ఎన్‌ఆర్‌ఐలకు ఫండ్స్‌ రూట్‌! | Mutual Funds Investment for NRIs in India | Sakshi
Sakshi News home page

ఎన్‌ఆర్‌ఐలకు ఫండ్స్‌ రూట్‌!

Published Mon, Sep 23 2024 1:29 AM | Last Updated on Mon, Sep 23 2024 8:07 AM

Mutual Funds Investment for NRIs in India

స్వదేశంలో పెట్టుబడి అవకాశాలు 

దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు 

పెట్టుబడుల పరంగా వైవిధ్యం 

భారత్‌లో విశ్రాంత జీవనానికి తగినంత నిధి 

పన్ను కోణంలోనూ ఆకర్షణీయం

మెరుగైన ఆరి్థక వృద్ధితో భారత్‌ పెట్టుబడులకు ఆకర్షణీయమైన చిరునామాగా నిలుస్తోంది. దేశ, విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో పెట్టుబడులతో ముందుకు వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు (ఎన్‌ఆర్‌ఐలు) సైతం భారత ఈక్విటీ అవకాశాలు మెరుగైన ఆప్షన్‌ అని నిపుణులు చెబుతున్నారు.

 తమ పెట్టుబడులను వైవిధ్యం చేసుకోవడంతోపాటు, ఆకర్షణీయమైన రాబడులు, పన్ను ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. తమ విశ్రాంత జీవనాన్ని స్వదేశంలో ప్రశాంతంగా, హాయిగా గడపాలని కోరుకునే వారు.. భారత ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా మెరుగైన నిధిని ఏర్పాటు చేసుకోవచ్చు. 
 

పెట్టుబడులకు అనుకూల విధానాలు, వాతావరణంతోపాటు, మెరుగైన నియంత్రణలు భద్రతకు హామీనిస్తున్నాయి. దీర్ఘకాలంలో సంపద సృష్టికి లేదా స్థిరమైన ఆదాయం కోసం ఎన్‌ఆర్‌ఐలు ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.  

మ్యూచువల్‌ ఫండ్‌లు (అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు/ఏఎంసీలు) విదేశీ మారకంలో పెట్టుబడులు స్వీకరించవు. అదే విధంగా ఎన్‌ఆర్‌ఐలు భారత్‌లో సాధారణ సేవింగ్స్‌ ఖాతాలో డిపాజిట్‌కు విదేశీ మారకద్రవ్య చట్టం (ఫెమా) అనుమతించదు. రూపాయి మారకంలో పెట్టుబడులకే అనుమతి ఉంటుంది కనుక ఎన్‌ఆర్‌ఐలు భారత ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేసేందుకు వీలుగా ప్రత్యేక బ్యాంక్‌ ఖాతా ఉండాలి. నాన్‌ రెసిడెంట్‌ ఎక్స్‌టర్నల్‌ అకౌంట్‌ (ఎన్‌ఆర్‌ఈ), నాన్‌ రెసిడెంట్‌ ఆర్డినరీ అకౌంట్‌ (ఎన్‌ఆర్‌వో), ఫారీన్‌ కరెన్సీ నాన్‌ రెసిడెంట్‌ (ఎఫ్‌సీఎన్‌ఆర్‌) అకౌంట్‌ అందుబాటులో ఉన్నాయి.  

ప్రత్యేక బ్యాంక్‌ ఖాతా  అవసరం
→ ఎన్‌ఆర్‌ఈ ఖాతా అయితే.. విదేశాల్లో ఆర్జించిన మొత్తాన్ని స్వదేశానికి పంపుకునేందుకు ఉపకరిస్తుంది. ఈ ఖాతాలో డిపాజిట్లపై వచ్చే వడ్డీపై పన్ను లేదు.   

→ ఎన్‌ఆర్‌వో ఖాతా.. భారత్‌లో ఆదాయ వనరులను ఇక్కడే డిపాజిట్‌ చేసుకునేందుకు ఉపకరిస్తుంది. ఈ ఖాతా ద్వారా భారత్‌లో ఆదాయాన్ని భారత్‌లోనే ఇన్వెస్ట్‌చేసుకోవచ్చు. ఈ ఖాతాలోని డిపాజిట్లపై వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. ఒక ఆరి్థక సంవత్సరంలో గరిష్టంగా మిలియన్‌ డాలర్లనే ఈ ఖాతా నుంచి విదేశీ ఖాతాకు మళ్లించుకోగలరు.

→ విదేశీ కరెన్సీ రూపంలో డిపాజిట్లు కలిగి ఉండేందుకు ఎఫ్‌సీఎన్‌ఆర్‌ ఖాతా అనుకూలిస్తుంది. ఈ ఖాతాతో కరెన్సీ మారకం రేట్ల రిస్క్‌ లేకుండా చూసుకోవచ్చు. ఎఫ్‌సీఎన్‌ఆర్‌ టర్మ్‌ డిపాజిట్‌ ఖాతా కాగా, ఎన్‌ఆర్‌ఈ పొదుపు/కరెంటు/రికరింగ్‌/ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతాగా పనిచేస్తుంది.  

→ చెక్, డీడీ, నెఫ్ట్‌ లేదా ఆర్‌టీజీఎస్‌ ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్లను కొనుగోలు చేస్తే.. ఈ నిధుల మూ లాలు తెలియజేసేందుకు వీలుగా ఫారిన్‌ ఇన్‌వార్డ్‌ రెమిటెన్స్‌ సర్టిఫికెట్‌ (ఎఫ్‌ఐఆర్‌సీ)ను సమర్పించాల్సి ఉంటుంది. బ్యాంక్‌ ఛానళ్లు, బ్రోకరేజీ సంస్థల సాయంతోనూ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.

కేవైసీ కీలకం
భారత మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి ముందు కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇందుకోసం పాస్‌పోర్ట్‌ కాపీ, పుట్టిన తేదీ ధ్రువీకరణ కాపీ, పాన్, ఫొటో, విదేశీ చిరునామా ధ్రువీకరణ కాపీలను సమరి్పంచాలి. ప్రస్తుత నివాసం అది శాశ్వతమైనా లేదా తాత్కాలికమైనా సరే రుజువులు సమరి్పంచాలి. ఫారిన్‌ పాస్‌పోర్ట్‌ కలిగిన వారు ఓసీఐ కార్డ్‌ కాపీని ఇవ్వాల్సి ఉంటుంది.

పెట్టుబడుల మార్గాలు.. 
ఎన్‌ఆర్‌ఐలు తామే స్వయంగా లేదంటే పవర్‌ ఆఫ్‌ అటార్నీ (పీవోఏ) ద్వారా ఇతరుల సాయంతో మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. నేరుగా అంటే ఎన్‌ఆర్‌ఈ/ఎన్‌ఆర్‌వో ఖాతాను తెరిచి వాటి ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్లను కొనుగోలు చేయడం లేదా సిప్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది వీలు కానప్పుడు.. భారత్‌లో తాము విశ్వసించే వ్యక్తికి ఈ పని అప్పగిస్తూ పీవోఏ ఇవ్వొచ్చు. మీ తరఫున సంబంధిత వ్యక్తి పెట్టుబడుల వ్యవహారాలు చూస్తారు. 

ప్రతి లావాదేవీ నిర్వహణ సమయంలో పీవోఏ లేదా నోటరైజ్డ్‌ కాపీని సమరి్పంచాల్సి ఉంటుంది. కొన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు ఎన్‌ఆర్‌ఐ స్వయంగా హాజరు కావాలని కోరుతున్నాయి. కొన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు యూఎస్‌ఏ, కెనడాలోని ఎన్‌ఆర్‌ఐల నుంచి పెట్టుబడులు అనుమతించడం లేదు. ఫారిన్‌ అకౌంట్‌ ట్యాక్స్‌ కాంప్లియన్స్‌ యాక్ట్‌ (ఫాక్టా) నిబంధనల అమలు ప్రక్రి య సంక్లిష్టంగా ఉండడమే దీనికి కారణం. 

ఎన్‌ఆర్‌ఐలు, యూఎస్‌ పౌరుల ఆర్థిక లావాదేవీల వివరాలను అమెరికా ప్రభుత్వంతో పంచుకోవాలని ఫాక్టా నిర్దేశిస్తోంది. విదేశీ ఆదాయంపై పన్ను ఎగవేతలను నిరోధించేందుకు ఈ నిబంధన పెట్టారు. పైగా అమెరికా, కెనడా నియంత్రణ సంస్థల వద్ద భారత అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే అన్నీ కాకుండా, కొన్ని అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు యూఎస్‌ఏ, కెనడా నుంచి ఎన్‌ఆర్‌ఐల పెట్టుబడులను కొన్ని షరతుల మేరకు అనుమతిస్తున్నాయి. కనుక అమెరికా, కెనడాలోని ఎన్‌ఆర్‌ఐలు అదనపు డాక్యుమెంట్లను సమరి్పంచాల్సి రావ చ్చు.

 ఆదిత్య బిర్లా సన్‌లైఫ్, నిప్పన్‌ ఇండియా, క్వాంట్‌ మ్యూచువల్‌ ఫండ్, సుందరం మ్యూచువల్, యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో ఎన్‌ఆర్‌ఐలు ప్రత్యక్షంగా హాజరు కాకుండానే ఆన్‌లైన్‌లో, ఎలాంటి పరిమితులు లేకుండా ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఎన్‌ఆర్‌ఐలు ప్రత్యక్షంగా హాజరు కావాలనే సంస్థల్లో.. 360 వన్‌ మ్యూచువల్‌ ఫండ్, యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్, డీఎస్‌పీ మ్యూచువల్‌ ఫండ్, ఐటీఐ మ్యూచువల్‌ ఫండ్, కోటక్‌ మ్యూచువల్‌ ఫండ్, నవీ మ్యూచువల్‌ ఫండ్, ఎన్‌జే ఇండియా మ్యూచువల్‌ ఫండ్, పీపీఎఫ్‌ఏఎస్‌ ఫండ్, ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్, 

టారస్‌ మ్యూచువల్‌ ఫండ్, వైట్‌ఓక్‌ క్యాపిటల్‌ ఉన్నాయి. మోతీలాల్‌ ఓస్వాల్, ఐసీఐసీఐ మ్యూచువల్‌ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్, ఎడెల్‌వీజ్‌ మ్యూచువల్‌ ఫండ్, బంధన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కేవలం అమెరికాలోని ఇన్వెస్టర్ల నుంచే పెట్టుబడు లు స్వీకరిస్తున్నాయి. ఇవి కూడా ఫిజికల్‌ మోడ్‌లో నే (భౌతిక రూపంలో) పెట్టుబడులు అనుమతిస్తున్నాయి. ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ మొదటి లా వాదేవీ భౌతిక రూపంలో, తదుపరి లావాదేవీలు అన్‌లైన్‌లో నిర్వహించేందుకు అనుమతిస్తోంది. https://mfuindia.com/usa-canada-residents  నుంచి యూఎస్, కెనడాలోని ఎన్‌ఆర్‌ఐలు మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.  

అవకాశాలు.. 
మ్యూచువల్‌ ఫండ్స్‌లో రెగ్యులర్, డైరెక్ట్‌ అని రెండు రకాల ప్లాన్లు ఉన్నాయి. రెగ్యులర్‌ ప్లాన్లు మధ్యవర్తుల ప్రమేయంతో పొందేవి. అంటే పంపిణీదారులకు ఈ ప్లాన్ల ద్వారా కమీషన్‌ ముడుతుంది. కేవైసీ, డాక్యుమెంటేషన్‌ ప్రక్రియ, ఎటువంటి పథకాలను ఎంపిక చేసుకోవాలి తదితర సేవలను వీరి నుంచి పొందొచ్చు. వీరికి కమీషన్‌ చెల్లించాల్సి రావడంతో రెగ్యులర్‌ ప్లాన్లలో ఎక్స్‌పెన్స్‌ రేషియో (ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే చార్జీ) ఎక్కువగా ఉంటుంది. డైరెక్ట్‌ ప్లాన్లు దీనికి విరుద్ధం. ఇందులో మధ్యవర్తులకు కమీషన్‌ చెల్లింపులు ఉండవు. 

దీంతో ఎక్స్‌పెన్స్‌ రేషియో డైరెక్ట్‌ ప్లాన్ల కంటే తక్కువగా ఉంటుంది. దీంతో దీర్ఘకాలంలో రెగ్యులర్‌ కంటే డైరెక్ట్‌ ప్లాన్లలో రాబడులు అధికంగా ఉంటాయి. ఒక పథకానికి సంబంధించి అది రెగ్యులర్‌ లేదా డైరెక్ట్‌ ప్లాన్‌ ఏది అయినా కానీ.. పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో ఒక్కటే ఉంటుంది. డైరెక్ట్‌ ప్లాన్లు ఎంపిక చేసుకునే ఎన్‌ఆర్‌ఐలు తమ పెట్టుబడులను తామే నిర్వహించుకోగల అవగాహన కలిగి ఉండాలి. అప్‌స్టాక్స్, కువేరా, ఎన్‌ఆర్‌ఐలకు సంబంధించి వాన్స్‌ తదితర ప్లాట్‌ఫామ్‌లు డైరెక్ట్‌ ప్లాన్లలో పెట్టుబడులకు వీలు కలి్పస్తున్నాయి.  

ఉపసంహరణ – పన్ను బాధ్యత 
భారత మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడితే లాభంపై రెట్టింపు పన్ను చెల్లించాల్సి వస్తుందన్న భయం అక్కర్లేదు. భారత్‌తో ద్వంద పన్నుల నివారణ ఒప్పందం (డీటీఏఏ) కుదుర్చుకున్న దేశాల్లోని ఎన్‌ఆర్‌ఐలు ఒక చోట పన్ను చెల్లిస్తే సరిపోతుంది. యూఎస్, కెనడా, మధ్యప్రాచ్య దేశాలు సహా మొత్తం 80 దేశాలతో భారత్‌కు ఈ విధమైన ఒప్పందాలు ఉన్నాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ లాభాలపై భారత పౌరులకు, ఎన్‌ఆర్‌ఐలకు ఒకే రకమైన నిబంధనలు అమలవుతున్నాయి. 

ఎన్‌ఆర్‌ఐలు తమ మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులను ఆన్‌లైన్‌లోనే విక్రయించుకోవచ్చు. అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు లాభంపై పన్నును మినహాయించి మిగిలిన మొత్తాన్ని ఎన్‌ఆర్‌ఈ లేదా ఎన్‌ఆర్‌వో ఖాతాకు జమ చేస్తాయి. అన్ని ఏఎంసీలు ఎన్‌ఆర్‌ఐలు పెట్టుబడులు విక్రయించిన సందర్భంలో టీడీఎస్‌ను అమలు చేయాల్సి ఉంటుంది. 

ఈక్విటీ ఫండ్స్‌ అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షలకు మించిన లాభంపై 12.5 శాతం, అంతకులోపు విక్రయించగా వచ్చిన లాభం (స్వల్ప కాల మూలధన లాభం)పై 15 శాతం టీడీఎస్‌ అమలు చేస్తాయి. అదే డెట్‌ ఫండ్స్‌లో లాభాలపై పన్ను ఇన్వెస్టర్‌ వార్షిక ఆదాయానికి కలుస్తుంది. డీటీఏఏ కింద పన్ను ప్రయోజనాలను క్లెయిమ్‌ చేసుకోవాలనుకునే వారు తాము నివసిస్తున్న దేశం నుంచి ట్యాక్స్‌ రెసిడెన్సీ సరి్టఫికెట్‌ (టీఆర్‌సీ) సమరి్పంచాల్సి ఉంటుంది.

 భారత్‌లో పన్ను చెల్లించిన ఎన్‌ఆర్‌ఐలు తమ దేశంలో డీటీఏఏ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. గల్ఫ్‌ దేశాల్లోని ఎన్‌ఆర్‌ఐలు భారత మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవడం ద్వారా తమ విశ్రాంత జీవనానికి తగినంత నిధి సమకూర్చుకోవచ్చని రిటైర్మెంట్‌ విషయంలో సలహా, సూచనలు, పరిష్కారాలు అందించే ‘ద్యోత సొల్యూషన్స్‌’కు చెందిన కౌశిక్‌ రామచంద్రన్‌ సూచిస్తున్నారు. మధ్య ప్రాచ్య దేశాల్లో పౌరసత్వం పొందలేరు కనుక రిటైర్మెంట్‌ తర్వాత స్వదేశానికి రావాల్సిందేనని, అలాంటి వారికి భారత మ్యూచువల్‌ ఫండ్స్‌ అనుకూలమని పేర్కొన్నారు.

   – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement