భారతదేశంలో ఎందరో మహిళలు అత్యున్నత శిఖరాలు అధిరోహించారు. అత్యంత ప్రభావంతమైన పదవులను నిర్వహించారు.. నిర్వహిస్తున్నారు. అలాంటి కోవకు చెందినవారే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala Sitharaman). నేడు (ఆగస్ట్ 18) ఆమె పుట్టిన రోజు. 64 ఏళ్లు పూర్తయి 65వ యేడులోకి అడుగుపెట్టారు.
భారతదేశ ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఇంటరాక్టివ్ లీడర్‌షిప్ స్టైల్‌కు పేరుగాంచారు. కీలకమమైన ఈ పదవిని నిర్వహించిన రెండవ మహిళ, పూర్తి సమయం మహిళా ఆర్థిక మంత్రిగా పనిచేసిన మొదటి మహిళ నిర్మలా సీతారామన్.
సేల్స్ వుమన్ నుంచి..
సేల్స్ వుమన్ నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి అయ్యే వరకు నిర్మలా సీతారామన్ ప్రయాణం ఆసక్తికరంగా సాగింది. ఆమె పదునైన వాక్‌పటిమ, చతురత, అంకితభావం, ప్రతిభకు ముఖ్యమైన ఆర్థిక మంత్రి పదవి దక్కింది. తమిళనాడులోని మధురైలో ఒక మధ్యతరగతి కుటుంబంలో 1959 ఆగస్టు 18న నిర్మలా సీతారామన్ జన్మించారు. ఆమె తల్లి సావిత్రి సీతారామన్ గృహిణి. తండ్రి నారాయణ్ సీతారామన్ రైల్వేలో పనిచేశారు.
విద్యాభ్యాసం
తిరుచిరాపల్లిలోని సీతాలక్ష్మి రామస్వామి కళాశాల నుంచి ఎకనామిక్స్‌లో బీఏ పూర్తి చేసిన నిర్మలా సీతారామన్ 1984లో జేఎన్‌యూ నుంచి మాస్టర్స్ డిగ్రీని అభ్యసించించారు. ఇండో-యూరోపియన్ టెక్స్‌టైల్ ట్రేడ్‌పై పరిశోధనలో పీహెచ్‌డీ కూడా చేశారు. ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ (PWC)లో సీనియర్ మేనేజర్‌గా పనిచేశారు. కొంత కాలం పాటు బీబీసీతో కూడా ఆమెకు అనుబంధం ఉంది.
ఆర్థిక మంత్రిగా ముద్ర..
పార్లమెంట్ వర్షాకాల సెషన్‌లో, ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందెం క్లబ్‌లపై 28 శాతం ట్యాక్స్ ప్రవేశపెట్టడంతోపాటు జీఎస్టీ చట్టాలకు ముఖ్యమైన సవరణలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలకు తర్వాత కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీవిత బీమా పథకాలు, ఆర్థిక చేరికకు సంబంధించిన పథకాల అమలులో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (RRB) ప్రాముఖ్యతను నిర్మలా సీతారామన్ నొక్కిచెప్పారు. మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడం ద్వారా కొత్త ఆదాయపు పన్ను స్లాబ్‌లను ప్రవేశపెట్టడం ఆమె సాధించిన ముఖ్యమైన విజయాలలో ఒకటి.
ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి నాయకత్వం వహించడంలో సీతారామన్ కీలక పాత్ర పోషించారు. ఈ చర్యను 2020లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ వ్యూహాత్మక పునర్నిర్మాణం వల్ల ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనమయ్యాయి. బ్యాంకుల విలీనంతో భారత బ్యాంకింగ్ రంగం మరింత సామర్థ్యం చేకూరింది.
Comments
Please login to add a commentAdd a comment