year of manmadha
-
షడ్రుచుల సమ్మేళనం
జీవితం అంటే షడ్రుచుల కలయిక. తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు అనుభవాల దీపిక. ఇలా ఉంటేనే జీవితానికి అర్థం పరమార్థం. ఈ సత్యాన్ని బోధిస్తూనే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తోంది ఉగాది పచ్చడి. ఈ మన్మథ నామ సంవత్సరం ప్రతి ఒక్కరికీ సకల శుభాలు చేకూర్చాలనీ ‘సాక్షి’ ఆకాంక్షిస్తోంది. సత్తెనపల్లి: ‘జయ’నామ సంవత్సరం ముగిసింది. ‘మన్మథ’ నామ సంవత్సరం వచ్చింది. ఉగాది ఉషస్సు తెచ్చింది. తేనెలొలుకు తెలు గు భాష గురించి ఆలోచించమని చెబుతుంది. మాతృభాష మాధుర్యాన్ని ఆస్వాదించమంటుంది. తెలుగుభాషలోని షడ్రుచుల గురించి ఈ నవ సంవత్సరాది ఉగాది చెబుతున్న మాటలు ఇలా.... తేనెలొలుకు : తేనెలొలుకు తెలుగుగా తెలుగును ఎంద రో కవులు అభివర్ణించారు. నేటి తరాలకు తేనె రుచులు అందించాల్సిన బాధ్యత భాషాభిమానులపై ఉంది. మన పద్యం, మన పాట, మన కావ్యం, మొత్తం మన తెలుగు సాహిత్య ఘనత. నేటి తరాల హృదయా ంతరాల్లోకి తీసుకెళ్లగలిగితే తీపి తెలుగుకు అదే కొత్త వెలుగు. చేదును ఛేదిద్దాం: పరభాషా వ్యామోహం వ్యసనంగా మారి నేటి తరాన్ని ఆ మత్తులో ముంచెత్తుతోంది. ఇదిచేదు అనుభవం. ఈ చేదును ఛేదించాలంటే ముల్లును ముల్లుతోనే తీయాలి. తెలుగు భాష ప్రాధ్యానాన్ని పెంచి నేటి తరాలను ఆ వైపు నడిపించగలిగేతే పరభాషలు పలాయనం చిత్తగిస్తాయి. తెలుగు భాషకు మంచి రోజులు వస్తాయి. పులుపే పులుపు: పులుపును నేరుగా రుచి చూడాలంటే ఇబ్బందిగానే ఉంటుంది. చక్కని వంటకంగా మారితే ఆ రుచే వేరు. తెలుగు భాషా అలాంటిదే. అక్షరాభ్యాసం, వ్యాకరణ దశలో విద్యార్థికి కొంత ఇబ్బందిగానే ఉంటుంది. దాన్ని అధిగమిస్తే మన భాష రుచే వేరే. సాహిత్య పరంగా భిన్న రుచులు అందించగలదు. ఉప్పులా ఉండాలి: జీవన గమనంలో ప్రస్తుత పరిస్థితుల్లో పరభాష అవసరాన్ని కొట్టి పారేయలేం. ఇతర భాషలపైనా పట్టు ఉండాల్సిందే. అది ఉప్పులా అవసరం మేరకు మాత్రమే ఉండాలి. ఆ‘కారం’ మారాలి : మాతృభాషపై చులకన భావం నేటితరాల్లో ఉంది. ఇది భాషా ప్రియులకు కారంగా అనిపించే విషయం. ఓ ఉద్యమంలా ముందుకు సాగి నేటి తరాల్లో భాషపై మమకారాన్ని పెంచి ఆ కారాన్ని మార్చడం భాషాభిమానుల చేతుల్లోనే ఉంది. తెలుగు పండితులు, ఉపాధ్యాయులు ఆ దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. వగరు వదిలిస్తే: పరభాష వ్యామోహాలు పెరగడానికి ప్రభుత్వాలు, ప్రైవేటు పాఠశాలలు, తల్లిదండ్రుల ఆలోచనా విధానాలు కారణమే. తెలుగు భాషలో అవకాశాలు తక్కువ అన్న భావన దీనికి కారణం కావచ్చు. అందుకే తెలుగు అంటే వగరుగా భావించవచ్చు. ప్రభుత్వఆలోచనల్లో ఇప్పుడిప్పుడే మార్పులు కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులు మారాలి. పంచాంగ శ్రవణం ఉగాది పండుగ నాడు పంచాంగ శ్రవణం ఓ ప్రత్యేకత సంతరించుకుంటుంది. పండితులు ఆలయాల్లో పంచాంగ శ్రవణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. వ్యక్తుల నక్షత్రాలు, రాశులను అనుసరించి ఏడాదిపాటు వారి భవితవ్యం ఎలా ఉండబోతుందో పండితులు చెబుతున్నారు. అయితే ఏదైనా శ్రమతోనే సాధ్యమనీ, అదృష్టంతోనే అన్ని చేకూరతాయని భావించేలా చేయడం పంచాంగం ఉద్దేశం కాదని పండితుల ముక్తాయింపు. తెలుగు పంచాంగాన్ని అనుసరిస్తూ తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం తెలుసుకుని ముందుకు సాగడం ఆనవాయితీగా వస్తోంది. -
అకటా... మన్మథా!
వెల్లివిరిసే చైత్రహాసం.. గండు కోయిల గళలాస్యం.. తెలుగునాట మన్మథుడికి ఘనస్వాగతం. కాలక్రమంలో వచ్చిన ఈ ఏడాది కాస్త ‘అధికంగా’ ఉంటోంది. పేరుకు మన్మథ నామవత్సరమైనా.. జంట ఆషాఢాలతో కొత్త జంటల మధ్య ఎడం పెంచనుంది. ఇంగ్లిష్ ఏడాది కంటే ఎక్కువ రోజులు ఉంటానంటూ.. 384 రోజుల నిడివితో ఉన్న కొత్త పంచాంగం మార్కెట్లోకి వచ్చేసింది. దాన్ని చూసి కొత్త జంటలే కాదు.. పురోహితులు కూడా కాస్త కంగారుపడుతున్నారు. త్రిగుళ్ల నాగరాజు మన్మథ నామ సంవత్సర పంచాంగంలో నవనాయకుల ఫలితాలు ఎలా ఉన్నా.. కొత్త జంటలకు మాత్రం కాస్త కష్టకాలమే. ఇక పురోహితుల దగ్గరకు వచ్చే సరికి ఆదాయ, వ్యయాలు కాస్త అటుఇటు అయ్యేలా ఉన్నాయి. దీనికంతటికీ కారణం ఈ మన్మథుడు అధిక మాసంతో ఆగమించడమే. ఏ శ్రావణమో.. కార్తీకమో.. అధిక మాసమైతే ఫర్వాలేదు. ఈసారి అధికమాసం ఆషాఢం కావడమే కొన్ని వర్గాలకు కొత్త చిక్కు తెచ్చిపెట్టింది. తెలుగు లీప్ ఇయర్... ఇంగ్లిష్ క్యాలెండర్లో నాలుగేళ్లకోసారి లీప్ ఇయర్ వస్తుంది. భూమి సూర్యుని చుట్టూ తిరిగే కాలం 364.25 రోజులు.. నాలుగు పావు రోజులను కలిపి.. లీప్ ఇయర్లో 29 రోజులు చేశారు. ఇదే సూత్రాన్ని అనుసరిస్తూ ప్రతి 28 నుంచి 33 నెలలకోసారి అధికమాసం లె క్కగట్టి కాలాన్ని క్రమబద్ధీకరిస్తారు పంచాంగకర్తలు. రవి సంక్రమణం కాని నెలను అధికమాసంగానూ.. ఆపై వచ్చే నెలను నిజమాసంగానూ నిర్ధారిస్తారు. ఈ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఆషాఢ మాసం అధికంగా వస్తోంది. ఎంత ఎంత ఎడమైతే... అధికమాసం వస్తే మాత్రం కొత్త జంటలకు వచ్చిన చిక్కేమిట నే కదా..! మన సంప్రదాయం ప్రకారం.. ఆషాఢమాసంలో అత్తగారింట్లో కొత్తకోడలు.. భార్యమణి తల్లిగారింట్లో కొత్తల్లుడూ ఉండరాదు. దీంతో ఆషాఢం రాగానే కొత్తకోడలిని పుట్టింటికి పంపించడం ఆనవాయితీగా వస్తుంది. మరి ఈసారి రెండు ఆషాఢాలు వస్తున్నాయి. దీంతో నూతన వధూవరులకు రెండు నెలలు విరహం తప్పదన్నమాట..! అయితే ‘ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక..’ అన్న కవి మాటలను అనుసరించి.. రెండు నెలల విరహం భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని మరింత పెంచుతుందంటారు విజ్ఞులు. రెండు నెలలు మదిలో గూడు కట్టుకున్న మకతిక భావాలన్నీ మదనుడి పాలైపోతాయని ఉల్లాసపరుస్తున్నారు. బడ్జెట్ బ్యాలెన్స్... ఇక ఆషాఢానికి పురోహితులకు లింకేంటంటే.. అసలే ఈ మాసంలో ముహూర్తాలుండవు. పైగా రెండు ఆషాఢాలు. దీంతో పురోహితులు చైత్రవైశాఖాల్లో కాస్త చెమటోడ్చాల్సి ఉంటుంది. అయితే ‘అధికస్య అధికం ఫలం’ అంటూ అధిక మాసంలో దానాలు ఎక్కువగా చేస్తుంటారు. ఇవి పురోహితుల బడ్జెట్ను కొంత బ్యాలెన్స్ చేయవచ్చు. డబుల్ ధమాకా... ఇక ఏటా ఆషాఢంలో సాగే మెగా డిస్కౌంట్ సేల్స్ అంటే అతివలకు ఎంత ఇష్టమో వేరే చెప్పక్కర్లేదు. ఈ ఏడాది రెండు నెలలు ఈ మెగా డిస్కౌంట్ ఆఫర్లు ఉండబోతున్నాయి. అధిక మాసంలో ఈ డిస్కౌంట్ మరింత అధికంగా ఉంటుందా అని ఇప్పట్నుంచే ఆరాలు తీస్తున్నారు కొందరు. మగువల సంగతి అలా ఉంటే.. ఆషాఢం మెగాసేల్స్ తమ బడ్జెట్ను తలకిందులు చేస్తుందేమోనని వారి భర్తలు ఇప్పట్నుంచే జేబులు తడుముకుంటున్నారు. మొత్తానికి మన్మథ నామ సంవ త్సరం అధికాషాఢంతో ఎందరిలోనో గుబులు రేపుతోంది.