ముంబై: పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో పన్ను తగ్గింపునకు కేంద్ర, రాష్ట్రాల సమన్వయ చర్య అవసరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ గురువారం పేర్కొన్నారు. తగ్గింపు విషయంలో ఆచితూచి నిర్ణయాలు అవసరమని అన్నారు. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలకు ఆదాయ పరమైన ఒత్తిడులు ఉన్న విషయాన్నీ ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కోవిడ్–19 ప్రేరిత సవాళ్లను ఎదుర్కొనడంసహా, పలు అభివృద్ధి కార్యకలాపాలకు ప్రభుత్వాలు భారీ వ్యయాలు చేయాల్సిన తక్షణ అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. బొంబాయి చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ‘‘ప్రభుత్వాల రెవెన్యూ ఇబ్బందులు ఒత్తిడులను పూర్తిగా అర్థం చేసుకోవాల్సిందే. అయితే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ద్రవ్యోల్బణం పెరుగుదలకు కూడా దారితీస్తుంది. ప్రత్యేకించి ఉత్పత్తి రంగంపై ప్రతికూలత చూపుతుంది’’ అని అన్నారు.
ఏఆర్‌సీలపై ప్రత్యేక దృష్టి
మొండిబకాయిల (ఎన్‌పీఏ) సమస్యల గురించి ఆర్‌బీఐ గవర్నర్ ప్రస్తావిస్తూ, అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీల (ఏఆర్‌సీలు) విషయంలో నియంత్రణా యంత్రాంగాన్ని మరింత పటిష్టవంతం చేయడంపై సెంట్రల్ బ్యాంక్ దృష్టి సారిస్తున్నట్లు వివరించారు. ఎన్‌పీఏల సమస్య పరిష్కారం విషయంలో ఏఆర్‌సీలే కీలకమన్న సంగతిని ఈ సందర్భంగా ప్రస్తావించారు. బ్యాంకింగ్ రంగానికి దన్నుగా మొండి బకాయిల నిర్వహణకు 2021–22 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రతిపాదించిన ఆస్తుల (రుణాల) పునర్ నిర్మాణ కంపెనీ(ఏఆర్‌సీ) ఏర్పాటును ప్రస్తావిస్తూ, ప్రస్తుత అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీల క్రియాశీలతకు ఎటువంటి అంతరాయం కలగని రీతిలోనే ప్రతిపాదిత ఏఆర్‌సీ ఏర్పాటు ఉంటుందని తెలిపారు. మొండి బకాయిల సమస్యను ఎలా ఎదుర్కొనాలన్న అంశంపై బ్యాంకింగ్‌లో అవగాహన, చైతన్యం పెరుగుతున్నట్లు గవర్నర్ తెలిపారు. బ్యాంకులు ఎన్‌పీఏలకు సంబంధించి తగిన కేటాయింపులు జరుపుతున్నాయని పేర్కొన్నారు. అలాగే పర్యవేక్షణ విధానాలకు ఆర్‌బీఐ మరింత పదును పెట్టినట్లు పేర్కొన్నారు. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఎన్‌పీఏల విషయంలో బ్యాంకింగ్ అంతర్గత అంశాలనూ ఆర్‌బీఐ పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు.
లిక్విడిటీ చర్యల వల్ల ఇబ్బంది లేదు
అసెట్ పర్చేజింగ్‌సహా వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పెంపునకు తీసుకుంటున్న చర్యలు ఆర్‌బీఐ బ్యాలెన్స్ షీట్‌పై ప్రతికూల ప్రభావం చూపు తుందన్న అంచనాలు సరికాదన్నారు. ఇటువంటి ఇబ్బంది ఏదీ తలెత్తబోదని ఆయన స్పష్టంచేస్తూ, సెంట్రల్ బ్యాంకింగ్ మౌలిక సూత్రాల విషయంలో రాజీ ఉండబోదని అన్నారు. ఎటువంటి రిస్క్ సమస్యలు లేని సావరిన్ (ప్రభుత్వ) బాండ్ల కొనుగోలుకు మాత్రమే సెంట్రల్ బ్యాంక్ ‘అసెట్ పర్చేజ్’ కార్యక్రమం పరిమితమవుతుందని స్పష్టం చేశారు.
డిజిటల్ కరెన్సీపై త్వరలో మార్గదర్శకాలు
డిజిటల్ (క్రిప్టో) కరెన్సీకి సంబంధించి పలు అంశాల్లో ఆర్‌బీఐలో అంతర్గతంగా పటిష్ట మదింపు జరుగుతోందని అన్నారు. త్వరలో ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను, ప్రతిపాదిత పత్రాలను సెంట్రల్ బ్యాంక్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. క్రిప్టో కరెన్సీ గురించి శక్తికాంతదాస్ మాట్లాడుతూ, ఆర్‌బీఐకి ఈ అంశంపై పలు ఆందోళనలు ఉన్నాయన్నారు. ఆయా అంశాలను కేంద్రంతో చర్చించినట్లు వెల్లడించారు.
ఎగుమతులు పెంచాలి...
దేశ ఎగుమతుల పెంపుపై ప్రత్యేక దృష్టి అవసరమని ఆర్‌బీఐ గవర్నర్ పేర్కొన్నారు. అలాగే వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను (ఎఫ్‌టీఏ) వ్యూహాత్మక ప్రాముఖ్యతనూ ప్రస్తావించారు. దేశీయంగా పటిష్టతేకాకుండా, అంతర్జాతీయంగా అవకాశాలను అందిపుచ్చుకోడానికి కూడా ఎఫ్‌టీఏలు దోహదపడతాయని అన్నారు. బ్రెగ్జిట్ అనంతర పరిస్థితుల నేపథ్యలో బ్రిటన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ)లతో వేర్వేరు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల బహుళవిధ ప్రయోజనాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు.
పెట్రో సెగతో ధరల మంట!
Published Fri, Feb 26 2021 5:14 AM | Last Updated on Fri, Feb 26 2021 8:19 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment