ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి 26 వరకు 17,654 కంపెనీలు మూతబడ్డాయని, ఇదే వ్యవధిలో 1,38,027 సంస్థలు రిజిస్టర్ అయ్యాయని కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా రాజ్యసభ(Parliament)కు రాతపూర్వకంగా తెలిపారు. 2023–24లో మూతబడిన సంస్థల సంఖ్య 22,044గాను, 2022–23లో 84,801గాను ఉంది. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నథ్వానీ అడిగిన ప్రశ్నకు గాను మంత్రి ఈ సమాధానం ఇచ్చారు.
ఐదేళ్లలో 339 విదేశీ కంపెనీలు..
2020 నుంచి విదేశీ కంపెనీల రిజిస్ట్రేషన్ తగ్గుతున్నట్లు కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా రాజ్యసభకు తెలిపారు. గత అయిదేళ్లలో 339 విదేశీ కంపెనీలు భారత్‌లో నమోదు చేయించుకున్నట్లు వివరించారు. 2020లో 90 విదేశీ కంపెనీలు రిజిస్టర్ చేసుకోగా ఆ తర్వాత నుంచి ఇది తగ్గుతూ వస్తోంది. 2021లో 75, 2022లో 64, 2023లో 57, 2024లో 53 సంస్థలు నమోదు చేసుకున్నాయి.
ఇదీ చదవండి: బ్యాంకుల్లోకి రూ.45 వేల కోట్ల డిపాజిట్లు
ఉద్దేశపూర్వక డిఫాల్టర్లు 2,664
గతేడాది మార్చి ఆఖరు నాటికి వ్యక్తులు, విదేశీ రుణగ్రహీతలు మినహా ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగవేసిన డిఫాల్టర్ల సంఖ్య 2,664గా ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభకు తెలిపారు. విల్‌ఫుల్ డిఫాల్టర్లు క్రమంగా తగ్గుతున్నారని వివరించారు. 2021–22లో 160 డిఫాల్టర్లు పెరగ్గా 2023–24లో ఇది 42కి తగ్గినట్లు వివరించారు. ఉద్దేశపూర్వక ఎగవేతలను నిరోధించేందుకు, మొండిబాకీలను తగ్గించేందుకు ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ సమగ్ర చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment