెల్లం, కొత్త చింతపండు, మిరియాలు’ కలిపి రుచి చూస్తారు.
ఉగాది పచ్చడి :-
చిక్కటి చింతపండురసంలో బెల్లం, వేపపువ్వు, మామిడి పిందెల్ని దంచి కలిపి పచ్చడిలా చేస్తారు. కొన్ని ప్రాంతాలలో కొంచెం మిరియాలపొడి, సైంధవలవణం కలిపే ఆచారమూ ఉంది. స్థూలంగా చూస్తే ఇది షడ్రసాల సమ్మేళనం. పండగలో భాగంగా ఈ పచ్చడిని అందరూ పరగడుపున సేవిస్తారు. ఈ ద్రవ్యాల విశిష్ట గుణాల వల్ల జీర్ణప్రక్రియ చురుగ్గా మారుతుంది.
వివిధ రసాల గుణాలు
మధురరసం: జన్మతః ఎల్లరకూ హితకరం. ధాతుపుష్టిని కల్గిస్తుంది. శరీరకాంతి పెరుగుతుంది. కేశాలు బాగా పెరుగుతాయి. ఓజస్సును పెంచుతుంది. బాలురకు, వృద్ధులకు, గాయపడిన వారికి కూడా హితకరం.
‘‘ఆ జన్మసాత్మ్యాత్ కురుతే ధాతూనాం ప్రబలం బలం
బాలవృద్ధ క్షతక్షీణ, వర్ణకేశ ఇంద్రియ ఓజసాం॥
అమ్లరసం: అగ్నిదీప్తిని, జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది. స్నిగ్ధమై (జావలా/ జిగురులాగా చేసిన పదార్థంలా) హృద్యంగా ఉంటుంది. నాలుకకు రుచిని పెంచుతుంది.
‘‘అమ్లో అగ్నిదీప్తికృత్ స్నిగ్ధో హృద్యయః పాచన రోచనః’’
లవణరసం: అగ్నిని ప్రేరేపించి, అజీర్ణాన్ని పొగొడుతుంది.
‘‘లవణః స్తంభసంఘాత బంధ విధ్మాపనో అగ్నికృత్.......’’
కటురసం: గొంతుకను శుద్ధి చేస్తుంది. దద్దుర్లు మొదలైన చర్మవ్యాధుల్ని తగ్గిస్తుంది. ఉదరశుద్ధి చేసి, వాపులను పోగొడుతుంది.
‘‘కటుః గలామయ, ఉదర్ద, కుష్ఠ, అలసక శోఫజిత్’’
తిక్తరసం: చేదు నాలుకకు ఇబ్బందికరమైనా... దీనిలో కొన్ని మంచి గుణాలున్నాయి. ఈ రసం ఆకలిని జనింపజేస్తుంది. క్రిమినాశకం, విషహరం, చర్మరోగాలు, జ్వరం, మూర్ఛ, ఛాతీ పట్టినట్లుండటం వంటి వికారాలను తగ్గిస్తుంది. మంటను, దప్పికనూ తగ్గిస్తుంది.
‘‘తిక్తః స్వయం అరోచిష్టురరుచిం, కృమి తృట్ విషం
కుష్ట మూర్ఛా జ్వర ఉత్క్లేశదాహ పిత్త కఫాన్ జయేత్॥
కషాయరసం: ఇది కష్టంగా జీర్ణమౌతుంది. పిత్త, కఫ వ్యాధులను శాంతింపజేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
‘‘కషాయః పిత్తకఫహా, గురుః అస్రవిశోధనః’’
గమనిక: ఈ రుచులన్నింటిని అవసరాన్ని బట్టి తగు మోతాదుల్లో సేవించాలి. మితిమీరితే మేలు చేసే ఈ రసాలే వ్యాధుల్ని కలగజేస్తాయి. ముఖ్యంగా లవణరసాన్ని చాలా తక్కువగా వాడాలి. అంటే ప్రకృతిలో దొరికే కాయగూరలలోని లవణ రసం సరిపోతుంది. కాబట్టి, రుచికోసమని, మళ్లీ ఉప్పును అధికంగా వేసుకోవడం మంచిదికాదు.