పెరుగుమోత | Variety of curd recipes | Sakshi
Sakshi News home page

పెరుగుమోత

Published Fri, Oct 18 2013 11:23 PM | Last Updated on Fri, Sep 1 2017 11:45 PM

Variety of curd recipes

 పులుపంటే మనకు ప్రత్యేకమైన లవ్వు.
 పులుసు
 పులిహార
 పుల్లట్లు
 పులిపొంగడాలు
 పుల్లకూర (పక్కింటి వాళ్లదైతే మరీను)
 అన్నీ...
 మన చాపల్యానికి తెరచాప లేపేవే!
 ఆఖరికి, తియ్యగా ఉన్న పెరుగులోనైనా...
 పిసరంత పులుపు దొరక్కపోతుందా అనినాలుక దేవులాడుతుంది!
 మరైతే అది పులుపులోని గొప్పతనమా?
 పెరుగులో దాగి ఉన్న మహత్మ్యమా?
 తెలియాలంటే పెరుగు మూత తియ్యాలి.
 తిరగమోత పెట్టాలి.

 
 టొమాటో కర్డ్ స్ల్యూ

 
 కావలసినవి
 బీన్‌కర్డ్ - కప్పు (సూపర్ మార్కెట్‌లో దొరుకుతుంది), టొమాటో తరుగు - పావుకప్పు, లవంగం - 1, వెల్లుల్లి రెబ్బలు: 6, కార్న్‌ఫ్లోర్ - అర టేబుల్ స్పూను, పచ్చిబఠాణీ - పావు కప్పు (ఉడికించాలి), నూనె - 3 టేబుల్ స్పూన్లు
 
 తయారి:  
 బీన్ కర్డ్‌ని అర అంగుళం ముక్కలుగా కట్ చేయాలి  
 
 టొమాటోలను శుభ్రంగా కడిగి ఉడికించి, తొక్క తీసి ముక్కలుగా కట్ చే యాలి  
 
 బాణలిలో నూనె వేసి కాగాక టొమాటో ముక్కలు, ఉప్పు వేసి మెత్తబడే వరకు ఉంచాలి  
 
 బీన్‌కర్డ్ ముక్కలు, వెల్లుల్లి తరుగు వే సి సన్నటి మంట మీద ఐదు నిమిషాలు ఉంచాలి  
 
 చిన్నగిన్నెలో నీరు, కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలిపి టీ స్పూన్ నూనె వేసి, పై మిశ్రమంలో వేసి కలిపి ఐదు నిముషాలు ఉడికించి దింపేయాలి  
 
 బఠాణీలతో గార్నిష్ చేయాలి.
 
 దహీ రింగ్ చాట్
 
 కావలసినవి:
 బియ్యప్పిండి -50 గ్రా., కారం - టీ స్పూను, చాట్‌మసాలా - అర టీ స్పూను, సేవ్ - పావు కప్పు, క్యారట్ తురుము - 3 టీ స్పూన్లు, ఉల్లితరుగు - అర కప్పు, పెరుగు - అర కప్పు, కొత్తిమీర - కొద్దిగా, ఉప్పు -తగినంత
 
 తయారి:  
 ఒక పాత్రలో బియ్యప్పిండి, అర టీ స్పూను కారం, ఉప్పు, తగినంత నీరు పోసి చపాతీపిండిలా కలపాలి  
 
 కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుని చేగోడీలాగ చేయాలి  అలా మొత్తం పిండితో తయారుచేసుకోవాలి  
 
 వీటిని ఆవిరి మీద ఉడికించి, బయటకు తీసి ఒక వెడల్పాటి పాత్రలో ఉంచాలి  
 
 ఉల్లితరుగు, క్యారట్ తురుము, కారం, చాట్ మసాలా, ఉప్పు, పెరుగు వేసి బాగా కలపాలి  
 
 చివరగా సేవ్, కొత్తిమీరలతో గార్నిష్ చేయాలి.
 
 థైర్ వెజ్ ఇడ్లీ
 
 కావలసినవి:
 గోధుమలు - ఒకటిన్నర కప్పులు, మినప్పప్పు - ముప్పావు కప్పు, బఠాణీ - పావు కప్పు, క్యారట్ తురుము - పావు కప్పు, బీన్స్ తరుగు - పావు కప్పు, పెరుగు - అర కప్పు, కొత్తిమీర - కొద్దిగా, కరివేపాకు - రెండు రెమ్మలు, ఆవాలు - టీ స్పూను, మినప్పప్పు (బద్దలు) - 2 టీ స్పూన్లు, శనగపప్పు - 2 టీ స్పూన్లు, అల్లం - చిన్న ముక్క, పచ్చిమిర్చి తరుగు - రెండు టీ స్పూన్లు, ఉప్పు - తగినంత, నూనె - తగినంత
 
 తయారి:  
 గోధుమలను నీటిలో రెండు గంటలు నానబెట్టాలి
 
 మినప్పప్పును నీటిలో అర గంట నానబెట్టాలి  
 
 గోధుమలను మరీ మెత్తగా కాకుండా రవ్వలా మిక్సీ పట్టాలి  
 
 మినప్పప్పును మెత్తగా మిక్సీ పట్టాలి ఒక గిన్నెలో మిక్సీ పట్టిన మినప్పిండి, గోధుమరవ్వ, ఉప్పు వేసి బాగా కలిపి ఆరు గంటలపాటు నాననివ్వాలి  
 
 బాణలిలో నూనె కాగాక, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి  
 
 క్యారట్ తురుము, బీన్స్ తరుగు వేసి ఐదారు నిముషాలు ఉంచి తీసేయాలి  
 
 నానబెట్టిన పిండిలో వీటిని కలిపి పెరుగు, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలపాలి  
 
 ఇడ్లీ రేకులలో వేసి కుకర్‌లో ఉంచి విజిల్ లేకుండా ఉడికించాలి.
 
 లస్సీ విత్ ఫ్లేక్స్

 
 కావలసినవి:
 పెరుగు - అరలీటరు, అల్లం తురుము - పావు టీ స్పూను, పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను, కార్న్‌ఫ్లేక్స్ - పావు కప్పు, కరివేపాకు - రెండు రెమ్మలు, కొత్తిమీర - కొద్దిగా, క్రీమ్ - 3 టీ స్పూన్లు, ఉప్పు
 
 తయారి:  
 మిక్సీలో అల్లం తురుము, పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేయాలి  
 
 పెరుగు, ఉప్పు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి  
 
 ఫ్రిజ్‌లో రెండు గంటలసేపు ఉంచాలి  
 
 గ్లాసులో ఈ మిశ్రమాన్ని పోయాలి  
 
 వరుసగా కార్న్‌ఫ్లేక్స్, కరివేపాకు, కొత్తిమీర, క్రీమ్‌లను పైన వేసి సర్వ్ చేయాలి.
 
 దహీ కడీ పకోడీస్
 
 కావలసినవి:
 కొద్దిగా పుల్లగా ఉన్న పెరుగు - రెండు కప్పులు (బాగా చిలకాలి), శనగపిండి - 2 టీ స్పూన్లు, కొబ్బరితురుము - టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను, కొత్తిమీర తరుగు - రెండు టీ స్పూన్లు, పసుపు - అర టీ స్పూను, పకోడీల కోసం: శనగపిండి -పావు కప్పు, పచ్చిమిర్చి తరుగు - అర టీ స్పూను, కొత్తిమీర - చిన్న కట్ట, తినే సోడా - చిటికెడు, పసుపు - కొద్దిగా, ఉప్పు - తగినంత, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా, పోపు కోసం: నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి - 1 (కట్ చేయాలి), జీలకర్ర - అర టీ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, కరివేపాకు - రెండు రెమ్మలు
 
 తయారి:
 ఒక పాత్రలో శనగపిండి, పచ్చిమిర్చి, కత్తిమీర, సోడా, పసుపు, ఉప్పు వేసి తగినంత నీరు పోసి పకోడీల పిండిలా కలుపుకోవాలి
 
 బాణలిలో నూనె కాగాక ఈ మిశ్రమాన్ని పకోడీలలా వేసి వేయించి గోధుమరంగులోకి వచ్చాక తీసి పక్కన ఉంచాలి  
 
 ఒక పాత్రలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి బాగా కలపాలి  
 
 ఒక చిన్న గిన్నెలో రెండు కప్పుల నీరు, శనగపిండి వేసి ఉండలు లేకుండా బాగా కలిపి వడగట్టాలి  
 
 వేయించిన కొబ్బరితురుము, అల్లంవెల్లుల్లి పేస్ట్ జతచేసి కలిపి స్టౌ మీద ఉంచి మరిగించాలి  
 
 మంట తగ్గించి ఐదు నిముషాలు ఉంచితే పులుసు రెడీ అవుతుంది  
 
 బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి  
 
 పచ్చిమిర్చి జతచేసి ఒకసారి వేయించాక, మరిగిన పులుసులో వేయాలి  
 
 తయారుచేసి ఉంచుకున్న పకోడీలను పులుసులో వేసి రెండు నిముషాలు ఉడికించి దించేయాలి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement