జీవితానికి క్రమశిక్షణ ఎంత ముఖ్యమో.. ఆర్ధిక అంశాల్లోనూ అంతే పద్ధతిగా ఉండకపోతే కొంపలారిపోతాయి, అన్నది తోసిపుచ్చలేని వాస్తవం. మన జీవితంలో ఆర్ధికం, ఆరోగ్యం.. అత్యంత ప్రాధాన్యాంశాలు. డబ్బుండి ఆరోగ్యం లేకపోయినా.. ఆరోగ్యం ఉండి డబ్బు లేకపోయినా ఆ వ్యక్తి జీవితం లేదా కుటుంబం అష్టకష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంచేత ప్రతి వ్యక్తికీ ఆర్ధిక క్రమశిక్షణ అనేది అత్యంత ముఖ్యం. చాలామంది చేతులు కాలాక మేలుకుంటారు. అప్పటికి వారి జీవితం నిండా మునిగిపోయి ఉంటుంది.. ఈ పరిస్థితి రాకుండా మొదటినుంచీ మెలకువతో వ్యవహరిస్తే వారి జీవితాలు బాగుపడతాయి. కానీ ఇలా చేసేవాళ్లు చాలా తక్కువమంది ఉంటారు.
22 -24 ఏళ్ల వయసులో సంపాదనలో పడేటప్పుడే మనం భవిష్యత్ అవసరాలను మదింపు చేయగలగాలి. గతంలో మన పూర్వీకులకు ఆర్ధిక అంశాలపై అంత అవగాహన లేకపోవడం, పెద్ద పెద్ద కుటుంబాల వల్ల వచ్చింది వచ్చినట్లుగా ఖర్చుపెట్టేయడం, పెట్టుబడి మార్గాలు పెద్దగా లేకపోవడం.. ఇత్యాది అంశాలన్నీ ఆర్ధిక క్రమశిక్షణ విషయంలో అవరోధాలుగా నిలిచేవి. ఇప్పుడలా కాదు. రకరకాల ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృత సమాచారం అందుబాటులోకి ఉంటోంది. అదే సమయంలో విభిన్న పెట్టుబడి మార్గాలు మన కళ్ల ముందు ఉంటున్నాయి. ఇది ఒక రకంగా వరమనే చెప్పొచ్చు. కానీ ఎంతమంది వీటిని సద్వినియోగం చేసుకుంటున్నారన్నదే ప్రధాన ప్రశ్న.
ఆర్ధిక క్రమశిక్షణ పాటిస్తే ఏమవుతుంది.. అన్న విషయాన్ని ఉదాహరణ పూర్వకంగా వివరిస్తాను.
రాహుల్ వయసు 24 ఏళ్ళు. అతనో ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. నెల జీతం రూ. 50,000. అందులోంచి రూ. 10,000 ఊళ్ళో ఉండే తల్లిదండ్రులకు పంపిస్తూ ఉంటాడు. అతనుండే సిటీలో రూము అద్దె, కరెంటు బిల్, తిండి ఖర్చులు, సాదరు, రవాణా ఖర్చులకు దాదాపు రూ. 20,000 దాకా అవుతుంది. మిగిలిన సొమ్ములో రూ. 10,000 వరకు హెల్త్ ఇన్సూరెన్సు(తనకు, తల్లిదండ్రులకు), డిపాజిట్లు, పెట్టుబడుల కోసం కేటాయించాడు. మిగతా రూ.10,000 ను పొదుపు చేస్తాడు. ఇదీ అతని నెలవారీ ప్రణాళిక.
పొదుపు ద్వారా ఏడాదికి రూ.1,20,000 దాచుకోగలిగాడు. మరోపక్క డిపాజిట్లు, పెట్టుబడుల ద్వారా రూ. ఏడాదికి 1,50,000 దాకా కూడబెట్టాడు. ఏడాది మొత్తానికి అతను రూ.2,70,000 వెనకేయగలిగాడు. ఇందులోంచి అత్యవసర ఖర్చులు, అనుకోని ఖర్చుల కోసం ఏడాది మొత్తం మీద ఇంకో 70,000 ఖర్చు చేశాడు అనుకుందాం. నికరంగా అతని దగ్గర ఏడాది తిరిగేసరికి కనీసం రూ. 2 లక్షలు ఉంటాయి. ఇప్పుడతను కాస్త పర్వాలేదు అనుకునే స్థాయికి వచ్చాడు.
ఈ మొత్తాన్ని అనుభవజ్ఞుల సలహా, సాధకబాధకాలు అన్నీ పరిగణనలోకి తీసుకుని రిస్కు తక్కువగా ఉండేలా చూసుకుంటూ కొంత షేర్లలోకి మరికొంత బాండ్లలోకి మళ్ళించాడు. దీనిపై వచ్చే రాబడి తక్కువగా ఉన్నప్పటికీ తన క్యాపిటల్‌కు నష్టం రాకుండా ప్లాన్ చేసుకున్నాడు. తద్వారా ఏడాది తిరిగేసరికి ఆ రూ. 2 లక్షల మీద అతనికి రూ. 1.50 లక్షలు వచ్చాయి. ఇప్పుడతని పెట్టుబడుల్లో సొమ్ము రూ. 3.5 లక్షలు అయింది. మరోపక్క ఈ రెండేళ్లలో అతని శాలరీ ఇంకో రూ.10,000 పెరిగింది. అయితే ఖర్చులు కూడా పెరగడం వల్ల ఆ పెరిగింది కాస్తా వాటికే సరిపోయేది. కాబట్టి అతని చేతికి కొత్తగా రూపాయి వచ్చిందీ లేదు, పోయిందీ లేదు. కానీ పెట్టుబడులు, పొదుపు మాత్రం క్రమం తప్పక కొనసాగిస్తూనే వచ్చాడు. ఇలా నాలుగేళ్లు గడిచాయి.
శాలరీ పెరుగుతూ వస్తున్నా పెరిగే ఖర్చులు, పుట్టుకొచ్చే కొత్త అవసరాలతో అది అక్కడికి అయిపోతుంది. కానీ ఈ నాలుగేళ్లలో అతని పొదుపు 4X120000 = 4,80,000 + వడ్డీ కలిపి దాదాపు రూ.5 లక్షల దాకా జమ అయింది. అదే సమయంలో పెట్టుబడులను ఎప్పటికప్పుడు తిరగేస్తూ రిస్క్ డోస్‌ను కొద్దికొద్దిగా పెంచుతూ వచ్చాడు. అంటే బాండ్లలో పెట్టుబడులు తగ్గిస్తూ.. షేర్లలో ఫ్రంట్ లైన్ స్టాక్స్‌ను ఎంచుకుంటూ.. వాటి రేట్లు దిగివచ్చిన ప్రతిసారీ కొనుగోలు చేస్తూ వచ్చాడు. తద్వారా మంచి లాభాలు కళ్లజూడగలిగాడు.
ఇలా మూడో ఏడాది తిరిగేసరికి తన పెట్టుబడులు రూ.6 లక్షల దాకా అయ్యాయి. మరో ఏడాది పూర్తయ్యేసరికి అవి కాస్తా రూ.12,00,000 అయ్యాయి.
పొదుపు ద్వారా సమకూర్చుకున్న రూ.5 లక్షలు కలిపితే ఇప్పుడు అతని చేతిలో దాదాపు రూ.17 లక్షల దాకా ఉన్నాయి. వయసు 28 ఏళ్ళు వచ్చాయి. మళ్ళీ అన్ని లెక్కలు బేరీజు వేసుకుని రూ. 50 లక్షల రేటులో సిటీకి కాస్త దూరమే అయినప్పటికీ ఒక డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొన్నాడు. తన దగ్గరున్న 17 లక్షల్లో 10 లక్షలు ఇంటికోసం కేటాయించాడు. 7 లక్షలు చేతిలో ఉంచుకున్నాడు. 40 లక్షలు లోన్ తీసుకున్నాడు. దీనిపై కాల పరిమితి ఎక్కువ పెట్టుకుని ఈఎంఐ రూ. 25,000 మించకుండా చూసుకున్నాడు.
తర్వాత అతను కంపెనీ మారడంతో (ఇది కూడా ప్లాన్ ప్రకారమే చేశాడు. మార్కెట్లో తనకున్న పొటెన్షియాలిటీ, ఉద్యోగంలో సంపాదించిన అనుభవం) శాలరీ పెరిగి దాదాపు రూ.లక్షకు చేరుకుంది. కొత్త ఉద్యోగంలో చేరితే (జాబ్ మారినప్పుడు కొన్ని బ్యాంకుల్లో లోన్ తీసుకోవడానికి కొంత ఇబ్బంది అవుతుంది. కొన్ని బ్యాంకులు మొత్తం అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని లోన్ ఇస్తాయి) లోన్‌కు ఇబ్బంది కావొచ్చన్న అంచనాతో జాబ్ మారడానికి ముందే చాలా తెలివిగా ఇంటి కొనుగోలుకు సిద్ధమయ్యాడు.
ఇల్లు కొనడం, కొన్నాళ్లకే జాబ్ మారడం జరిగిపోయాయి. పెట్టుబడులు కొనసాగిస్తూనే ఉన్నాడు ఎక్కడా 'అతి' కి పోకుండా ప్లాన్‌కు తగ్గట్లే సాగుతూ వచ్చాడు. ఇంతలోనే పెళ్లి కుదిరింది. తన దగ్గరున్న సొమ్ముల్లోనే ఓ 2 లక్షలు వెచ్చించి ఇంటికి అవసరమైన సామాన్లు కొనుక్కున్నాడు. పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్‌లోకి అడుగుపెట్టాడు.
ఒక రూ.50,000 ఉద్యోగి.. కేవలం నాలుగేళ్ల వ్యవధిలో జీవితాన్ని స్థిరపరుచుకునే స్థాయికి ఎదిగాడు. ఇదంతా జరగడానికి అతను చేసిందల్లా...
1. ఆర్ధిక క్రమశిక్షణ ఎక్కడా తప్పలేదు.
2. అత్యాశకు పోలేదు.
3. తనకు ఉన్న దానితోనే సరిపెట్టుకున్నాడు.
4. పక్కవాళ్ళను చూసో, స్నేహితులను బట్టో అక్కర్లేని వస్తువులు కొనేయలేదు.
5. లాభాలు వస్తున్నాయి కదా అని మొత్తం డబ్బులు తీసుకెళ్లి స్టాక్ మార్కెట్లో పెట్టేయలేదు.
6. రిస్క్ స్థాయిని పెంచుకుంటూ వెళ్ళాడే తప్ప నూటికి నూరు శాతం రిస్క్ తీసుకోలేదు.
7. ఆడంబరాలకు పోలేదు. మార్కెట్లో 50,000 ఖరీదు చేసే ఫోన్లు దొరుకుతున్నా తన స్థాయికి మించి 10,000-15,000 ఫోన్‌తోనే సరిపెట్టుకున్నాడు.
8. లోన్ పెట్టుకుంటే కారు కొనుక్కునే అవకాశం ఉన్నప్పటికీ కొనేయాలని ఉబలాటపడలేదు.
9. స్థిరపడేవరకు టూర్లు, విందులు, వినోదాలు, విలాసాల జోలికి పోకూడనే నిర్ణయం తీసుకుని కచ్చితంగా పాటిస్తూ వచ్చాడు.
10. వేలకు వేలు పోసి ఖరీదైన బట్టలని కొనేయలేదు.
ఇలా చెప్పుకుంటూ పోతే... చాలానే ఉన్నా అతను పాటించింది మాత్రం పూర్తిగా ఆర్ధిక క్రమశిక్షణ. అదే అతని జీవితాన్ని ఇప్పుడు చాలా హుందాగా నిలబెట్టింది. కొత్త జీవితంలోకి అడుగు పెట్టేలా చేసింది. అతను త్వరలోనే కారూ కొనుక్కోగలడు, అవసరమైతే ఖరీదైన ఫోనూ కొనగలడు. చిన్న వయసులోనే ఇంత ఆర్ధిక క్రమశిక్షణ పాటించిన వ్యక్తి భవిష్యత్తులో గాడి తప్పకుండా ముందుకు సాగుతాడనే భావిద్దాం. మీరూ ఇలా చేసి చూడండి. మీ జీవితం కచ్చితంగా పూలమయం అవుతుంది. అలా కాదు.. నాకు తాత్కాలిక ప్రయోజనాలే ముఖ్యం.. అంటూ అర్ధం పర్ధం లేకుండా విచ్చలవిడిగా ఖర్చు చేసుకుంటూ పోతే ఏం జరుగుతుందో తదుపరి కథనంలో చూద్దాం.
-బెహరా శ్రీనివాస రావు, పర్సనల్ ఫైనాన్స్ విశ్లేషకులు.
Comments
Please login to add a commentAdd a comment