రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్
ముంబై: దేశ స్థూల ఆర్థిక పరిస్థితులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ మరింత దృష్టి సారిస్తున్నారు. ఆర్థికాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన గురువారం పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్వీట్‌లో దాస్ ఈ వివరాలను వెల్లడించారు. నవంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి కేవలం అరశాతంగా నమోదయిన నేపథ్యంలో గవర్నర్ పారిశ్రామిక బృందాలతో భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
డిసెంబర్ రిటైల్ (2.19%), టోకు ధరలు (3.80%) తగ్గిన పరిస్థితుల్లో ఆర్‌బీఐ రెపో రేటును (ప్రస్తుతం 6.5%) తగ్గించాలని ఇప్పటికే పారిశ్రామిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. పాలసీ విధానాలు, తీసుకునే నిర్ణయాల విషయంలో ఆర్‌బీఐ తమ వాదనలకు ప్రాధాన్యమివ్వడం లేదని కూడా పలు సందర్భాల్లో పారిశ్రామిక ప్రతినిధుల నుంచి విమర్శ వస్తోంది. కొత్త గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ద్రవ్య పరపతి విధాన కమిటీ ఫిబ్రవరి 7వ తేదీన ద్వైమాసిన ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించనున్న సంగతి తెలిసిందే.
వరుస సమావేశాలు...
ఆర్‌బీఐ గవర్నర్‌గా డిసెంబర్ 12న బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండుసార్లు ప్రభుత్వ బ్యాంకర్లతో, ఒకసారి ప్రైవేటు బ్యాంకర్లతో ఆర్‌బీఐ గవర్నర్ సమావేశమయ్యారు. లిక్విడిటీ (ద్రవ్యలభ్యత), చిన్న పరిశ్రమలకు రుణ లభ్యతసహా దిద్దుబాటు చర్యల పరిధిలో (పీసీఏ) ఉన్న 11 బ్యాంకులపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు వార్తలు వచ్చాయి. అటు తర్వాత లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ), నాన్– బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులతో కూడా భేటీ అయ్యారు. ఎంఎస్‌ఎంఈ ప్రతినిధులతో సమావేశం అనంతరం ఈ రంగం అభివృద్ధిపై సలహాలకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మాజీ చైర్మన్ యూకే సిన్హా నేతృత్వంలో ఆరుగురు సభ్యుల నిపుణుల కమిటీనీ ఏర్పాటు చేయడం గమనార్హం. ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి రూ.25 కోట్ల వరకూ రుణం ఉండి, చెల్లించలేకపోతున్న రుణాన్ని, ఒకేసారి పునర్‌వ్యవస్థీకరించడానికి కూడా ఆర్‌బీఐ అనుమతించింది.
Comments
Please login to add a commentAdd a comment