రమీజా..మజాకా!
- టీవీ క్విజ్‌ల్లో వరుస విజయాలు
- మా టీవీ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లోనూ ప్రతిభ
చదివింది నర్సింగ్.. సాధిస్తున్నది బుల్లితెర బహుమతులు. ఒకటి కాదు రెండు కాదు వరుసగా మూడేళ్లలో మూడు కార్యక్రమాల్లో ప్రతిభ చాటి హ్యాట్రిక్ సాధించాడు. అతనే మదనపల్లెకు చెందిన మహమ్మద్ రమీజ్. మా టీవీ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో పాల్గొని రూ.3.20 లక్షలు గెలుచుకున్నాడు. దీనికి సంబంధించిన కార్యక్రమం ఆదివారం మాటీవీలో ప్రసారమైంది.
మదనపల్లె సిటీ : మదనపల్లెలో ఓ విద్యార్థి టీవీ క్విజ్ పోటీల్లో దూసుకుపోతున్నాడు. వరుస విజయాలతో అదరహో అనిపిస్తున్నాడు. ఇం దిరానగర్‌లోని ఫైరోజ్, జాహిదా దంపతులు. వీరి మొదటి కుమారుడు రమీజ్. 2012లో సోనీ టీవీలో అమితాబచ్చన్‌తో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో, 2013లో విజయ్ టీవీలో ప్రసారమైన ప్రకాష్‌రాజ్‌తో తమిళంలో ‘నీంగళ్ వెలలామ్ ఒరుకోడి’ (నీవు ఒక కోటి గెలవచ్చు) కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.
అమితాబ్, ప్రకాష్‌రాజ్‌తో కలిసి పలు క్విజ్‌లకు జావాబులిచ్చి అధిక మొత్తంలో బహుమతులను గెలుపొందాడు. తాజాగా మా టీవీ కార్యక్రమంలో మీలో ఎవరు కోటీశ్వరుడులోనూ అర్హత సాధించి రాయలసీమలోనే మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. రమీజ్ వృత్తిరీత్యా నర్సింగ్ కోర్సును పూర్తి చేశాడు. ఉద్యోగాన్వేషణలో భాగంగా ప్రతి రోజూ పత్రికలతో పాటు జీకే, కరెంట్ అఫైర్స్ పుస్తకాలను చదివేవాడు.
ఈ నేపథ్యంలో వరుసగా మూడు సంవత్సరాల్లో మూడు ప్రధాన కార్యక్రమాల్లో ఎంపికై హ్యాట్రిక్ సాధించాడు. అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు. ఇతని విజయం పట్ల రాజీవ్ విద్యామిషన్ అకడమిక్ మానిటరింగ్ అధికారి మహమ్మద్‌ఖాన్, టైలర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ. ఎస్.నజీర్, అంజుమన్ కమిటీ సభ్యులు ఖాదర్‌హుస్సేన్, సయ్యద్‌బాషా, ఎస్.హెచ్.రహమా న్, అలీ ఖాన్, రఫీవుల్లాఖాన్ అభినందించారు.
ఓటమే గెలుపునకు రాచబాట
క్విజ్ కార్యక్రమాల్లో చిన్నచిన్న తప్పిదాలతో అద్భుత విజయాలు దూరమవుతాయి. నిరాశ, నిస్ఫృహలకు లోనుకాకూడదు. మరింత పట్టుదలతో ముందుకెళితే మరిన్ని అద్భుతాలు సాధించవచ్చు. ఓటమి గెలుపునకు రాచబాట. మాటీవీ కార్యక్రమంలో రూ.25 లక్షలు గెలుపు వరకు వెళ్లా. ఓ చిన్నపొరబాటుతో దాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఎప్పటికైనా కోటి రూపాయల క్విజ్‌ను సాధించి తీరుతా.
- మహమ్మద్ రమీజ్