జీవితం అంటే షడ్రుచుల కలయిక. తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు అనుభవాల దీపిక. ఇలా ఉంటేనే జీవితానికి అర్థం పరమార్థం. ఈ సత్యాన్ని బోధిస్తూనే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తోంది ఉగాది పచ్చడి. ఈ మన్మథ నామ సంవత్సరం ప్రతి ఒక్కరికీ సకల శుభాలు చేకూర్చాలనీ ‘సాక్షి’ ఆకాంక్షిస్తోంది.
సత్తెనపల్లి: ‘జయ’నామ సంవత్సరం ముగిసింది. ‘మన్మథ’ నామ సంవత్సరం వచ్చింది. ఉగాది ఉషస్సు తెచ్చింది. తేనెలొలుకు తెలు గు భాష గురించి ఆలోచించమని చెబుతుంది. మాతృభాష మాధుర్యాన్ని ఆస్వాదించమంటుంది. తెలుగుభాషలోని షడ్రుచుల గురించి ఈ నవ సంవత్సరాది ఉగాది చెబుతున్న మాటలు ఇలా....
తేనెలొలుకు : తేనెలొలుకు తెలుగుగా తెలుగును ఎంద రో కవులు అభివర్ణించారు. నేటి తరాలకు తేనె రుచులు అందించాల్సిన బాధ్యత భాషాభిమానులపై ఉంది. మన పద్యం, మన పాట, మన కావ్యం, మొత్తం మన తెలుగు సాహిత్య ఘనత. నేటి తరాల హృదయా ంతరాల్లోకి తీసుకెళ్లగలిగితే తీపి తెలుగుకు అదే కొత్త వెలుగు.
చేదును ఛేదిద్దాం: పరభాషా వ్యామోహం వ్యసనంగా మారి నేటి తరాన్ని ఆ మత్తులో ముంచెత్తుతోంది. ఇదిచేదు అనుభవం. ఈ చేదును ఛేదించాలంటే ముల్లును ముల్లుతోనే తీయాలి. తెలుగు భాష ప్రాధ్యానాన్ని పెంచి నేటి తరాలను ఆ వైపు నడిపించగలిగేతే పరభాషలు పలాయనం చిత్తగిస్తాయి. తెలుగు భాషకు మంచి రోజులు వస్తాయి.
పులుపే పులుపు: పులుపును నేరుగా రుచి చూడాలంటే ఇబ్బందిగానే ఉంటుంది. చక్కని వంటకంగా మారితే ఆ రుచే వేరు. తెలుగు భాషా అలాంటిదే. అక్షరాభ్యాసం, వ్యాకరణ దశలో విద్యార్థికి కొంత ఇబ్బందిగానే ఉంటుంది. దాన్ని అధిగమిస్తే మన భాష రుచే వేరే. సాహిత్య పరంగా భిన్న రుచులు అందించగలదు.
ఉప్పులా ఉండాలి: జీవన గమనంలో ప్రస్తుత పరిస్థితుల్లో పరభాష అవసరాన్ని కొట్టి పారేయలేం. ఇతర భాషలపైనా పట్టు ఉండాల్సిందే. అది ఉప్పులా అవసరం మేరకు మాత్రమే ఉండాలి.
ఆ‘కారం’ మారాలి : మాతృభాషపై చులకన భావం నేటితరాల్లో ఉంది. ఇది భాషా ప్రియులకు కారంగా అనిపించే విషయం. ఓ ఉద్యమంలా ముందుకు సాగి నేటి తరాల్లో భాషపై మమకారాన్ని పెంచి ఆ కారాన్ని మార్చడం భాషాభిమానుల చేతుల్లోనే ఉంది. తెలుగు పండితులు, ఉపాధ్యాయులు ఆ దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉంది.
వగరు వదిలిస్తే: పరభాష వ్యామోహాలు పెరగడానికి ప్రభుత్వాలు, ప్రైవేటు పాఠశాలలు, తల్లిదండ్రుల ఆలోచనా విధానాలు కారణమే. తెలుగు భాషలో అవకాశాలు తక్కువ అన్న భావన దీనికి కారణం కావచ్చు. అందుకే తెలుగు అంటే వగరుగా భావించవచ్చు. ప్రభుత్వఆలోచనల్లో ఇప్పుడిప్పుడే మార్పులు కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులు మారాలి.
పంచాంగ శ్రవణం
ఉగాది పండుగ నాడు పంచాంగ శ్రవణం ఓ ప్రత్యేకత సంతరించుకుంటుంది. పండితులు ఆలయాల్లో పంచాంగ శ్రవణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. వ్యక్తుల నక్షత్రాలు, రాశులను అనుసరించి ఏడాదిపాటు వారి భవితవ్యం ఎలా ఉండబోతుందో పండితులు చెబుతున్నారు. అయితే ఏదైనా శ్రమతోనే సాధ్యమనీ, అదృష్టంతోనే అన్ని చేకూరతాయని భావించేలా చేయడం పంచాంగం ఉద్దేశం కాదని పండితుల ముక్తాయింపు. తెలుగు పంచాంగాన్ని అనుసరిస్తూ తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం తెలుసుకుని ముందుకు సాగడం ఆనవాయితీగా వస్తోంది.
షడ్రుచుల సమ్మేళనం
Published Sat, Mar 21 2015 1:27 AM | Last Updated on Tue, Nov 6 2018 4:56 PM
Advertisement
Advertisement