ఐటీఆర్ ఫారం 7 గురించి చెప్పే కథ పెద్దగా ఉంటుంది. ప్రత్యేకంగా ఉంటుంది. ఇది కొంచెం కష్టతరమైనదేనని చెప్పక తప్పదు. ఎవరెవరు ఈ ఫారం వేయొచ్చంటే..
– ధార్మిక సంస్థలు, మత ట్రస్టులు
– రాజకీయ పార్టీలు
– సైంటిఫిక్ రీసెర్చ్ సంస్థలు
– యూనివర్సిటీలు, కాలేజీలు, సంస్థలు
– ఖాదీ, గ్రామ పరిశ్రమ సంస్థలు
పైన చెప్పిన అన్నింటికీ నిర్వచనాలు ఉన్నాయి. ఆ పరిధిలోకి వచ్చినవే ఫారం 7 వేయాలి. నిర్వచనం, పరిధి, కార్యకలాపాలు, ఆంక్షలు ఇలా కొన్ని విషయాలను చట్టంలో పొందుపర్చారు. ఇటువంటి సంస్థలు మినహాయింపు పొందాలంటే దీన్ని వినియోగించుకోవచ్చు. ఇటువంటి సంస్థలకు ఆదాయం ఉంటుంది. ఖర్చులు ఉంటాయి. నికర ఆదాయం పన్ను పరిమితిని దాటి ఉంటుంది. కానీ వారికి మినహాయింపు ఉంటుంది.
పన్ను చెల్లించనక్కర్లేదు. పూర్తిగా మినహాయింపు వెసులుబాటు ఉంటుంది (చట్టానికి లోబడి). వారే ఫారం 7 వేయాలి. మినహాయింపునకు అర్హత లేని వారు, మినహాయింపు వద్దనుకున్న సంస్థలు ఫారం 7 వేయనక్కర్లేదు. అటువంటి సంస్థలు ఫారం 5 వేయాల్సి ఉంటుంది. గతంలో చెప్పినట్లు ఫారం 5 వేయాలా లేక ఫారం 7 వేయాలా అన్నది చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అవసరం అయితే, వృత్తి నిపుణుల సలహా తీసుకోండి. ట్రస్ట్, సొసైటీ, కంపెనీ, భాగస్వామ్య సంస్థ, స్థానిక సంస్థల, వ్యక్తుల కలయిక.. వీరందరూ కూడా ఈ రిటర్ను వేయొచ్చు.
అయితే, ఫారం 3,4,5,6లకు .. ఈ ఫారం 7కు తేడా ఏమిటీ అంటే దీన్ని వేయాల్సిన వారు మినహాయింపు కోవకు చెందినవారై ఉండాలి. మినహాయింపునకు అర్హత ఉన్నవారే దాఖలు చేయాలి. ఆడిట్‌కి వర్తించే కేసులైతే, 31–10–2024 లోపల వేయాలి. వీరు ట్యాక్స్ ఆడిట్ రిపోర్టును కూడా నిర్దేశించిన ఫారంలో దాఖలు చేయాలి. ఇతరులు 31–07–2024 లోపల వేయాలి.
ఏ చిన్న తప్పు దొర్లినా, భూతద్దంలో చూస్తారు. ఎందుకంటే దురదృష్టవశాత్తు కొన్ని సంస్థలు అర్హత లేకపోయినా పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందుతున్నాయి. మీరు ట్రస్టీలైనా, మేనేజ్‌మెంట్ మెంబర్లయినా తగిన జాగ్రత్తలు వహించండి.
– కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment