Foriegn investiments
-
‘అందరికీ బీమా’.. 100% ఎఫ్‌డీఐలు రావాల్సిందే..
ముంబై: ప్రజలందరికీ 2027 నాటికల్లా బీమా రక్షణ కల్పించాలన్న లక్ష్యం సాకారం కావాలంటే ఇన్సూరెన్స్ రంగంలోకి భారీగా పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉందని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్డీఏఐ చైర్మన్ దేబాశీష్ పాండా తెలిపారు.ఈ నేపథ్యంలో ఇన్సూరెన్స్ రంగంలోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతించాల్సి ఉంటుందని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. బీమా విస్తృతిని పెంచేందుకు ఈ రంగంలో మరిన్ని సంస్థలు రావాల్సిన అవసరం ఉందన్నారు. 2000 నుంచి భారత్‌లో ప్రైవేట్, విదేశీ పెట్టుబడులను క్రమంగా అనుమతిస్తున్నారు.ప్రస్తుతం జనరల్, లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ విభాగాల్లో 74 శాతం వరకు ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంది. దీన్ని వంద శాతానికి పెంచిన పక్షంలో దేశీయంగా వచ్చే పెట్టుబడులకు కూడా కొంత దన్ను లభించగలదని పాండా చెప్పారు. మరోవైపు, బీమా సుగమ్ ప్లాట్‌ఫాం అనేది పాలసీదార్లకు సమగ్రమైన పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా వ్యవహరిస్తూ బీమా రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తోందని ఆయన పేర్కొన్నారు. -
ఫారెక్స్ నిల్వలు ఎందుకంటే..
భారత విదేశీ మారక నిల్వలు మొదటిసారి రికార్డుస్థాయిలో 700 బిలియన్ డాలర్ల మార్కును చేరాయి. ఇటీవల ప్రభుత్వ వర్గాలు అధికారికంగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2024 సెప్టెంబర్ 27 నాటికి దేశంలోని విదేశీ మారక నిల్వలు 705 బిలియన్ డాలర్ల(రూ.59 లక్షల కోట్లు)కు చేరాయి. ఫారెక్స్ నిర్వల వల్ల దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతాయో తెలుసుకుందాం. దేశీయ స్టాక్ మార్కెట్లు పెరిగేందుకు ఫారెక్స్ నిల్వలు ఉపయోగపడుతాయి.రూపాయి విలువను స్థిరీకరించడానికి ఆర్బీఐ ఫారెక్స్ నిల్వలను ఉపయోగిస్తుంది. కరెన్సీలో తీవ్రమైన హెచ్చుతగ్గులను నిరోధించడానికి తోడ్పడుతాయి.విదేశీ కరెన్సీలను కొనుగోలు చేయడం లేదా విక్రయించడం ద్వారా రూపాయి విలువను ఆర్బీఐ నియంత్రిస్తుంది.వస్తువుల దిగుమతుల కోసం ఫారెక్స్ నిల్వలు ఉపయోగపడుతాయి.చమురు ధరల పెరుగుదల, ఆర్థిక సంక్షోభాల సమయంలో ఈ నిల్వలు తోడ్పడుతాయి.ఇదీ చదవండి: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లపై దర్యాప్తు వాయిదా!ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ వాతావరణం, ప్రపంచ ఉద్రిక్తతలు వెరసి చమురు ధరలు పెరుగుతున్నాయి. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడుతున్న దేశం మనది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేయాలంటే ఫారెక్స్ నిల్వలు ఎంతో ఉపయోగపడుతాయి. రానున్న రోజుల్లో భారత్ ఎన్నో రెట్లు అభివృద్ధి చెందుతుందని నమ్మి వివిధ దేశాలకు చెందిన ఇన్వెస్టర్లు వివిధ రూపాల్లో పెట్టుబడి పెడుతున్నారు. దాంతో ఫారెక్స్ నిల్వలు పెరుగుతున్నాయి. -
బంగారుకొండను పేరుస్తున్న ఆర్బీఐ..!
భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2024 జనవరి-ఏప్రిల్ మధ్యకాలంలో 24 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. 2023 ఏడాదిలో చేసిన మొత్తం కొనుగోళ్లు 16 టన్నుల కంటే ఇది చాలాఎక్కువ. ఏప్రిల్ 26, 2024 నాటికి ఆర్బీఐ వద్ద విదేశీ మారక నిల్వల్లో భాగంగా 827.69 టన్నుల బంగారం ఉన్నట్లు ఆర్బీఐ నివేదించింది. 2023 డిసెంబర్ చివరి నాటికి అది 803.6 టన్నులుగా ఉంది.ఇండియా మొత్తం విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా డిసెంబర్ 2023 చివరి నాటికి 7.75 శాతంగా ఉందని ఆర్బీఐ చెప్పింది. అది ఏప్రిల్ 2024 చివరి నాటికి 8.7 శాతానికి పెరిగింది. ఇటీవల గోల్డ్రేటు పెరగడంతో రిజర్వ్ బంగారం విలువ అధికమైంది. అభివృద్ధి చెందుతున్న దేశాల సెంట్రల్ బ్యాంకుల మాదిరిగానే కరెన్సీ అస్థిరతను కట్టడి చేసేందుకు ఆర్బీఐ పసిడి నిల్వలను పెంచుకున్నట్లు తెలిపింది.‘పెరుగుతున్న అంతర్జాతీయ అనిశ్చితులు, భౌగోళిక అస్థిరతల వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠపరుచుకోవాలని భావిస్తున్నాయి. దాంతో సెంట్రల్ బ్యాంకులు తమ వద్ద ఉన్న క్యాష్ రిజర్వ్‌లను వివిధ మార్గాల్లో నిల్వచేస్తున్నాయి. అందులో ప్రధానంగా బంగారంవైపు మొగ్గు చూపుతున్నాయి. 2024 మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్బ్యాంక్లు 290 టన్నుల బంగారాన్ని కోనుగోలు చేశాయి. మొత్తం ప్రపంచ పసిడి డిమాండ్‌లో నాలుగింట ఒక వంతు వాటా ఈ బ్యాంకుల వద్దే ఉంది. ఏదైనా అనిశ్చితి ఎదురైతే దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేది బంగారమేనని అన్ని దేశాలు విశ్వసిస్తున్నాయి’ అని ఆర్బీఐ ఆర్థికవేత్తలు నెలవారీ బులెటిన్‌లో ప్రచురించారు.ఇదీ చదవండి: ‘వర్కింగ్ ఏజ్’ జనాభా తగ్గడమే పెద్ద సవాలుభారత్లో బంగారాన్ని ప్రధానంగా వినియోగిస్తున్నప్పటికీ ఆర్బీఐ చాలాకాలంపాటు పసిడి నిల్వలను భారీగా కూడబెట్టలేకపోయింది. 1991లో విదేశీ మారకద్రవ్య సంక్షోభం సమయంలో బంగారం నిల్వల్లో చాలాభాగం తాకట్టుపెట్టి ఆర్బీఐ విమర్శలు ఎదుర్కొంది. అప్పటినుంచి క్రమంగా బంగారం రిజర్వ్‌లను పెంచుకుంటోంది. కరోనా తర్వాత 2022లో పసిడి కొనుగోలుపై దూకుడుగా వ్యవహరించింది. జనవరి 2024 నుంచి కొనుగోలు కార్యకలాపాలను మరింత పెంచింది. -
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు డీలా
న్యూఢిల్లీ: గత కొద్ది నెలలుగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) వెనకడుగు వేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి 9 నెలల్లో(ఏప్రిల్–డిసెంబర్) 13 శాతం క్షీణించాయి. అంతర్గత వాణిజ్యం, పరిశ్రమల ప్రోత్సాహక శాఖ (డీపీఐఐటీ) తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం 32.03 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ప్రధానంగా కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, టెలికం, ఆటో, ఫార్మా రంగాలకు ఎఫ్‌డీఐలు నీర సించాయి. గతేడాది(2022–23) ఏప్రిల్–డిసెంబర్లో 36.74 బిలియన్ డాలర్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లభించాయి. అయితే ఈ ఏడాది మూడో త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో 18% ఎగసి 11.6 బిలియన్ డాలర్లను తాకాయి. 7 శాతం డౌన్: తాజా సమీక్షా కాలంలో ఈక్విటీ పెట్టుబడులుసహా మొత్తం ఎఫ్‌డీఐలు 51.5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గతేడాది తొలి 9 నెలల్లో లభించిన 55.27 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇవి 7 శాతం తక్కువ. -
ఎఫ్‌డీఐ... రికార్డులు
న్యూఢిల్లీ: కీలకమైన పెట్టుబడి కేంద్రంగా భారత్ ఆవిర్భవిస్తోందనడానికి సూచనగా గడిచిన ఇరవై ఏళ్లలో భారీ స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వెల్లువెత్తాయి. తాజాగా కొత్త మైలురాయి అధిగమించాయి. పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహ విభాగం (డీపీఐఐటీ) గణాంకాల ప్రకారం 2000 ఏప్రిల్ నుంచి 2020 సెప్టెంబర్ మధ్య కాలంలో 500.12 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. వీటిలో 29 శాతం మారిషస్ నుంచి ఉన్నాయి. మిగతావి సింగపూర్ (21 శాతం), అమెరికా, నెదర్లాండ్స్, జపాన్ (తలో 7 శాతం), బ్రిటన్ (6 శాతం) నుంచి వచ్చాయి. మారిషస్ నుంచి అత్యధికంగా 144.71 బిలియన్ డాలర్లు, సింగపూర్ నుంచి 106 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. జర్మనీ, సైప్రస్, ఫ్రాన్స్, కేమ్యాన్ ఐల్యాండ్స్ తదితర దేశాల ఇన్వెస్టర్లు కూడా ఇన్వెస్ట్ చేశారు. 2015–16 నుంచి ఎఫ్‌డీఐల ప్రవాహం గణనీయంగా పెరిగింది. 2019–20లో రికార్డు స్థాయిలో 50 బిలియన్ డాలర్లు వచ్చాయి. సర్వీసులు, సాఫ్ట్‌వేర్‌లో ఎక్కువగా.. సేవల రంగం, కంప్యూటర్ సాఫ్ట్వేర్.. హార్డ్‌వేర్, టెలికమ్యూనికేషన్స్, ట్రేడింగ్, నిర్మాణ రంగం, ఆటోమొబైల్, రసాయనాలు, ఫార్మా తదితర రంగాలు.. అత్యధిక స్థాయిలో ఎఫ్‌డీఐలను ఆకర్షించాయి. 1999లో విదేశీ మారక నియంత్రణ చట్టం (ఫెరా) స్థానంలో విదేశీ మారక నిర్వహణ చట్టాన్ని (ఫెమా) అమల్లోకి తెచ్చినప్పట్నుంచీ ఎఫ్‌డీఐల ప్రవాహం మొదలైందని నాంగియా ఆండర్సన్ ఇండియా పార్ట్నర్ నిశ్చల్ అరోరా తెలిపారు. అప్పట్నుంచీ 500 బిలియన్ డాలర్లు రావడమనేది పటిష్టమైన భారత ఆర్థిక మూలాలు, స్థిరమైన రాజకీయ పరిస్థితులు, 2007–08 నాటి మాంద్యంలోనూ మదుపుదారులకు మెరుగైన రాబడులిచ్చిన ఆర్థిక వృద్ధి సామర్థ్యంపై ఇన్వెస్టర్లకు గల నమ్మకాన్ని సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఏ దేశంలోకైనా ఎఫ్‌డీఐలు రావాలంటే వ్యాపార నిర్వహణ సులభతరంగా ఉండటం, స్థల .. కార్మిక చట్టాలు.. పన్ను రేట్లును సరళతరంగా ఉండటం, నిపు ణుల లభ్యత, లాజిస్టిక్స్, రాజకీయ స్థిరత్వం వంటి అంశాలు కీలకంగా ఉంటాయని డెలాయిట్ ఇం డియా పార్ట్నర్ రజత్ తెలిపారు. భారత్ ఇప్పటికే ఈ విషయాల్లో చాలా మెరుగుపడిందన్నారు. -
6 నెలల్లో రూ. 2.22 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ, సాక్షి: పలు దేశాలను కరోనా వైరస్ పీడిస్తున్న నేపథ్యంలోనూ భారత్ విదేశీ పెట్టుబడులను భారీగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి ఆరు నెలల కాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) 15 శాతం వృద్ధి చూపాయి. ఈ విషయాలను పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) విడుదల చేసిన తాజా గణాంకాలు వెల్లడించాయి. ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య కాలంలో దేశంలోకి 30 బిలియన్ డాలర్ల(రూ. 2.22 లక్షల కోట్లు) విదేశీ పెట్టుబడులు ప్రవహించినట్లు తెలియజేశాయి. 2019-20 తొలి ఆరు నెలల్లో ఇవి 26 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ ఎఫ్‌డీఐలలో సింహభాగం అంటే 29 శాతం మారిషస్ నుంచి లభించగా.. 21 శాతం వాటాతో సింగపూర్ తదుపరి స్థానంలో నిలిచింది. యూఎస్, నెదర్లాండ్స్, జపాన్ సైతం 7 శాతం చొప్పున వాటాతో ఈ జాబితాలో చోటు చేసుకున్నాయి. రంగాలవారీగా.. డీపీఐఐటీ గణాంకాల ప్రకారం ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య కాలంలో సర్వీసుల రంగం అత్యధికంగా 17 శాతం విదేశీ పెట్టుబడులను ఆకట్టుకుంది. సర్వీసుల రంగంలో ఫైనాన్షియల్, బ్యాంకింగ్, బీమా, ఔట్సోర్సింగ్ సైతం కలసి ఉన్నట్లు డీఐఐఐటీ గణాంకాలు పేర్కొన్నాయి. ఈ రంగాలలో కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డవేర్ విభాగానికి 12 శాతం ఎఫ్‌డీఐలు లభించాయి. టెలికం రంగానికి 7 శాతం వాటా దక్కింది. మొత్తం ఎఫ్‌డీఐలలో రాష్ట్రాలవారీగా గుజరాత్ 35 శాతం వాటాతో అగ్రస్థానాన్ని పొందింది. ఇదేవిధంగా మహారాష్ట్ర 20 శాతం, కర్ణాటక 15 శాతం, ఢిల్లీ 12 శాతం చొప్పున ఎఫ్‌డీఐలను ఆకట్టుకున్నాయి. కోవిడ్-19ను సమర్థవంతంగా ఎదుర్కొనే బాటలో పలు దేశాల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు సహాయక ప్యాకేజీల ద్వారా లిక్విడిటీని పెంచిన నేపథ్యంలో భారత్‌కు విదేశీ పెట్టుబడులు పెరుగుతూ వచ్చినట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలలోకి విదేశీ పెట్టుబడులను ఆకట్టుకునే బాటలో పలు సంస్కరణలు తీసుకురావడం కూడా ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. కాంట్రాక్ట్ మ్యాన్యుఫాక్చరింగ్, కోల్ మైనింగ్ తదితర రంగాలు భవిష్యత్‌లో మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకట్టుకునే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. -
ఎఫ్ఐఐల ఫేవరెట్ షేర్ల స్పీడ్
ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో దేశీ స్టాక్ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) భారీగా పెట్టుబడులు కుమ్మరించారు. క్యూ2(జులై- సెప్టెంబర్)లో రూ. 35,000 కోట్లకుపైగా ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేశారు. తద్వారా దాదాపు 400 కంపెనీలలో వాటాలను పెంచుకున్నారు. వీటిలో 100 కంపెనీల షేర్లు మార్చి నుంచి చూస్తే 100 శాతంపైగా ర్యాలీ చేశాయి. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చిలో స్టాక్ మార్కెట్లు 52 వారాల కనిష్టాలను తాకిన సంగతి తెలిసిందే. దీంతో పలు కౌంటర్లు ఏడాది కనిష్టాలకు చేరాయి. ఈ స్థాయిల నుంచీ పలు షేర్లు లాభాల దౌడు తీస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. మార్చి నుంచి విదేశీ ఇన్వెస్టర్లు వాటాలు పెంచుకున్న సుమారు 385 కంపెనీలలో మార్చి నుంచి చూస్తే.. 107 స్టాక్స్ 100-500 శాతం మధ్యలో జంప్ చేశాయి. మార్చి కనిష్టాల నుంచి రెట్టింపైన కౌంటర్లలో చాలా వరకూ మిడ్, స్మాల్ క్యాప్ విభాగం నుంచే చోటు చేసుకోవడం గమనార్హం. జాబితాలో ఎంఅండ్ఎం, ఇమామీ, ప్రకాష్ ఇండస్ట్రీస్, జిందాల్ పాలీ, అదానీ గ్యాస్, గ్లెన్ మార్క్ ఫార్మా, అదానీ గ్రీన్, అఫ్లే ఇండియా, డిక్సన్ టెక్నాలజీస్ తదితరాలున్నాయి. గత రెండేళ్లుగా మిడ్, స్మాల్ క్యాప్స్ అక్కడక్కడే అన్నట్లుగా నిలిచిపోవడంతో కొద్ది రోజులుగా ర్యాలీ బాట పట్టినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు పటిష్ట యాజమాన్యం, నాణ్యమైన బిజినెస్ వంటి అంశాలు కొన్ని కౌంటర్లకు జోష్ నిస్తున్నట్లు చెప్పారు. లార్జ్ క్యాప్స్ కంటే రానున్న ఏడాది కాలంలో లార్జ్ క్యాప్స్ ను మించి దూకుడు చూపగల మిడ్, స్మాల్ క్యాప్స్ వైపు ఎఫ్ఐఐలు చూపు సారించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. షేర్ల రిటర్నులకు ప్రాధాన్యం ఇవ్వకుండా గుర్తింపు కలిగిన, పటిష్ట వ్యాపార అవకాశాలు అధికంగాగల కంపెనీలను ఎంపిక చేసుకుంటున్నట్లు తెలియజేశారు. నిజానికి 2018 జనవరి నుంచీ మిడ్, స్మాల్ క్యాప్స్ వెనకడుగులో నిలిచిపోయినట్లు మార్కెట్ విశ్లేషకులు ఈ సందర్భంగా వివరించారు. అయితే ఇటీవల బిజినెస్ లు మందగించిన లార్జ్ క్యాప్ కంపెనీల నుంచి పెద్ద కంపెనీలుగా ఆవిర్భవించగల మిడ్ క్యాప్స్ వైపు ఎఫ్ఐఐలు చూపును మరల్చినట్లు తెలియజేశారు. భారీ లాభాలలో ఎఫ్ఐఐలు ఇన్వెస్ట్ చేసిన కొన్ని కంపెనీలు, షేర్ల జోరు తీరు ఎలా ఉన్నదంటే.. ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ లో ఎఫ్ఐఐల వాటా క్యూ2లో 5.2 శాతం నుంచి 6.99 శాతానికి ఎగసింది. ఈ షేరు 544 శాతం ర్యాలీ చేసింది. ఈ బాటలో సీజీ పవర్లో వాటా 0.23 శాతం నుంచి 0.3 శాతానికి పెరిగింది. షేరు 459 శాతం దూసుకెళ్లింది. ఆర్తి డ్రగ్స్ లో వాటా 1.82 శాతం నుంచి 2.19 శాతానికి బలపడగా.. షేరు 408 శాతం జంప్ చేసింది. ఇదే విధంగా అదానీ గ్రీన్‌లో ఎఫ్ఐఐల వాటా 21.52 శాతం నుంచి 22.43 శాతానికి చేరగా.. షేరు 405 శాతం పురోగమించింది. లారస్ ల్యాబ్స్ లో వాటా 4.68 శాతంమేర పెరిగి 20.74 శాతాన్ని తాకింది. షేరు 400 శాతం లాభపడింది. ఇతర కౌంటర్లలో ఇంటలెక్ట్ డిజైన్, మాస్టెక్, టాటా కమ్యూనికేషన్స్, గ్లోబస్ స్పిరిట్స్, మార్క్ సన్స్ ఫార్మా, మజెస్కో 330-254 శాతం మధ్య ఎగశాయి. వీటిలో ఎఫ్ఐఐల వాటా 1.4-0.2 శాతం మధ్య పెరిగింది. -
ఎఫ్‌పీఐల దన్ను- మార్కెట్ల దూకుడు
ఓవైపు కోవిడ్-19 కారణంగా ఆర్థిక వ్యవస్థ తిరోగమన పథంలో పడినప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులు వెల్తువెత్తుతున్నాయి. దీంతో తాజాగా మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ ఆరు నెలల తదుపరి 40,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. ఇందుకు ప్రధానంగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌లో కొనుగోళ్లకు ఆసక్తి చూపడం కారణమవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వివరాలు ఇలా.. ఆగస్ట్‌లో స్పీడ్ ఈ నెలలో శుక్రవారం వరకూ(3-28) ఎఫ్‌పీఐలు దేశీ క్యాపిటల్ మార్కెట్లలో రూ. 47,334 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. వీటిలో రూ. 46,602 కోట్లను ఈక్విటీ కొనుగోలుకి వెచ్చించగా.. రూ. 732 కోట్లను రుణ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేశారు. వెరసి వరుసగా మూడో నెలలోనూ నికర పెట్టుబడిదారులుగా నిలుస్తున్నారు. కాగా.. జులైలో ఎఫ్‌పీఐల పెట్టుబడులు రూ. 3,301 కోట్లకు పరిమితంకాగా.. జూన్‌లో రూ. 24,053 కోట్ల విలువైన స్టాక్స్ నికరంగా సొంతం చేసుకున్నారు. వెరసి ఈ ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి ఎఫ్‌పీఐలు ఈక్విటీలలో నికరంగా రూ. 80,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. వీటిలో ఆగస్ట్ పెట్టుబడులే అధికంకావడం గమనార్హం! కారణాలున్నాయ్ కరోనా వైరస్ విలయంతో ఈ ఏడాది తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో దేశ ఆర్థిక వ్యవస్థ 19 శాతం క్షీణించవచ్చన్న అంచనాలున్నప్పటికీ రెండో త్రైమాసికం నుంచీ రికవరీ బాట పట్టవచ్చన్న ఆశలు ఎఫ్‌పీఐలకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు మార్కెట్ నిపుణులు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీలు, రిజర్వ్ బ్యాంక్ తీసుకుంటున్న లిక్విడిటీ పెంపు, రేట్ల కోత వంటి చర్యలు దోహదపడనున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. లాక్‌డవున్‌ల ఎత్తివేత తదుపరి పలు రంగాలలో డిమాండ్ కనిపిస్తుండటంతో కంపెనీలు సైతం మెరుగైన ఫలితాలు ప్రకటించే వీలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి పలు అంశాలు.. వర్ధమాన దేశాలలోకెల్లా దేశీ మార్కెట్లను ఆకర్షణీయంగా నిలుపుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. వీటికి జతగా గత వారాంతాన యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ సైతం వడ్డీ రేట్లను నామమాత్ర స్థాయిలోనే మరికొంత కాలం కొనసాగించనున్నట్లు స్పష్టం చేయడంతో ఇకపైన కూడా విదేశీ పెట్టుబడుల రాక కొనసాగవచ్చని కొటక్ సెక్యూరిటీస్, మార్నింగ్ స్టార్, గ్రో తదితర రీసెర్చ్ సంస్థల నిపుణులు ఊహిస్తున్నారు. -
విదేశీ పెట్టుబడులకు గాలం
అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధం నేపథ్యంలో పెట్టుబడుల అవకాశాలను అందిపుచ్చుకోవడంపై భారత్ దృష్టి సారిస్తోంది. బహుళజాతి సంస్థ(ఎంఎన్సీ)లను రప్పించేందుకు తీసుకోతగిన చర్యలపై కసరత్తు చేస్తోంది. టెస్లా, గ్లాక్సోస్మిత్‌క్లెయిన్ వంటి 324 కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రతిపాదనలు పరిశీలిస్తోంది. ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసే సంస్థలకు స్థలం ఇవ్వడంతో పాటు విద్యుత్, నీరు, రోడ్డు మార్గం వంటి సదుపాయాలు కూడా కల్పించడం తదితర అంశాలు వీటిలో ఉన్నాయి. పరిశ్రమ, అంతర్గత వాణిజ్యం పెట్టుబడుల ప్రోత్సాహక విభాగం ఈ మేరకు ఒక ముసాయిదా రూపొందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అమెరికన్ దిగ్గజం ఎలీ లిలీ అండ్ కో, దక్షిణ కొరియాకు చెందిన హన్వా కెమికల్ కార్పొరేషన్, తైవాన్ సంస్థ హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీ తదితర దిగ్గజ కంపెనీలతో కేంద్రంలోని ఉన్నతాధికారులు సంప్రదింపులు జరపనున్నట్లు వివరించాయి. భూ, కార్మిక చట్టాలతోనే సవాలు... వాణిజ్య యుద్ధాల నేపథ్యంలో పలు పెద్ద కంపెనీలు చైనాకు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నాయి. వియత్నాం, మలేషియా వంటి దేశాలను ఎంచుకుంటున్నాయి. కఠినమైన భూసేకరణ నిబంధనలు, కార్మిక చట్టాలున్న కారణంగా భారత్‌ను పక్కన పెడుతున్నాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనుకునే సంస్థలు.. తామే స్థలాన్ని సేకరించుకోవాల్సి ఉంటోంది. అయితే, వివిధ కారణాల రీత్యా దీనికి చాలా సమయం పట్టేస్తుండటంతో అసలు ప్రాజెక్టును ప్రారంభించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో ఇన్వెస్ట్ చేసేందుకు కంపెనీలు ముందుకు రావడం లేదు. ఇలాంటి ప్రతికూలాంశాలను గుర్తించిన కేంద్రం.. విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు తీసుకోతగిన చర్యలపై దృష్టి పెడుతోంది. ప్రతిపాదనలు ఇవీ... ముసాయిదా ప్రతిపాదనల ప్రకారం తక్షణమే కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనువైన పారిశ్రామిక క్లస్టర్స్ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తుంది. అలాగే పెట్టుబడులు, ఎంచుకున్న ప్రాంతం ప్రాతిపదికగా ప్రోత్సాహకాలు ఇస్తుంది. యాంటీ–డంపింగ్ సుంకాలను క్రమబద్ధీకరిస్తుంది. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలు, ఇంధనాన్ని ఆదా చేసే వాహనాల తయారీకి ప్రోత్సాహకాలు ఉంటాయి. అటు ఎలక్ట్రానిక్స్, టెలికం రంగాలకు సంబంధించి ఉద్యోగాలపరమైన వెసులుబాట్లు, పెట్టుబడుల ప్రాతిపదికన తయారీ సంబంధ ప్రోత్సాహకాలు మొదలైనవి పరిశీలనలో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలన్నింటినీ ప్రధాని కార్యాలయం పరిశీలిస్తోందని, త్వరలోనే నిర్ణయం తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా... 2025 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని భారత్ నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వృద్ధికి దోహదపడే అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా.. ఎగుమతులను ప్రోత్సహించేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు, వ్యాపారాల నిర్వహణకు అనుకూల పరిస్థితులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కార్పొరేట్ ట్యాక్స్ రేటు తగ్గించడం, విదేశీ పెట్టుబడుల నిబంధనలు సడలించడం తదితర సంస్కరణలు ప్రవేశపెట్టింది. వీటి ఊతంతో వ్యాపారాలకు అనువైన దేశాల జాబితాలో ర్యాంకింగ్స్‌ను గణనీయంగా మెరుగుపర్చుకుంటోంది. ప్రపంచ బ్యాంక్ రూపొందించే ఈ లిస్టులో 2017 నుంచి ఏకంగా 37 ర్యాంకులు పైకి ఎగబాకింది. అయినప్పటికీ రువాండా, కొసొవో వంటి దేశాల కన్నా ఇంకా దిగువనే 63వ ర్యాంకులో ఉంది. దీంతో మరిన్ని సంస్కరణలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. -
రికార్డుల హోరు
స్టాక్ మార్కెట్లో రికార్డుల మోత మోగుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్లను నెలకొల్పింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలకమైన స్థాయి, 11,900 పాయింట్ల ఎగువకు ఎగబాకింది. కంపెనీల క్యూ2 ఆర్థిక ఫలితాలు అంచనాలను మించి పోతుండటం, సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు....వీటన్నింటి ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా ఏడో ట్రేడింగ్ సెషన్లోనూ లాభాల్లోనే ముగిశాయి. మార్చి తర్వాత సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా ఇన్ని రోజులు లాభపడటం ఇదే మొదటిసారి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 4 పైసలు పుంజుకొని 70.77 కు చేరడం సానుకూల ప్రభావం చూపించింది. అయితే సెన్సెక్స్ రికార్డ్ లాభాల కారణంగా పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో ఇంట్రాడే లాభాలు తగ్గాయి. లోహ, టెలికం, ఐటీ షేర్లు లాభపడగా, వాహన షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. రికార్డ్ బ్రేక్... బీఎస్ఈ సెన్సెక్స్ 137 పాయింట్ల లాభంతో 40,302 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది సెన్సెక్స్‌కు జీవిత కాల గరిష్ట స్థాయి ముగింపు దీంతో ఈ ఏడాది జూన్ 3 నాటి ఆల్‌టైమ్ క్లోజింగ్ రికార్డ్, 40,268 పాయింట్ల రికార్డ్ బద్దలైంది. ఇక ఇంట్రాడేలో కూడా సెన్సెక్స్ జీవిత కాల గరిష్ట స్థాయి, 40,483 పాయింట్లను తాకింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 51 పాయింట్లు పెరిగి 11,941 పాయింట్ల వద్ద ముగిసింది. ఆల్‌టైమ్ హై (12,103 పాయింట్లు)కు 162 పాయింట్ల దూరంలో నిఫ్టీ ఉంది. లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్ రోజంతా అదే జోరు చూపించింది. లాభాల స్వీకరణ కారణంగా ఆరంభ లాభాలు ఆవిరైనా, చివరకు లాభాల్లోనే ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 318 పాయింట్లు, నిఫ్టీ 98 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. అన్నీ శుభ శకునములే... విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం, అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ రిస్క్‌లు తగ్గుముఖం పట్టటం, వృద్ధి జోరు పెంచడం లక్ష్యంగా మరిన్ని సంస్కరణలకు కేంద్రం తెరతీయనున్నదన్న వార్తలు... ఇవన్నీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిస్తున్నాయి. ఈ నెలలో విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పటిదాకా మన క్యాపిటల్ మార్కెట్లో రూ.16,464 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. విదేశీ ఇన్వెస్టర్లు నికర కొనుగోళ్లు జరపడం ఇది వరుసగా రెండో నెల. చైనా–అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారు దశకు రావడంతో ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. యూరప్ మార్కెట్లు కూడా లాభాల్లోనే ముగిశాయి. ► అవకతవకలు చోటు చేసుకున్నాయనడానికి ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని కంపెనీ స్పష్టతనివ్వడంతో ఇన్ఫోసిస్ షేర్ 3 శాతం లాభంతో రూ.709 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్ ఇదే. ► ఈ క్యూ2లో రూ.629 కోట్ల నికర నష్టాలు రావడంతో యెస్ బ్యాంక్ షేర్ ఇంట్రాడేలో 10 శాతం మేర పతనమై రూ.60ను తాకింది. ఆ తర్వాత రికవరీ అయి 0.75 శాతం నష్టంతో రూ.66 వద్ద ముగిసింది. ఒక దశలో ఈ షేర్ 8 శాతానికి పైగా లాభంతో రూ.71ను తాకడం విశేషం. ► సెన్సెక్స్‌తో పాటు పలు షేర్లు కూడా ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ హోల్డింగ్స్, అబాట్ ఇండియా, అదానీ గ్రీన్, క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ బ్యాంక్, ఐనాక్స్ లీజర్, మణప్పురం ఫైనాన్స్, మెట్రోపొలిస్ హెల్త్‌కేర్, మిధాని, ఎమ్‌ఎస్‌టీసీ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
బడ్జెట్.. ముంచెన్!
విదేశీ ఇన్వెస్టర్లపై పన్ను పోటు మరింతగా పెరుగుతుందనే ఆందోళనతో సోమవారం మన స్టాక్ మార్కెట్ భారీగా పడిపోయింది. అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా ఉండటంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 38,800 పాయింట్ల దిగువకు, నిఫ్టీ, 11,600 పాయింట్ల దిగువకు పతనమయ్యాయి. ఇంట్రాడేలో 907 పాయింట్ల వరకూ పతనమైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 793 పాయింట్ల నష్టంతో 38,721 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఇంట్రాడేలో 288 పాయింట్ల మేర క్షీణించిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 253 పాయింట్ల నష్టంతో 11,559 పాయింట్ల వద్దకు చేరింది. సెన్సెక్స్, నిఫ్టీలు ఈ ఏడాది బాగా నష్టపోయింది ఈ రోజే. సెన్సెక్స్, నిఫ్టీలు 2 శాతానికి పైగా నష్టపోయాయి. శాతం పరంగా చూస్తే, 2016, ఏప్రిల్ తర్వాత ఈ సూచీలు అత్యధికంగా నష్టపోవడం ఇదే మొదటిసారి. ఆర్థిక, వాహన, చమురు షేర్లు బాగా నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. వర్షాలు అంతంతమాత్రంగానే కురుస్తుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం ప్రతికూల ప్రభావం చూపించాయి. అంచనాలు తల్లకిందులు... మందగమనంలో ఉన్న వినియోగ రంగానికి జోష్‌నివ్వడానికి కేంద్రం బడ్జెట్లో తాయిలాలు ఇవ్వగలదని అందరూ అంచనా వేశారని శాంక్టమ్ వెల్త్ మేనేజ్మెంట్ ఎనలిస్ట్ సునీల్ శర్మ పేర్కొన్నారు. ఈ అంచనాలన్నీ తల్లకిందులు కావడం, మరోవైపు రానున్న ఆర్థిక ఫలితాలు మరింత అధ్వానంగా ఉండబోతున్నాయన్న ఆందోళనతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నదని వివరించారు. సెన్సెక్స్ భారీ నష్టాల్లో ఆరంభమైంది. రోజు గడుస్తున్న కొద్దీ ఎలాంటి ఊరటలేకపోగా, ఈ నష్టాలు అంతకంతకూ పెరిగాయి. మరిన్ని విశేషాలు.. ► ఇటీవల ప్రతిరోజూ ఆల్‌టైమ్ హైలను తాకుతున్న బజాజ్ ఫైనాన్స్ షేర్ 8 శాతం నష్టంతో రూ.3,415 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► అమ్మకాలు తగ్గుతుండటంతో వాహన కంపెనీలు ఉత్పత్తిలో కోత విధిస్తున్నాయన్న వార్తలు వాహన షేర్లను పడగొట్టాయి. హీరో మోటోకార్ప్ 5.3 శాతం, మారుతీ సుజుకీ 5.2 శాతం, టాటా మోటార్స్ 3.4 శాతం, బజాజ్ ఆటోలు 2 శాతం చొప్పున నష్టపోయాయి. ► ఇండెక్స్ హెవీ వెయిట్ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఓఎన్జీసీ 5.4 శాతం, ఎల్ అండ్ టీ 4.3 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.85 శాతం చొప్పున కుదేలయ్యాయి. ► పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేర్ భారీగా పతనమైంది. భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్‌కు సంబంధించిన ఖాతాలో రూ.3,800 కోట్ల మోసం జరిగిందన్న విషయం వెలుగులోకి రావడంతో బీఎస్ఈలో పీఎన్బీ షేర్ 11 శాతం నష్టంతో రూ.72.80 వద్ద ముగిసింది. ► ఎల్ అండ్ టీ కంపెనీ ఇటీవలనే బలవంతంగా చేజిక్కించుకున్న మైండ్‌ట్రీ షేర్ 10 శాతం నష్టంతో రూ.774 వద్ద ముగిసింది. మైండ్‌ట్రీ వ్యవస్థాపకులు కృష్ణకుమార్ నటరాజన్, ఎన్ఎస్. పార్థసార«థి, రోస్టో రావణన్‌లు తమ తమ డైరెక్టర్ల పదవులకు, కంపెనీ పదవులకు రాజీనామా చేయడం దీనికి కారణం. ► దాదాపు 300కు పైగా షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. మారుతీ సుజుకీ, టీవీఎస్ మోటార్; హీరో మోటోకార్ప్, ఈరోస్ మీడియా, ఎస్కార్ట్స్, సన్ టీవీ, కాక్స్ అండ్ కింగ్స్, గోవా కార్బన్, గ్రాఫైట్ ఇండియా తదితర షేర్లు ఈ పతన జాబితాలో ఉన్నాయి. ► ఎల్ అండ్ టీ రేటింగ్‌ను అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ, బ్యాంక్ ఆఫ్ అమెరికా డౌన్‌గ్రేడ్ చేయడంతో ఎల్ అండ్ టీ షేర్ 4% నష్టంతో రూ.1,490 వద్ద ముగిసింది. ఎందుకు పడిందంటే... ఎఫ్‌పీఐలపై పన్ను సంపన్న వర్గాలపై మరింత పన్ను విధించాలన్న ప్రతిపాదన.. భారత్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న 2,000కు పైగా విదేశీ ఫండ్స్‌పై తీవ్రంగానే ప్రభావం చూపగలదని నిపుణులంటున్నారు. ట్రస్ట్‌ల మార్గంలో భారత్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న ఎఫ్‌పీఐలపై తాజా సర్‌చార్జీ భారం మరింతగా పెరుగుతుందని, ఫలితంగా పన్ను పరంగా భారత్‌కు ఉన్న ఆకర్షణ తొలగుతుందని, విదేశీ పెట్టుబడులు నీరసిస్తాయని నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తాజా ప్రతిపాదన కారణంగా విదేశీ ఇన్వెస్టర్లపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను(ఎల్టీసీజీ) భారం మరింతగా పెరుగుతుంది. ఈ పన్ను విషయమై త్వరలోనే వివరణ ఇస్తామని సీబీడీటీ చైర్మన్ పేర్కొనగా, ఇక ఎలాంటి వివరణ అవసరం లేదని, అంతా స్పష్టంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెగేసి చెప్పారు. దీంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. బడ్జెట్ ప్రతిపాదనలు... లిస్టెడ్ కంపెనీల్లో ప్రజలకు కేటాయించే కనీస వాటాను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఫలితంగా స్టాక్ మార్కెట్లో షేర్ల సప్లై పెరిగి లిక్విడిటీ ఆవిరైపోతుంది. ఐటీ, పీఎస్‌యూ షేర్లపై ప్రభావం అధికంగా ఉంటుంది. ఇక ఎమ్ఎన్సీలు మన మార్కెట్ నుంచి డీలిస్ట్ కావడానికి ప్రయత్నాలు చేస్తాయి. ఇక సంపన్నులపై అధిక పన్నులు విధించడం, షేర్ల బైబ్యాక్‌పై 20 శాతం పన్ను తదితర ప్రతిపాదనలు కూడా మార్కెట్‌పై తీవ్రమైన ప్రభావమే చూపుతున్నాయి. ప్రపంచ మార్కెట్ల పతనం... అమెరికా ఆర్థిక వ్యవస్థలో వృద్ధి అంతంతమాత్రంగానే ఉంది. దీంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోతకు సిద్ధమవుతోంది. అయితే గత శుక్రవారం వెలువడిన ఉద్యోగ గణాంకాలు అంచనాలను మించాయి. ఆర్థిక వ్యవస్థ బానే ఉందన్న సంకేతాలు ఈ గణాంకాలు ఇవ్వడంతో ఫెడరల్ రిజర్వ్ రేట్లకోత విషయంలో పునరాలోచించే అవకాశాలున్నాయన్న అంచనాలు పెరిగాయి. మరోవైపు అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ, మోర్గాన్ స్టాన్లీ ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లను డౌన్‌గ్రేడ్ చేయడమే కాకుండా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో తన పెట్టుబడులను తగ్గించుకోవాలని(ఇది దాదాపు ఐదేళ్ల కనిష్ట స్థాయి) నిర్ణయించుకోవడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. ఈ కారణాలన్నింటి వల్ల ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. చైనా షాంఘై సూచీ 2.5 శాతం, హాంగ్‌సెంగ్ సూచీ 1.5 శాతం, జపాన్ నికాయ్ సూచీ 1 శాతం, దక్షిణ కొరియా కోస్పి సూచీ 2.2 శాతం చొప్పున పతనమయ్యాయి. ఇక యూరప్సూచీలు నష్టాల్లో ఆరంభమై, నష్టాల్లోనే ముగిశాయి. జూన్ క్వార్టర్ ఫలితాలు.. ఎలా ఉంటాయో ? వినియోగం తగ్గి ఆర్థిక వ్యవస్థ మందగమనంగా ఉన్న నేపథ్యంలో నేటి నుంచి ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు వెలువడనున్నాయి. బ్యాంక్‌లు మినహా ఇతర రంగాల కంపెనీల ఆర్థిక ఫలితాల్లో పెద్దగా మెరుపులు ఉండకపోవచ్చని, అంతంతమాత్రంగానే ఉండొచ్చన్న ఆందోళన నెలకొన్నది. 2 రోజులు..రూ. 5 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా సోమవారం ఇన్వెస్టర్ల సంపద రూ.3.39 లక్షల కోట్లు హరించుకుపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.3,39,193 కోట్లు ఆవిరై రూ.1,47,96,303 కోట్లకు పడిపోయింది. బడ్జెట్ రోజు సంపద నష్టాన్ని కూడా కలుపుకుంటే మొత్తం రెండు రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.5,61,773 కోట్లు హరించుకుపోయింది. ఎదురీదిన యస్ బ్యాంక్ అన్ని షేర్లు క్షీణించినా, యస్ బ్యాంక్ మాత్రం ఎదురీదింది. ఆరంభంలోనే ఐదేళ్ల కనిష్ట స్థాయి, రూ.85.70కు పడిపోయిన ఈ షేర్ తర్వాత పుంజుకొని 5.5 శాతం లాభంతో రూ.93 వద్ద ముగిసింది. బ్యాంక్ ఆర్థిక స్థితిగతులు భేషుగ్గా ఉన్నాయని యాజమాన్యం స్పష్టతనివ్వడంతో పాటు ఉన్నత స్థాయిల్లోని నిర్వహణ పదవులను భర్తీ చేయడం కూడా కలిసి వచ్చింది. సెన్సెక్స్‌లో ఈ షేర్‌తో పాటు టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మాత్రమే లాభపడ్డాయి. మొత్తం మీద 31 సెన్సెక్స్ షేర్లలో 28 షేర్లు నష్టపోయాయి. -
ఎఫ్ఐఐల పెట్టుబడులే కీలకం..
ముంబై: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) భారత స్టాక్ మార్కెట్లలో తమ పెట్టుబడులను జోరుగా కొనసాగించిన నేపథ్యంలో గతవారం ప్రధాన సూచీలు మూడున్నర శాతం మేర లాభాలను నమోదుచేశాయి. రెట్టించిన ఉత్సాహంతో వీరు పెట్టుబడులను కొనసాగించడంతో నిఫ్టీ వారాంత ట్రేడింగ్ రోజున 11,427 వద్దకు చేరుకుంది. అయితే, ఇక్కడ నుంచి జీవితకాల గరిష్టస్థాయిలకు చేరుకుంటుందా..? లేదంటే, స్వల్పకాలిక దిద్దుబాటుకు లోనవుతుందా? అనే ప్రధాన అంశానికి ఎఫ్ఐఐల నిర్ణయమే అత్యంత కీలకం కానుందని దలాల్ స్ట్రీట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈనెల్లో ఇప్పటివరకు దేశీ స్టాక్ మార్కెట్లో రూ.17,055 కోట్లను పెట్టుబడి పెట్టిన వీరు ఇదే ట్రెండ్‌ను కొనసాగిస్తే సూచీలు ఊర్థ్వముఖంగా ప్రయాణం కొనసాగిస్తాయని భావిస్తున్నారు. ‘ఎమర్జింగ్ మార్కెట్లతో పోల్చితే ఫిబ్రవరి మధ్యవరకు దేశీ ప్రధాన సూచీలు అండర్పెర్ఫార్మ్ చేశాయి. ఇప్పుడైతే ఈ ట్రెండ్‌లో మార్పు కనిపిస్తోంది. సాధారణ ఎన్నికలపై అంచనాలు, ఇక్కడి మార్కెట్లో స్వల్పకాలిక రాబడికి ఉన్న అవకాశాల ఆధారంగా ఎఫ్ఐఐల పెట్టుబడుల కొనసాగింపు ఉండనుంది. ఒకవేళ వీరి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే మాత్రం షార్ప్ కరెక్షన్ ఉంటుంది’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసని విశ్లేషించారు. నిఫ్టీలో 38 శాతం వాటా కలిగిన ఫైనాన్షియల్ రంగంలో ప్రస్తుతం పెట్టుబడులు జోరుగా కొనసాగుతున్నాయి. వీటిలో ప్రైవేటు బ్యాంకులు బలమైన రిటైల్ వృద్ధిని నమోదుచేస్తుండగా.. పీఎస్‌యూ బ్యాంకులు మొండిబకాయిల భారం నుంచి బయటపడడం సానుకూలంగా ఉంది. ఇక హోలీ సందర్భంగా 21న (గురువారం) మార్కెట్లకు సెలవుకావడం గమనార్హం. అంతర్జాతీయ అంశాలపై దృష్టి.. అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఓఎంసీ).. కీలక వడ్డీ రేట్లపై ఈవారంలో తన నిర్ణయాన్ని వెలువరించనుంది. అత్యధిక శాతం నిపుణుల అంచనాల ప్రకారం ఫెడరల్ ఫండ్ రేట్లు (2.25 శాతం నుంచి 2.5 శాతం) మార్చకపోవచ్చు. మరోవైపు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ (బీఓఈ) వడ్డీ రేట్ల నిర్ణయం గురువారం వెల్లడికానుంది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమణ మరింత జాప్యం కానుందని తెలుస్తోంది. ఈవారంలో ఇందుకు సంబంధించి కీలక నిర్ణయాలు వెలువడనున్నాయి. యూకే ద్రవ్యోల్బణం బుధవారం వెల్లడికానుండగా.. జపాన్ వాణిజ్యలోటు సోమ వారం, ద్రవ్యోల్బణం డేటా శుక్రవారం వెల్లడికానున్నాయి. ఎఫ్ఐఐల నికర కొనుగోళ్లు మార్చి 1–15 కాలంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.20,400 కోట్ల పెట్టుబడులను భారత స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టారు. రూ.17,919 కోట్లను ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్‌చేసిన వీరు.. రూ.2,499 కోట్లను డెట్ మార్కెట్లో పెట్టుబడిపెట్టారు. అటు దేశీయ, ఇటు అంతర్జాతీయ సానుకూల అంచనాలు దీనికి కారణం. -
విదేశీ పెట్టుబడులతో ఒరిగింది శూన్యం
ఏఎన్‌యూ: రెండున్నర దశాబ్దాల్లో భారతదేశంలో విదేశీ పెట్టుబడుల వల్ల నిజమైన పారిశ్రామికాభివృద్ధి జరగలేదని జేఎన్‌యూ (న్యూఢిల్లీ) ఆర్థికశాస్త్ర అధ్యాపకుడు ఆచార్య సి.పి.చంద్రశేఖర్ చెప్పారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గురువారం ఏఎన్‌యూ రీసెర్చ్ ఫోరం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య చంద్రశేఖర్ దేశంలో 1991 తర్వాత జరిగిన ‘ఆర్థికాభివృద్ధి– విశ్లేషణ’ అంశంపై ప్రసంగించారు. 1950–80 మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వమే పరిశ్రమలు స్థాపించి వాటి అభివృద్ధికి చర్యలు తీసుకునేదని చెప్పారు. 1980–90 మధ్య ఆర్థిక వృద్ధి పెరిగినప్పటికీ ఆదాయం కంటే రుణాలు అధికమయ్యాయన్నారు. 1990 అనంతరం స్వదేశీ పెట్టుబడి తగ్గి విదేశీ పెట్టుబడి పెరిగిందన్నారు. కానీ వాటి వల్ల ఎలాంటి వృద్ధి జరగలేదన్నారు. 2013 తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థ సంక్షోభంలోకి వెళ్లిపోయిందని చెప్పారు. పాతికేళ్లుగా నిజమైన అభివృద్ధి జరగలేదని, భవిష్యత్‌లో కూడా ఆర్థిక వృద్ధి జరిగే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు. వీసీ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించిన సభలో సెంటర్ ఫర్ సైంటిఫిక్ సోషలిజం విభాగాధిపతి ఆచార్య అంజయ్య, పొలిటికల్ సైన్స్ అధ్యాపకుడు డాక్టర్ అంజిరెడ్డి పాల్గొన్నారు.