పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? తప్పకుండా ఇవి తెలుసుకోండి Must Keep in Mind These Rules When Your Applying Personal Loan | Sakshi
Sakshi News home page

పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? తప్పకుండా ఇవి తెలుసుకోండి

Published Tue, Jun 11 2024 6:13 PM

Must Keep in Mind These Rules When Your Applying Personal Loan

పర్సనల్ లోన్ అనేది ప్రస్తుతం సర్వసాధారణం అయిపోయింది. ఉద్యోగం చేస్తున్నవారు, బిజినెస్ చేసేవారు ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో లోన్ తీసుకోవడానికి సిద్దమైపోతారు. ఇంతకీ పర్సనల్ లోన్ తీసుకునే ముందు తెలుసుకోవలసిన విషయాలు ఏంటి? ఏ సమయంలో పర్సనల్ లోన్ తీసుకోవాలి అనే విషయాలను వివరంగా ఈ కథనంలో చూసేద్దాం..

వడ్డీ రేటు
పర్సనల్ లోన్ తీసుకోవాలనుకునే వ్యక్తి బ్యాంకులు ఎంత వడ్డీకి లోన్ ఇస్తుంది అనే విషయాన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే వెహికల్ లోన్స్, హోమ్ లోన్స్ వంటి వాటితో పోలిస్తే.. పర్సనల్ లోన్ వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా తీసుకొనే మొత్తాన్ని (డబ్బు) బట్టి, వ్యవధి, క్రెడిట్ స్కోరును బట్టి కూడా ఈ వడ్డీని నిర్ణయిస్తారు. పర్సనల్ లోన్ మీద వడ్డీ రేటు 12 నుంచి 21 శాతం వరకు ఉంటుంది. కాబట్టి లోన్ తీసుకునే వ్యక్తి తప్పకుండా ఈ విషయంలో జాగ్రత్తపడాలి. అంతే కాకుండా.. మీకు వచ్చే వార్షిక ఆదాయానికి మించి లోన్ తీసుకుంటే.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఎవరికి లోన్ ఇస్తారు
లోన్ అనేది ఉద్యోగం చేసేవారికైనా.. సొంతంగా బిజినెస్ చేసేవారికైనా ఇస్తారు. అయితే ఉద్యోగికి బ్యాంక్ లోన్ ఇవ్వాలంటే.. వారు మూడు నెలల పేస్లిప్ ఇవ్వాల్సి ఉంటుంది. సొంతంగా బిజినెస్ చేసేవారికి డెబిట్ / క్రెడిట్ కార్డు హిస్టరీని చూసి లోన్ మంజూరు చేయడం జరుగుతుంది. కొన్ని బ్యాంకులు ఫేమస్ కంపెనీలలో ఉద్యోగం చేసేవారికి మాత్రమే లోన్ ఇస్తాయి.

ఆదాయాన్ని మించకుండా..
పర్సనల్ లోన్ తీసుకునే వ్యక్తి తన నెలవారీ జీతం కంటే ఎక్కువ లోన్ తీసుకోకూడదు. ఎందుకంటే వచ్చే డబ్బుతోనే నిత్యావసరాలు, ఈఎంఐ వంటి వాటితో పాటు పిల్లల చదువులు ఇతరత్రా ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ పూర్తిగా బేరీజు చేసుకున్న తరువాత ఎంత లోన్ తీసుకుంటే.. ఎంత ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. నెల జీతంలో ఈఎంఐ పోగా ఎంత మిగులుతుంది అనేది చూసుకోవాలి. ముఖ్యంగా పర్సనల్ లోన్ అనేది 12 నెలలు (ఒక సంవత్సరం) మించగకుండా ఉండేలా చూసుకోవడం ఉత్తమం.

లోన్ ఎప్పుడు తీసుకోవాలి?
లోన్ తీసుకోవడం అనేది కొంతవరకు కరెక్ట్ కాదు. అయితే అత్యవసర పరిస్థితుల్లో, వేరే మార్గం లేని సమయంలో తీసుకోవాలి. ఆరోగ్యం మందగించినప్పుడు లేదా అనుకోని దుర్ఘటనలు జరిగినప్పుడు తీసుకోవచ్చని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. సరదాల కోసం, గ్యాడ్జెట్స్ కొనుగోలు కోసం, విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయడానికి లోన్ తీసుకోకూడదు. తప్పకుండా ఇవన్నీ గుర్తుంచుకోవాలి.

Advertisement
 
Advertisement
 
Advertisement