న్యూఢిల్లీ: భారత్ సమగ్ర, సుస్థిర అభివృద్ధికి, చిన్న పట్టణాల్లో ఉపాధి కల్పనకు మౌలిక, విద్య, ఆరోగ్య సంరక్షణా రంగాలతోపాటు డిజిటల్ ఎకానమీకి ఊపును ఇవ్వడానికి మరింత కృషి జరగాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ సూచించారు. ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) 48వ నేషనల్ మేనేజ్‌మెంట్ సదస్సును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్‌బీఐ గవర్నర్ మాట్లాడారు. ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే...
గతం భవిష్యత్తుకు బాట కావాలి
మహమ్మారి నుంచి కోలుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో సంక్షోభానికి దారితీసిన పరిస్థితులను సమీక్షించుకోవాలి. పటిష్టమైన, సమగ్రమైన, స్థిరమైన వృద్ధికి పరిస్థితులను సృష్టించుకోవాలి. సంక్షోభం కలిగించిన నష్టాన్ని పరిమితం చేయడం మొదటి అడుగు మాత్రమే. భవిష్యత్తులో ఇటువంటి సవాళ్లను ఎదుర్కొని, సుస్థిర వృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నం పక్కా ప్రణాళికకు అనుగుణంగా ఉండాలి. మధ్యకాలిక పెట్టుబడులు, పటిష్ట ఫైనాన్షియల్ వ్యవస్థలు, వ్యవస్థాగత సంస్కరణల ప్రాతిపదికన స్థిర వృద్ధి ప్రణాళికలను రూపొందించాలి. ఈ దిశలో విద్యా, ఆరోగ్యం, నూతన ఆవిష్కరణలు, భౌతిక, డిజిటల్ ఇన్‌ఫ్రాలపై మరిన్ని పెట్టుబడులు అవసరం. పోటీని, ఇందుకు సంబంధించి చైతన్యాన్ని పెంపొందించడానికి ప్రోత్సహించడానికి అలాగే మహమ్మారి ప్రేరిత అవకాశాల నుండి ప్రయోజనం పొందడానికి కార్మిక, ఉత్పత్తి మార్కెట్లలో మరింత సంస్కరణలను తీసుకుని రావాలి.
గిడ్డంగి, వ్యవ‘సాయం’ కీలకం
గిడ్డంగి, సరఫరా చైన్‌ల పటిష్టత, వ్యవసాయం ప్రత్యేకించి ఉద్యానవన రంగం విలువల పెంపునకు కృషి తత్సంబంధ మౌలిక సదుపాయాల కల్పన చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు, సమగ్రాభివృద్ధికి ఎంతో అవసరం. కొన్ని రంగాల కోసం ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత పథకం (పీఐఎల్) తయారీ రంగాన్ని ప్రోత్సహించడంలో ఒక ముఖ్యమైన చొరవ. దీనివల్ల ప్రయోజనాలు దీర్ఘకాలం కొనసాగుతాయి.
ప్రైవేటు వినయోగం పెరగాలి
కరోనా మహమ్మారి అటు అభివృద్ధి చెందుతున్న, చెందిన దేశాలలో పేదలపై తీవ్ర ప్రభావం చూపింది. మహమ్మారి సవాళ్లు తొలగిపోయిన తర్వాత సుస్థిర పురోభివృద్ధిని సాగించేలా మన ప్రయత్నం ఉండాలి. మహమ్మారి సవాళ్ల నేపథ్యంలో పడిపోయిన ప్రైవేటు వినియోగం పునరుద్ధరణ జరగాల్సి ఉంది. వృద్ధిలో ఈ విభాగం ప్రాధాన్యత ఎంతో ఉంది. ప్రస్తుతం ప్రపంచాభివృద్ధికి దేశాల మధ్య సమన్వయ సహకారం అవసరం అన్న అంశాన్ని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వ్యాక్సినేషన్ పురోగతిపై అన్ని దేశాలు పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉంది. మహమ్మారి తర్వాత ప్రపంచాన్ని కలుపుకుని పోవడం ఒక పెద్ద సవాలే. ఆటోమేషన్ వల్ల ఉత్పాదకత లాభం జరుగుతుంది. అయితే ఇది కార్మిక మార్కెట్‌లో మందగమనానికి దారితీసే అవకాశం ఉంది. ఈ సందర్భంలో శ్రామిక శక్తికి కీలక నైపుణ్యం, శిక్షణ అవసరం. బిలియన్ డాలర్(రూ. 7,300 కోట్లు) విలువను అందుకున్న స్టార్టప్‌లు (యూనికార్న్) 60కు చేరడం ఈ విషయంలో భారత్ పోటీ తత్వాన్ని తెలియజేస్తున్నాయి.
డిజిటల్, ఈ–కామర్స్, ఫార్మా వెలుగులు
భారత్ డిజిటల్ రంగంలో దూసుకుపోతోంది. ఇదే ధోరణి కొనసాగే వీలుంది. క్లౌడ్ కంప్యూటింగ్, కస్టమర్ ట్రబుల్‌షూటింగ్, డేటా అనలటిక్స్, వర్క్‌ప్లేస్ ట్రాన్స్‌ఫార్మేషన్, సప్లైచైన్ ఆటోమేషన్, 5జీ మోడరనైజేషన్, సైబర్ సెక్యూరిటీలో సామర్థ్యాల పెంపు వంటి విభాగాల్లో డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉంది. దేశంలో భారీగా విస్తరిస్తున్న రంగాల్లో ఈ–కామర్స్ ఒకటి. వృద్ధి చెందుతున్న మార్కెట్, ఇంటర్నెట్ సదుపాయాల విస్తరణ, స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరగడం, కోవిడ్ సవాళ్ల నేపథ్యంలో వినియోగదారు ప్రాధాన్యతల్లో మార్పు వంటి అంశాలు ఈ–కామర్స్ పురోగతికి దోహదపడుతున్నాయి. డిజిటల్ రంగం పురోగగతికి కేంద్రం డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్–అప్ ఇండియా, స్కిల్ ఇండియా, ఇన్నోవేషన్ ఫండ్ ఏర్పాటు వంటి ఎన్నో చర్యలను తీసుకుని వచి్చంది. దేశంలో పురోగమిస్తున్న రంగాల్లో ఔషధ విభాగం ఒకటి. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ అభివృద్ధి ద్వారా భారత్ ఈ విషయంలో తన సత్తా చాటింది.
ఇంకా గవర్నర్ ఏమన్నారంటే...
è గ్లోబల్ వ్యాల్యూ చైన్‌లో భారత్ వాటా గణనీయంగా పెరుగుతోంది. ఇది దేశీయ లఘు, మధ్య చిన్న తరహా పరిశ్రమలకు లాభించే అంశం.
è ఎగుమతుల రంగం పురోగమిస్తోంది. 2030 నాటికి బారత్ ఇంజనీరింగ్ ఎగుమతుల లక్ష్యం 200 బిలియన్ డాలర్లు. దీని లక్ష్య సాధనకు కృషి జరగాలి.
è దేశంలో ఎకానమీ పురోగతిలో బ్యాంకింగ్ పాత్ర కీలకం. ఇటీవల కాలంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలూ ఈ విషయంలో పురోగమిస్తున్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి.
మౌలిక, విద్య, ఆరోగ్య రంగాలపై దృష్టి అవశ్యం
Published Thu, Sep 23 2021 6:39 AM | Last Updated on Thu, Sep 23 2021 6:39 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment