అకటా... మన్మథా!
వెల్లివిరిసే చైత్రహాసం.. గండు కోయిల గళలాస్యం.. తెలుగునాట మన్మథుడికి ఘనస్వాగతం. కాలక్రమంలో వచ్చిన ఈ ఏడాది కాస్త ‘అధికంగా’ ఉంటోంది. పేరుకు మన్మథ నామవత్సరమైనా.. జంట ఆషాఢాలతో కొత్త జంటల మధ్య ఎడం పెంచనుంది. ఇంగ్లిష్ ఏడాది కంటే ఎక్కువ రోజులు ఉంటానంటూ.. 384 రోజుల నిడివితో ఉన్న కొత్త పంచాంగం మార్కెట్‌లోకి వచ్చేసింది. దాన్ని చూసి కొత్త జంటలే కాదు.. పురోహితులు కూడా కాస్త కంగారుపడుతున్నారు.
త్రిగుళ్ల నాగరాజు
మన్మథ నామ సంవత్సర పంచాంగంలో నవనాయకుల ఫలితాలు ఎలా ఉన్నా.. కొత్త జంటలకు మాత్రం కాస్త కష్టకాలమే. ఇక పురోహితుల దగ్గరకు వచ్చే సరికి ఆదాయ, వ్యయాలు కాస్త అటుఇటు అయ్యేలా ఉన్నాయి. దీనికంతటికీ కారణం ఈ మన్మథుడు అధిక మాసంతో ఆగమించడమే. ఏ శ్రావణమో.. కార్తీకమో.. అధిక మాసమైతే ఫర్వాలేదు. ఈసారి అధికమాసం ఆషాఢం కావడమే కొన్ని వర్గాలకు కొత్త చిక్కు తెచ్చిపెట్టింది.
తెలుగు లీప్ ఇయర్...
ఇంగ్లిష్ క్యాలెండర్లో నాలుగేళ్లకోసారి లీప్ ఇయర్ వస్తుంది. భూమి సూర్యుని చుట్టూ తిరిగే కాలం 364.25 రోజులు.. నాలుగు పావు రోజులను కలిపి.. లీప్ ఇయర్‌లో 29 రోజులు చేశారు. ఇదే సూత్రాన్ని అనుసరిస్తూ ప్రతి 28 నుంచి 33 నెలలకోసారి అధికమాసం లె క్కగట్టి కాలాన్ని క్రమబద్ధీకరిస్తారు పంచాంగకర్తలు. రవి సంక్రమణం కాని నెలను అధికమాసంగానూ.. ఆపై వచ్చే నెలను నిజమాసంగానూ నిర్ధారిస్తారు. ఈ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఆషాఢ మాసం అధికంగా వస్తోంది.
ఎంత ఎంత ఎడమైతే...
అధికమాసం వస్తే మాత్రం కొత్త జంటలకు వచ్చిన చిక్కేమిట నే కదా..! మన సంప్రదాయం ప్రకారం.. ఆషాఢమాసంలో అత్తగారింట్లో కొత్తకోడలు.. భార్యమణి తల్లిగారింట్లో కొత్తల్లుడూ ఉండరాదు. దీంతో ఆషాఢం రాగానే కొత్తకోడలిని పుట్టింటికి పంపించడం ఆనవాయితీగా వస్తుంది. మరి ఈసారి రెండు ఆషాఢాలు వస్తున్నాయి. దీంతో నూతన వధూవరులకు రెండు నెలలు విరహం తప్పదన్నమాట..! అయితే ‘ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక..’ అన్న కవి మాటలను అనుసరించి.. రెండు నెలల విరహం భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని మరింత పెంచుతుందంటారు విజ్ఞులు. రెండు నెలలు మదిలో గూడు కట్టుకున్న మకతిక భావాలన్నీ మదనుడి పాలైపోతాయని ఉల్లాసపరుస్తున్నారు.
బడ్జెట్ బ్యాలెన్స్...
ఇక ఆషాఢానికి పురోహితులకు లింకేంటంటే.. అసలే ఈ మాసంలో ముహూర్తాలుండవు. పైగా రెండు ఆషాఢాలు. దీంతో పురోహితులు చైత్రవైశాఖాల్లో కాస్త చెమటోడ్చాల్సి ఉంటుంది. అయితే ‘అధికస్య అధికం ఫలం’ అంటూ అధిక మాసంలో దానాలు ఎక్కువగా చేస్తుంటారు. ఇవి పురోహితుల బడ్జెట్‌ను కొంత బ్యాలెన్స్ చేయవచ్చు.
డబుల్ ధమాకా...
ఇక ఏటా ఆషాఢంలో సాగే మెగా డిస్కౌంట్ సేల్స్ అంటే అతివలకు ఎంత ఇష్టమో వేరే చెప్పక్కర్లేదు. ఈ ఏడాది రెండు నెలలు ఈ మెగా డిస్కౌంట్ ఆఫర్లు ఉండబోతున్నాయి. అధిక మాసంలో ఈ డిస్కౌంట్ మరింత అధికంగా ఉంటుందా అని ఇప్పట్నుంచే ఆరాలు తీస్తున్నారు కొందరు. మగువల సంగతి అలా ఉంటే.. ఆషాఢం మెగాసేల్స్ తమ బడ్జెట్‌ను తలకిందులు చేస్తుందేమోనని వారి భర్తలు ఇప్పట్నుంచే జేబులు తడుముకుంటున్నారు. మొత్తానికి మన్మథ నామ సంవ త్సరం అధికాషాఢంతో ఎందరిలోనో గుబులు రేపుతోంది.