తెలంగాణ ప్రభుత్వం విధించిన ప్రవేశ పన్నుకు నిరసనగా జగ్గయ్యపేట మండలంలోని గరికపాడు ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద ఆంధ్ర, తెలంగాణ ...
జగ్గయ్యపేట
తెలంగాణ ప్రభుత్వం విధించిన ప్రవేశ పన్నుకు నిరసనగా జగ్గయ్యపేట మండలంలోని గరికపాడు ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల లారీ, టాక్సీ, ఇతర అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీలోని పలు జిల్లాలకు చెందిన యజమానులు, డ్రైవర్‌లు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన లారీ యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ నుంచి వచ్చే వాహనాలను పొరుగు రాష్ట్రాలకు చెందిన వాహనాలుగా గుర్తించి ప్రవేశ పన్ను చెల్లించాలంటూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్య వలన లారీ యజమానులు, డ్రైవర్‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉందన్నారు.
విభజన చట్టంలో ప్రవేశ పన్ను, రహదారి పన్ను, ఇతర ఫీజులు వసూలు చేయవ ద్దని ఉందని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ప్రవేశ పన్ను వసూలు చేయటంతో యజమానులు ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంతో తీవ్రంగా చర్చించి పన్ను జీవోను వెంటనే రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. ఒకానొక సమయంలో ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా రోడ్డుపై నుంచి బయటకు లాగేశారు. ఈ ఆందోళనతో రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. స్థానిక శాసనసభ్యుడు శ్రీరాం రాజగోపాల్ ఆందోళనకారుల వద్దకు వచ్చి మద్దతు తెలిపారు.
ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి పన్ను రద్దుకు చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. దాదాపు గంటన్నర పాటు ఆందోళన సాగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి యలమంచిలి వీర ఈశ్వరరావు, జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కోలేరు వెంకటరమేష్, విజయవాడ, రాజమండ్రి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, జగ్గయ్యపేట, వీరులపాడు, కంచికచర్ల ప్రాంతాలకు చెందిన లారీ యజమానుల సంఘం అసోసియేషన్ నాయకులు నాదెండ్ల కృష్ణ, సుంకర రమేష్, అప్పలరాజు, సురేష్, సత్యనారాయణ, నూకల శ్రీచంద్రశేఖర్, మండవ శ్రీధరన్, కర్రి విష్ణురెడ్డి, సూరపనేని సురేష్, సూరిబాబు, ఆదినారాయణ, ఇతర అనుబంధ సంఘాల యజమానులు పాల్గొన్నారు.