tax charge
-
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి 'కబ్జ' చిత్రానికి అభినందనలు
కన్నడలో భారీగా ప్రేక్షకాధరణ పొందిన చిత్రం 'కబ్జ'. ఇందులో ఉపేంద్ర , సుదీప్ , శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. మల్టీస్టారర్ చిత్రంగా 2023 మార్చి 17న ఈ చిత్రం విడుదలైంది. కన్నడ దర్శకుడు ఆర్ చంద్రు స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయనప్పటికీ నష్టాలు అయితే రాలేదు. అయితే, తాజాగా ఈ సినిమా నిర్మాత, దర్శకుడు అయిన ఆర్. చంద్రుని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రశంసా పత్రంతో సత్కరించింది.శ్రీ సిద్దేశ్వర్ ఎంటర్ప్రైజెస్ బ్యానర్‌పై కబ్జ సినిమాను ఆర్. చంద్రు నిర్మించారు. పెద్దగా లాభాలు రాకపోయినప్పటికీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్‌ను పూర్తిగా ఆయన క్లియర్ చేశాడు. దీంతో ఆర్.చంద్రు నిర్మాణ సంస్థకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రశంసా పత్రం జారీ చేసింది. పన్ను బకాయిలు పెట్టకుండా ఆ శాఖకు రికార్డు స్థాయిలో డబ్బు చెల్లించినందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి ప్రశంసా పత్రాన్ని ఆయన అందుకున్నారు. ఆర్.చంద్రు నిర్మించి, దర్శకత్వం వహించిన 'కబ్జా' దేశవ్యాప్తంగా ఆదరణ పొందింది. ఈ సినిమా నిర్మాత శ్రీ సిద్దేశ్వర్ ఎంటర్‌ప్రైజెస్‌కి ఇప్పుడు అత్యధిక పన్ను కట్టిన ఘనత దక్కింది.ఈ బ్యానర్‌పై ఐదు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆర్.చంద్రు కన్నడ సక్సెస్ఫుల్ దర్శకుల్లో ఒకరిగా పేరు పొందారు. చిక్కబళ్లాపూర్‌లోని ఓ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన చంద్రు ఈరోజు సినీ ప్రపంచంలో ఉన్నత స్థాయికి ఎదిగారు. ఈ కాలంలో దర్శకుడిగా విజయం సాధించడం అనేది చాలెంజింగ్‌తో కూడుకున్న పని. అయినప్పటికీ, అతను ప్రేక్షకుల ప్రశంసలు పొందిన చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మించాడు. తమ సొంత బ్యానర్ ద్వారా కూడా కొత్త వారికి అవకాశాలు ఇస్తున్నారు.ఇటీవల జరిగిన కన్నడ సినీ అవార్డ్స్‌లో 'కబ్జా' ఉత్తమ VFX పోస్ట్ ప్రొడక్షన్, యానిమేషన్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది. 1960 కాలం నేపథ్యంలో సాగే కథతో ఈ కబ్జ చిత్రాన్ని తెరకెక్కించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. -
Petrol Prices: ‘వ్యాట్’ తగ్గిస్తేనే పెట్రో ఊరట
న్యూఢిల్లీ/ముంబై/కోల్‌కతా: ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని, అక్కడి ప్రభుత్వాలు విలువ ఆధారిత పన్ను(వ్యాట్) తగ్గించకపోవడమే ఇందుకు కారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సామాన్య ప్రజలకు ఊరట కలిగించడానికి, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ తగ్గించాలని కోరారు. ప్రస్తుత ప్రపంచ సంక్షోభ సమయంలో సహకార సమాఖ్య స్ఫూర్తితో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రధాని మోదీ బుధవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. దేశంలో కోవిడ్–19 తాజా పరిస్థితిపై సమీక్షించారు. ఈ సందర్భంగా పెట్రో ధరల మోతను ప్రత్యేకంగా ప్రస్తావించారు. పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌లో ఎౖMð్సజ్ సుంకాలను తగ్గించిందని గుర్తుచేశారు. వ్యాట్ తగ్గించాలని కేంద్రం కోరినప్పటికీ కొన్ని రాష్ట్రాలు పెడచెవిన పెడుతున్నాయని, దీనివల్ల అక్కడి ప్రజలకు అన్యాయం జరుగుతోందని ఆక్షేపించారు. మరికొన్ని రాష్ట్రాలు తమ విజ్ఞప్తిని మన్నించి, వ్యాట్‌ను తగ్గించాయని చెప్పారు. సీఎంలను ప్రత్యేకంగా కోరుతున్నా.. బీజేపీ పాలిత కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించాయని వెల్లడించారు. దీనివల్ల రూ.వేల కోట్ల ఆదాయం నష్టపోతున్నప్పటికీ ప్రజలకు సాయం చేయడం కోసం ముందుకొచ్చాయని ప్రశంసించారు. ప్రతిపక్ష పాలిత మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లో కొన్ని కారణాల వల్ల వ్యాట్ తగ్గించలేదన్నారు. అందువల్లే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని తెలిపారు. తాను ఎవరినీ విమర్శించడంలేదని, ప్రజల సంక్షేమం కోసం ఇప్పటికైనా వ్యాట్ మినహాయించాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రత్యేకంగా విన్నవిస్తున్నానని చెప్పారు. కలిసి పనిచేయాలి ఉక్రెయిన్–రష్యా యుద్ధం, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మందగించిన భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే సహకార సమాఖ్య స్ఫూర్తిని పెంపొందించుకోవాలని ప్రధాని మోదీ చెప్పారు. సప్లైచైన్ తీవ్రంగా ప్రభావితం అవుతోందని, కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కరోనా సవాళ్లు ముగిసిపోలేదు కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లు ఇంకా అంతం కాలేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత రెండు వారాలుగా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని, అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. వైరస్‌కు వ్యతిరేకంగా వ్యాక్సినేషన్ అనేది అతిపెద్ద రక్షణ కవచమని తెలిపారు. పిల్లల్లో అర్హులైనవారందరికీ సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఇందుకోసం పాఠశాలల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ప్రజంటేషన్ ఇచ్చారు. కరోనాపై భారత్ సుదీర్ఘ యుద్ధం చేస్తోందని ప్రధానమంత్రి వివరించారు. కరోనాపై పోరాటంలో ముఖ్యమంత్రులు, అధికారులు, ఫ్రంట్‌లైన్ కార్యకర్తల కృషిని ఆయన ప్రశంసించారు. పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించాలి: కాంగ్రెస్ న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌పై పన్నుల రూపంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ.27 లక్షల కోట్లు ఆర్జించిందని, ఆ సొమ్మంతా ఏం చేశారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు. యూపీఏ సర్కారు హయాం కంటే మోదీ సర్కారు హయాంలో చమురుపై ఎక్సైస్ సుంకం ఎన్నో రెట్లు పెరిగిపోయిందన్నారు. ఈ సుంకాన్ని వెంటనే తగ్గించాలని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ట్వీట్ చేశారు. పెట్రోల్, డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను 2014 మే నెల నాటి స్థాయికి తగ్గించాలని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ విమర్శలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తిప్పికొట్టారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాయని, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికీ తగ్గించలేదని ధ్వజమెత్తారు. రూ.1,500 కోట్లు వెచ్చించాం: మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో పెట్రోల్, డీజిల్‌పై ప్రజలకు రాయితీ ఇస్తున్నామని, ఇందుకోసం గత మూడేళ్లలో రూ.1,500 కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. పెట్రో ధరలపై ప్రధాని అవాస్తవాలు చెబుతున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కరోనాపై సమీక్షించడానికి నిర్వహించిన వర్చువల్ భేటీలో ప్రధానమంత్రి పెట్రోల్ ధరలపై మాట్లాడడం ఏమిటని మమత ఆక్షేపించారు. ఈ భేటీలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. కేంద్రం రూ.26,500 కోట్లివ్వాలి: ఉద్ధవ్ థాకరే కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపుతోందని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరగుదలకు తాము బాధ్యత వహించబోమన్నారు. కేంద్రానికి ప్రత్యక్ష పన్నుల్లో 38.3 శాతం, జీఎస్టీ వసూళ్లలో 15 శాతం మహారాష్ట్ర నుంచే వస్తున్నాయని తెలిపారు. తమ వాటా కింద రూ.26,500 కోట్లు రావాల్సి ఉన్నప్పటికీ కేంద్రం ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఇది కూడా చదవండి: ద్వేషపూరిత రాజకీయాలకు స్వస్తి పలకాలంటూ మోదీకి లేఖ -
దేశంలో క్రిప్టో చట్టబద్ధత ఖాయం!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత్‌దాస్ నుంచి తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నప్పటికీ, క్రిప్టో కరెన్సీకి చట్ట బద్ధత కల్పించడానికే కేంద్రం మొగ్గుచూపుతున్నట్లు మరోసారి స్పష్టం అయ్యింది. క్రిప్టో కరెన్సీని పన్ను పరిధిలోకి తీసుకువచ్చి, లాభాలపై పన్నులు విధించడంపై కేంద్రం దృష్టి సారించినట్లు స్వయంగా రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఆదాయపు పన్ను చట్టాల్లో మార్పులు తీసుకురావడానికి సిద్ధమవుతోందని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారని భావిస్తున్న 2022–23 బడ్జెట్లోనే ఈ మేరకు ప్రతిపాదనలు ఉంటాయని ఆయన సూచించారు. క్రిప్టో కరెన్సీని కొందరు అసెట్‌గా భావిస్తున్నారని అన్నారు. తద్వారా వచ్చే ఆదాయంపై ఇప్పటికే కొంత మంది క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లిస్తున్నారని తరుణ్ బజాజ్ తెలిపారు. ఇతర కొన్ని సేవల తరహాలోనే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కూడా క్రిప్టోకి వర్తిస్తుందని చట్టం ‘చాలా స్పష్టంగా‘ చెబుతోందని వివరించారు. ‘‘క్రిప్టోపై పన్ను అంశాలపై మేము దృష్టి సారిస్తాము. ఇప్పటికే ప్రజలు దానిపై పన్నులు చెల్లిస్తున్నారని నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ కొనుగోళ్ల పరిమాణం నిజంగానే చాలా పెరిగింది. ఈ అంశంపై పన్నులకు సంబంధించి కొన్ని చట్టపరమైన మార్పులు తీసుకురాగలమా లేదా అని చూద్దాం. అయితే ఇది బడ్జెట్ నాటికి సిద్ధం అవుతుంది. మనం ఇప్పటికే బడ్జెట్‌కు దగ్గరగా ఉన్నాము. బడ్జెట్లో ప్రతిపాదనలను ప్రవేశపెట్టే విషయాన్ని పరిశీలించాలి’’ అని బజాజ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. క్రిప్టో ట్రేడింగ్ విషయంలో టీసీఎస్ (మూలం వద్ద పన్ను వసూలు) విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు ఏమి జరుగుతుందో చూడాల్సి ఉందని ఆయన అన్నారు. వేగంగా పరిణామాలు... క్రిప్టో కరెన్సీపై దేశంలో నియంత్రణకానీ, నిషేధంకానీ లేవు. ఈ వర్చువల్ కరెన్సీల వల్ల ఫైనాన్షియల్, ఆర్థిక వ్యవస్థలకు తీవ్ర విఘాతమని ఆర్బీఐ గవర్నర్ నుంచి ప్రకటనల నేపథ్యంలో మీడియాలో దీనికి అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రకటనలు వెలువడుతున్నాయి. సినీ స్టార్ నుంచి క్రీడాకారుల వరకూ క్రిప్టోకు సానుకూలంగా ప్రచారం చేస్తున్నారు. క్రిప్టోకరెన్సీ పెట్టుబడిపై భారీ రాబడులు వస్తాయంటూ తప్పుదారి పట్టించే ప్రకటనలు వస్తున్నాయన్న ఆందోళనల మధ్య స్వయంగా ప్రధానమంత్రి మోదీ ఈ అంశంపై సమావేశం నిర్వహించడం గమనార్హం. మరోవైపు క్రిప్టోపై నిషేధం తగదని, దీనిపై నియంత్రణ మాత్రమే ఉండాలని బీజేపీ నాయకుడు జయంత్ సిన్హా నేతృత్వంలోని జరిగిన తాజా పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలో కూడా అభిప్రాయాలు వ్యక్తమవడం గమనార్హం. ఆయా అంశాల నేపథ్యంలో క్రిప్టో కరెన్సీని నిబంధనలతో అనుమతించాలని కేంద్రం భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఈ నెల 29వ తేదీ నుంచీ ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల్లోనే కేంద్రం బిల్లు పెట్టడానికి కసరత్తు జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. వర్చువల్ కరెన్సీలకు సంబంధించి సేవలను అందించకుండా బ్యాంకులుసహా తన నియంత్రిత సంస్థలను అన్నింటిపైనా నిషేధం విధిస్తూ, 2018 ఏప్రిల్ 6వ తేదీన ఆర్బీఐ జారీ చేసిన ఒక సర్క్యులర్‌ను 2021 మార్చి 4వ తేదీన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి ఇక్కడ గమనించాల్సిన మరో అంశం. -
గూగుల్, నెట్‌ఫ్లిక్స్, ఫేస్బుక్.. గ్లోబల్ ‘టాక్స్’ షాక్!!
టెక్, సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు కలిసికట్టుగా షాక్ ఇచ్చేందుకు ప్రపంచం సిద్ధమైంది. గ్లోబల్ ట్యాక్స్ పేరుతో కనీసం 15 శాతం టాక్స్ వసూలు చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు 136 దేశాల(భారత్ సహా) అంగీకారం తెలిపగా, పాక్ సహా నాలుగు దేశాలు మాత్రం ఈ ఒప్పందానికి దూరం జరిగాయి. ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (OECD) ఆర్గనైజేషన్ సమావేశం శుక్రవారం పారిస్‌లో జరిగింది. తమ తమ దేశాల్లో ఆపరేషన్‌ను నిర్వహించుకునేందుకు గూగుల్, ఫేస్బుక్, నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, అమెజాన్.. ఇతరత్రాలకు ఓఈసీడీలోని దేశాలు కనీసం 15 శాతం ట్యాక్స్ విధించాలని తీర్మానించాయి. మొత్తం 140 దేశాల్లో శ్రీ లంక, కెన్యా, నైజీరియా, పాకిస్తాన్.. మాత్రం ఈ అగ్రిమెంట్లో చేరేందుకు విముఖత వ్యక్తం చేశాయి. అయితే టెక్ దిగ్గజాల నుంచి టాక్స్ వసూలు నిర్ణయం అమలు అయ్యేది మాత్రం 2023 నుంచే.. వీటితో పాటు ఏకపక్ష టాక్స్ విధింపు నిర్ణయాలను తక్షణమే వెనక్కి తీసుకుంటున్నట్లు OECD సభ్య దేశాలు ప్రకటించాయి. అక్టోబర్ 13న వాషింగ్టన్లో జరగబోయే జీ-20 ఫైనాన్స్ మినిస్టర్ల సమావేశంలో, ఈ నెలాఖరులో రోమ్(ఇటలీ)లో జరగబోయే జీ-20 నేతల సదస్సులో 15 శాతం పన్ను వసూలు నిర్ణయం గురించి అధికారిక ప్రకటన చేయనున్నారు. 15 మినిమమ్ టాక్స్ కాగా, గరిష్టంగా ఎంత ఉంటుందనేది మాత్రం ఫిక్స్ చేయలేదు. ఇక భారత్ విషయానికొస్తే.. డిజిటల్ అడ్వైర్టైజింగ్ సర్వీసుల మీద నేరుగా 6 శాతం ట్యాక్స్‌లను విధిస్తూ 2016లో నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో 1,600 కోట్ల రూపాయలు రాగా.. కిందటి ఏడాదితో పోలిస్తే అది రెట్టింపు వసూలు కావడం విశేషం. ఇక 2020లో నాన్ రెసిడెంట్ ఈకామర్స్ దారులపై 2 శాతం టాక్స్ విధించింది భారత్. ఇప్పటిదాకా తక్కువ శాతం చెల్లింపుతో సేవల్ని అందిస్తున్న టెక్ దిగ్గజాలకు.. కనీస విధింపు నిర్ణయం మింగుడు పడడం లేదు. సెర్చింజిన్ గూగుల్ అయితే ఇప్పటికే అడ్డగోలుగా ట్యాక్సులు చెల్లించాల్సి వస్తోందని అసంతృప్తిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో జీ-20 సమావేశాల్లోపు ఓఈసీడీ దేశాలకు విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాయి. అయితే సమయం లేకపోవడంతో ఈ ప్రయత్నం ఫలించకపోవచ్చనే అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. చదవండి: ఫేస్బుక్ ద్వారా సంపాదన.. ఎలాగో తెలుసా? -
పన్నుల ఆదాయం 43,864 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 2021–22 సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్లో 30 శాతానికి చేరువగా ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఆగస్టు నాటికి ఐదు నెలల కాలంలో ప్రభుత్వ ఖజానాకు వివిధ రూపాల్లో రూ.64,826 కోట్లు సమకూరినట్టు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. మొత్తం రూ.2.21 లక్షల కోట్ల బడ్జెట్లో 29.24 శాతంగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయానికి 31.62 శాతం రావడం గమనార్హం. ఈ ఏడాది పన్నుల ఆదాయం కింద రూ.43,864 కోట్లు రాగా, రూ.20 వేల కోట్లకు పైగా అప్పుల ద్వారా సమీకరించారు. ప్రతిపాదిత పన్నుల ఆదాయ బడ్జెట్ రూ.1.76 లక్షలకుగాను ఐదు నెలల్లో 25 శాతం మాత్రమే సమకూరింది. గత ఏడాది ఆగస్టు నాటికి పన్నుల ఆదాయం కింద 21.68 శాతం మాత్రమే వచ్చింది. అప్పులు 50 శాతం ఈ ఏడాది ప్రతిపాదిత అప్పుల బడ్జెట్లో ఐదు నెలల కాలానికే ప్రభుత్వం దాదాపు 50 శాతం మొత్తాన్ని సమకూర్చుకుంది. కాగ్ లెక్కల ప్రకారం ఆగస్టు నాటికి రూ.20,941.84 కోట్లు అప్పుల రూపంలో తెచ్చుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.45 వేల కోట్లు అప్పులుగా తీసుకురావాలన్నది లక్ష్యం కాగా, ఇందులో 46 శాతం ఇప్పటికే వచ్చాయి. అయితే, కరోనా కారణంగా గత ఏడాది ఇదే సమయానికి ప్రతిపాదిత బడ్జెట్లో 74.47 శాతం అప్పుల కింద తీసుకోవాల్సి వచ్చింది. ఇక, అప్పులకు వడ్డీల కింద ఇప్పటివరకు రూ.6,775.50 కోట్లు చెల్లించినట్టు కాగ్ లెక్కలు చెపుతున్నాయి. -
రాష్ట్రపతి నోట జీతం ప్రస్తావన.. రచ్చ రచ్చ
ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ల జీతం, సెలబ్రిటీల సంపాదన గురించి జనాల్లో ఒకరకమైన ఆసక్తి ఉంటుంది. ‘ఫలానా వాళ్లు ఎంత సంపాదిస్తారో తెలిస్తే షాక్ అవుతారు?’ లాంటి హెడ్డింగ్‌లకు దక్కే ఆదరణే అందుకు ఉదాహరణ. అయితే తమ జీతాలు, సంపాదన గురించి వాళ్లు బహిరంగంగా మాట్లాడే సందర్భాలు చాలా తక్కువ. అలాంటిది రాష్ట్రపతి హోదాలో రామ్‌నాథ్ కోవింద్ తన జీతం, కట్టింగ్ల గురించి మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. న్యూఢిల్లీ: తాజాగా ఓ న్యూస్ ఛానెల్ ద్వారా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురించి ట్విటర్ ఓ వీడియో వైరల్ అవుతోంది. ‘‘ దేశంలోనే అత్యధికంగా జీతం తీసుకుంటున్న వ్యక్తి నేను. నా నెల సంపాదన ఐదు లక్షలు. కానీ, అందులో 3 లక్షల దాకా ట్యాక్స్, కట్టింగ్ల రూపంలోనే పోతున్నాయి. ఆ లెక్కన నాకు మిగిలేది తక్కువే. అంటే మిగిలినవాళ్ల కంటే నేనేం బెటర్ కాదు. ఒక టీచర్ నాకంటే ఎక్కువే సేవింగ్స్ చేస్తున్నాడు’’ అంటూ సరదాగా నవ్వుతూ మాట్లాడారు ఆయన. అంతే.. राष्ट्रपति बोले- मुझे 5 लाख प्रति महीना तनख्वाह मिलती है जिसमें से पौने 3 लाख टैक्स चला जाता है, हमसे ज्यादा बचत तो एक टीचर की होती है#presidentkovind #UttarPradesh pic.twitter.com/D6MAgmFCZm — News24 (@news24tvchannel) June 27, 2021 రెండు వాదనలతో.. ఇక రాష్ట్రపతి జీతంలో ట్యాక్స్ కట్టింగ్లు ఉండవని, ఆ విషయం తెలియక ఆయన అలా మాట్లాడడం విడ్డూరంగా ఉందని కొందరు ట్విటర్ ద్వారా హేళన చేస్తున్నారు. పైగా పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇతరత్రా అలవెన్స్‌లు కూడా ఉంటాయని గుర్తుచేస్తున్నారు. మరికొందరేమో రాజ్యాంగంలోని ప్రతులంటూ కొన్ని ఆధారాలను ట్విటర్లో పోస్ట్ చేస్తున్నారు. పెన్షన్ యాక్ట్ 1951 ప్రకారం.. రాష్ట్రపతి జీతంపై పన్ను విధించరని చెప్తున్నారు. అయితే అదంతా ఉత్తదేనని, రాష్ట్రపతి జీతంలో కట్టింగ్లు ఉంటాయని వాదిస్తున్నారు. ఇంకొందరేమో మరి ఆ ట్యాక్స్ కట్టింగ్ల జీతం ఎటుపోతుందోనని ఇంటర్నెట్ ద్వారా ఆరా తీస్తున్నారు. ఈ వివాదం ఎటు నుంచి ఎటో వెళ్లి.. రాజకీయ దుమారానికి తెరలేపింది. ఇదిలా ఉంటే కిందటి ఏడాది కరోనా టైంలో జీతాల్లో కొంత వాటాను(30 శాతం దాకా) త్యాగం చేసినవాళ్లలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కూడా ఉన్నారు. చదవండి: రాష్ట్రపతి కాన్వాయ్ కోసం ఆగిన ఊపిరి! -
కెయిర్న్ వివాద పరిష్కారంపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: బ్రిటన్ ఇంధన దిగ్గజం కెయిర్న్‌తో పన్ను వివాదాన్ని పరిష్కరించుకునేందుకు మెరుగైన మార్గాలన్నీ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీనికి సంబంధించి ట్యాక్సేషన్ విషయంలో భారత సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే విధంగా, కెయిర్న్‌కు అనుకూలంగా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇవ్వడం తప్పు ధోరణులకు దారి తీసే అవకాశం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. భారత విభాగాన్ని గతంలో పునర్వ్యవస్థీకరణ చేసిన కెయిర్న్ దాదాపు రూ. 10,247 కోట్ల మేర పన్నులు, వడ్డీ కట్టాలంటూ ఆదాయ పన్ను శాఖ నోటీసులివ్వడం, కంపెనీకి చెందాల్సిన డివిడెండ్లను.. ట్యాక్స్ రీఫండ్లను జప్తు చేసుకోవడం తెలిసిందే. దీనిపై కెయిర్న్ వివిధ న్యాయస్థానాలతో పాటు అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌ను కూడా ఆశ్రయించగా.. కంపెనీకి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. కెయిర్న్‌కు భారత ప్రభుత్వం 1.725 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 12,600 కోట్లు) చెల్లించాలంటూ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇచ్చింది. వీటిని భారత ప్రభుత్వం సవాలు చేసింది. రికవరీ బాటన పరిశ్రమ: పారిశ్రామిక రంగం రికవరీ బాటన పయనిస్తోందని ఆర్థికమంత్రి ఫైనాన్షియల్ టైమ్స్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నిర్వహించిన ఒక వెబినార్‌లో పేర్కొన్నారు. కరోనా సెకండ్‌వేవ్ సవాళ్ల నేపథ్యంలోనూ పెట్టుబడి ఉపసంహరణసహా బడ్జెట్ ప్రతిపాదనలు అన్నింటినీ అమలు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. -
ఏపీ వాహనాల పన్నుపై చర్చించాలి
జగ్గయ్యపేట తెలంగాణ ప్రభుత్వం విధించిన ప్రవేశ పన్నుకు నిరసనగా జగ్గయ్యపేట మండలంలోని గరికపాడు ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల లారీ, టాక్సీ, ఇతర అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీలోని పలు జిల్లాలకు చెందిన యజమానులు, డ్రైవర్లు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన లారీ యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ నుంచి వచ్చే వాహనాలను పొరుగు రాష్ట్రాలకు చెందిన వాహనాలుగా గుర్తించి ప్రవేశ పన్ను చెల్లించాలంటూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్య వలన లారీ యజమానులు, డ్రైవర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉందన్నారు. విభజన చట్టంలో ప్రవేశ పన్ను, రహదారి పన్ను, ఇతర ఫీజులు వసూలు చేయవ ద్దని ఉందని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ప్రవేశ పన్ను వసూలు చేయటంతో యజమానులు ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంతో తీవ్రంగా చర్చించి పన్ను జీవోను వెంటనే రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. ఒకానొక సమయంలో ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా రోడ్డుపై నుంచి బయటకు లాగేశారు. ఈ ఆందోళనతో రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. స్థానిక శాసనసభ్యుడు శ్రీరాం రాజగోపాల్ ఆందోళనకారుల వద్దకు వచ్చి మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి పన్ను రద్దుకు చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. దాదాపు గంటన్నర పాటు ఆందోళన సాగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి యలమంచిలి వీర ఈశ్వరరావు, జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కోలేరు వెంకటరమేష్, విజయవాడ, రాజమండ్రి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, జగ్గయ్యపేట, వీరులపాడు, కంచికచర్ల ప్రాంతాలకు చెందిన లారీ యజమానుల సంఘం అసోసియేషన్ నాయకులు నాదెండ్ల కృష్ణ, సుంకర రమేష్, అప్పలరాజు, సురేష్, సత్యనారాయణ, నూకల శ్రీచంద్రశేఖర్, మండవ శ్రీధరన్, కర్రి విష్ణురెడ్డి, సూరపనేని సురేష్, సూరిబాబు, ఆదినారాయణ, ఇతర అనుబంధ సంఘాల యజమానులు పాల్గొన్నారు.