న్యూఢిల్లీ: దేశ ఫైనాన్షియల్ స్థిరత్వం, ఆర్థిక పురోగతిలో ఖచ్చితత్వం కలిగిన, విశ్లేషణాత్మక ఆడిట్ నివేదికల పాత్ర ఎంతో ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ఆయా అంశాలు వ్యవస్థల పట్ల ప్రజలలో విశ్వాసాన్ని నింపుతాయని అన్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ ఆడిట్ అండ్ అకౌంట్స్ (ఎన్‌ఏఏఏ) అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ రంగంలో సుపరిపాలనకు ఆడిటింగ్ ఒక మూలస్తంభమని అన్నారు.
‘‘ఉద్దేశించిన ఫలితాలను సాధించడంలో భాగంగా ప్రజా వనరులు బాధ్యతాయుతంగా, సమర్ధవంతంగా నిర్వహించబడుతున్నాయా లేదా అనే అంశంపై నిష్పాక్షిక అంచనాలకు రావడం అవసరం. ఈ దిశలో న్యాయమైన, నిష్పాక్షికమైన ఆడిట్ పాత్ర ఎంతో ఉంటుంది. ఇది ఆయా వర్గాల్లో విశ్వాసాన్ని నింపుతుంది’’ అని దాస్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయన ప్రసంగంలో మరికొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే...
► అంతర్జాతీయంగా చూస్తే, సమీకృత ఆర్థిక వ్యవస్థలో న్యాయమైన,నిష్పక్షపాతమైన ఆడిట్ అనేది కేవలం దేశీయంగా కీలక పాత్ర పోషించే అంశమే కాదు.ప్రపంచ వేదికపై దేశ ఖ్యాతిని,విశ్వసనీయతను పెంపొందించడానికి ఇది ఒక సాధనం.
► ఫైనాన్షియల్ మార్కెట్ల సంక్లిష్టత, సమర్థవంతమైన వనరుల కేటాయింపు, ప్రజల నుంచి సుపరిపాలనపై ఏర్పడుతున్న అధిక అంచనాలు ఇక్కడ ప్రస్తావించుకోదగిన అంశాలు. ఈ నేపథ్యంలో ఆడిట్ పాత్ర ఎంతో కీలకంగా మారింది.
► భారతదేశం వేగంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాం.ఈ విషయంలో భాగస్వాములందరికీ ఆర్థిక పనితీరుపై భరోసాను కల్పించడానికి ఆడిటర్ల నైపుణ్యం, ఈ వ్యవస్థలో పటిష్టత అవసరం.
► కేవలం అందుబాటులో ఉన్న సాక్ష్యాలు, సమాచారం ఆధారంగా ఆర్థిక నిర్ణయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సరికాని డేటా వల్ల తగిన నిర్ణయాలను తీసుకోలేం.
► ఇక్కడ బ్యాంకింగ్ రంగాన్నే ఒక ఉదాహరణగా తీసుకుందాం. సరికాని, తప్పుదోవ పట్టించే ఆర్థిక నివేదికల ఆధారంగా బ్యాంక్ రుణ మంజూరీలు చేసినట్లయితే, రుణగ్రహీత కంపెనీ చివరకు దానిని తిరిగి చెల్లించలేకపోతుంది. రుణదాతకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితి మిగులుతుంది. దీనికితోడు అర్హత కలిగిన కంపెనీలకు రుణం ఇవ్వడానికీ బ్యాంకింగ్ తదుపరి వెనుకడుగు వేస్తుంది. తనకు వచ్చిన నష్టాన్ని భర్తీ చేసుకోడానికి ఇతరులపై బ్యాంకులు వడ్డీభారాన్ని వేయకా తప్పనిసరి పరిస్థితి ఉంటుంది. వెరసి ఇదంతా ఆర్థిక వ్యవస్థ తిరోగమనానికి దారితీస్తుంది.
► ఆడిట్ నాణ్యత, పటిష్టత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల ఆడిట్‌ను మెరుగుపరచడానికి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)తో ఆర్‌బీఐ సంప్రదింపులు జరిపి అనేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరిలో వాణిజ్య బ్యాంకుల కోసం రిస్క్ ఆధారిత అంతర్గత ఆడిట్ వ్యవస్థను బలోపేతం చేశాం. ఏప్రిల్‌లో బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో (ఎన్‌బీఎఫ్‌సీ) చట్టబద్ధమైన ఆడిటర్ల నియామకానికి సంబంధించిన మార్గదర్శకాలను ఆధునికీకరణ జరిగింది. రదర్శకత, వివేకవంతమైన వ్యాపార వ్యూహం, సమర్థవంతమైన రిస్క్ మేనేజ్‌మెంట్ లక్ష్యాలుగా ఈ చర్యలను తీసుకున్నాం.
► ఆడిట్‌లో అంతర్జాతీయ ప్రమాణాలు మరింత పటిష్టం చేయడానికి ఈ రంగంలో ప్రముఖులు, నిపుణులతో పాటు ఫైనాన్షియల్ రంగంలోని నియంత్రణ సంస్థలు, పర్యవేక్షకులు కలిసి పనిచేయాలి. బలమైన,అందరికీ చేరువచేసే ఆర్థిక రంగాన్ని నిర్మించడానికి,సుపరిపాలనకు,నైతిక విధానాల పరిపుష్టికి చురుకైన చర్యలు తీసుకోవాలి.
ఆర్థిక పురోగతిలో ‘ఆడిట్’కు కీలకపాత్ర
Published Tue, Oct 26 2021 4:23 AM | Last Updated on Tue, Oct 26 2021 4:23 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment