న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత్‌దాస్ నుంచి తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నప్పటికీ, క్రిప్టో కరెన్సీకి చట్ట బద్ధత కల్పించడానికే కేంద్రం మొగ్గుచూపుతున్నట్లు మరోసారి స్పష్టం అయ్యింది. క్రిప్టో కరెన్సీని పన్ను పరిధిలోకి తీసుకువచ్చి, లాభాలపై పన్నులు విధించడంపై కేంద్రం దృష్టి సారించినట్లు స్వయంగా రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ వెల్లడించారు.
ఇందుకు సంబంధించి ఆదాయపు పన్ను చట్టాల్లో మార్పులు తీసుకురావడానికి సిద్ధమవుతోందని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారని భావిస్తున్న 2022–23 బడ్జెట్‌లోనే ఈ మేరకు ప్రతిపాదనలు ఉంటాయని ఆయన సూచించారు. క్రిప్టో కరెన్సీని కొందరు అసెట్‌గా భావిస్తున్నారని అన్నారు. తద్వారా వచ్చే ఆదాయంపై ఇప్పటికే కొంత మంది క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లిస్తున్నారని తరుణ్ బజాజ్ తెలిపారు.
ఇతర కొన్ని సేవల తరహాలోనే వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) కూడా క్రిప్టోకి వర్తిస్తుందని చట్టం ‘చాలా స్పష్టంగా‘ చెబుతోందని వివరించారు. ‘‘క్రిప్టోపై పన్ను అంశాలపై మేము దృష్టి సారిస్తాము. ఇప్పటికే ప్రజలు దానిపై పన్నులు చెల్లిస్తున్నారని నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ కొనుగోళ్ల పరిమాణం నిజంగానే చాలా పెరిగింది. ఈ అంశంపై పన్నులకు సంబంధించి కొన్ని చట్టపరమైన మార్పులు తీసుకురాగలమా లేదా అని చూద్దాం.
అయితే ఇది బడ్జెట్ నాటికి సిద్ధం అవుతుంది. మనం ఇప్పటికే బడ్జెట్‌కు దగ్గరగా ఉన్నాము. బడ్జెట్‌లో ప్రతిపాదనలను ప్రవేశపెట్టే విషయాన్ని పరిశీలించాలి’’ అని బజాజ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. క్రిప్టో ట్రేడింగ్ విషయంలో టీసీఎస్ (మూలం వద్ద పన్ను వసూలు) విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు ఏమి జరుగుతుందో చూడాల్సి ఉందని ఆయన అన్నారు.
వేగంగా పరిణామాలు...
క్రిప్టో కరెన్సీపై దేశంలో నియంత్రణకానీ, నిషేధంకానీ లేవు. ఈ వర్చువల్ కరెన్సీల వల్ల ఫైనాన్షియల్, ఆర్థిక వ్యవస్థలకు తీవ్ర విఘాతమని ఆర్‌బీఐ గవర్నర్ నుంచి ప్రకటనల నేపథ్యంలో మీడియాలో దీనికి అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రకటనలు వెలువడుతున్నాయి. సినీ స్టార్ నుంచి క్రీడాకారుల వరకూ క్రిప్టోకు సానుకూలంగా ప్రచారం చేస్తున్నారు.
క్రిప్టోకరెన్సీ పెట్టుబడిపై భారీ రాబడులు వస్తాయంటూ తప్పుదారి పట్టించే ప్రకటనలు వస్తున్నాయన్న ఆందోళనల మధ్య స్వయంగా ప్రధానమంత్రి మోదీ ఈ అంశంపై సమావేశం నిర్వహించడం గమనార్హం. మరోవైపు క్రిప్టోపై నిషేధం తగదని, దీనిపై నియంత్రణ మాత్రమే ఉండాలని బీజేపీ నాయకుడు జయంత్ సిన్హా నేతృత్వంలోని జరిగిన తాజా పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలో కూడా అభిప్రాయాలు వ్యక్తమవడం గమనార్హం.
ఆయా అంశాల నేపథ్యంలో క్రిప్టో కరెన్సీని నిబంధనలతో అనుమతించాలని కేంద్రం భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఈ నెల 29వ తేదీ నుంచీ ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల్లోనే కేంద్రం బిల్లు పెట్టడానికి కసరత్తు జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. వర్చువల్ కరెన్సీలకు సంబంధించి సేవలను అందించకుండా బ్యాంకులుసహా తన నియంత్రిత సంస్థలను అన్నింటిపైనా నిషేధం విధిస్తూ, 2018 ఏప్రిల్ 6వ తేదీన ఆర్‌బీఐ జారీ చేసిన ఒక సర్క్యులర్‌ను 2021 మార్చి 4వ తేదీన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి ఇక్కడ గమనించాల్సిన మరో అంశం.
Comments
Please login to add a commentAdd a comment