తుపాకీ ‘రాయ్’డు | The country achieved successes garvincela | Sakshi
Sakshi News home page

తుపాకీ ‘రాయ్’డు

Published Sat, Sep 27 2014 12:01 AM | Last Updated on Sat, Sep 2 2017 2:00 PM

తుపాకీ ‘రాయ్’డు

తుపాకీ ‘రాయ్’డు

‘యత్రాహం విజయస్థత్రా’ ఇదీ భారత సైన్యంలోని ‘గూర్ఖా రైఫిల్స్’ నినాదం.  ఒకరకంగా ‘గూర్ఖా రైఫిల్స్’ విజయానికి రూపకాలంకారం. ఓటమిని అస్సలు ఇష్టపడరు. ఎంతకష్టమైనా అనుకున్నది సాధిస్తారు. అందుకే గూర్ఖా రైఫిల్స్‌కు సైన్యంలో ప్రత్యేకమైన స్థానం. భారత సైన్యంలో ‘11 గూర్ఖా రైఫిల్స్’ రెజిమెంట్‌లో సిపాయిగా చేరిన జీతూ రాయ్..  ఇదే విజయ మంత్రాన్ని పుణికి పుచ్చుకున్నాడు. తుపాకీతో శత్రువులను తుద ముట్టించాల్సిన తను... అదే ఆయుధంతో పతకాల పంట పండిస్తూ దేశం గర్వించేలా విజయాలు సాధిస్తున్నాడు. తాజాగా ఏషియాడ్‌లో ఒక స్వర్ణం, ఒక కాంస్యం గెలిచి భారత పతాకాన్ని రెపరెపలాడించాడు.     
- శ్యామ్ తిరుక్కోవళ్లూరు

 
సెప్టెంబర్ 20, 2014.. ఇంచియాన్‌లోని ఆంగ్‌నియాన్ షూటింగ్ రేంజ్... పురుషుల 50 మీ. ఎయిర్ పిస్టల్... అందరి కళ్లు స్టార్ షూటర్లు వాంగ్ ఝివీ (చైనా), జోంగో (దక్షిణ కొరియా)పైనే... కానీ ఈ ఇద్దరు ఫైనల్స్‌కు ముందే ఇంటిదారి పట్టారు. దీంతో చూపు హోంగ్ పుంగ్ (వియత్నాం)పై నిలిచింది. స్వర్ణంపై గురి అతనిదేనని అంతా భావించారు. అయితే అంచనాలను తలకిందులు చేస్తూ భారత షూటర్ జీతూ రాయ్ చివరి ప్రయత్నంలో లక్ష్యంవైపు పిస్టల్ పేల్చి స్వర్ణం అందించాడు. అంతే షూటింగ్ రేంజ్‌లో ఒక్కసారిగా హర్షధ్వానాలు.. సాక్షాత్తు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ సైతం చప్పట్లు కొట్టారంటే జీతూ రాయ్ సాధించిన విజయం ఎంత అమూల్యమైనదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
 
పడిలేచిన కెరటం

షూటింగ్ కెరీర్‌ను జీతూరాయ్ ఆకస్మికంగా ఎంచుకోవాల్సి వచ్చింది. గూర్ఖా రెజిమెంట్‌లో సిపాయిగా శిక్షణ సమయంలో రాయ్ అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు. ఆర్మీ ఆధ్వర్యంలో నిర్వహించిన యంగ్ బ్లడ్ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటడంతో ఓ అధికారి అతన్ని షూటింగ్ బృందంలోకి ఎంపిక చేశారు. ఇది సరిగ్గా నాలుగేళ్ల కిందట జరిగింది. అయితే ట్రైనింగ్‌లో చూపిన ప్రతిభను మహూలోని ఆర్మీ మార్క్స్‌మన్‌షిప్ యూనిట్ (ఏఎంయూ)లో కనబర్చలేకపోయాడు. ఫలితంగా ఏఎంయూ నుంచి తిరిగి రెజిమెంట్‌కు వెళ్లాల్సి వచ్చింది.

మళ్లీ సత్తా చాటడంతో తిరిగి ఏఎంయూలో శిక్షణకు ఎంపికయ్యాడు. ఈసారీ అదే ఫలితం. అధికారులు మళ్లీ తనని రెజిమెంట్‌కు పంపారు. ఏఎంయూ నుంచి నైపుణ్యం లేదన్న కారణంగా తనను బయటకు పంపడాన్ని రాయ్ జీర్ణించుకోలేక పోయాడు. పోయిన చోటే వెతుక్కున్నాడు. షూటింగ్ కెరీర్‌ను సవాలుగా తీసుకున్నాడు. లక్ష్యంపై గురిపెట్టాడు. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించాడు.

దేశవాళీ పోటీలనే ఇందుకు వేదికగా చేసుకున్నాడు. చివరికి సఫలమయ్యాడు. తనను వద్దన్న వాళ్లే తిరిగి ఏంఎంయూలోకి ఎంపిక చేసేలా చేశాడు. అదే ఉత్సాహాన్ని కొనసాగించి గత ఏడాది భారత్ బృందంలో చోటు దక్కించుకున్నాడు. అప్పటి నుంచి జీతూ రాయ్ వెనుదిరిగి చూడలేదు. పాల్గొన్న ప్రతీ చాంపియన్‌షిప్‌లోనూ లక్ష్యంవైపు గురిపెట్టి విజయవంతమయ్యాడు. ఫలితంగా తాను పాల్గొన్న తొలి ఏషియాడ్‌లోనే స్వర్ణం సాధించి భారత్‌కు ఇంచియాన్‌లో తొలి స్వర్ణం దక్కేలా చేశాడు.
 
పిస్టల్ కింగ్

లక్ష్యం దిశగా తుపాకీని గురిపెట్టి విజయం సాధించడంలో జీతూ రాయ్‌ని మించిన షూటర్లు లేరంటే అతిశయోక్తి కాదేమో. అందుకే అతన్ని ‘పిస్టల్ కింగ్’  అని అంతా ముద్దుగా పిలుచుకుంటారు. 10 మీ. ఎయిర్ పిస్టల్, 50 మీ. ఫ్రీ పిస్టల్ ఈవెంట్లలో నిలకడగా రాణిస్తున్నాడు. గత ఏడాది నిలకడగా మంచి ఫలితాలు సాధించడం ద్వారా మ్యూనిచ్ (జర్మనీ), చాంగ్‌వాన్ (దక్షిణ కొరియా) ప్రపంచ కప్‌లలో ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఇక ఈ ఏడాదైతే అత్యంత విజయవంతమైన భారత షూటర్‌గా జీతూ రాయ్ రికార్డులకు ఎక్కాడు.

ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో 50 మీటర్ల ఫ్రీ పిస్టల్‌లో స్వర్ణాలు కైవసం చేసుకోవడం అతని ప్రతిభకు తార్కాణం. ఇంచియాన్‌లోనే 10 మీ. ఎయిర్ పిస్టల్‌లో టీమ్ విభాగంలో కాంస్యం నెగ్గాడు. ఇక ప్రపంచకప్‌లలోనైతే తన షూటింగ్ ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నాడు. తొమ్మిది రోజుల్లో ప్రపంచకప్‌లలో మూడు పతకాలు నెగ్గి ఔరా అనిపించుకున్నాడు. మ్యూనిచ్ ప్రపంచకప్‌లో 10మీ. ఎయిర్ పిస్టల్‌లో రజతం గెలిచాడు. మరిబోర్ ప్రపంచకప్‌లో 10 మీ. ఎయిర్ పిస్టల్‌లో బంగారు, 50 మీ. ఫ్రీ పిస్టల్‌లో రజత పతకాలు నెగ్గాడు.

ఒక ప్రపంచకప్‌లో రెండు పతకాలు నెగ్గిన తొలి భారత షూటర్‌గా ఘనత సాధించాడు. ఈ రెండు ప్రపంచకప్‌లలో సత్తా చాటడంతో అంతర్జాతీయ ర్యాంకుల్లో ఈ భారత షూటర్ టాప్-5లో స్థానం సంపాదించగలిగాడు. ప్రస్తుతం 10 మీ. ఎయిర్ పిస్టల్‌లో అగ్రస్థానం, 50 మీ. ఫ్రీ పిస్టల్‌లో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, ఒక కాంస్యంతో మొత్తం ఏడు పతకాలు సాధించి ఈ ఏడాదిని ఘనంగా ముగించాడు.

2014లో తన ప్రదర్శనపై జీతూ రాయ్ సంతృప్తి వ్యక్తం చేశాడు. షూటింగ్‌లో తన విజయానికి ఆర్మీ సహకారమే కారణమని చెప్పాడు. ‘నేను ఎంతో సాధిస్తానని కొన్నేళ్ల కిందట అస్సలు అనుకోలేదు. నేను ఆర్మీకి ఎంతో రుణపడి ఉన్నా. అంతర్జాతీయంగా నేను రాణించడానికి ఆర్మీయే కారణం. ఒకవేళ ఆర్మీ సహకారమే లేకపోతే నేను బ్రిటన్‌లోనో లేదంటే స్వగ్రామంలో ఆలుగడ్డలు పండించుకుంటూ ఉండేవాడిని’ అని జీతూ రాయ్ అన్నాడు.
 
లక్ష్యం ఒలింపిక్స్...

భారత్ నుంచి 2016 ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి షూటర్ కూడా జీతూనే. షూటింగ్ కెరీర్‌లో ఒక్కో మెట్టు ఎదుగుతున్న జీతూ రాయ్‌పై ఇప్పుడు అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఇప్పుడున్న జోరును తను మరో రెండేళ్ల పాటు కొనసాగించాల్సి ఉంటుంది. ఈ భారత షూటర్ పట్టుదల, ఉత్సాహం చూస్తుంటే రియో ఒలింపిక్స్ వరకు ఫామ్‌ను కొనసాగించడం పెద్ద కష్టమేమీ కాదు. అదే జరిగితే భారత త్రివర్ణ పతాకాన్ని మరోసారి రెపరెపలాడించడం ఖాయం.
 
షూటర్ల ఫ్యాక్టరీ...
 
ఆగస్ట్ 17, 2004.. ఏథెన్స్ ఒలింపిక్స్... మార్కోపోలో షూటింగ్ రేంజ్... పురుషుల డబుల్ ట్రాప్ పోటీల్లో భారత షూటర్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ రజత పతకం నెగ్గి చరిత్ర సృష్టించాడు. తను పతకం గెలుస్తాడని ఎవరూ ఊహించలేదు. అయితే రాథోడ్ విజయానికి కావడానికి మధ్యప్రదేశ్‌లోని మహూలో ఉన్న ఆర్మీ మార్క్స్‌మన్‌షిప్ యూనిట్ (ఏఎంయూ) కారణం. ఏథెన్స్ ఒలింపిక్స్‌కు నాలుగేళ్ల ముందటి నుంచి రాథోడ్ ఇక్కడే సాధన చేస్తున్నాడు. అంతర్జాతీయ షూటింగ్‌లో అలా మొదలైన ఏఎంయూ షూటర్ల ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. జీతూ రాయ్‌తో పాటు విజయ్ కుమార్, గుర్‌ప్రీత్ సింగ్, ఏడీ పీపుల్స్, ఇమ్రాన్ హసన్ ఖాన్, సీకే చౌదరి, హరి ఓం సింగ్, సుశీల్ గాలే, ప్రవీణ్ దాహియా, సీమా తోమర్ లాంటి అంతర్జాతీయ షూటర్లు ఏఎంయూలో శిక్షణ పొందిన వారే. ప్రస్తుతం అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తూ భారత్‌కు పతకాలు అందించి పెడుతున్నారు. ఇంకా అంతర్జాతీయంగా తమ సత్తా చాటేందుకు ఎంతో మంది షూటర్లు సిద్ధంగా ఉన్నారు.
 
అంతర్జాతీయ ప్రమాణాలతో...

మార్క్స్‌మన్ అంటే లక్ష్యాన్ని గురిచూసి కొట్టడం.. ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు అందించిపెట్టడమే లక్ష్యంగా మధ్యప్రదేశ్‌లోని మహూలో ఆర్మీ మార్క్స్‌మన్‌షిప్ యూనిట్ (ఏఎంయూ)లో అత్యాధునిక సౌకర్యాలతో షూటింగ్ రేంజ్‌ను నెలకొల్పారు. 50 మీ. రేంజ్ (60 షూటింగ్ లేన్లు), 25 మీ. రేంజ్ ( 6 షూటింగ్ బేలు), 10 మీ. ఎయిర్ కండీషన్ రేంజ్ (60 షూటింగ్ లేన్లు), రెండు ట్రాప్, స్కీట్ రేంజ్‌లు, 250 మంది షూటర్లు బస చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఫలితంగా ఆర్మీ షూటర్లకు అత్యాధునిక షూటింగ్ రేంజ్ అందుబాటులోకి వచ్చింది. సుశిక్షితులైన షూటింగ్ కోచ్‌ల సాయంతో అనతి కాలంలోనే ఏఎంయూకు చెందిన భారత షూటర్లు అంతర్జాతీయంగా సత్తా చాటడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇదే ఏఎంయూ భారత కీర్తిని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తోంది.

తండ్రి మరణంతో మారిన గమ్యం

జీతూ రాయ్ పుట్టింది, పెరిగింది నేపాల్‌లోనే. సంకువసాబా జిల్లాలోని సిత్తల్‌పాటి-8 అనే మారుమూల గ్రామంలో పేదరికంలోనే పెరిగిన జీతూ... ఇంటికి సమీపంలోనే ఉన్న పొలంలో వ్యవసాయం చేసే తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. వరి, మొక్కజొన్న, ఆలుగడ్డలు పండించడంలో తల్లికి సహకరించే వాడు. 2006లో తన తండ్రి మరణంతో అతని గమ్యం మారింది. స్థానికంగా చాలా మంది యువకులు భారత సైన్యంలో చేరడంతో వారిని స్ఫూర్తిగా తీసుకుని తానూ ఆర్మీలో చేరాడు. టీనేజ్‌లో గూర్ఖా రైఫిల్స్‌లో సిపాయిగా బాధ్యతలు చేపట్టాడు. అయితే తనలోని నైపుణ్యం బయట పడేందుకు నాలుగేళ్ల సమయం పట్టింది. అప్పటిదాకా సాధారణ సిపాయిలా గూర్ఖా రెజిమెంట్‌లో కఠోర శిక్షణ తీసుకున్నాడు. అలా రాటుదేలిన జీతూ గమ్యం వైపు సాగి విజయవంతమయ్యాడు.
 
శభాష్ గూర్ఖా...

భారత సైన్యంలోని 11 గూర్ఖా రైఫిల్స్‌లో నేపాల్ దేశస్తులైన గూర్ఖా సైనికులకు స్థానం ఉంటుంది. ఇందులో నేపాల్‌కు చెందిన రాయ్, లింబూ తెగలకు చెందిన వాళ్లే ప్రధానంగా ఉంటారు. అయితే ఈ తెగలకు చెందిన వారిని ధైర్యానికి ప్రతీకగా భావిస్తారు. వీరిది అత్యంత దృడ నిర్మాణం, కఠినమైన స్వభావం. మహాభారత పురాణాల ప్రకారం అర్జునుడిని ఈ తెగలకే చెందిన కిరాంత్ వంశస్తులు ఓడించినట్లు చెబుతారు. ఇదే తెగలకు చెందిన జీతూ రాయ్ ఇప్పుడు అంతర్జాతీయ షూటింగ్‌లో రాణిస్తూ శభాష్ గూర్ఖా అనిపించు కుంటున్నాడు.


 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement