ఏడాదంతా మధురం
షడ్రుచుల ఉగాది పచ్చడి రుచి చూడటం.. ఆపై పంచాంగంలో ఇంట్లో వాళ్ల రాశుల వారీగా ఆదాయ, వ్యయాలు చూసుకోవ డం.. రాజ్యపూజ్యం బాగుంటే సంబరపడిపోవడం.. అవమానం అంకె ఎక్కువుంటే జాగ్రత్తగా ఉండాలనుకోవడం.. ఉగాది రోజు ప్రతి తెలుగు ఇంటా కనిపించే దృశ్యమే. తమ ఇంట్లోనూ ఇదే సీన్ కనిపిస్తుందంటారు నటుడు శివబాలాజీ అర్ధాంగి, నటి మధుమిత. మన్మథ నామ సంవత్సరాన్ని సాదరంగా ఆహ్వానిస్తున్నానని చెబుతున్న మధుమిత పండుగ సంబురాలను ‘సిటీప్లస్’తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాట ల్లోనే..
..:: శిరీష చల్లపల్లి
పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. మన తెలుగింటి
పండుగల్లో బాగా నచ్చేది ఉగాది. ఈ కొత్త సంవత్సరాదిని సెంటిమెంట్‌గా భావిస్తాను. చిన్నప్పుడైతే ప్రతి పండక్కీ కొత్తబట్టలు ఉండాల్సిందే. లేదంటే ఇల్లు పీకి పందిరేసేదాన్ని. శివబాలాజీతో పెళ్లయ్యాక జీవితం కొత్తగా అనిపించింది. బాబు పుట్టాక ఆ సంతోషం రెట్టింపయ్యింది. ఇంకో బాబు పుట్టాక నా జీవితం పరిపూర్ణమైందనిపించింది. మా అమ్మకు మేం ముగ్గురం. అందుకే నాకూ ముగ్గురు సంతానం కావాలని ఉంది. ఇంకో పాప కావాలని ఉంది. ఆడపిల్లయితే పండుగలకు, పబ్బాలకు బంగారుబొమ్మలా ముస్తాబు చేసి చూసుకుంటే ఎంత ముచ్చటగా ఉంటుందో..!
ఏడాదంతా అలాగే..
చిన్నప్పుడు ఉగాది పండుగకు మా అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లే వాళ్లం. మా అమ్మమ్మ డజనుకుపైగా పిండి వంటలు చేసేది. వాళ్లింటికి కూతవేటు దూరంలోనే బోలెడన్ని మామిడి, వేప చెట్లు ఉండే వి. నిండుగా పూత పూసిన మానులు.. వాటిపై గొంతెత్తి కూసే కోయిలలు.. ఎంతో హాయిగా అనిపించేది. చిన్నప్పుడు చెట్లు బాగా ఎక్కేదాన్ని. కొమ్మలెక్కి ఊయలలు ఊగటం భలే సరదాగా అనిపించేది. ఇక షడ్రుచుల ఉగాది పచ్చడి తీసుకున్నప్పుడు మొదట ఏ రుచి ఫీలవుతామో.. ఆ ఏడాదంతా అలాగే ఉంటుందని నమ్మకం. అందుకే నేను బెల్లం ముక్క ఎక్కడ తేలుతుందో చూసుకుని.. తీసుకునేదాన్ని. ఇప్పటికీ అలాగే తీసుకుంటున్నాను.
తినేవారుండాలే కానీ..
ఉగాది అంటే భక్షాలు ఫేమస్. చక్కెర పొంగలి, పులిహోర కామన్. వీటికి తోడు రకరకాల పిండివంటలు సిద్ధంగా ఉంటాయి. పిండివంటలు వండటమంటే నాకు చాలా సరదా. గూగుల్‌లో వెతికి మరీ రకరకాలు ట్రై చేస్తుంటా. నేను చేసే చక్కెర పొంగలి, పులిహోర, పేనీల పాయసం అంటే మా ఆయనకు భలే ఇష్టం. అందుకే ఏ పండుగొచ్చినా మా ఇంట్లో ఈ మూడు వంటకాలు ఉండాల్సిందే. పండుగ అనగానే బంధువులు కూడా వచ్చేస్తారు. అందరం కలసి హ్యాపీగా కబుర్లాడుకుంటూ భోజనం చేస్తాం. తినేవాళ్లుండాలే కానీ నేను ఎన్ని వె రైటీలైనా వండి పెడ్తాను. ఇరుగుపొరుగు వారికి పంచిపెడ్తుంటాను. అందులో నాకు తెలియని ఆనందం దొరుకుతుంది.
మామూలు రోజుల్లోనూ..
తెలుగుదనం ఉట్టిపడేలా నిండుగా తయారవ్వడం అంటే చాలా ఇష్టం. అందుకే ఏ పండుగొచ్చినా చెవులకు జుంకాలు, చేతులకు ముత్యాల గాజులు, మెడలో హారం వేసుకుంటాను. పండుగలప్పుడే కాదు.. మామూలు రోజుల్లో కూడా నేను ఎక్కువగా చీరల్లో ఉండటానికే ఇష్టపడతాను. జనాలు కూడా నన్ను అలా చూడటానికే ఇష్టపడటం వల్లేమో.. నేను అలాంటి పాత్రలు ఒప్పుకుంటూ ఉంటాను. పుట్టింటికి రా చెల్లి, మన్మథుడు, ఊకొడతారా.. ఉలిక్కిపడతారా.. ఇలాంటి సినిమాల్లో నా పాత్రలు తెలుగుదనానికి కేరాఫ్‌గా ఉంటాయి. ప్రస్తుతం మారుతి డెరైక్షన్‌లో నాని హీరోగా చేస్తున్న ‘భలే భలే మగాడివోయ్’ సినిమాలో ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నాను.