Ugadi chutney
-
సకల శుభారంభం
చైత్రశుద్ధ పాడ్యమి అంటే ఉగాది పర్వదినం. ఆబాలగోపాలం ఆనందంగా చేసుకునే పండుగ ఉగాది. కాలగమన సౌ«ధానికి తొలి వాకిలి. పౌర్ణమిరోజున చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ మాసానికి అదే పేరు ఉంటుంది. చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలిసి ఉండటం వలన ఈ మాసావికి చైత్రమాసం అని పేరు. అన్ని ఋతువులకన్నా విశేషమైన ఋతువు వసంత ఋతువు. కోకిల పాటలు, సన్నజాజి, మల్లెల పరిమళాలు, చిగురించిన ఆకులతో పచ్చని చెట్లతో ప్రకృతిమాత కొత్త అందాలు సంతరించుకుంటుంది. మనిషిని, మనస్సును, బుద్ధిని వికసింపజేసే అహ్లాదభరిత వాతావరణంలో ఉగాది నాడు మనం నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాం. అంటే నిన్నటి వరకు ఉన్న ప్లవనామ సంవత్సరం నుంచి నేటితో శుభకృతు నామ సంవత్సర ఉగాదిలోకి అడుగు పెడుతున్నాం. ఈ సందర్భంగా ఉగాది విశిష్టతతోపాటు ఈ రోజున ఏమేం చేయాలో తెలుసుకుందాం... చైత్ర శుద్ధ పాడ్యమినే కొత్త సంవత్సరంగా అంగీకరించడానికి , వేడుక చేసుకోడానికి కారణం ఋతువులు. నెలల కంటే ఋతువులు ప్రధానమైనవి. చైత్రమాసానికి శిశిర ఋతువు పోయి వసంత ఋతువు... అంటే ఆకులు రాలే కాలం అయిపోయి చెట్లు చిగుర్చి పూత పూస్తాయి. మల్లెలు గుబాళిస్తాయి. పక్షుల ఈకలు ఊడి కొత్తవి వస్తాయి. మనకు కూడా అప్పటిదాకా చర్మం పొడివారడం, పగుళ్ళు, పొట్టు ఊడటం లాంటి సమస్యలు పోయి కొత్త చర్మం వస్తుంది. ఈ నెలతో చెట్లు చిగురించడం మొదలై పూత, పిందెలు, పండ్లు – ఇలా అంతా ఫలవంతంగా సాగుతుంది. శరీరంలో పైకి కనిపించే మార్పులే కాదు.. మానసికంగా కూడా చైత్రమాసం ఉల్లాసాన్ని, ఉత్సాహాన్నీ ఇస్తుంది. చలికాలంలో, వర్షాకాలంలో ఉండే మందకొడితనం వసంతఋతువు నుంచి ఉండదు. ఒకవిధమైన చురుకుదనం ప్రవేశిస్తుంది. ఈ కారణంగానే చైత్రమాసంలో ఉగాదిని జరుపుకుంటాం. ఎలా జరుపుకోవాలి? ఉగాది పండుగ జరుపుకునే విధానాన్ని అత్యంత ప్రామాణిక గ్రంథమైన ‘ధర్మసింధు’’పంచవిధుల సమన్వితం’గా సూచిస్తోంది. అవి 1. తైలాభ్యంగనం, 2. నూతన సంవత్సరాది స్తోత్రం, నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం), 4. ధ్వజారోహణం (పూర్ణకుంభదానం), ç5. పంచాంగ శ్రవణం... తైలాభ్యంగనం తైలాభ్యంగనం అంటే తల మొదలుకొని ఒళ్లంతా నువ్వుల నూనె పట్టించి నలుగుపెట్టి తలస్నానం చేయడం ప్రధమ విధి. ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను నివసిస్తారని, అందుకే నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసిన వారికి లక్ష్మి, గంగాదేవి అనుగ్రహం లభిస్తుందని ప్రతీతి. నూతన సంవత్సర స్తోత్రం అభ్యంగ స్నానానంతరం దీపధూపాది పూజాదికాలు చేసిన తర్వాత మామిడి ఆకులతో, పూలతోరణాలతో అలంకరించిన పూజామందిరంలో నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను, ఇష్టదేవతారాధనతో బాటు పూజించి ఉగాది ప్రసాదాన్ని (ఉగాది పచ్చడి) నివేదించాలి. ఉగాడి పచ్చడి సేవనం ఉగాది నాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేపనం అత్యంత ప్రధానమైనది. వేపపూత, కొత్త చింతపండు, బెల్లం లేక పంచదార లేక చెరకు ముక్కలు, నేయి, ఉప్పు, మిరియాలు, షడ్రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడిని ఇంట్లో అందరూ సేవించాలి. ఉగాది నాడు ఉగాడి పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా షడ్రుచుల సమ్మేళనంతో ఉంటుందని చెబుతారు. పురాణ కాలం నుంచి... చారిత్రకాల వరకు... ► అనేక పురాణ కథల్లో ఉగాది ప్రస్తావన కనిపిస్తుంది. విష్ణుమూర్తి మత్సా్యవతారం ఎత్తింది చైత్ర శుద్ధ పాడ్యమి నాడే. ► బ్రహ్మ దేవుడు సృష్టిని ప్రారంభించింది ఉగాదినాడే. ► ఈ కారణంగానే ఉగాది నాడు కొత్త లెక్కలు ప్రారంభించే ఆచారం వచ్చింది. ► వనవాసానంతరం సీతారాములు అయోధ్యకు తిరిగి వచ్చింది ఈనాడే. ► వసు చక్రవర్తి తపస్సు చేసి ఈనాడే రాజ్యాధికారం సాధించాడు. అందుకే ఉగాదికి అంత ప్రాశస్త్యం. ► చరిత్రలో అత్యంత పరాక్రమశాలి విక్రమార్కుడు. ఆ తేజోవంతుడైన విక్రమార్క చక్రవర్తి పట్టాభిషిక్తుడయ్యింది చైత్ర శుద్ధ పాడ్యమినాడే. అదేవిధంగా మరో శకకారుడైన శాలివాహన శకం కూడా ఉగాదిరోజునే ఆరంభమైంది. వీరిద్దరినీ ఉగాదిరోజున స్మరించుకోవడం ఆచారం. ► చైత్ర శుక్ల పాడ్యమి నాడు నూతన సంవత్సరాది. ఈ సంప్రదాయం కన్నడ, మహారాష్ట్రులకు కూడ ఉంది. పంచాంగ శ్రవణం ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేసేవారికి గంగాస్నాన ఫలితం లభిస్తుందని పురాణోక్తి. ఏమిటీ పంచాంగం? మనకు తెలుగు సంవత్సరాలు ‘ప్రభవ’ తో మొదలుపెట్టి ‘అక్షయ’ నామ సంవత్సరం వరకు గల 60 సంవత్సరాలలో తాము జన్మించిన నామ సంవత్సరాన్ని జీవితంలో ఒక్కసారో, రెండుసార్లో చూస్తూంటారు! అందువల్లనే వారు జన్మించిన 60 సంవత్సరాలకు తిరిగి ఆ నామ సంవత్సరం వచ్చినపుడు, అది ఒక పర్వదినంగా భావించి ‘షష్టిపూర్తి’ ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ ఉంటారు. పంచాంగంలో ఏముంటుంది? నిత్య వ్యవహారాల కోసం అందరూ ఇంగ్లీషు క్యాలెండర్‌ని ఉపయోగిస్తున్నప్పటికీ... శుభకార్యాలు, పూజాపురస్కారాలు, పితృ దేవతారాధన వంటి విషయాలకు వచ్చేటప్పటికి ‘పంచాంగం’ చూడటమే ఆచారం. ఇది మన పంచాంగ విశిష్టతకు నిదర్శనం. ‘పంచాంగం’ అంటే... తిధి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే అయిదు అంగాలు కలది అని అర్థం. పాడ్యమి నుంచి పూర్ణిమ లేదా అమావాస్య వరకు 15 తిథులు, ఆదివారం నుంచి శనివారం వరకు ఏడు వారాలు, అశ్వని మొదలు రేవతి వరకు 27 నక్షత్రాలు, విష్కంభం మొదలుకొని వైధృతి వరకు 27 యోగాలు, బవ మొదలుకొని కిం స్తుఘ్నం వరకు11 కర ణాలు ఉన్నాయి. వీటన్నిటినీ తెలిపేదే పంచాంగం. ‘పంచాంగ శ్రవణం’ ఉగాది విధుల్లో ఒకటి. నేడు పల్లెటూళ్లు మొదలుకొని పెద్ద పెద్ద నగరాల వరకూ అన్నిచోట్లా పంచాంగ శ్రవణం నిర్వహించడం చూస్తూనే ఉన్నాము . ఇప్పుడంటే పంచాంగాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి కానీ ఇంతకుమునుపు ఇలా దొరికేవి కాదు. తాళపత్రాల మీద రాసినవి మాత్రమే... అదీ కొందరు పండితులవద్ద మాత్రమే ఉండేవి కాబట్టి వారు ఉగాదినాడు సంవత్సర ఫలాలను అందరికీ తెలియజేసేవారు. పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పం చాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం. పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు. అంటే నవనాయకులను తెలుసుకుని వారిద్వారా ఫలాలను అంచనా వేస్తారు. సంవత్సరంలో ఏయే గ్రహాలకు ఏయే అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి. ఎవరిని ధ్యానించాలి? ఈ పండుగకు అధిదేవత రాముడు, కృష్ణుడు, లక్ష్మి, సరస్వతి లేదా వినాయకుడు వంటి దేవతలు కారు. కాలపురుషుడు ఈ పర్వపు అధిదేవత. ‘ఓం కాలాయనమః’ అనే నమక మంత్రం గాని విష్ణు సహస్రం గాని పఠించాలి. భగవంతుడే కాలపురుషుడని, నిత్యం అతణ్ణి ధ్యానించాలని శాస్త్రం చెబుతోంది. మానవ జీవితం అంతా కాలం పైననే ఆధారపడి ఉండుట వలన కాలపురుషుని ఆరాధించాలి. మనం చేసే పంచాంగ శ్రవణమే ఈ ఆరాధన. విష్ణు సహస్రనామ ఫలశ్రుతిలో చెప్పినట్లు మనం ఏ రూపంలో స్తుతించినా అది పరమాత్మునికే చెందుతుంది. ఈ దృష్టితో కాలపురుషుని పంచాంగ శ్రవణ రూపాన స్తుతించాలి. ఇంకనూ సత్కర్మానుష్టానానికి కావలసిన కాల విశేషణాలను తెలుసుకోవడమే పంచాంగం ప్రయోజనం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలనేవి పంచాంగాలు. ఒక శుభ కార్యం గాని ఒక ధర్మకార్యం గాని చేయడానికి పంచాంగమే మనకు మార్గదర్శనం చేస్తుంది. ఈ చైత్రమాసపు శుద్ధ పాడ్యమి నుంచి వసంతరాత్రులు జరుపుకుంటారు. అంతేకాదు, తెలుగువారి ప్రీతికరమైన శ్రీ రామనవమి కూడా ఈ నెలలోనే వస్తుంది. ఈ శ్రీ శుభకృత్‌నామ సంవత్సర ఉగాది మన దేశమంతటికీ శుభాలను చేకూరుస్తుందనీ, సకల జీవులకు సుఖశాంతులు ప్రసాదించగలదనీ ఆకాంక్షిద్దాం. – డి.వి.ఆర్. -
సకల శుభాలకు నాంది ఉగాది
♦ దుర్ముఖి నామ ఉగాదికి అంతా రెడీ ♦ వేడుకలకు సిద్ధమైన జిల్లావాసులు ♦ కుండలు, పచ్చడి సామగ్రి కొనుగోలు ♦ ఇంటింటా ఇష్టమైన భక్షాలు.. ♦ పంచాగశ్రవణం కోసం ఆలయాల్లో ఏర్పాట్లు రుతువుల్లో అందరినీ మైమరిపించేది వసంత రుతువు. శిశిరంలో ఎండిపోయిన చెట్లన్నీ వసంత కాలంలో చిగుళ్లు తొడిగి పచ్చగా కళకళలాడుతూ కొత్త అందాలతో అలరిస్తాయి. అందుకే ఈ రుతువును అత్యంత మనోహరమైనది, ఆహ్లాదకరమైనదిగా చెబుతారు. నూతన తెలుగు సంవత్సర ఆరంభానికి ఈ రుతువునే కొలమానంగా తీసుకున్నారు. వసంతంలో వచ్చే తొలిమాసం చైత్రం. తిథుల్లో మొదటి గౌరవం దక్కేది పాడ్యమి. బ్రహ్మ పురాణం అనుసరించి బ్రహ్మ సృష్టిని ఆరంభించింది ఈ చైత్ర శుద్ధ పాడ్యమినాడే అని పండితులు చెబుతున్నారు. అందుకే ఈ రోజును నూతన తెలుగు సంవత్సరాదిగా పాటిస్తూ ఉగాది పండుగను జరుపుకుంటున్నాం. - దోమ/ఘట్‌కేసర్‌టౌన్/షాబాద్ ఉగాది పచ్చడిలో షడ్రుచులు.. ఉగాది పండుగ అంటే అందరికీ గుర్తొచ్చేది ఆరు రుచులతో (షడ్రుచులు) కూడిన పచ్చడి. పండుగ రోజున ఏ ఇంట్లో చూసినా ఉప్పు, పులుపు, కారం, తీపి, చేదు, వ గరు వంటి 6 రుచులతో కూడిన పచ్చడి ఘుమఘుమలే కనిపిస్తాయి. ప్రత్యేకంగా కొనుగోలు చేసిన కొత్త కుండల్లోనే ఈ పచ్చడిని తయారు చేయడం ఓ విశేషంగా చెప్పుకోవచ్చు. ఉగాది పచ్చడి తాగితే చక్కటి ఆరోగ్యంతో పాటు జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి సుఖశాంతులు విలసిల్లుతాయని ప్రజల నమ్మకం. ఆరురుచుల ప్రత్యేకతలు: చింతపండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొత్త బెల్లం వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. పచ్చిమిరప చెవిపోటు, గొంతు వాపు వంటి లక్షణాలను అరికడుతుంది. ఉప్పు ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. చెరకు ముక్కలు, అరటి పళ్లు ఆరోగ్యానికి మంచి చేస్తాయి. పచ్చడి తయారుచేసే విధానం.. కావాల్సిన వస్తువులు: ఒక స్పూన్ వేపపువ్వు రేకులు, చెరకు ముక్కలు, కొబ్బరి ముక్కలు, 6 అరటి పళ్లు, చింతపండు, మామిడి కాయలు, 100 గ్రాముల బెల్లం, ఒక పచ్చి మిరపకాయ, చిటికెడు ఉప్పు, 2 ఏలకులు, 2 గ్లాసుల నీళ్లు. తయారీ విధానం: ముందుగా చెరకు, కొబ్బరి, బెల్లం, మిరపకాయ, మామిడికాయలను చిన్న ముక్కలుగా చేసి విడివిడిగా పెట్టాలి. పేప పువ్వును శుభ్రపరచి రేకులను ఓ పక్కన పెట్టాలి. ఏలకులు గుండుగా చేసి అట్టిపెట్టాలి. 2 గ్లాసుల నీళ్లలో చింత పండును బాగా చిలికి, పులుపు నీళ్లను ఓ గిన్నెలోకి వడపోయాలి. అందులో బెల్లం వేసి బాగా కలియబెట్టాలి. ఆ తర్వాత అరటిపళ్లను ముద్దగా చేసి నీళ్లలో కలపాలి. అందులో చిటికెడు ఉప్పు, ఏలకుల పొడి, చెరకు, మిరపకాయ, మామిడి ముక్కల్ని వేసి బాగా కలపాలి. పండుగ సాంప్రదాయాలు ఉగాది పండుగకు 15 రోజుల ముందు నుంచే గ్రామాల్లో పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇళ్లకు సున్నం, రంగులు వేయడం, అందంగా అలంకరించడం ప్రారంభం అవుతుంది. పండుగ రోజున ఇళ్లంతా శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలు, పూలు, మామిడి తోరణాలతో అందంగా అలంకరిస్తారు. ఈ రోజున అభ్యంగన స్నానం ఆచరించడడం, గంగాదేవి, మహాలక్ష్మి అమ్మవార్లను పూజించడం శుభప్రదంగా భావిస్తారు. కొత్త దుస్తులను ధరించడం ఓ ఆనవాయితీ. ముఖ్యంగా ఎండల నుంచి ఉపశమనం కోసం తెలుపు లేదా లేత రంగుల దుస్తులు ఎక్కువగా ధరిస్తారు. నోరూరించే భక్షాలు.. ఉగాది పండుగ అంటేనే అందరికీ గుర్తొచ్చేది నోరూరించే భక్షాలు (పోలెలు). ఎన్ని వంటలున్నా వీటిని రుచి చూడడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. సాధారణంగా పండుగకు ఒకరోజు ముందే భక్షాలను సిద్ధం చేసి ఉంచుతారు. ముందుగా శనగ పప్పుతో చక్కెరను జత చేసి దానిని బాగా గ్రైండర్లో వేసి రుబ్బి పూర్ణంగా మారుస్తారు. అనంతరం గోధుమ పిండితో చిన్నచిన్న ముద్దలు తయారు చేస్తారు. ఈ ముద్దల మధ్యన కొద్దికొద్దిగా పూర్ణాన్ని ఉంచి పెనంపై వేసి వేడి చేస్తే భక్షాలు సిద్ధం అయినట్లే. ఇలా తయారు చేసిన భక్షాలను అందరూ ఇష్టంగా తింటారు. పంచాంగ శ్రవణం.. ఉగాది నాడు పంచాంగ శ్రవణం ప్రధానఘట్టం. దీని వెనుకా అనేక కారణాలున్నాయి. ఖగోళ శాస్త్రీయ ధృ క్కోణానికి అద్దం పట్టే సాంప్రదాయంగా పండితులు దీనిని పేర్కొంటారు. ఖగోళ స్థితిగతులను అనుసరించే పంచాంగాన్ని రూపొందిస్తారు. ఇందులో తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే 5 అంగాలు ఉంటాయి. చంద్రుడి నడకకు సంబంధించినది తిథి. వారంలోని ప్రతీ రోజును ఓ గ్రహానికి ఆదిదేవతగా భావించి ఆ రోజును ఆ గ్రహం పేరుతో పిలుస్తారు. రాశి చక్రంలోని 27 నక్షత్రాల్లో ఏ రోజున ఏ నక్షత్రం దగ్గరకు చంద్రుడు వస్తే ఆ రోజు ఆ నక్షత్రం ఉన్నట్లు చెబుతారు. నక్షత్రరాశిలో సూర్యచంద్రుల స్థితిని బట్టి యోగం లెక్కకడతారు. ఇక తిథిలో అర్ధభాగం కరణం. వాటన్నింటినీ ఆధారంగా చేసుకొని కొత్త సంవత్సరంలో వాతావరణం ఎలా ఉంటుంది, ఏఏ పంటలు వేస్తే బాగుంటుంది, వానలు పడే సమయం తదితర విషయాలను పంచాంగ శ్రవణం ద్వారా ప్రజలు తెలుసుకుంటారు. -
షడ్రుచుల సమ్మేళనం
జీవితం అంటే షడ్రుచుల కలయిక. తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు అనుభవాల దీపిక. ఇలా ఉంటేనే జీవితానికి అర్థం పరమార్థం. ఈ సత్యాన్ని బోధిస్తూనే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తోంది ఉగాది పచ్చడి. ఈ మన్మథ నామ సంవత్సరం ప్రతి ఒక్కరికీ సకల శుభాలు చేకూర్చాలనీ ‘సాక్షి’ ఆకాంక్షిస్తోంది. సత్తెనపల్లి: ‘జయ’నామ సంవత్సరం ముగిసింది. ‘మన్మథ’ నామ సంవత్సరం వచ్చింది. ఉగాది ఉషస్సు తెచ్చింది. తేనెలొలుకు తెలు గు భాష గురించి ఆలోచించమని చెబుతుంది. మాతృభాష మాధుర్యాన్ని ఆస్వాదించమంటుంది. తెలుగుభాషలోని షడ్రుచుల గురించి ఈ నవ సంవత్సరాది ఉగాది చెబుతున్న మాటలు ఇలా.... తేనెలొలుకు : తేనెలొలుకు తెలుగుగా తెలుగును ఎంద రో కవులు అభివర్ణించారు. నేటి తరాలకు తేనె రుచులు అందించాల్సిన బాధ్యత భాషాభిమానులపై ఉంది. మన పద్యం, మన పాట, మన కావ్యం, మొత్తం మన తెలుగు సాహిత్య ఘనత. నేటి తరాల హృదయా ంతరాల్లోకి తీసుకెళ్లగలిగితే తీపి తెలుగుకు అదే కొత్త వెలుగు. చేదును ఛేదిద్దాం: పరభాషా వ్యామోహం వ్యసనంగా మారి నేటి తరాన్ని ఆ మత్తులో ముంచెత్తుతోంది. ఇదిచేదు అనుభవం. ఈ చేదును ఛేదించాలంటే ముల్లును ముల్లుతోనే తీయాలి. తెలుగు భాష ప్రాధ్యానాన్ని పెంచి నేటి తరాలను ఆ వైపు నడిపించగలిగేతే పరభాషలు పలాయనం చిత్తగిస్తాయి. తెలుగు భాషకు మంచి రోజులు వస్తాయి. పులుపే పులుపు: పులుపును నేరుగా రుచి చూడాలంటే ఇబ్బందిగానే ఉంటుంది. చక్కని వంటకంగా మారితే ఆ రుచే వేరు. తెలుగు భాషా అలాంటిదే. అక్షరాభ్యాసం, వ్యాకరణ దశలో విద్యార్థికి కొంత ఇబ్బందిగానే ఉంటుంది. దాన్ని అధిగమిస్తే మన భాష రుచే వేరే. సాహిత్య పరంగా భిన్న రుచులు అందించగలదు. ఉప్పులా ఉండాలి: జీవన గమనంలో ప్రస్తుత పరిస్థితుల్లో పరభాష అవసరాన్ని కొట్టి పారేయలేం. ఇతర భాషలపైనా పట్టు ఉండాల్సిందే. అది ఉప్పులా అవసరం మేరకు మాత్రమే ఉండాలి. ఆ‘కారం’ మారాలి : మాతృభాషపై చులకన భావం నేటితరాల్లో ఉంది. ఇది భాషా ప్రియులకు కారంగా అనిపించే విషయం. ఓ ఉద్యమంలా ముందుకు సాగి నేటి తరాల్లో భాషపై మమకారాన్ని పెంచి ఆ కారాన్ని మార్చడం భాషాభిమానుల చేతుల్లోనే ఉంది. తెలుగు పండితులు, ఉపాధ్యాయులు ఆ దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. వగరు వదిలిస్తే: పరభాష వ్యామోహాలు పెరగడానికి ప్రభుత్వాలు, ప్రైవేటు పాఠశాలలు, తల్లిదండ్రుల ఆలోచనా విధానాలు కారణమే. తెలుగు భాషలో అవకాశాలు తక్కువ అన్న భావన దీనికి కారణం కావచ్చు. అందుకే తెలుగు అంటే వగరుగా భావించవచ్చు. ప్రభుత్వఆలోచనల్లో ఇప్పుడిప్పుడే మార్పులు కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులు మారాలి. పంచాంగ శ్రవణం ఉగాది పండుగ నాడు పంచాంగ శ్రవణం ఓ ప్రత్యేకత సంతరించుకుంటుంది. పండితులు ఆలయాల్లో పంచాంగ శ్రవణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. వ్యక్తుల నక్షత్రాలు, రాశులను అనుసరించి ఏడాదిపాటు వారి భవితవ్యం ఎలా ఉండబోతుందో పండితులు చెబుతున్నారు. అయితే ఏదైనా శ్రమతోనే సాధ్యమనీ, అదృష్టంతోనే అన్ని చేకూరతాయని భావించేలా చేయడం పంచాంగం ఉద్దేశం కాదని పండితుల ముక్తాయింపు. తెలుగు పంచాంగాన్ని అనుసరిస్తూ తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం తెలుసుకుని ముందుకు సాగడం ఆనవాయితీగా వస్తోంది. -
ఏడాదంతా మధురం
షడ్రుచుల ఉగాది పచ్చడి రుచి చూడటం.. ఆపై పంచాంగంలో ఇంట్లో వాళ్ల రాశుల వారీగా ఆదాయ, వ్యయాలు చూసుకోవ డం.. రాజ్యపూజ్యం బాగుంటే సంబరపడిపోవడం.. అవమానం అంకె ఎక్కువుంటే జాగ్రత్తగా ఉండాలనుకోవడం.. ఉగాది రోజు ప్రతి తెలుగు ఇంటా కనిపించే దృశ్యమే. తమ ఇంట్లోనూ ఇదే సీన్ కనిపిస్తుందంటారు నటుడు శివబాలాజీ అర్ధాంగి, నటి మధుమిత. మన్మథ నామ సంవత్సరాన్ని సాదరంగా ఆహ్వానిస్తున్నానని చెబుతున్న మధుమిత పండుగ సంబురాలను ‘సిటీప్లస్’తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాట ల్లోనే.. ..:: శిరీష చల్లపల్లి పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. మన తెలుగింటి పండుగల్లో బాగా నచ్చేది ఉగాది. ఈ కొత్త సంవత్సరాదిని సెంటిమెంట్‌గా భావిస్తాను. చిన్నప్పుడైతే ప్రతి పండక్కీ కొత్తబట్టలు ఉండాల్సిందే. లేదంటే ఇల్లు పీకి పందిరేసేదాన్ని. శివబాలాజీతో పెళ్లయ్యాక జీవితం కొత్తగా అనిపించింది. బాబు పుట్టాక ఆ సంతోషం రెట్టింపయ్యింది. ఇంకో బాబు పుట్టాక నా జీవితం పరిపూర్ణమైందనిపించింది. మా అమ్మకు మేం ముగ్గురం. అందుకే నాకూ ముగ్గురు సంతానం కావాలని ఉంది. ఇంకో పాప కావాలని ఉంది. ఆడపిల్లయితే పండుగలకు, పబ్బాలకు బంగారుబొమ్మలా ముస్తాబు చేసి చూసుకుంటే ఎంత ముచ్చటగా ఉంటుందో..! ఏడాదంతా అలాగే.. చిన్నప్పుడు ఉగాది పండుగకు మా అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లే వాళ్లం. మా అమ్మమ్మ డజనుకుపైగా పిండి వంటలు చేసేది. వాళ్లింటికి కూతవేటు దూరంలోనే బోలెడన్ని మామిడి, వేప చెట్లు ఉండే వి. నిండుగా పూత పూసిన మానులు.. వాటిపై గొంతెత్తి కూసే కోయిలలు.. ఎంతో హాయిగా అనిపించేది. చిన్నప్పుడు చెట్లు బాగా ఎక్కేదాన్ని. కొమ్మలెక్కి ఊయలలు ఊగటం భలే సరదాగా అనిపించేది. ఇక షడ్రుచుల ఉగాది పచ్చడి తీసుకున్నప్పుడు మొదట ఏ రుచి ఫీలవుతామో.. ఆ ఏడాదంతా అలాగే ఉంటుందని నమ్మకం. అందుకే నేను బెల్లం ముక్క ఎక్కడ తేలుతుందో చూసుకుని.. తీసుకునేదాన్ని. ఇప్పటికీ అలాగే తీసుకుంటున్నాను. తినేవారుండాలే కానీ.. ఉగాది అంటే భక్షాలు ఫేమస్. చక్కెర పొంగలి, పులిహోర కామన్. వీటికి తోడు రకరకాల పిండివంటలు సిద్ధంగా ఉంటాయి. పిండివంటలు వండటమంటే నాకు చాలా సరదా. గూగుల్‌లో వెతికి మరీ రకరకాలు ట్రై చేస్తుంటా. నేను చేసే చక్కెర పొంగలి, పులిహోర, పేనీల పాయసం అంటే మా ఆయనకు భలే ఇష్టం. అందుకే ఏ పండుగొచ్చినా మా ఇంట్లో ఈ మూడు వంటకాలు ఉండాల్సిందే. పండుగ అనగానే బంధువులు కూడా వచ్చేస్తారు. అందరం కలసి హ్యాపీగా కబుర్లాడుకుంటూ భోజనం చేస్తాం. తినేవాళ్లుండాలే కానీ నేను ఎన్ని వె రైటీలైనా వండి పెడ్తాను. ఇరుగుపొరుగు వారికి పంచిపెడ్తుంటాను. అందులో నాకు తెలియని ఆనందం దొరుకుతుంది. మామూలు రోజుల్లోనూ.. తెలుగుదనం ఉట్టిపడేలా నిండుగా తయారవ్వడం అంటే చాలా ఇష్టం. అందుకే ఏ పండుగొచ్చినా చెవులకు జుంకాలు, చేతులకు ముత్యాల గాజులు, మెడలో హారం వేసుకుంటాను. పండుగలప్పుడే కాదు.. మామూలు రోజుల్లో కూడా నేను ఎక్కువగా చీరల్లో ఉండటానికే ఇష్టపడతాను. జనాలు కూడా నన్ను అలా చూడటానికే ఇష్టపడటం వల్లేమో.. నేను అలాంటి పాత్రలు ఒప్పుకుంటూ ఉంటాను. పుట్టింటికి రా చెల్లి, మన్మథుడు, ఊకొడతారా.. ఉలిక్కిపడతారా.. ఇలాంటి సినిమాల్లో నా పాత్రలు తెలుగుదనానికి కేరాఫ్‌గా ఉంటాయి. ప్రస్తుతం మారుతి డెరైక్షన్‌లో నాని హీరోగా చేస్తున్న ‘భలే భలే మగాడివోయ్’ సినిమాలో ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నాను. -
ఉగాది పచ్చడి ప్రాశస్త్యం
తెలుగు నెలలలో మొదటిదైన చైత్రమాసం ఆరంభమే ‘ఉగాది’. దీనితోనే ‘వసంతరుతువు’ మొదలవుతుంది. ఆయుర్వేద సూత్రాలరీత్యా ఇది ‘శ్లేష్మ’ ప్రకోపకాలం. కాబట్టి కఫాన్ని నియంత్రణలో పెట్టడానికి చేదు, కారం, వగరు ఉండే ఆహారం మంచిది. పాయసాల వంటి స్నిగ్ధ పదార్థాలు నిషేధం. వేడి కలిగించే పదార్థాలు మంచివి. దీనికి మద్దతుగా మనకు ప్రకృతి ప్రసాదించిన ద్రవ్యాలు ‘వేపపువ్వు (తిక్తరసం - చేదు), మామిడి పిందెలు (కషాయరసం - వగరు)’ తెలుగు కొత్త ఏడాది ప్రారంభానికి చిహ్నంగా ‘కొత్తబెల్లం, కొత్త చింతపండు, మిరియాలు’ కలిపి రుచి చూస్తారు. ఉగాది పచ్చడి :- చిక్కటి చింతపండురసంలో బెల్లం, వేపపువ్వు, మామిడి పిందెల్ని దంచి కలిపి పచ్చడిలా చేస్తారు. కొన్ని ప్రాంతాలలో కొంచెం మిరియాలపొడి, సైంధవలవణం కలిపే ఆచారమూ ఉంది. స్థూలంగా చూస్తే ఇది షడ్రసాల సమ్మేళనం. పండగలో భాగంగా ఈ పచ్చడిని అందరూ పరగడుపున సేవిస్తారు. ఈ ద్రవ్యాల విశిష్ట గుణాల వల్ల జీర్ణప్రక్రియ చురుగ్గా మారుతుంది. వివిధ రసాల గుణాలు మధురరసం: జన్మతః ఎల్లరకూ హితకరం. ధాతుపుష్టిని కల్గిస్తుంది. శరీరకాంతి పెరుగుతుంది. కేశాలు బాగా పెరుగుతాయి. ఓజస్సును పెంచుతుంది. బాలురకు, వృద్ధులకు, గాయపడిన వారికి కూడా హితకరం. ‘‘ఆ జన్మసాత్మ్యాత్ కురుతే ధాతూనాం ప్రబలం బలం బాలవృద్ధ క్షతక్షీణ, వర్ణకేశ ఇంద్రియ ఓజసాం॥ అమ్లరసం: అగ్నిదీప్తిని, జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది. స్నిగ్ధమై (జావలా/ జిగురులాగా చేసిన పదార్థంలా) హృద్యంగా ఉంటుంది. నాలుకకు రుచిని పెంచుతుంది. ‘‘అమ్లో అగ్నిదీప్తికృత్ స్నిగ్ధో హృద్యయః పాచన రోచనః’’ లవణరసం: అగ్నిని ప్రేరేపించి, అజీర్ణాన్ని పొగొడుతుంది. ‘‘లవణః స్తంభసంఘాత బంధ విధ్మాపనో అగ్నికృత్.......’’ కటురసం: గొంతుకను శుద్ధి చేస్తుంది. దద్దుర్లు మొదలైన చర్మవ్యాధుల్ని తగ్గిస్తుంది. ఉదరశుద్ధి చేసి, వాపులను పోగొడుతుంది. ‘‘కటుః గలామయ, ఉదర్ద, కుష్ఠ, అలసక శోఫజిత్’’ తిక్తరసం: చేదు నాలుకకు ఇబ్బందికరమైనా... దీనిలో కొన్ని మంచి గుణాలున్నాయి. ఈ రసం ఆకలిని జనింపజేస్తుంది. క్రిమినాశకం, విషహరం, చర్మరోగాలు, జ్వరం, మూర్ఛ, ఛాతీ పట్టినట్లుండటం వంటి వికారాలను తగ్గిస్తుంది. మంటను, దప్పికనూ తగ్గిస్తుంది. ‘‘తిక్తః స్వయం అరోచిష్టురరుచిం, కృమి తృట్ విషం కుష్ట మూర్ఛా జ్వర ఉత్క్లేశదాహ పిత్త కఫాన్ జయేత్॥ కషాయరసం: ఇది కష్టంగా జీర్ణమౌతుంది. పిత్త, కఫ వ్యాధులను శాంతింపజేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ‘‘కషాయః పిత్తకఫహా, గురుః అస్రవిశోధనః’’ గమనిక: ఈ రుచులన్నింటిని అవసరాన్ని బట్టి తగు మోతాదుల్లో సేవించాలి. మితిమీరితే మేలు చేసే ఈ రసాలే వ్యాధుల్ని కలగజేస్తాయి. ముఖ్యంగా లవణరసాన్ని చాలా తక్కువగా వాడాలి. అంటే ప్రకృతిలో దొరికే కాయగూరలలోని లవణ రసం సరిపోతుంది. కాబట్టి, రుచికోసమని, మళ్లీ ఉప్పును అధికంగా వేసుకోవడం మంచిదికాదు.