
లూసానే: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ జై షా మంగళవారం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్‌తో భేటీ అయ్యారు. త్వరలో లూసానేలోనే ఐఓసీ ఉన్నతస్థాయి అధికారులు పాల్గొనే అసాధారణ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మేటి క్రీడా కమిటీల చీఫ్‌ల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ నెలాఖరున (30వ తేదీ) జరిగే ఈ కీలకమైన సమావేశంలో క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో కొనసాగించే అంశంపై చర్చ జరుగనుంది. దీంతో ఈ చర్చ కంటే ముందుగా జై షా, థామస్ బాచ్‌లు అ అంశంపై అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఐసీసీ సోషల్ మీడియాలో ఇద్దరి ఫొటోను పోస్ట్ చేసింది.
‘లాస్ ఏంజెలిస్–2028 ఒలింపిక్స్‌లో టి20 ఫార్మాట్‌లో క్రికెట్ ఈవెంట్ జరగనుంది. అయితే 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్‌లో క్రికెట్ ఉంటుందా లేదా అన్నది ఇంకా ఖరారు కాలేదు. దాంతో తదుపరి విశ్వక్రీడల్లోనూ క్రికెట్ క్రీడను కొనసాగించే విషయంపై ప్రాథమిక దశ సంప్రదింపులు మొదలయ్యాయి. ఐసీసీ చైర్మన్ జై షా ఈ అంశమై ఐఓసీ చీఫ్ బాచ్‌తో సమావేశమయ్యారు’ అని ఐసీసీ ‘ఎక్స్’లో ట్వీట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment