Audit Report
-
ధార్మిక సంస్థలకు.. ఐటీఆర్ ఫారం-7
ఐటీఆర్ ఫారం 7 గురించి చెప్పే కథ పెద్దగా ఉంటుంది. ప్రత్యేకంగా ఉంటుంది. ఇది కొంచెం కష్టతరమైనదేనని చెప్పక తప్పదు. ఎవరెవరు ఈ ఫారం వేయొచ్చంటే..– ధార్మిక సంస్థలు, మత ట్రస్టులు– రాజకీయ పార్టీలు – సైంటిఫిక్ రీసెర్చ్ సంస్థలు – యూనివర్సిటీలు, కాలేజీలు, సంస్థలు – ఖాదీ, గ్రామ పరిశ్రమ సంస్థలు పైన చెప్పిన అన్నింటికీ నిర్వచనాలు ఉన్నాయి. ఆ పరిధిలోకి వచ్చినవే ఫారం 7 వేయాలి. నిర్వచనం, పరిధి, కార్యకలాపాలు, ఆంక్షలు ఇలా కొన్ని విషయాలను చట్టంలో పొందుపర్చారు. ఇటువంటి సంస్థలు మినహాయింపు పొందాలంటే దీన్ని వినియోగించుకోవచ్చు. ఇటువంటి సంస్థలకు ఆదాయం ఉంటుంది. ఖర్చులు ఉంటాయి. నికర ఆదాయం పన్ను పరిమితిని దాటి ఉంటుంది. కానీ వారికి మినహాయింపు ఉంటుంది.పన్ను చెల్లించనక్కర్లేదు. పూర్తిగా మినహాయింపు వెసులుబాటు ఉంటుంది (చట్టానికి లోబడి). వారే ఫారం 7 వేయాలి. మినహాయింపునకు అర్హత లేని వారు, మినహాయింపు వద్దనుకున్న సంస్థలు ఫారం 7 వేయనక్కర్లేదు. అటువంటి సంస్థలు ఫారం 5 వేయాల్సి ఉంటుంది. గతంలో చెప్పినట్లు ఫారం 5 వేయాలా లేక ఫారం 7 వేయాలా అన్నది చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అవసరం అయితే, వృత్తి నిపుణుల సలహా తీసుకోండి. ట్రస్ట్, సొసైటీ, కంపెనీ, భాగస్వామ్య సంస్థ, స్థానిక సంస్థల, వ్యక్తుల కలయిక.. వీరందరూ కూడా ఈ రిటర్ను వేయొచ్చు.అయితే, ఫారం 3,4,5,6లకు .. ఈ ఫారం 7కు తేడా ఏమిటీ అంటే దీన్ని వేయాల్సిన వారు మినహాయింపు కోవకు చెందినవారై ఉండాలి. మినహాయింపునకు అర్హత ఉన్నవారే దాఖలు చేయాలి. ఆడిట్‌కి వర్తించే కేసులైతే, 31–10–2024 లోపల వేయాలి. వీరు ట్యాక్స్ ఆడిట్ రిపోర్టును కూడా నిర్దేశించిన ఫారంలో దాఖలు చేయాలి. ఇతరులు 31–07–2024 లోపల వేయాలి.ఏ చిన్న తప్పు దొర్లినా, భూతద్దంలో చూస్తారు. ఎందుకంటే దురదృష్టవశాత్తు కొన్ని సంస్థలు అర్హత లేకపోయినా పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందుతున్నాయి. మీరు ట్రస్టీలైనా, మేనేజ్మెంట్ మెంబర్లయినా తగిన జాగ్రత్తలు వహించండి. – కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులు -
భారీ నష్టాల్లో ఉత్తర డిస్కం
సాక్షి, హైదరాబాద్: ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) భారీ నష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. 2023 జనవరి 1– మార్చి 31 మధ్య కాలానికి సంబంధించి సంస్థ తాజాగా ప్రకటించిన ‘త్రైమాసిక విద్యుత్ ఆడిట్’ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. సంస్థ పరిధిలోని 17 జిల్లాల/విద్యుత్ సర్కిళ్లలో మొత్తం 38 విద్యుత్ డివిజన్లుండగా.. డివిజన్ల వారీగా విద్యుత్ సాంకేతిక, ఆర్థిక నష్టాల మొత్తాలను (ఏటీఅండ్‌సీ లాసెస్)ను సంస్థ ఈ నివేదికలో పొందుపరిచింది. మూడు డివిజన్లలో పరిధిలో ఈ నష్టాలు ఏకంగా 70–80 శాతానికి ఎగబాకినట్లు నివేదిక పేర్కొంది. అంటే ఈ డివిజన్లకు సరఫరా చేసిన మొత్తం విద్యుత్‌కు గాను కేవలం 20–30 శాతం బిల్లులు మాత్రమే వసూలయ్యాయన్నమాట. ముఖ్యంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సరఫరా చేసిన విద్యుత్‌కి సంబంధించిన బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లించకపోవడంతో పెద్దయెత్తున బకాయిలు పేరుకుపోతున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. స్థూలంగా 36 శాతం నష్టాలు గత త్రైమాసికంలో టీఎస్ఎన్పీడీసీఎల్ మొత్తం రూ.4,726.60 కోట్ల విద్యుత్ బిల్లులను జారీ చేయగా, రూ.3,203.89 కోట్లను (67.78శాతం) మాత్రమే వసూలు చేసుకోగలిగింది. అంటే 36.33 శాతం ఏటీ అండ్ సీ నష్టాలు నమోదయ్యాయి. డిస్కంల సుస్థిర మనుగడ కోసం ఏటీ అండ్ సీ నష్టాలను 2019–20 నాటికి 6 శాతానికి తగ్గించుకోవాలని ఉదయ్ పథకం కింద కేంద్రం లక్ష్యంగా నిర్దేశించింది. అయినా రాష్ట్ర డిస్కంలు అంతకంతకు నష్టాల్లో కూరుకుపోతున్నాయి. వసూలు కాని ‘ఇతర’ కేటగిరీ బిల్లులు గృహాలు, వాణిజ్యం, పారిశ్రామిక కేటగిరీల వినియోగదారులు 90 నుంచి 100 శాతం విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నట్టు త్రైమాసిక విద్యుత్ ఆడిట్ నివేదిక తెలిపింది. ఇతర కేటగిరీలో మాత్రం చాలా డివిజన్లలో ఒక శాతం బిల్లులు కూడా వసూలు కావడం లేదు. ఈ డివిజన్ల పరిధిలోని కాళేశ్వరం వంటి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పంప్‌హౌస్‌ల విద్యుత్ కనెక్షన్లు ఇతర కేటగిరీలోనే ఉన్నాయి. ఏటీ అండ్ సీ నష్టాలు అంటే..? సాంకేతిక లోపాలు, విద్యుత్ చౌర్యంతో డిస్కంలకు జరిగే నష్టాలను విద్యుత్ రంగ పరిభాషలో.. ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ (టీ అండ్ డీ) నష్టాలంటారు. సాంకేతిక లోపాలు, విద్యుత్ చౌర్యంతో పాటు వసూలుకాని విద్యుత్ బిల్లులను కలిపి..అగ్రిగేట్ టెక్నికల్ అండ్ కమర్షియల్ లాసెస్ (ఏటీ అండ్ సీ లాసెస్) అంటారు. పెద్దపల్లిలో 80%..కరీంనగర్ రూరల్‌లో 78.99% నష్టాలు పెద్దపల్లి డివిజన్లో విద్యుత్ సాంకేతిక, వాణిజ్య నష్టాల మొత్తం ఏకంగా 80.18 శాతానికి ఎగబాకి రాష్ట్ర విద్యుత్ రంగ చరిత్రలోనే కొత్త రికార్డును సృష్టించింది. ఈ డివిజన్లో గత త్రైమాసికంలో రూ.435.08 కోట్ల విద్యుత్ బిల్లులను జారీ చేయగా, కేవలం రూ.89.63 కోట్లు (20.6%) మాత్రమే వసూలయ్యాయి. డివిజన్ పరిధిలో 1,71,002 విద్యుత్ కనెక్షన్లుండగా, 421.55 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్ సరఫరా చేశారు. 15.95 ఎంయూల (3.78 శాతం) ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నష్టాలు (టీ అండ్ డీ లాసెస్) పోగా, మిగిలిన 405.6 ఎంయూల విద్యుత్‌ను వినియోగించినందుకు గాను వినియోగదారులకు రూ.435.08 కోట్ల బిల్లులు జారీ చేశారు. ♦ కరీంనగర్ రూరల్ డివిజన్లో 78.99 శాతం ఏటీఅండ్‌సీ నష్టాలు నమోదయ్యాయి. అక్కడ రూ.445.67 కోట్ల బిల్లులకు గాను రూ.96.28 కోట్లు (21.6%) మాత్రమే వసూలయ్యాయి. ♦ భూపాలపల్లిలో 71.2 శాతం ఏటీఅండ్‌సీ నష్టాలు వచ్చాయి. అక్కడ రూ.205.7 కోట్ల బిల్లులకు గాను రూ.80.19 కోట్లే (38.98 శాతం) వసూలయ్యాయి. ఇక అక్కడ టీ అండ్ డీ నష్టాలు సైతం 26.13 శాతంగా ఉన్నాయి. చౌర్యం/సాంకేతిక లోపాలతో ఏకంగా 99.35 ఎంయూల విద్యుత్ నష్టం జరిగింది. ♦ ములుగు డివిజన్లో 61.58 శాతం ఏటీ అండ్ సీ నష్టాలు వచ్చాయి. అక్కడ రూ.122.36 కోట్ల బిల్లులకు గాను రూ.48.97 కోట్లు (40.02 శాతం) మాత్రమే వసూలయ్యాయి. ♦కరీంనగర్ డివిజన్లో 48.86 శాతంఏటీఅండ్సీ నష్టాలు నమోదయ్యాయి. అక్కడ రూ.444.12 కోట్ల బిల్లులకు గాను రూ.218.46 కోట్లు (49.10%) మాత్రమే వసూలయ్యాయి. ♦మంథని డివిజన్లో 44.12 శాతం ఏటీఅండ్ సీ నష్టాలున్నాయి. అక్కడ రూ.328.8 కోట్ల బిల్లులకు గాను రూ.144.48 కోట్లు (43.94%) మాత్రమే వసూలయ్యాయి. హన్మకొండ రూరల్‌లో 34.54 శాతం ఏటీఅండ్ సీ నష్టాలు వచ్చాయి. అక్కడ రూ.177.25 కోట్ల బిల్లులకు గాను రూ.124.79 కోట్లు (70.4శాతం) మాత్రమే వసూలయ్యాయి. మరో 7.04 శాతం టీ అండ్ డీ నష్టాలున్నాయి. పైన పేర్కొన్న ఈ డివిజన్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి పంప్‌హౌస్‌లతో పాటు దేవాదుల, సమ్మక్క సాగర్ వంటి భారీ లిఫ్టులు కూడా ఉన్నాయి. -
వీడియోకాన్‌పై ఆడిట్ సందేహాలు
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న వీడియోకాన్ ఇండస్ట్రీస్ ఖాతా పుస్తకాల ఆడిట్ సమీక్షలో కొన్ని పద్దులు, లావాదేవీల నమోదుపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ప్రమోటర్ ధూత్ కుటుంబం నిర్వహణలో ఉన్నప్పుడు వీటి నమోదు జరిగి ఉండవచ్చని ఆడిట్ సమీక్ష పేర్కొంది. కంపెనీపై దివాలా చట్ట చర్యలు ప్రారంభించకముందు ఈ సందేహాస్పద లావాదేవీలు నమోదైనట్లు ఆడిట్ అభిప్రాయపడింది. కాగా.. వీడియోకాన్ రుణపరిష్కార నిపుణులు ఇప్పటికే జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)కు ఇలాంటి లావాదేవీలను రద్దు చేయడం, ప్రక్కన పెట్టడంపై దరఖాస్తు చేశారు. ఈ ఆడిట్ సమీక్ష వివరాలను గత నాలుగు త్రైమాసికాల ఆర్థిక ఫలితాలు ప్రకటిస్తున్న సందర్భంగా కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. దివాలా చట్ట నిబంధనల ప్రకారం ప్రిఫరెన్షియల్, విలువ తక్కువగా మదింపు, అక్రమ లావాదేవీల గుర్తింపునకు రుణ పరిష్కార నిపుణులు చేపట్టిన స్వతంత్ర లావాదేవీ ఆడిట్ సమీక్ష అనంతరం ఈ అంశాలు బయటపడినట్లు వివరించింది. రుణ పరిష్కార నిపుణులు 2021 జూన్(క్యూ1), సెప్టెంబర్(క్యూ2), డిసెంబర్(క్యూ3), 2022 మార్చి(క్యూ4)తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను క్రోడీకరించి పూర్తిఏడాది(2021–22) పనితీరును ప్రకటించారు. వెరసి వీడియోకాన్ ఇండస్ట్రీస్ స్టాండెలోన్ ఆదాయం రూ. 756 కోట్లకు చేరగా.. రూ. 6,111 కోట్లకుపైగా నికర నష్టం నమోదైంది. -
Odisha Train Accident: వామ్మో రైలా..! రైల్వే ఆడిట్ రిపోర్ట్‌లో ఏముంది?
ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనకు ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌ను మార్చడమే కారణమని కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దీనిపై గతంలో కాగ్ విడుదల చేసిన రైల్వే ఆడిట్ రిపోర్ట్ తెరపైకి రావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైల్వే భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. రైల్వే ఆడిట్ రిపోర్టును గత ఏడాది సెప్టెంబర్‌లోనే పార్లమెంట్లో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) విడుదల చేసింది. రైల్వే ట్రాక్‌లలో ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి లోటుపాట్లను సవరించే అంశంపై విస్తుపోయే అంశాలను కాగ్ నివేదికలో పేర్కొంది. విస్తుపోయే నిజాలు.. 2017-21 మధ్య మొత్తం 1,127 రైలు ప్రమాదాల్లో 289 ప్రమాదాలు ట్రాక్‌ల పునరుద్ధరణకు సంబంధించినవేనని కాగ్ నివేదిక పేర్కొంది. రైల్వే ట్రాక్‌ల నిర్మాణాలు, ప్రమాద ప్రదేశాల తనిఖీలు 30- 100 శాతం తగ్గాయి. 2017 నుంచి 2021 మార్చి వరకు 422 రైలు ప్రమాదాలు ఇంజనీరింగ్ సమస్యల కారణంగా జరిగాయి. అందులో 275 ప్రమాద ఘటనలు ఆపరేటింగ్ విభాగంలో లోపాల కారణంగా జరిగాయి. ట్రాక్‌లపై పాయింట్లను తప్పుగా గుర్తించారు. ప్రధానంగా 171 ప్రమాద కేసులు నిర్వహణ లోపాల కారణంగా జరిగాయి. 156 కేసుల్లో నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్‌ల నిర్మాణం చేపట్టినట్లు విస్తుపోయే విషయాలను కాగ్ నివేదిక పేర్కొంది. అంతేకాకుండా వేగంగా రైలు నడపడం కూడా ప్రమాద ఘటనలకు ప్రధాన కారణం అని నివేదిక వెల్లడించింది. నిధుల తగ్గింపు.. 63 శాతం ప్రమాద ఘటనల్లో నిర్ణీత గడువులోగా విచారణ చేపట్టలేదు. అంతేకాకుండా 49 శాతం కేసుల్లో ఆ నివేదికలను ఆమోదించడంలోనే ఆలస్యం జరిగింది. 2017-18 నుంచి ఐదేళ్లలో దాదాపు రూ. ఒక లక్ష కోట్ల కార్పస్ ఫండ్‌ను అందుకున్న రైల్వే శాఖ.. వ్యయం క్రమంగా తగ్గుముఖం పట్టింది. ట్రాక్‌ల పునరుద్ధరణకు నిదులు సరైన మోతాదుల్లో కేటాయించలేదు.. అంతేకాకుండా కేటాయించిన దానిలో పూర్తిగా ఖర్చు చేయలేదని నివేదిక వెల్లడించింది. రైల్వే ట్రాక్‌ల నిర్వహణను సకాలంలో చేయాలని కాగ్ తెలిపింది. మెరుగైన సాంకేతికతను ఉపయోగించాలని కోరింది. ఇలా అయితేనే రైలు ప్రమాదాలను పూర్తి స్థాయిలో నియంత్రించగలమని నివేదికలో స్పష్టం చేసింది. మరోవైపు బాలాసోర్‌లోని బహనగ స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి 7 గంటలకు మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య 288కు చేరింది. దాదాపు 900 మంది గాయపడ్డారు. ఇదీ చదవండి:లూప్ లైన్లో ఐరన్ ఓర్‌తో ఉన్న గూడ్స్‌ను కోరమండల్ ఢీకొట్టింది: రైల్వే బోర్డు మెంబర్ జయవర్మ సిన్హా -
మ్యూచువల్ ఫండ్స్ ఫోరెన్సిక్ ఆడిటింగ్
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్, వాటి అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు, ట్రస్టీల ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణకు ఫోరెన్సిక్ ఆడిటర్లను సెబీ నియమించనుంది. యూనిట్ హోల్డర్ల ప్రయోజనాల పరిరక్షణకు వీలుగా మ్యూచువల్ ఫండ్ ట్రస్టీల పాత్ర, వాటిని జవాబుదారీ చేయడానికి సెబీ ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు చేయడం తెలిసిందే. మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు, ఏఎంసీలు, ట్రస్టీలు లేదా బోర్డ్ ఆఫ్ ట్రస్టీల ఫోరెన్సిక్ ఆడిట్ బాధ్యతల నిర్వహణకు అర్హత కలిగిన సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ సెబీ ప్రకటన జారీ చేసింది. ఎంపికైన సంస్థలు డిజిటల్ ఆధారాలైన మొబైల్, కంప్యూటర్లు, ట్యాబ్లెట్లు, హార్డ్ డ్రైవ్‌లు, యూఎస్బీ డ్రైవ్‌లను స్వాధీనం చేసుకుని, వాటిని విశ్లేషించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ ప్రక్రియలో గుర్తించిన అంశాలతో నివేదికను రూపొందించి సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. ఫోరెన్సిక్ ఆడిటింగ్, డిజిటల్ ఫోరెన్సిక్లో కనీసం 10 ఏళ్ల అనుభవం ఉండాలని సెబీ షరతుల్లో పేర్కొంది. అలాగే, కనీసం 10 పార్ట్నర్లు లేదా డైరెక్టర్లను ట్రస్టీ బోర్డుల్లో కలిగి ఉండాలని నిబంధనలు విధించింది. దరఖాస్తుల సమర్పణకు మార్చి 6 వరకు గడువు ఇచ్చింది. -
మా లెక్కే కరెక్ట్.. ఇక మీ ఇష్టం
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల ఆడిట్ రిపోర్టుల పరిశీలన కార్యక్రమం మంగళవారం కూడా కొన సాగింది. ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఎస్ఎఫ్ ఆర్సీ) కార్యాలయంలో దాదాపు 29 కాలేజీల ప్రతినిధులు హాజరయ్యారు. ఒక్కోకాలేజీ ప్రతినిధితో అధికారులు విడి విడిగా చర్చలు జరిపారు. జమాఖర్చుల వివరాలపై మరింత లోతుగా ప్రశ్నలు వేశారు. ఎఫ్ఆర్సీ వర్గాలు మాత్రం కాలేజీలు సమర్పించిన నివేదికల్లోని ప్రతీ అంశాన్ని నిశితంగా పరిశీలించాయి. యాజమాన్య ప్రతిని ధులు మాత్రం తమ ఖర్చులన్నీ న్యాయబద్ధమైనవేనని కమిటీ ఎదుట స్పష్టం చేసినట్టు తెలిసింది. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్త ఫీజుల ఖరారుపై కొంతకాలంగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. కోవిడ్ నేపథ్యంలో 2019లో ఖరారు చేసిన ఫీజులే కొనసాగించాలని ఎఫ్ఆర్సీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీంతో 80కిపైగా కాలేజీల యజమా న్యాలు ఎఫ్ఆర్సీ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశాయి. ఈ నేపథ్యంలో కాలేజీలు ప్రతిపాదించిన ఫీజులనే కొనసాగించేందుకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తుదిఫీజు ఖరారు బాధ్యతను ఎఫ్ఆర్సీకి అప్పగించడంతో ఆడిట్ రిపోర్టుల పునఃపరిశీలన చేపట్టారు. అప్పుడు ఎందుకు ఆమోదించారు? కొన్నినెలల క్రితం ఇవే ఆడిట్ రిపోర్టులను ఎఫ్ఆర్సీ ఆమో దించిందని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. కోర్టు వ్యాజ్యాలు, రవాణా చార్జీలు వంటివి తీసేసి, మిగతా ఖర్చులన్నీ న్యాయమైనవేనని ఎఫ్ఆర్సీ సమ్మతించినట్టు చెబుతున్నాయి. ఇప్పుడు అవే రిపోర్టులపై పరిశీలన చేపట్టడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నాయి. ఈసారి భిన్నమైన రీతిలో ప్రశ్నలు వేస్తున్నారని అంటున్నాయి. కాలేజీ ప్రాంగణంలో చేసిన రిపేర్లు, లేబొరేటరీల్లో అదనంగా ఏర్పాటు చేసిన వసతులపై కొన్ని కాలేజీలను గుచ్చిగుచ్చి ప్రశ్నించినట్టు తెలిసింది. మూడేళ్లలోనే రిపేర్లు ఎందుకు వచ్చాయి? ఈ వ్యయాన్ని ఆడిట్ రిపోర్టులో ఎందుకు చూపించారు? అని ఎఫ్ఆర్సీ నిలదీసినట్టు సమాచా రం. కాలేజీ ప్రాంగణంలో శుభ్రత కోసం చేపట్టిన ఖర్చును కూడా ప్రశ్నించినట్టు సమాచారం. ఆన్లైన్ విద్యాబోధనకు ఉపయోగించిన విధానాలు, అయిన ఖర్చులపై మరింత నిశితంగా పరిశీలించేందుకు ఎఫ్ఆర్సీ ఆసక్తి చూపినట్టు తెలిసింది. ఫీజు ఎంతో మేమే నిర్ణయిస్తాం.. ఆడిట్ రిపోర్టులు పరిశీలించిన తర్వాత కాలేజీ నిర్వాహకులతో అధికారులు ఏ విషయమూ చర్చించడం లేదు. గతంలో ఎంత ఫీజు ఇవ్వాలనుకునేది తమతో చర్చించి అంగీకారం కూడా తీసుకున్నాయని చెబుతు న్నాయి. మరోవైపు ఫీజు పెంచాలా? వద్దా? ఎంత పెంచాలి? అనే విషయాలను తర్వాత తెలియజేస్తామని అధికారులు అంటున్నారు. ఫీజు నిర్ణయంపై తమకు పూర్తి స్వేచ్ఛ ఉందని ఎఫ్ఆర్సీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీన్నిబట్టి ఎక్కడో ఒకచోట అవసరమైన మేర నిర్వహణ వ్యయంలో కోత పెట్టే అవకాశం కన్పిస్తోంది. మొత్తం మీద వీలైనంత మేర ఫీజులు తగ్గించాలనే యోచనలో ఉన్నట్టు ఎఫ్ఆర్సీ వర్గాలు తెలిపాయి. -
మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో అలజడి.. వెలుగులోకి భారీ స్కాం?
భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోషకాహార పథకంలో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. రేషన్ సరుకులను తరలించేందుకు వినియోగించిన ట్రక్కుల నంబర్లు బైకులుగా తేలటం నుంచి.. లబ్ధిదారుల వాస్తవానికి దూరంగా ఉండటం వరకు భారీ స్థాయిలో అవినీతి వెలుగులోకి వచ్చింది. ఈ స్కాంతో చిన్నారులు, మహిళలు పోషకాహారలోపానికి గురికావటంతో పాటు పన్ను చెల్లింపుదారుల కోట్లాది రూపాయలు అవినీతిపరుల చేతిలోకి వెళ్లినట్లు రాష్ట్ర ఆడిటర్ గుర్తించారు. పాఠశాల చిన్నారులకు ఉచిత ఆహారం పథకంలో అవినీతి జరిగినట్లు మధ్యప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ రూపొందించిన 36 పేజీల నివేదికలోని పలు అంశాలు బయటకి రావటం ఆ రాష్ట్ర ప్రభుత్వంలో అలజడి సృష్టిస్తోంది. 2021కి సంబంధించిన టేక్ హోమ్ రేషన్ పథకంలో దాదాపు 24 శాతం మంది లబ్ధిదారుల వివరాలను పరిశీలించినట్లు నివేదిక తెలిపింది. ఈ పథకం ద్వారా 34.69 లక్షల మంది 6 నెలల నుంచి 3 ఏళ్లలోపు పిల్లలు, 14.25 లక్షల గర్భిణీ మహిళలు, పాలిచ్చే తల్లులు, 0.64 లక్షల మంది పాఠశాల మానేసిన బాలికలకు పోషకాహారం అందించారు. నకిలీ ట్రక్కులు.. పోషకాహార పథకంలో భాగంగా వివిధ ఉత్పత్తి ప్లాంట్ల నుంచి సుమారు 1,125.64 మెట్రిక్ టన్నుల రేషన్ సరుకులను సరఫరా చేశారు. రవాణా కోసం ట్రక్కులకు రూ.6.94 కోట్లు ఖర్చు చేశారు. అయితే, ట్రక్కులుగా లెక్కలో చూపిన వాహనాలు బైకులు, కార్లు, ఆటోలు, ట్యాంకర్లుగా రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. దీంతో సరుకుల రవాణాలోనే కోట్లాది రూపాయలు దారిమళ్లినట్లు స్పష్టమవుతోంది. 9వేలు ఉండాల్సింది.. 36.08 లక్షలు రేషన్ తీసుకునేందుకు అర్హులైన పాఠశాల మానేసిన బాలికల వివరాలను 2018, ఏప్రిల్‌లోపు సేకరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయి. అయితే, 2021, ఫిబ్రవరి వరకు ఆ వివరాలను సేకరించలేకపోయింది మహిళా, శిశుసంక్షేమ శాఖ. మరోవైపు.. పాఠశాల విద్యా విభాగం రాష్ట్రంలో స్కూల్ మానేసిన బాలికలు 2018-19 మధ్య 9వేల మంది ఉంటారని అంచనా వేసింది. అయితే, మహిళా, శిశు సంక్షేమ శాఖ ఎలాంటి సర్వే నిర్వహించకుండానే 36.08 లక్షల మందిగా తేల్చింది. ఈ విషయంపై ప్రభుత్వ ప్రతినిధులను ప్రశ్నించగా ఎలాంటి స్పందన లేదని పలు మీడియాలు వెల్లడించాయి. ఇదీ చదవండి: ‘రామన్ మెగసెసె’ అవార్డు తిరస్కరించిన కేరళ మాజీ ఆరోగ్య మంత్రి -
ఆర్థిక పురోగతిలో ‘ఆడిట్’కు కీలకపాత్ర
న్యూఢిల్లీ: దేశ ఫైనాన్షియల్ స్థిరత్వం, ఆర్థిక పురోగతిలో ఖచ్చితత్వం కలిగిన, విశ్లేషణాత్మక ఆడిట్ నివేదికల పాత్ర ఎంతో ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ఆయా అంశాలు వ్యవస్థల పట్ల ప్రజలలో విశ్వాసాన్ని నింపుతాయని అన్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ ఆడిట్ అండ్ అకౌంట్స్ (ఎన్‌ఏఏఏ) అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ రంగంలో సుపరిపాలనకు ఆడిటింగ్ ఒక మూలస్తంభమని అన్నారు. ‘‘ఉద్దేశించిన ఫలితాలను సాధించడంలో భాగంగా ప్రజా వనరులు బాధ్యతాయుతంగా, సమర్ధవంతంగా నిర్వహించబడుతున్నాయా లేదా అనే అంశంపై నిష్పాక్షిక అంచనాలకు రావడం అవసరం. ఈ దిశలో న్యాయమైన, నిష్పాక్షికమైన ఆడిట్ పాత్ర ఎంతో ఉంటుంది. ఇది ఆయా వర్గాల్లో విశ్వాసాన్ని నింపుతుంది’’ అని దాస్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయన ప్రసంగంలో మరికొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► అంతర్జాతీయంగా చూస్తే, సమీకృత ఆర్థిక వ్యవస్థలో న్యాయమైన,నిష్పక్షపాతమైన ఆడిట్ అనేది కేవలం దేశీయంగా కీలక పాత్ర పోషించే అంశమే కాదు.ప్రపంచ వేదికపై దేశ ఖ్యాతిని,విశ్వసనీయతను పెంపొందించడానికి ఇది ఒక సాధనం. ► ఫైనాన్షియల్ మార్కెట్ల సంక్లిష్టత, సమర్థవంతమైన వనరుల కేటాయింపు, ప్రజల నుంచి సుపరిపాలనపై ఏర్పడుతున్న అధిక అంచనాలు ఇక్కడ ప్రస్తావించుకోదగిన అంశాలు. ఈ నేపథ్యంలో ఆడిట్ పాత్ర ఎంతో కీలకంగా మారింది. ► భారతదేశం వేగంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాం.ఈ విషయంలో భాగస్వాములందరికీ ఆర్థిక పనితీరుపై భరోసాను కల్పించడానికి ఆడిటర్ల నైపుణ్యం, ఈ వ్యవస్థలో పటిష్టత అవసరం. ► కేవలం అందుబాటులో ఉన్న సాక్ష్యాలు, సమాచారం ఆధారంగా ఆర్థిక నిర్ణయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సరికాని డేటా వల్ల తగిన నిర్ణయాలను తీసుకోలేం. ► ఇక్కడ బ్యాంకింగ్ రంగాన్నే ఒక ఉదాహరణగా తీసుకుందాం. సరికాని, తప్పుదోవ పట్టించే ఆర్థిక నివేదికల ఆధారంగా బ్యాంక్ రుణ మంజూరీలు చేసినట్లయితే, రుణగ్రహీత కంపెనీ చివరకు దానిని తిరిగి చెల్లించలేకపోతుంది. రుణదాతకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితి మిగులుతుంది. దీనికితోడు అర్హత కలిగిన కంపెనీలకు రుణం ఇవ్వడానికీ బ్యాంకింగ్ తదుపరి వెనుకడుగు వేస్తుంది. తనకు వచ్చిన నష్టాన్ని భర్తీ చేసుకోడానికి ఇతరులపై బ్యాంకులు వడ్డీభారాన్ని వేయకా తప్పనిసరి పరిస్థితి ఉంటుంది. వెరసి ఇదంతా ఆర్థిక వ్యవస్థ తిరోగమనానికి దారితీస్తుంది. ► ఆడిట్ నాణ్యత, పటిష్టత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల ఆడిట్‌ను మెరుగుపరచడానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)తో ఆర్బీఐ సంప్రదింపులు జరిపి అనేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరిలో వాణిజ్య బ్యాంకుల కోసం రిస్క్ ఆధారిత అంతర్గత ఆడిట్ వ్యవస్థను బలోపేతం చేశాం. ఏప్రిల్‌లో బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో (ఎన్బీఎఫ్సీ) చట్టబద్ధమైన ఆడిటర్ల నియామకానికి సంబంధించిన మార్గదర్శకాలను ఆధునికీకరణ జరిగింది. రదర్శకత, వివేకవంతమైన వ్యాపార వ్యూహం, సమర్థవంతమైన రిస్క్ మేనేజ్మెంట్ లక్ష్యాలుగా ఈ చర్యలను తీసుకున్నాం. ► ఆడిట్లో అంతర్జాతీయ ప్రమాణాలు మరింత పటిష్టం చేయడానికి ఈ రంగంలో ప్రముఖులు, నిపుణులతో పాటు ఫైనాన్షియల్ రంగంలోని నియంత్రణ సంస్థలు, పర్యవేక్షకులు కలిసి పనిచేయాలి. బలమైన,అందరికీ చేరువచేసే ఆర్థిక రంగాన్ని నిర్మించడానికి,సుపరిపాలనకు,నైతిక విధానాల పరిపుష్టికి చురుకైన చర్యలు తీసుకోవాలి. -
ఐటీఆర్ ఫైలింగ్ తుది గడువు పొడిగింపు
న్యూఢిల్లీ : ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే తుది గడువును ప్రభుత్వం పొడిగించింది. 2017-18 సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ ఫైలింగ్‌కు ఉన్న తుది గడువును సెప్టెంబర్ 30 నుంచి కొన్ని కేటగిరీల పన్ను చెల్లింపుదారులకు అక్టోబర్ 15కు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఆడిట్ రిపోర్టు తుది గడువు కూడా అక్టోబర్ 15గానే నిర్ణయించింది. ఈ కొత్త మార్గదర్శకాలు, రూ.2 కోట్లకు పైన ఆదాయం ఆర్జించే వారికి, ఛార్టెడ్ అకౌంట్లు ఇంకా తమ అకౌంట్లను ఆడిట్ చేసే అవసరం ఉన్న పన్ను చెల్లింపుదారులకు వర్తించనున్నాయి. అయితే పన్ను చెల్లించడానికి మాత్రం సెప్టెంబర్ 30నే తుది గడువుగా నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘పలువురు స్టేక్‌హోల్డర్ ప్రతినిధుల అభ్యర్థన మేరకు, ఐటీఆర్‌లు, ఆడిట్ రిపోర్టుల తుది గడువును పెంచాం. కొన్ని కేటగిరీల పన్ను చెల్లింపుదారులకు ఈ తుది గడువు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 15కు పెరిగింది’ అని సీబీడీటీ తెలిపింది. సీబీడీటీ తుది గడువును పెంచడం స్వాగతించాల్సిన విషయమని ట్యాక్స్ పార్టనర్ సమీర్ కనబార్ తెలిపారు. అంతకముందు 2017-18లో పన్ను చెల్లింపులు రికార్డు స్థాయిలో రూ.10.03 లక్షల కోట్లకు పెరిగినట్టు సీబీడీటీ తెలిపింది. -
తప్పు మీద తప్పు.!
♦ డిఫాల్టర్స్‌కు కొమ్ముకాస్తున్న డీసీఓ కార్యాలయం ♦ ఇద్దరు కాదు...ముగ్గురు డీసీసీబీ డెరైక్టర్లదీ అదే పరిస్థితి ♦ ఆడిట్ రిపోర్టు మూడేళ్లుగా తొక్కిపెట్టిన వైనం రుణాన్ని ఎగ్గొట్టిన డీసీసీబీ డెరైక్టర్లను డీసీఓ కార్యాలయ వర్గాలు వెనకేసుకొస్తున్నాయి. ప్రతి ఏడాది నిజాయితీగా ఆడిట్ రిపోర్ట ఇవ్వాల్సిందిపోయి మూడేళ్లుగా తొక్కిపెట్టాయి. ఆడిట్ రిపోర్టపై నిక్కచ్చిగా పరిశీలించి తన బాధ్యత నెరవేర్చాల్సిన హ్యాండ్లూమ్ సొసైటీ యంత్రాంగం పూర్తిగా విస్మరించింది. ఫిర్యాదు వచ్చాక పరిశీలించాల్సిన డీసీసీబీ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించింది. వెరసి డిఫాల్టర్స్‌గా ఉన్న డీసీసీబీ డెరైక్టర్ల వ్యవహారంలో వరుస తప్పులు చోటుచేసుకున్నాయి. సాక్షి ప్రతినిధి, కడప: ముగ్గురు డీసీసీబీ డెరైక్టర్లు డిఫాల్టర్లుగా ఉన్నట్లు తాజాగా వెలుగు చూసింది. దీనిపై నాబార్డు యంత్రాంగం విచారణకు రావడంతో వారు ఒక్కమారుగా ఉలికిపాటుకు గురైనట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఆ ముగ్గురు డీసీసీబీ డెరైక్టర్లు చేనేత సహకార సంఘాలకు రుణాలు పొందారు. నకిలీ సంఘాల పేరుతో కొందరు, బినామీలతో మరికొందరు రుణాలు పొంది సబ్సిడీ చేజిక్కించుకునే ఎత్తుగడను అవలంబించారు. కోడి, కోడిగుడ్డు అన్నట్లుగా రుణం మొత్తం ఎగవేతకు పథక రచన చేశారు. ఆమేరకు అమలు పర్చడంలో చాకచక్యంగా వ్యవహరించారు. ఆడిట్ నివేదిక తొక్కిపెట్టి.. ఏయే ఏడాదికి ఆ ఏడాది సహకార సంఘాలపై ఆడిట్ నివేదిక ఇవ్వాల్సిన డీసీఓ కార్యాలయం ఆ ముగ్గురు డీసీసీబీ డెరైక్టర్లు వ్యవహారాన్ని తొక్కిపెట్టినట్లు సమాచారం. ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన హ్యాండ్లూమ్ సొసైటీ అసిస్టెంట్ డెరైక్టర్ కార్యాలయం పట్టించుకోలేదు. ఈక్రమంలో ఆప్కాబ్, నాబార్డు ద్వారా పొందిన రుణాలు చెల్లింపులో కోట్లాది రూపాయాలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు చేనేత సంఘాల నేతలు ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసినా డీసీసీబీ మిన్నకుండిపోగా, డీసీఓ కార్యాలయం వర్గాలు తేలుకుట్టిన దొంగల్లాగా వ్యవహరించాయి. ఈ నేపథ్యంలో ఆప్కాబ్ నాబార్డు అధికారులు విచారణకు వస్తున్నారని తెలుసుకున్న తరుణంలో హ్యాండ్లూమ్ సొసైటీకీ చెందిన కీలక అధికారి ఒకరు అందుబాటులో లేకుండా వెళ్లినట్లు సమాచారం. నాబార్డు అధికారులు రావడంతో.. హ్యాండ్లూమ్ సొసైటీలకు రుణాలు పొంది, వాటిని స్వాహా చేసిన వైనంపై నాబార్డు అధికారులు విచారణకు వస్తున్నారని తెలుసుకున్న ఓ అధికారి సెలవులో వెళ్లినట్లు తెలుస్తోంది. హాండ్లూమ్ సొసైటీ కార్యాలయంలో కీలక అధికారిని ప్రశ్నించే అవకాశం ఉండడమే అందుకు కారణంగా తెలుస్తోంది. జిల్లాకు అధికారులు వచ్చారని తెలుసుకున్న మరుక్షణమే సెలవులో వెళ్లినట్లు సమాచారం. డీసీసీబీ డెరైక్టర్లు డిఫాల్టర్స్ గుర్తింపు పడకుండా ఎవరి పరిధిలో వారు పక్కాగా సహకారం అందించడంతోనే వ్యవహారం పూర్తిగా మరుగునపడినట్లు పలువురు చెప్పుకొస్తున్నారు. ఇద్దరు డెరైక్టర్లు దాదాపు రూ.2.5కోట్లు బకాయిలున్నట్లు సమాచారం ఉండగా, మరో డెరైక్టర్ రూ.1.5కోట్లు బకాయి పడినట్లు తెలుస్తోంది. ముగ్గురు డెరైక్టర్లు పరిధిలోనే రూ.4కోట్లు పైబడి రుణాలు వసూలు కావాల్సి ఉన్నా, డీసీసీబీ మౌనంగా ఉండడానికి కారణం పాలకమండలిలో ఆ ముగ్గరు క్రియాశీలక భూమిక పోషించడమేనని తెలుస్తోంది. డిఫాల్టర్స వ్యవహారాన్ని నిగ్గుతేల్చాల్సిన బాధ్యత డీసీఓ కార్యాలయంపై ఉంది. అలాగే వాస్తవాలను బహిర్గతం పర్చాల్సిన ఆవశ్యకత హాండ్లూమ్ సొసైటీ యంత్రాంగంపై ఉందని చేనేత వర్గాలు సైతం భావిస్తున్నాయి. అధికారులు ఏమేరకు స్పందిస్తారో చూడాలి. మునుపటి అధికారి సహకారమే.. డీసీసీబీ డెరైక్టర్లు పొందిన రుణాలు, వారి సొసైటీల తీరుతెన్నులూ ప్రతి ఏడాది నివేదించాల్సిన అధికారి మిన్నకుండిపోయినట్లు తెలుస్తోంది. డెరైక్టర్లు నుంచి ప్రతిఫలం ఆశించిన మునపటి అధికారి ఆమేరకు లబ్ధిపొందిన అనంతరం వ్యవహారాన్ని తొక్కిపెట్టినట్లు తెలుస్తోంది. మూడేళ్లుగా ఎలాంటి నివేదిక ఇవ్వనట్లు విశ్వసనీయ సమాచారం. ఉన్నది ఉన్నట్లు అధికారికంగా నివేదిక అందజేసింటే డీసీసీబీ డెరైక్టర్లుగా వారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. డీసీసీబీ నిబంధనల ప్రకారం పాలకమండలిలో డిఫాల్టర్లు కొనసాగేందుకు అనర్హులు. ఈ క్రమంలో ఆ ముగ్గురు డెరైక్టర్ల వ్యవహారాన్ని పూర్తిగా మరుగున పర్చినట్లు తెలుస్తోంది. అందుకుగాన భారీ ఎత్తున నజరానా పొందినట్లు సమాచారం.