తప్పు మీద తప్పు.!
♦ డిఫాల్టర్స్‌కు కొమ్ముకాస్తున్న డీసీఓ కార్యాలయం
♦ ఇద్దరు కాదు...ముగ్గురు డీసీసీబీ డెరైక్టర్లదీ అదే పరిస్థితి
♦ ఆడిట్ రిపోర్టు మూడేళ్లుగా తొక్కిపెట్టిన వైనం
రుణాన్ని ఎగ్గొట్టిన డీసీసీబీ డెరైక్టర్లను డీసీఓ కార్యాలయ వర్గాలు వెనకేసుకొస్తున్నాయి. ప్రతి ఏడాది నిజాయితీగా ఆడిట్ రిపోర్‌ట ఇవ్వాల్సిందిపోయి మూడేళ్లుగా తొక్కిపెట్టాయి. ఆడిట్ రిపోర్‌టపై నిక్కచ్చిగా పరిశీలించి తన బాధ్యత నెరవేర్చాల్సిన హ్యాండ్లూమ్ సొసైటీ యంత్రాంగం పూర్తిగా విస్మరించింది. ఫిర్యాదు వచ్చాక పరిశీలించాల్సిన డీసీసీబీ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించింది. వెరసి డిఫాల్టర్స్‌గా ఉన్న డీసీసీబీ డెరైక్టర్ల వ్యవహారంలో వరుస తప్పులు చోటుచేసుకున్నాయి.
సాక్షి ప్రతినిధి, కడప: ముగ్గురు డీసీసీబీ డెరైక్టర్లు డిఫాల్టర్లుగా ఉన్నట్లు తాజాగా వెలుగు చూసింది. దీనిపై నాబార్డు యంత్రాంగం విచారణకు రావడంతో వారు ఒక్కమారుగా ఉలికిపాటుకు గురైనట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఆ ముగ్గురు డీసీసీబీ డెరైక్టర్లు చేనేత సహకార సంఘాలకు రుణాలు పొందారు. నకిలీ సంఘాల పేరుతో కొందరు, బినామీలతో మరికొందరు రుణాలు పొంది సబ్సిడీ చేజిక్కించుకునే ఎత్తుగడను అవలంబించారు. కోడి, కోడిగుడ్డు అన్నట్లుగా రుణం మొత్తం ఎగవేతకు పథక రచన చేశారు. ఆమేరకు అమలు పర్చడంలో చాకచక్యంగా వ్యవహరించారు.
ఆడిట్ నివేదిక తొక్కిపెట్టి..
ఏయే ఏడాదికి ఆ ఏడాది సహకార సంఘాలపై ఆడిట్ నివేదిక ఇవ్వాల్సిన డీసీఓ కార్యాలయం ఆ ముగ్గురు డీసీసీబీ డెరైక్టర్లు వ్యవహారాన్ని తొక్కిపెట్టినట్లు సమాచారం. ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన హ్యాండ్లూమ్ సొసైటీ అసిస్టెంట్ డెరైక్టర్ కార్యాలయం పట్టించుకోలేదు. ఈక్రమంలో ఆప్కాబ్, నాబార్డు ద్వారా పొందిన రుణాలు చెల్లింపులో కోట్లాది రూపాయాలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు చేనేత సంఘాల నేతలు ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసినా డీసీసీబీ మిన్నకుండిపోగా, డీసీఓ కార్యాలయం వర్గాలు తేలుకుట్టిన దొంగల్లాగా వ్యవహరించాయి. ఈ నేపథ్యంలో ఆప్కాబ్ నాబార్డు అధికారులు విచారణకు వస్తున్నారని తెలుసుకున్న తరుణంలో హ్యాండ్లూమ్ సొసైటీకీ చెందిన కీలక అధికారి ఒకరు అందుబాటులో లేకుండా వెళ్లినట్లు సమాచారం.
నాబార్డు అధికారులు రావడంతో..
హ్యాండ్లూమ్ సొసైటీలకు రుణాలు పొంది, వాటిని స్వాహా చేసిన వైనంపై నాబార్డు అధికారులు విచారణకు వస్తున్నారని తెలుసుకున్న ఓ అధికారి సెలవులో వెళ్లినట్లు తెలుస్తోంది. హాండ్లూమ్ సొసైటీ కార్యాలయంలో కీలక అధికారిని ప్రశ్నించే అవకాశం ఉండడమే అందుకు కారణంగా తెలుస్తోంది. జిల్లాకు అధికారులు వచ్చారని తెలుసుకున్న మరుక్షణమే సెలవులో వెళ్లినట్లు సమాచారం. డీసీసీబీ డెరైక్టర్లు డిఫాల్టర్స్ గుర్తింపు పడకుండా ఎవరి పరిధిలో వారు పక్కాగా సహకారం అందించడంతోనే వ్యవహారం పూర్తిగా మరుగునపడినట్లు పలువురు చెప్పుకొస్తున్నారు.
ఇద్దరు డెరైక్టర్లు దాదాపు రూ.2.5కోట్లు బకాయిలున్నట్లు సమాచారం ఉండగా, మరో డెరైక్టర్ రూ.1.5కోట్లు బకాయి పడినట్లు తెలుస్తోంది. ముగ్గురు డెరైక్టర్లు పరిధిలోనే రూ.4కోట్లు పైబడి రుణాలు వసూలు కావాల్సి ఉన్నా, డీసీసీబీ మౌనంగా ఉండడానికి కారణం పాలకమండలిలో ఆ ముగ్గరు క్రియాశీలక భూమిక పోషించడమేనని తెలుస్తోంది. డిఫాల్టర్‌స వ్యవహారాన్ని నిగ్గుతేల్చాల్సిన బాధ్యత డీసీఓ కార్యాలయంపై ఉంది. అలాగే వాస్తవాలను బహిర్గతం పర్చాల్సిన ఆవశ్యకత హాండ్లూమ్ సొసైటీ యంత్రాంగంపై ఉందని చేనేత వర్గాలు సైతం భావిస్తున్నాయి. అధికారులు ఏమేరకు స్పందిస్తారో చూడాలి.
మునుపటి అధికారి సహకారమే..
డీసీసీబీ డెరైక్టర్లు పొందిన రుణాలు, వారి సొసైటీల తీరుతెన్నులూ ప్రతి ఏడాది నివేదించాల్సిన అధికారి మిన్నకుండిపోయినట్లు తెలుస్తోంది. డెరైక్టర్లు నుంచి ప్రతిఫలం ఆశించిన మునపటి అధికారి ఆమేరకు లబ్ధిపొందిన అనంతరం వ్యవహారాన్ని తొక్కిపెట్టినట్లు తెలుస్తోంది. మూడేళ్లుగా ఎలాంటి నివేదిక ఇవ్వనట్లు విశ్వసనీయ సమాచారం. ఉన్నది ఉన్నట్లు అధికారికంగా నివేదిక అందజేసింటే డీసీసీబీ డెరైక్టర్లుగా వారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. డీసీసీబీ నిబంధనల ప్రకారం పాలకమండలిలో డిఫాల్టర్లు కొనసాగేందుకు అనర్హులు. ఈ క్రమంలో ఆ ముగ్గురు డెరైక్టర్ల వ్యవహారాన్ని పూర్తిగా మరుగున పర్చినట్లు తెలుస్తోంది. అందుకుగాన భారీ ఎత్తున నజరానా పొందినట్లు సమాచారం.