బాంబే నుంచి బార్సిలోనా వరకు! | Amin Shaikh Achievements Rental company officer | Sakshi
Sakshi News home page

బాంబే నుంచి బార్సిలోనా వరకు!

Published Sun, Aug 16 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 7:30 AM

మనసున్నవాడు... అభాగ్యుల మనసెరిగినవాడు... అమీన్ షేక్!

మనసున్నవాడు... అభాగ్యుల మనసెరిగినవాడు... అమీన్ షేక్!

ఆదర్శం
కొందరు ముందుకు దూసుకుపోతారు.  విజయాలను ఆస్వాదించడానికి మాత్రమే పరిమితమైపోతారు. కానీ మరికొందరు ముందుకు దూసుకుపోతారు. ఒకవైపు విజయాలను ఆస్వాదిస్తూనే వెనక్కి తిరిగి చూసుకుంటారు. తమ కష్టాలను, కన్నీళ్లను గుర్తు చేసుకుంటారు. అలాంటి కష్టాలు మరెవరూ పడకుండా చేయాలని తపన పడతారు. ఈ రెండో కోవకు చెందిన వ్యక్తే అమీన్ షేక్.
 
అమీన్ ముంబైలో ఒక కారు రెంటల్ కంపెనీకి యజమాని. ఒక మంచి రచయిత. కానీ ఒకప్పుడు తను ముంబై టీ కొట్టులో పనివాడు. మారుతండ్రి తనను హోటల్లో పనికి కుదిర్చితే విధి లేక మౌనంగా చేసేవాడు అమీన్. కొట్టు యజమానితో పాటు, కస్టమర్లు కూడా తిట్టేవారు, ఈసడించేవారు. సాయంత్రం ఇంటికి వస్తే మరో బాధ. మారుతండ్రి చిన్న చిన్న కారణాలతో దండించేవాడు. దాంతో ఈ బాధలు భరించలేక ఇంట్లో నుంచి పారిపోయాడు అమీన్.
 
ఆదరించేవాళ్లు లేరు. ఆకలి తీర్చే వాళ్లు లేరు. కడుపు కాలితే చెత్తకుండీలు వెదికేవాడు. కన్ను మూతపడితే పార్క్ బెంచి మీద వాలేవాడు. తన చిట్టి కడుపు నింపుకోవడం కోసం బూటు పాలిష్ దగ్గ ర్నుంచి చిన్నా చితకా పనులు ఎన్నో చేశాడు. అలాంటి సమయంలో ఒకరోజు ‘స్నేహసదన్’ అనే స్వచ్ఛందసంస్థ దృష్టిలో పడ్డాడు. వీధి బాలలు, అనాథ బాలలకు అండగా నిలబడే ఈ సంస్థ అమీన్‌కు ఆశ్రయం ఇచ్చింది. చదువు చెప్పించడంతో పాటు డ్రైవింగ్ నేర్పించి సర్టిఫికెట్ ఇప్పించింది. తర్వాత ఆ సంస్థకు సన్నిహితుడైన ఒక పెద్దాయన దగ్గర అమీన్ డ్రైవర్‌గా చేరాడు. అది అతని జీవితాన్నే మార్చేసింది.
 
అమీన్‌లోని కష్టపడేతత్వం, అంకిత భావం చూసి ఆ పెద్దాయన ముచ్చట పడ్డాడు. అమీన్ సొంతంగా కార్ రెంటల్ కంపెనీని మొదలు పెట్టడానికి కావలసిన సహాయ సహకారాలు అందించాడు. దాంతో ‘స్నేహ ట్రావెల్స్’ పేరుతో సొంతంగా ట్రావెల్ కంపెనీని పెట్టి, ఆర్థికంగా స్థిరపడ్డాడు అమీన్.
 
కానీ అక్కడితో ఆగిపోలేదు. ఒకసారి గతంలోకి చూసుకున్నాడు. తాను పడినట్లు ఎవరూ బాధ పడకుండా ఉండేందుకు తన వంతుగా ఏదైనా చేయాలను కున్నాడు. ‘బాంబే టు బార్సి లోనా’ పేరుతో ఒక ప్రాజెక్ట్ ప్రారంభించి వీధి బాలల కనీస అవసరాలు తీర్చడం మొదలు పెట్టాడు. బాంబే సరే... ఈ బార్సిలోనా ఏమిటి అంటే అమీన్ ఇలా చెప్తాడు...
 
‘‘నేను ముంబై నుంచి వెళ్లి తొలి సారిగా చూసిన నగరం స్పెయిన్‌లోని బార్సిలోనా. ఈ నగరం నాకు ఎంతగానో నచ్చింది. అక్కడ నాకు మంచి ఫ్రెండ్స్ కూడా ఏర్పడ్డారు. దీంతో డబ్బు పొదుపు చేసుకుని ప్రతి సంవత్సరం అక్కడకు వెళ్లి వస్తుండేవాడిని. అక్కడ నా ఫ్రెండ్స్ చేసే  రకరకాల స్వచ్ఛంద కార్యక్రమాలను గమనించేవాడిని. దాంతో సేవ గురించి లోతైన అవగాహన వచ్చింది. ఈసారి నాతో పాటు ముగ్గురు అనాథపిల్లల్ని కూడా తీసుకెళ్లి సంతోషపెట్టాను.’’
 
అమీన్ అంతే. అనాథ పిల్లల కళ్లలో కాస్త సంతోషం చూసినా మురిసిపోతాడు. ‘లైఫ్ ఈజ్ లైఫ్.. అయామ్ బికాజ్ ఆఫ్ యూ’ పేరుతో తాను రాసిన పుస్తకం మీద వచ్చిన లాభాలను కూడా వీధి పిల్లల కోసం కేటాయించాడు. అది మాత్రమే కాక ‘బాంబే టు బార్సిలోనా’ పేరుతో ముంబైలో తాను నడపనున్న కేఫ్ మీద వచ్చిన లాభాలను కూడా వీధిబాలల విద్యకు, ఉపాధికి  కేటాయించాలను కుంటున్నాడు. ఈ కేఫ్‌లో టీ తాగి కబుర్లు చెప్పుకోవడమే కాదు... మంచి మంచి పుస్తకాలు కూడా చదువుకోవచ్చు. డొనేషన్ బాక్స్ కూడా ఉంటుంది. దాతలు అందులో తమకు తోచినంత విరాళాన్ని వెయ్యవచ్చు. ఆ మొత్తాన్నీ వీధిబాలల సంరక్షణ కోసం ఖర్చు చేస్తాడు అమీన్.
 
ప్రసుత్తం ఎనిమిది మంది పిల్లలను దత్తత చేసుకుని, వారి సంరక్షణా బాధ్యతలను చూస్తున్నాడు అమీన్. భవిష్యత్‌లో మరింత మంది బాధ్యతను స్వీకరించాలనుకుంటున్నాడు. మంచి మనసుతో అనుకున్నది నెరవేరకుండా ఉంటుందా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement